సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యానికి చెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ రాజకీయాలను సినిమా సంస్కృతి నుంచి విడదీసి చూడలేం. తమిళనాట ప్రతి రాజకీయ కదలిక థ్రిల్లర్ సినిమాను మరిపిస్తుంది. జైలుకు వెళ్లడానికి ముందు శశికళ చెన్నై మెరీనా బీచ్‌లో ‘అమ్మ’ సమాధి వద్ద మూడు ‘్భషణ ప్రతిజ్ఞ’లు చేసి జనం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం ఓ నాటకీయ పరిణామం. ‘మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రత్యర్థులను, కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోను..’ అంటూ జయ సమాధిపై తన కుడిచేయితో మూడుసార్లు గట్టిగా చరిచి ‘చిన్నమ్మ’ శపథం చేసింది. ‘పగ సాధిస్తా’నంటూ ఇలా శపథాలు చేయడం సినిమాల్లో తప్ప పరిణతి చెందిన రాజకీయ వాతావరణంలో మనం ఎన్నడూ చూడం. శిక్ష పడిన ఖైదీ జైలు నుంచైనా పాలనాయంత్రాంగాన్ని నడిపించగలదన్నది శశికళ అభిమానుల నమ్మకం. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో గట్టెక్కిన పళని స్వామి జైలులో ఉన్న శశికళ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు పొందుతూ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి తప్పదేమో! బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి విపరిణామాలను మనం ఊహించగలమా?
వ్యక్తిపూజ, అంధ విశ్వాసాలకు ఆలవాలమైన తమిళనాడులో ఇలాంటి రాజకీయ సంక్షోభం ఏర్పడినందుకు మనం వి స్మయం చెందనక్కర్లేదు. జయలలిత మరణానంతరం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని ఆశించలేం. శశికళను, ఆమెకు చెందిన ‘మన్నార్‌గుడి మాఫియా’ను కాదని కాదని అన్నాడిఎంకెలో ఏ నేత కూడా ప్రభుత్వాన్ని స్వతంత్రంగా నడిపే అవకాశాలు లేవన్నది నిజం. ముఖ్యమంత్రి అయినా, పార్టీ ఎమ్మెల్యేలు అయినా శశికళకు మోకాళ్లపై నిలబడి నమస్కరించాల్సిందే. ఇలాంటి పరిణామాలు మన రాజకీయ వ్యవస్థలో కొత్తేమీ కాదు.
శశికళ వంద తప్పులు చేసి ఉండొచ్చు. వాటి వెనుక అసలు సూత్రధారి దివంగత ముఖ్యమంత్రి జయలలితే. బంధుగణం నుంచి, స్నేహితుల నుంచి తప్పించి తనను ఏకాకిని చేసిన శశికళ చర్యల గురించి జయకు అంతా తెలుసు. శశికళ అరాచకాల గురించి తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత జయను ఆవహించింది. ‘తమిళనాడు ఉక్కు మహిళ’గా పేరుతెచ్చుకున్న జయలలిత తన నెచ్చెలి అక్రమాలకు అడ్డుకట్టవేయలేక పోయారు. జయ చుట్టూ శశికళ బంధువర్గమంతా ‘కోటరీ’గా స్థిరపడి, ‘మన్నార్‌గుడి మాఫియా’గా బలపడి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు బిగించి సాగించిన అవినీతి కలాపాలకు అంతే లేదు. శశికళ స్వభావం పసిగట్టిన జయ మొదట్లో కొంత జాగ్రత్తపడినా ఆ తర్వాత ఏమీ చేయలేకపోయారు. శశికళను, ఆమె బంధువులను రెండుసార్లు ‘పోయస్ గార్డెన్’ను జయ బయటికి తరిమేశారు. ఆ తర్వాత మళ్లీ అదే శశికళను ఆమె ఎందుకు అక్కున చేర్చుకున్నారు? ఇందుకు అనేక విషయాలు కారణం కావచ్చు. జయ,శశిల మధ్య ‘అతి సాన్నిహిత్యం’ ఓ ముఖ్య కారణం. తన ఆర్థిక వ్యవహారాలన్నీ శశికళకు తెలుసుకాబట్టి ఆమెను ‘పోయెస్ గార్డెన్’లోనే ఉంచడం మంచిదని జయ భావించి ఉండవచ్చు. జయ బలహీనతలన్నీ తెలుసు కాబట్టి ఆమె అవినీతి కార్యకలాపాల్లో శశికళ భాగస్వామి అయింది. ‘అతి సాన్నిహిత్యాన్ని’ ఆసరాగా చేసుకుని శశికళ ఎంతో తెలివిగా తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, శశికళ, మరో ఇద్దరిని సుప్రీం కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే, శశికళకు చెందిన ‘మన్నార్‌గుడి మాఫియా’ చేసిన అకృత్యాల గురించి ప్రజలకు చాలా విషయాలు తెలియవనే చెప్పాలి. శశికళ రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన టిటివి దినకరన్ అనేక అక్రమాలతో సంబంధం కలిగి, ఓ కేసులో శిక్షకు గురయ్యాడు.
జయలలిత ఆశయాలను కొనసాగిస్తామని శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఘనంగా ప్రకటించాయి. అంటే మరో అవినీతి సామ్రాజ్యాన్ని వీరు నిర్మిస్తారా? తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రెండు వర్గాలు ఇంకా ‘జయ నామస్మరణ’ చేస్తున్నాయి. ఉచిత పథకాల ద్వారా ప్రజాభిమానాన్ని జయ చూరగొన్నా, ఆమెపై పడ్డ అవినీతి మచ్చ మాత్రం తొలగిపోదు. ఇక, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు అద్భుతమైన తీర్పును ప్రకటించినా, తమిళనాట రాజకీయ గందరగోళానికి ఆ తీర్పు కారణమైంది. ఈ కేసులో తుది తీర్పు ఇవ్వడానికి దాదాపు రెండు దశాబ్దాల కాలం పట్టింది. న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై తరచూ ఆవేదన చెందే సర్వోన్నత న్యాయస్థానం- కేసుల విచారణలో దశాబ్దాల జాప్యానికి మాత్రం జవాబు చెప్పదు. అక్రమాస్తుల కేసులో తాత్సారం లేకుండా గతంలోనే తీర్పు ఇచ్చి ఉంటే తమిళనాడులో ఈ గందరగోళం ఏర్పడి ఉండేది కాదు.
జయ మరణానంతరం ఆమెకు నిజమైన వారసురాలిని తానేనని శశికళ భావించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం తాను చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టినా ఆమె పార్టీపై పట్టుకోల్పోలేదు. తన నీడలాంటి పళని స్వామిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసి, తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించింది. ఏ విషయంలోనూ తనకు ఎదురులేదని నియంతలా వ్యవహరించిన జయలలిత పార్టీలో ‘ద్వితీయ శ్రేణి’ నాయకత్వాన్ని ఎదగనివ్వలేదు. తన తర్వాత పార్టీగాని, ప్రభుత్వం గాని ఏమై పోయినా తనకు సంబంధం ఉండదన్నట్టుగా జయ వ్యవహరించారు. జయ వైఖరే ప్రస్తుత సంక్షోభానికి కారణమని తెలుసుకున్న శశికళ జైలుకు వెళ్లడానికి ముందే జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వంలో, పార్టీలో తన నమ్మకస్తులను నియమించుకుంది.
ఒక వ్యక్తిపై ఆధారపడే పార్టీల్లో ఇలాంటి సంక్షోభాలు తప్పవని తమిళనాడు పరిస్థితులు అద్దం పట్టాయి. వంశపారంపర్య నాయకత్వం కొనసాగే పార్టీల్లో ఇలాంటి గందరగోళం ఉండదు. డిఎంకె అధినేత కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌ను, శరద్ పవార్ తన కుమార్తెను, బాల్ ధాకరే తన కుమారుడు ఉద్ధవ్‌ను తమ రాజకీయ వారసులుగా ప్రకటించారు. ఈ విషయంలో మిగతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకంగా నిలుస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, యుపిలో బహుజన సమాజ్ పార్టీలో మాత్రం ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇంకా తేలలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని అనారోగ్యకర లక్షణాలుండడంతో, వంశపారంపర్య రాజకీయాల్లో కొన్ని ప్రయోజనాలున్నాయని సంతృప్తి పడాలేమో!
ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకుంటే తమిళనాడులో జయ మరణానంతరం జరిగిన పరిణామాలను విశే్లషించుకోవాలి. మెజారిటీ ఎమ్మెల్యేలు ‘రిసార్టు’లో బందీలైనపుడు ప్రజాస్వామ్యం చెరసాల పాలైందని భావించాలి. పార్టీ కార్యాలయంలో కాకుండా, రిసార్టులో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ‘ఎన్నుకున్నపుడు’, ఆ సమావేశం ఎవరి నేతృత్వంలో జరిగిందో, ఎలాంటి నోటీసు లేకుండా ఎమ్మెల్యేల సమావేశం ఎలా జరిగిందో తెలుసుకుంటే- ఇది ప్రజాస్వామ్యమేనా? అన్న సందేహం కలుగుతుంది. బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ కలిగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ఆలోచన చేయకపోవడం మరింత ఆందోళనకు గురిచేసే అంశం. తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగరరావు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేశారు. అధికారం కోసం జరిగిన పోరులో పన్నీర్ సెల్వంకు కేంద్రం పరోక్షంగా మద్దతునిచ్చిందన్న వ్యాఖ్యానాలు లేకపోలేదు. అయితే, శశికళకు జైలుశిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువడడంతో వారంలో ఇద్దరు ముఖ్యమంత్రుల చేత ప్రమాణం చేయించే అగత్యం తప్పింది. ఈ మొత్తం ఘటనా క్రమంలో విస్మయపరచే విషయమేమంటే- సుప్రీం కోర్టు ప్రకటించిన తీర్పులో జయలలితను దోషిగా ప్రకటించినా, ఆ విషయాన్ని అన్నా డిఎంకెలో ఏ వర్గం కూడా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి పీఠం తమదంటే తమదని పోటీ పడ్డారే తప్ప రాజకీయాల్లో అవినీతి గురించి ఎవరికీ పట్టింపులేదు. ఈ పరిణామాలు దేనికి సంకేతం?
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాదకరమైన ధోరణిని గమనించాలి. ఎందుకంటే అవినీతిని అంతమొందిస్తానని ఆయన ప్రతి సభలోనూ ఛాతీ బాదుకొని మరీ చెబుతున్నారు. అవినీతి మన ప్రజాస్వామ్య మూలాలను ఇంకా తినేస్తోందనడానికి తమిళనాడు ఓ స్పష్టమైన ఉదాహరణ. ఈ ఉదంతం వల్ల మరో అంశం కూడా స్పష్టమవుతోంది. ఈ ఆధిపత్య పోరులో రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారో చూస్తే తమిళనాడువరకు నోట్ల రద్దు ఘోరంగా విఫలమైందని అర్థమవుతుంది.
*

సెల్ : 80083 22206