కథ

దిక్సూచి (కథల పోటీలో ఎంపికైన రచన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీకసలు బుద్ధుందా?’ అన్నాడు కేదార్.
‘ఇందులో బుద్ధి లేకపోవడానికేముంది? నా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఆశ్చర్యపోవడానికేమీ లేదు. అందరికీ ఇలాంటి సువర్ణావకాశం రాకపోవచ్చు. నాకు వచ్చింది. నేను దాన్ని సకాలంలో ఉపయోగించుకుంటున్నాను’ అన్నాడు రోహిత్.
రోహిత్ ఆఫీస్ వాళ్లు రెండు నెలలు హాఫ్ పే లీవ్ కావాలంటే తీసుకోవచ్చన్నారు. దాన్ని సువర్ణావకాశం కింద అనుకున్నాడతను.
రోహిత్‌ని ఒక పిచ్చివాడి కింద చూసి ‘నువ్వెప్పుడైనా ఎవరి మాటైనా విన్నావా? ఇప్పుడు వినడానికి’ అన్నాడు కేదార్.
చిరునవ్వే సమాధానం. భార్య కూడా అతని నిర్ణయాన్ని హర్షించలేదు. అప్పుడు కూడా చిరునవ్వే సమాధానం అయ్యింది.
‘మొండి మనిషి, నీకు తోచిందే తప్ప ఇంకొకటి చెయ్యవు’ అంది.
‘నువ్వన్నది నేనెప్పుడు చెయ్యలేదు. నీ ఖర్చులకుగానీ ఇంటి ఖర్చులకు గానీ నువ్వెంత అడిగుతే దానికన్నా ఎక్కువే ఇస్తాను తప్ప తక్కువ ఇవ్వను కదా! ఇంటి నిర్ణయాలన్నీ నీమీదే వదిలేశాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయానికి తరువాత నువ్వే నన్ను పొగుడుతావు’ అన్నాడు.
‘ఎదుటి వాడ్ని నోరెలా మూయించాలో నీకు బాగా తెలుసు. నీకన్నీ తెలుసన్న గర్వం’ అంది మణి.
‘నాకు గర్వం అంటే నేనొప్పుకోను. నేనంటే నాకు గౌరవం. దానే్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకో. మనిషన్న వాడికి అది చాలా అవసరం. సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, సెల్ఫ్ వర్షిప్‌కీ చాలా తేడా ఉంది. తనను తాను గౌరవించుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటివాడు తనకు గౌరవం ఇవ్వాలని తాపత్రయం పడటం, వాళ్లివ్వకపోతే బాధపడటం తప్పు. గౌరవం అన్నది మనం సంపాదించుకోవాలి కానీ ఎదుటి వాడి నించి ఆశించడం కానీ ముష్టి ఎత్తడం కానీ చెయ్యకూడదు. ఉదాహరణకు భర్తగా నాకు నువ్వు గౌరవం ఇవ్వాలని నేను ఆశించకూడదు. అది పొందేంత గొప్పగా నా ప్రవర్తన ఉండాలి. అలాగే తండ్రిగా నా పిల్లలు నన్ను గౌరవించాలని కోరకూడదు. వాళ్లు మనస్ఫూర్తిగా ఇచ్చేటట్లుగా ప్రవర్తించాలి. తండ్రిగా నా ప్రవర్తన పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. నా పిల్లలు నాలో ఒక ఆత్మీయుడ్ని, ఒక గురువును, స్నేహితుడ్ని చూడగలగాలి’ అన్నాడు.
‘అబ్బా... నీతో మాటల్లో గెలవడం నా వల్ల కాదు’ అంటూ వంటింట్లోకి దారితీసింది మణి.
రోహిత్, మణిలకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. అమ్మాయి టెన్త్ చదువుతోంది. పిల్లలిద్దరూ బుద్ధిమంతులే. చదువులో మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు.
‘నాన్నగారూ ఇవ్వాళ మా స్కూల్లో పి.టి. మీటింగ్ ఉంది. మీరొస్తారా?’ అంది కావ్య.
ప్రతీసారీ మణే వెడుతుంది. ఎప్పుడో చిన్న క్లాస్‌లో ఉన్నప్పుడు ఒకటి రెండుసార్లు వెళ్లాడు. ఇప్పుడు రాననడానికి కారణం లేదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలనుకున్నాడు.
‘నువ్వు కూడా వస్తావా?’ అన్నాడు భార్యతో.
‘నువ్వు వెళ్లు. నేనొచ్చినా నాకు మాట్లాడడానికి అవకాశం ఎలాగా నాకివ్వవుగా’ అంది.
రోహిత్ పెదవులపై చిరునవ్వు. భార్యకెప్పుడూ తన మీద కినుక.. ఆమెను మాట్లాడనివ్వడని.
మాట్లాడడం అతనికున్న వీక్‌నెస్. దాన్ని జయించడం అతని తరం కావటంలేదు. సరే తానొక్కడే వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.
పట్టణంలో ఉన్న ప్రముఖ స్కూళ్లల్లో ఒకటైన స్కూల్లో చదువుతోంది కావ్య. అందులో ఫీజ్ చాలా ఎక్కువ కాబట్టి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ల పిల్లలే అందులో చదువుతారు. స్కూల్లో పిల్లల చదువుతోపాటు తల్లిదండ్రులకు కూడా చదువు ఉంటుంది. వాళ్లనుకున్న రిజల్ట్స్ కోసం పిల్లల మీద తెచ్చే ఒత్తిడిని, వాళ్ల తల్లిదండ్రులకు ట్రాన్స్‌ఫర్ చెయ్యబడుతుంది. రిజల్ట్స్ బాగుండకపోతే స్కూల్ రెప్యుటేషన్ పోతుంది.
పరీక్షల ముందుగా పిల్లలకు ఎలా గైడెన్స్ ఇవ్వాలో దాని మూలంగా పిల్లలు ఎంత బాగా రిజల్ట్స్ తెస్తారో డిస్కస్ చెయ్యడానికి ఏర్పరచిన మీటింగ్ అది.
ముందుగా ప్రిన్సిపాల్ తనను తాను పరిచయం చేసుకుంది. ఆ తరువాత గత పదేళ్లుగా తమ స్కూల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో వివరించింది. ప్రతిసారి పిల్లలు బోర్డ్ ఎగ్జామ్స్‌లో మంచి రిజల్ట్స్ తేవాలంటే టీచర్సే కాకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలన్న అభిప్రాయం వ్యక్తపరచింది. మీ మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి అంది.
ఇద్దరు ముగ్గురు వాళ్ల అభిప్రాయాలు చెప్పారు. నాలుగో వ్యక్తి లేచి ‘మాకంత టైమ్ ఉండదండీ.. అందుకేగా మీ స్కూల్లో చేర్పించింది’ అన్నాడు.
‘మీకు సమయం లేకపోతే మీ భార్య చెయ్యవచ్చు కదా! ఎంతలేదన్నా తల్లికి మించిన గురువు లేదు కదా!’ అంది ప్రిన్సిపాల్.
వెంటనే ఆ పిల్లవాడి తల్లి లేచింది. ‘నేను బిజీ డాక్టర్నండీ. ప్రొఫెసర్‌గా ఆయనకైనా కాస్త టైమ్ దొరుకుతుందేమో కానీ నాకస్సలు కుదరదు. నాకు పిల్లలతో మాట్లాడడానికే టైమ్ దొరకదు’ అంది ఆవిడ.
అప్పటిదాకా శ్రోతగా వున్న రోహిత్ లేచి నిలబడ్డాడు. అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడని అర్థమైన ప్రిన్సిపాల్ అతన్ని మాట్లాడమన్నట్లుగా సంజ్ఞ చేసింది.
‘మీరు బిజీ డాక్టర్ అంటున్నారు. మీ కన్సల్టేషన్ కోసం వచ్చిన అందర్నీ అటెండ్ అవుతారా లేక కొంతమందిని వెనక్కి వెళ్లిపొమ్మంటారా?’ అని అడిగాడు.
‘అలా ఎలా వెళ్లిపొమ్మంటాం? డాక్టర్‌గా అందర్నీ చూడడం నా ధర్మం. ఆ రోజు కుదరకపోతే మర్నాడు రమ్మంటాను’
‘కరెక్ట్‌గా చెప్పారు. డాక్టర్‌గా మీ విధులు మీకు తెలిసినంతగా తల్లిగా తెలియవని నేను అనుకోవటం లేదు. మీ పేషెంట్ కన్సల్టేషన్‌కి కొంత సమయం కేటాయిస్తారు కదా! అలాగే మీ పిల్లవాడిని కూడా అలాగే అనుకుని కొంత సమయం కేటాయించవచ్చు కదా!’
‘మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? అలా అడగడానికి మీరెవరండీ? నా పేషెంట్,. నా పిల్లవాడు ఒకటేనా?’
‘నేనెవర్నన్న ప్రశ్న కాదు. మీ పేషెంట్, మీ పిల్లవాడు ఒకటని కూడా నేనటం లేదు. మీ పేషెంట్‌కి ఇంకో డాక్టర్ దొరుకుతాడు. కానీ మీ పిల్లవాడికి ఇంకో అమ్మ దొరకదు. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీకు కష్టంగా ఉన్నా నేను చెప్పేది వినండి. డబ్బుతో వచ్చే సుఖాలు పిల్లలకు ఇస్తే చాలనుకుంటున్నాము మనందరం ఈనాడు. ప్రతీవాళ్లు డబ్బు సంపాదనకై పరుగులు, మానవుడు సృష్టించిన డబ్బు మానవుడ్నే తిప్పుకుంటోంది. డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతున్నాడు.
ఒక చిన్న సంఘటన. చిన్నప్పుడు ఒక ఐదు రూపాయల నోటు దొరికింది. దానితో ఆడుకుంటున్నాను. నా చేతిలోని ఆ కాగితం చూసి అమ్మ గుండెల్లో భయం. దానికి కారణం ఆ కాగితం నేను చింపేస్తానేమో అని. అది నేను చింపేస్తే ఆ రోజు కూర కొనడానికి డబ్బులు లేక అందరం ఆవకాయ అన్నం తినాలి. అమ్మ మెల్లిగా ప్రేమగా నన్ను మరిపించి ఆ కాగితం తీసుకుంది. ఆ తరువాత దుకాణానికి వెళ్లి నాకు చాక్లెట్ కావాలన్నాను. డబ్బు తెమ్మన్నాడు. అమ్మ తన దగ్గర ఉన్న పర్స్‌లోంచి ఇచ్చింది. దుకాణం వాడు నాకు చాక్లెట్ ఇచ్చాడు. నేను ఆనందం పట్టలేకపోయాను. అప్పుడు తెలిసింది నాకు ఏదైనా కొనాలంటే డబ్బు కావాలని. కాలక్రమేణా డబ్బుతో చాలా కొనుక్కోవచ్చని అర్థమయ్యింది. అప్పుడు అమ్మను అడిగాను అమ్మా డబ్బుంటే అన్నీ కొనవచ్చా! అని.
అమ్మ నవ్వి డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి నాన్నా అంది. అప్పుడు చిన్నవాడిగా నాకు తెలియకపోయినా తరువాత నాకు తెలిసింది. డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉన్నాయని. అందులో ముఖ్యమైనది అమ్మ ప్రేమ. నేటి తల్లిదండ్రులు డబ్బుతో పిల్లలకు సౌకర్యాలు కూర్చడంతో వాళ్ల బాధ్యత తీరిపోతుందనుకుంటున్నారు. మన పిల్లల్ని మనమే లంచగొండులుగా మారుస్తున్నాము తెలుసా?’
ఒక్కసారిగా ఈ మాటతో అందరిలో కలకలం. ఒకతను లేచి, ‘ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా?’
‘నేను మాట్లాడేవన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. మీరెప్పుడైనా టూర్ వెళితే మీ పిల్లలకు ఏమైనా తెస్తారా?’
‘ఆ తెస్తాను.. అందులో తప్పేముంది?’
‘తప్పుందని నేను అనటం లేదు. మీరు ఎప్పుడైనా టూర్ వెళ్లేవారైతే అందులో తప్పు లేదు. కానీ అదే మీ ఉద్యోగం అనుకోండి, మీరు వెళ్లిన ప్రతీసారీ అలా తేవడంతో పిల్లలకు అది ఒక అలవాటుగా మారిపోతుంది. అలాగే నువీ పనిచేస్తే నీకిది కొంటాను అంటూ వాళ్లకు చెప్పడం కొనడం, మనం వాళ్లతో గడపాల్సిన సమయం గడపలేదన్న గిల్ట్‌తో వాళ్లకు బహుమతులివ్వడం లంచం కాదంటారా?’
ఎవ్వరూ మాట్లాడలేదు. అందరి మొహాల్లోకి ఒక్కసారి చూసి, మళ్లీ మొదలుపెట్టాడు రోహిత్.
‘నేనిప్పుడు మాట్లాడే మాటలు ప్రస్తుతం మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య. మనందరం చదువుకున్న వాళ్లమే. పిల్లల్ని కావాలనుకునే ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చాము. వాళ్లు మనని అడగలేదు. పిల్లలు సంసారానికి పీటముళ్లు అంటారు పెద్దలు. పిల్లలు పుట్టాక ఆ దాంపత్యం విడరాని బంధంగా మారుతుందన్నది పెద్దల భావం. ఎన్ని విభేదాలు వున్నా పిల్లల విషయంలో చాలామంది భార్యాభర్తలు ఒకటవుతారు. మనం కన్న పిల్లలకు మనమే సమయం, ఆప్యాయత పంచలేకపోతే డబ్బు కోసం పనిచేసే టీచర్స్‌కు, ఇంట్లో వాళ్లను చూసే ఆయాలకు బాధ్యత ఉండాలని ఆశించడం ఎంత సమర్థనీయమో ఆలోచించండి. అలా అని మనం మన ఉద్యోగాలూ, భవిష్యత్తును వదులుకోవాలని అనటంలేదు.
కోరికలన్నవి అనంతం. దానికి అడ్డుకట్ట వెయ్యాలి. లేకపోతే అది మనని కబళిస్తుంది. ప్రతీ దానికీ ఒక సమయం ఉంది. చదువుకు, ఉద్యోగానికీ, పెళ్లికీ, పిల్లల్ని కనడానికీ, అలాగే పిల్లలకు మన అవసరం కూడా ఒక వయసు వచ్చేదాకా ఉంటుంది. ఏదొచ్చినా నాకు మా అమ్మానాన్నా ఉన్నారన్న ధీమా వాళ్లకు కావాలి. వాళ్ల ముద్దు మాటల వయసులో వాళ్ల తప్పటడుగుల వయసులో వాటిలోని ఆనందం మనం అనుభవించకపోతే మళ్లీ మనకా సమయం తిరిగి రమ్మన్నా రాదు.
డబ్బు సంపాదించడానికి సమయం ఎప్పుడూ ఉంటుంది. కానీ వీటికి సమయం మించిపోకుండా చూడాలి. ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందన్న మాట. తప్పటడుగుల సమయంలో మన చెయ్యి ఆసరా వాళ్లకెలా అవసరమో, వాళ్ల హైస్కూల్ టైమ్‌లో కూడా మన అవసరం చాలా ఉంటుంది. టెన్త్ తరువాత ఏం చదవాలి అన్నది వాళ్లు డిసైడ్ చేసుకోలేరు. శారీరకంగా వచ్చే మార్పులు కూడా ఉంటాయి. పొడుగు ఎదుగుతున్న మొక్కకు కట్టే ఆసరా కావాల్సి వచ్చినట్లే పిల్లలకు ఈ టైమ్‌లో తల్లిదండ్రుల అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మన సమయాన్ని వాళ్ల కోసం వెచ్చించడం ఎంతైనా అవసరమని నా ఉద్దేశం. ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని ఎవర్నైనా నొప్పిస్తే మన్నించండి. మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో చెయ్యబట్టే మనం ఈనాడు ఈ స్థితికి చేరుకోగలిగాము’ అన్నాడు రోహిత్.
‘వెల్ సెడ్ మిస్టర్ రోహిత్’ అంది ప్రిన్సిపాల్ అనుకోకుండా అందరి చేతులూ దగ్గరకు రావడంతో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.
‘సారీ! మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. డాక్టర్‌గా నా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అమ్మ పాత్రకు అన్యాయం చేశాను. ఇక మీదట అలా జరగదు’ అంది డాక్టర్‌గారు.
‘మనం మన ఉద్యోగాలు వదులుకోనక్కరలేదమ్మా. మధ్యలో కాస్త సమయం మన పిల్లల కోసం కేటాయిస్తే చాలు. నేను కూడా ఈ మధ్యే రియలైజ్ చేశాను. అందుకే నా ఉద్యోగం నించి రెండు నెలలు సెలవు తీసుకున్నాను. నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. ఈ రెండు నెలలూ నా శాయశక్తులా వాడికి గైడెన్స్ ఇవ్వాలని నా ఉద్దేశం’ అన్నాడు రోహిత్.
‘అందుకా నువ్వు సెలవు తీసుకున్నది. అది అంత అవసరమా? వాళ్లకు మనం ఏం పాఠాలు చెప్తాంరా?’ అన్నాడు కేదార్.
‘ఈ సెలవు మూలంగా ఉద్యోగపరంగా నాకు నష్టం జరిగినా ఫరవాలేదురా. నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడమే నా ధ్యేయం. ఇప్పుడు కూడా నేను వాళ్లకు పాఠాలు చెప్పబోవటం లేదు. వాళ్లు ప్రయాణించాల్సిన మార్గాన్ని ఎలా సుగమం చేసుకోవాలో నేర్పించడం మాత్రమే నేను చెయ్యదల్చుకున్నది’ అన్నాడు రోహిత్.

కానీ అతనేం చెయ్యబోతున్నాడో అడగలేదు కేదార్. అతని దృష్టిలో రోహిత్ చేస్తున్నది అవసరం లేదని.
మీటింగ్ హాల్ నించి బైటపడి క్లాస్‌రూమ్‌లో ఎదురుచూస్తున్న కూతుర్ని తీసుకుని కారు దగ్గరకు నడిచాడు.
గుమ్మంలోనే ఎదురైంది మణి. కారు తాళాలు తాళాల స్టాండ్‌లో పెట్టి సోఫాలో కూర్చుని, కాళ్లు టీపాయ్ మీద పెట్టి, కళ్ళు మూసుకున్నాడు. కావ్య తన గదిలోకి వెళ్లింది.
చల్లగా స్పృశిస్తున్న చేతుల్ని దగ్గరకు తీసుకుని పెదవులకు ఆనించుకున్నాడు. ఆ స్పర్శలో ఇద్దరికీ ఒకరికొకరన్న భావం వ్యక్తమవుతోంది.
‘లే రోహిత్ అలసటగా ఉందా? భోజనానికి రా! అక్కడ బాగా మాట్లాడి అలిసిపోయినట్లున్నావు’ అంది మణి.
‘ఏం వేళాకోళంగా ఉందా? నేను అంత మాట్లాడతానా?’ అన్నాడు.
‘సరేలే! వాదనలెందుకు కానీ భోజనానికి నడువు. కమల్ కూడా వచ్చాడు. అందరం కలసి భోజనం చేద్దాము’ అని వంటింట్లోకి దారి తీసింది.
రోహిత్ కొడుకు పేరు కమలేష్. వాళ్ల అమ్మ పేరు కలిసేటట్లుగా రావాలని ఆ పేరు పెట్టాడు. భోజనాల దగ్గర చెప్పాడు కొడుకుతో ‘నేను ఉద్యోగం నించి రెండు నెలలు సెలవు తీసుకున్నాను. మీ ఇద్దరికీ చదువులో సహాయం చేద్దామని’
‘వావ్ నాన్నగారూ నిజంగానా? నాకు చాలా డౌట్స్ వస్తాయి. ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. స్కూల్లో చెప్పినవన్నీ అర్థం అయినట్లుగా ఉంటుంది కానీ ఇంటికొచ్చాక కొన్ని విషయాలు అర్థం కానట్లుగా అనిపిస్తాయి’ అన్నాడు కమల్.
‘నాకు కూడా అలాగే ఉంటుంది నాన్నగారూ. అమ్మనడుగుదామంటే అమ్మకు ఉద్యోగం, ఇంట్లో పనితో సరిపోతుంది. మీరు కూడా ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇప్పుడు మీరు మా పక్కన ఉంటానంటే మాకు చాలా హ్యాపీగా ఉంది’ అంది కావ్య.
‘ముందు భోజనాలు కానివ్వండి. తరువాత మాట్లాడుకుందాము’ అన్నాడు.
రాత్రి పడుకున్నప్పుడు అడిగింది మణి. ‘ఇందుకా నువ్వు సెలవు తీసుకున్నది. అసలీ ఆలోచన ఎలా వచ్చింది?’
‘ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు మణీ. వాళ్లను చదువు చదువు అని తోస్తున్నాము కానీ చదువు మీద ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో చెప్పలేక పోతున్నాము. ఇదివరకు ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు. చదువు పూర్తయ్యాక మేనేజ్‌మెంట్ క్లాసెస్‌లో చెప్పే కొన్ని సూత్రాలు జీవితంలో ముందుకు సాగాలంటే కూడా పనికి వస్తాయన్న విషయం వాళ్లకు తెలియాలి. అది మనం తెలియజెప్పాలి’ అన్నాడు.
‘అంటే ఇప్పుడు వాళ్లకు చదువు కాక మేనేజ్‌మెంట్ క్లాసెస్ తీసుకుంటావా?’
‘నేను వాళ్లకు చదువు చెప్పడమెందుకు? స్కూల్లో టీచర్స్ చెబుతున్నారు. అది సరిగ్గా బుర్రలోకి ఎలా ఎక్కించుకోవాలో మార్గదర్శకమివ్వడమే నేను చేసే పని’ అన్నాడు.
‘సరేలే నువ్వేదో ప్లాన్‌లో ఉన్నట్లున్నావు కానియ్యి. నేనెందుకు అడ్డు చెప్పడం. పిల్లల పరీక్షల రెండు నెలలూ వాళ్లకు సహాయంగా నువ్వుంటే నాకంతకన్నా కావల్సినదేముంది’ అంది మణి.
మర్నాడు పిల్లలిద్దరినీ పిలిచాడు. తండ్రి చదువు చెప్తాడేమో అని పుస్తకాలు తెచ్చుకున్నారిద్దరూ.
‘నేను చదువు చెప్పటానికి పిలవలేదు. ముందుగా నేను చెప్పేది శ్రద్ధగా వినండి’ అన్నాడు.
అర్థంకాని పాఠాలు చెప్తాడేమో అనుకున్న తండ్రి ఏం చెప్పడానికి పిలిచాడో అన్న అనుమానం ఇద్దరి మనసుల్లో.
‘చదువుకున్నా ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి. మన చర్యలన్నిటికీ మూలం మనసు, బుద్ధి. మన బుద్ధే మన జ్ఞానానికి పరికరం. ఈ పరికరాన్ని మనం జీవితంలో సరిగా ఉపయోగించుకోవాలి. మనసు మీద మనకు నియంత్రణ చాలా అవసరం. మన బుద్ధిని ఉపయోగించి మనసును నియంత్రించుకుంటే మన కోరికలను కూడా నియంత్రించుకోవచ్చు. వీటన్నిటికీ ఇలాగే చెయ్యాలన్న నిబద్ధత ఏమీ లేదు. మారుతూ ఉంటాయి’ అన్నాడు రోహిత్.
‘కానీ అది సాధ్యమంటారా నాన్నగారూ!’ కావ్య.
‘మన మనసన్నది గాలిలాంటిది. గాలిని పట్టుకోగలమా! అలాగే మనసునూ పట్టుకోలేము. కానీ కష్టమైనా సాధ్యం కాదని చెప్పలేము. మనసును నియంత్రించుకుంటే ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత విజ్ఞానానికి దారితీస్తుంది. ఇవన్నీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అన్నమాట’
అర్థం కానట్టు మొహం పెట్టింది కావ్య. కొడుకు మొహంలోకి చూసి అడిగాడు ‘నీ కర్థమయ్యిందా?’ అని.
‘కొంచెం కొంచెం అర్థమయ్యింది’ అన్నాడు.
‘మీరిద్దరూ పూర్తిగా అర్థం చేసుకున్నారని కానీ ఇప్పుడే చేసుకోవాలని కానీ నా ఉద్దేశం కాదు. ముందు చదువు మీద ఏకాగ్రత పెంచుకోండి. ఇవన్నీ తొందరగా సాధ్యం అయ్యే పనులు కావు. కానీ ప్రయత్నిస్తే కష్టం కాదు. అర్జునుడు మత్స్య యంత్రం కొట్టడానికి తన గురిని ఎలా తప్పకుండా కొట్టగలిగాడో మనం కూడా జీవితంలో పైకి రావాలంటే కొన్ని నియమాలు పాటించాలి. మీ వెనక నేనున్నాను. పరిగెట్టే మనసుకు కళ్ళాలు ఎలా వెయ్యాలో నేను మీ వెనక ఉండి గైడ్ చేస్తాను. ఈ రెండు నెలలూ మీ లక్ష్యం, మీ పరీక్షలు మాత్రమే. మిగిలినవన్నీ పక్కకు పెట్టండి. అలా అని పొద్దస్తమానూ చదవమని కూడా చెప్పను. ఎంత చదివారో దాన్ని బుర్రలో నిక్షిప్తం చెయ్యడానికి ప్రయత్నించండి. విజయం మీదే’ అన్నాడు రోహిత్.
పరీక్షలై పోయాక అడిగాడు కేదార్.
‘నీ పిల్లలకు చదువులు చెప్పడం అయిపోయిందా? సెలవులు కూడా అయిపోయినట్లున్నాయి మళ్లీ ఉద్యోగంలో చేరాలిగా’ అని.
దానికి సమాధానంగా నవ్వుతూ ‘అయిపోయిందిరా. నేనొక దిక్సూచిలా వాళ్లకు సాయం చేసాను. ఇంక ఫలితం కాలానికి, దైవానికి వదిలెయ్యడమే’ అన్నాడు.
కావ్యా, కమలేష్ ఇదివరకటికన్నా ఉత్సాహంగా పరీక్షలకు చదివారు. ఇదివరకు బోర్ అనిపించిన చదువు తండ్రి పక్కనుండటంతో మనసుకెంతో హాయిగా అనిపించింది.
కొంతకాలం గడిచింది..
కమలేష్ ఇప్పుడు కాబోయే డాక్టర్, కావ్య ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువులకు అమెరికా వెళ్లడానికి ప్రయత్నాల్లో ఉంది. *

: రచయత చిరునామా :
303 ఫ్లాట్ నెం. అలేఖ్య రెయిన్ డ్రాప్స్,
17-18, ప్లాట్ నెం. గంటమి ఎన్‌క్లేవ్,
చిరాక్ పబ్లిక్ స్కూల్ పక్కన, కొండాపూర్,
హైదరాబాద్-500084
ఫోన్ : 7702319351

అనురాధ (సుజలగంటి)