సబ్ ఫీచర్

‘మండలి’ ఫలితాలు దేనికి సంకేతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి శాసనమండలిలో స్థానిక సంస్థలు, టీచర్లు, గ్రా డ్యుయేట్ల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో వె లువడిన ఫలితాలు విభిన్న తీర్పులిచ్చాయి. స్థానిక సంస్థల నుంచి మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, ఆ పార్టీ మద్దతుతో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బిజెపి విజయం సాధించింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ, ఆ పార్టీ బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇవి చూడ్డానికి సాధారణ ఎన్నికల మాదిరి కనిపించినా పట్ట్భద్రులు, విద్యావంతులు, నిరుద్యోగులు నేరుగా పాల్గొని ఇచ్చిన తీర్పుగా గ్రహించాలి. అంటే 9 జిల్లాలకు చెందిన విద్యావంతులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటేశారన్నమాట. ఒకరకంగా రాష్ట్రంలో 60 శాతానికి పైగా జరిగిన ఎన్నికలివి. వీటిని శాంపిల్‌గానే భావించి తీరాలి.
పరిమిత సంఖ్యలో ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లేసిన మూడు స్థానాల్లో తెదేపా గెలుపొందినా, విద్యావంతులు పాల్గొన్న ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాలే విజయం సాధించడాన్ని ఇక్కడ విస్మరించకూడదు. ఇవి రానున్న నగర పాలక సంస్థల, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు ఒక సంకేతమే. టీచర్స్, గ్రాడ్యుయేట్ల స్థానాల్లో తా ము ఎందుకు ఓడిపోయామో అధికార పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల స్థానంలో మిత్రపక్షమైన బిజెపి గెలిచినప్పటికీ, నైతికంగా అది బిజెపి వ్యక్తిగత ఖాతాలోకే వెళుతుంది. ఎందుకంటే అసలు ఆ సీటును నామినేషన్ చివరి తేదీకి ముందు ప్రకటించారు. పొత్తుతో పనిలేకుండా సోము వీర్రాజు అండ్ కో అక్కడ ముందుగానే ఓట్లు నమోదు చేయించుకున్నారు. నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో మంత్రులు చూపిన శ్రద్ధ కింది స్ధాయి శ్రేణుల్లో కనిపించలేదు.
విశాఖలో బిజెపి గెలిస్తే వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఉనికి దెబ్బతింటుందన్న తెదేపా భయమే కా రణం! తెదేపా ఎమ్మెల్యేలు కొందరు బిజెపి విజయానికి తమ పార్టీనే కారణమన్న వాదన తెరమీదకు తీసుకురావడం మిత్రపక్షాన్ని రెచ్చగొట్టడమే కాకుండా, అది సా ధించిన విజయాన్ని తక్కువ చేయడమే. కాసేపు అదే నిజమనుకుంటే, మరి మిగిలిన చోట్ల తెదేపా గెలవాలి కదా? ఎందుకు ఓడిపోయిందన్న ‘కమల దళం’ ప్రశ్నలో లా జిక్కు ఉంది కదా! అధికారంలో ఉన్నప్పటికీ మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి తెదేపా ఆర్థికంగా, రాజకీయంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. అందులో కడపను కొట్టడమంటే మామూలు విషయం కాదు. దశాబ్దాలపాటు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపను కైవసం చేసుకోవడం తెదేపా చరిత్రలో అతిపెద్ద విజయమే. ‘అన్నగారు’ చేయని సాహసాన్ని ‘అల్లుడుగారు’ చేసి చూపారు. సీనియర్లను పక్కకుపెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నిందలెదుర్కొంటున్న ‘బాబు అండ్ సన్’- కడపలో డబ్బు కంటే సీనియారిటీనే పార్టీని గెలిపించిందన్న నిజాన్ని మర్చిపోకూడదు. సోమిరెడ్డి వంటి సీనియర్లను రంగంలోకి దింపిన నాయకత్వం చారిత్రక ఫలితాన్ని సొంతం చేసుకుంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీనియర్లతో అభిప్రాయాలు పంచుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో కడప, నెల్లూరు-ప్రకాశం-చిత్తూరు జిల్లా ఫలితాల ద్వారా రుజువైంది. సోమిరెడ్డి సీనియారిటీ కడపను గెలిపించగా, మంత్రి నారాయణ అనుభవ రాహిత్యం రెండు జిల్లాల్లో తెదేపాను ముంచేసింది. ఆ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నారాయణ ప్రతిపాదించిన అభ్యర్ధిపై సీనియర్ల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా ‘బాబు అండ్ సన్’ పట్టించుకోకుండా చివరికి పరాభవం పాలయ్యారు.
కార్పొరేట్ వ్యక్తులకు ఇంకా ప్రాధాన్యం కొనసాగుతోందన్న సంకేతాలిచ్చిన నాయకత్వ నిర్ణయాన్ని సొంత పార్టీ శ్రేణులే నిస్సంకోచంగా తిప్పికొట్టాయ. తామేం చేసినా ఆమోదిస్తారనుకునే ధోరణికి దీనిని తిరుగులేని జవాబుగానే గ్రహించాలి. సీనియర్ల సలహాలు కాదన్నందుకు అనుభవించిన ఫలితమన్నమాట! అప్పటికీ మంత్రి శిద్దా రాఘవరావు వంటి నేతలు కష్టపడినందున ఆ మాత్రమైనా ఓట్లు వచ్చాయి. ఇక్కడ గుర్తించాల్సింది- నారాయణ నిలబెట్టిన అభ్యర్థి ఓటమి కాదు. బాబు సొంత జిల్లాలో మూటకట్టుకున్న వైఫల్యం! నిజానికి ఈ ఎన్నికలు తెదేపా నాయకత్వానికి ఒక గుణపాఠం. మరో రకంగా హెచ్చరిక సంకేతం. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలిపే సం కేతం. ఎన్నికల్లో డబ్బు ఒక్కటే కాదు, ప్రజామోదం, నాయకుల సమష్టి ఆమోదం, అభ్యర్ధుల గుణగుణాలు సైతం కీలకమని నెల్లూరు-ప్రకాశం- చిత్తూరు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. నారాయణను అతిగా ప్రోత్సహించి, గుడ్డిగా నమ్మి సొంత జిల్లాలోనే పార్టీ ఓడితే, ఇక మిగిలిన జిల్లాల్లో సరైన ఫలితాలు ఎందుకు రాలేదని నేతలపై కనె్నర్ర చేసే అవకాశం బాబుకు ఉండదు కదా? మరి ఫలానా మంత్రులు, ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటూ ఇచ్చిన ర్యాంకులు ఏమయ్యాయి? ఆ ‘పనిమంతు లు’ మంచి ఫలితాలను ఎం దుకు రాబట్టలేకపోయారు? నా రాయణకు ఏం రాజకీయ అనుభవం ఉందని, సీనియర్లను ప క్కకుపెట్టి ఆయనకు పెత్తనం ఇచ్చారన్న ప్రశ్నలకు జవాబిచ్చే ధైర్యం నాయకత్వానికి ఉందా?
బాబు గత రెండున్నరేళ్ల కాలంలో ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని రాష్ట్రం, దేశం, విదేశాల్లో చేస్తున్న పర్యటనల ఫలితాలు ఇంతేనా? అన్న నిర్వేదం ఎన్నికల ఫలితాలు చూసిన తమ్ముళ్లలో రావడం సహజం. ఇతరులకు పనిచేసే సమయం, సొంతంగా ఆలోంచించే స్వేచ్ఛ ఇవ్వకపోతే ఫలితాలు ఇంతకంటే భిన్నంగా ఉంటాయా? ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా, టీచర్లు, ప్రభుత్వోద్యోగులకు ఫిట్‌మెంట్, వారానికి ఐదురోజుల పనిదినాల పేరుతో వరాలిస్తూ నెత్తినపెట్టుకున్నా వారంతా తన సర్కారును ఎందుకు తిరస్కరించారో ఆత్మపరిశీలన చేసుకోవాలి.
పథకాలను అనుభవిస్తున్న వారిలో ఈ రెండు వర్గాలూ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీని కాదని, ప్రతిపక్షాన్ని ఎందుకు నెత్తినపెట్టుకున్నారో ఆలోచించాలి. టీచర్లు, గ్రాడ్యుయేట్లలో మాకు బలం లేదు కాబట్టి గెలవలేదన్న కొత్త వాదన ఓటమిని కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. మరి అంత బలం లేనప్పుడు అసలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే ధైర్యం ఉందా? ఇలాంటి మతిలేని లాజిక్కులతో నాయకత్వాన్ని మెప్పించే నేతల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.
ఇక వైకాపా అధినేత జగన్‌కు జనంలో సదభిప్రాయం లేదని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నా జగన్, ఆయన పార్టీ బలం పెరగడం లేదంటూ బాబు చుట్టూ ఉన్న ఒక వర్గం గత ఏడాది నుంచీ చేస్తున్న మానసికానంద ప్రచారంలో డొల్లతనాన్ని, ఆత్మానందాన్నీ ఈ ఎన్నికల ఫలితాలు వెక్కిరిస్తున్నాయి. ‘మండలి’ ఎన్నికల్లో జగన్ ఎక్కడా ప్రచారం చేయలేదు. పిడిఎఫ్ అభ్యర్ధులకు మద్దతునిచ్చి, వారు పోటీ చేయని చోట వారి మద్దతు తీసుకున్నారంతే! చదువుకున్న వారంతా ప్రతిపక్షానికి జైకొట్టడాన్ని తక్కువ చేసి చూడలేం. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేసిన ఓట్లకు, నేరుగా ప్రజలు వేసిన ఓట్లకూ తేడా గమనించకుండా ఆ మూడు విజయాలపైనే ఎక్కువ మాట్లాడి, ప్రజలు నేరుగా ఇచ్చిన తీర్పును తక్కువ చేసి చూపితే, అది ఆత్మద్రోహం చేసుకోవడమే అవుతుంది.
జగన్ విజయాన్ని తక్కువ చేయడం కూడా సబబు కాదు. ఆయన గత కొద్ది నెలల నుంచీ జనం మధ్యలో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతున్నారు. ఆ ఫలితాన్ని ఆయన మిత్రపక్షాలతో కలసి ఎన్నికల్లో అందుకున్నారు. ఇప్పటికైతే చదువుకున్న వాళ్లు జగన్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ నిజాన్ని గుర్తించక తప్పదు! జనంలో జగన్ ఇమేజి పెరగడం లేదని, ఆయన పార్టీలో కుమ్ములాటలు పెరుగుతున్నాయని, ఆయన త్వరలో మోదీతో కలసిపోతారంటూ సొంత మీడియా కులపతులు చెప్పే భవిష్యవాణిలో ఏమాత్రం పస లేదని, తాజా తీర్పు స్పష్టం చేసిన తర్వాతయినా తెదేపా నాయకత్వం తీరు మారాలి.
స్థానిక సంస్థల విజయంపై జగన్ శిబిరంలో డీలా గురించి డప్పు కొట్టిన నయా రాజగురువులుం గారు, అదే సమయంలో జరిగిన టీచర్స్- గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ప్రతిపక్షం సాధించిన విజయంపై వౌనం వహించినా, ప్రజలు వాటి గురించి మాట్లాడుకోవడం మానేయరు కదా? ఎందుకంటే ప్రపంచం విజేతల గురించే మాట్లాడుకుంటుంది. పొగడ్తలు తియ్యగా, విమర్శలు చేదుగా ఉంటాయి. ఆరోగ్యానికి ‘తీపి’ హానికరమన్న వాస్తవాన్ని నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144