సబ్ ఫీచర్

ఫిరాయింపుల చట్టం ఉన్నా లేనట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి రాజకీయ పరిణామాలు మన పార్లమెంటరీ వ్యవస్థలోని డొల్లతనాన్ని ప్రస్ఫుటంగా తెలుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు, చట్టసభల్లో కీచులాటలు ప్రజలకు వెగటు కలిగిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశానికి సరిపోదన్న అనుమానాలు కలుగుతున్నాయి. పాతతరం నాయకులకు ప్రజాశ్రేయస్సే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఉండేవి కావు. నేడు అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు అక్రమార్జనపైనే దృష్టి పెడుతున్నారు. పదవులు, పలుకుబడి కోసం సునాయాసంగా పార్టీలు మార్చేస్తున్నారు. సంపాదన ఒక్కటే వారికి పరమావధిగా మారింది. ఓ పార్టీ టిక్కెట్‌పై గెలిచి మరో పార్టీలోకి మారేందుకు నేతలు ఏ మాత్రం జంకడం లేదు. ఈ కారణంగానే రాజకీయాల్లో విలువలు పాతాళానికి పతనమవుతున్నాయి. చట్టసభలు ప్రజాసమస్యల పరిష్కారానికి గాక, రాజకీయ పార్టీల వ్యక్తిగత దూషణలకు వేదికలవుతున్నాయి.
సామాజిక స్పృహ ఉన్నప్పటికీ ఈ తరం మేధావులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విలువలు పతనమైన రాజకీయ రంగంలో తాము ఇమడలేమని విద్యాధికులు విముఖత చూపుతున్నారు. దీంతో ‘రాజకీయ వ్యాపారులు’ విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాము బాగా ఖర్చుపెట్టామని, గెలిచాక అంతకు పదింతలు సంపాదించాలని నేతలు ఆరాటపడుతున్నారు. ప్రజల్లో నైతికస్థాయి పడిపోయిందని, వారు అవకాశవాదంతో ఓట్లు వేస్తున్నారని నేతలు వాదిస్తున్నారు. తప్పంతా ప్రజలదే అన్నట్టు రాజకీయాన్ని నాయకులు వ్యాపారం చేస్తున్నారు.
నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు రాజకీయాలను విషతుల్యం చేస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిణామాలు, దిగజారుడు రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైనంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కానీ, ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నీచ రాజకీయాలను ఖండించడం లేదు. ‘నాకు సిగ్గులేదు, నీకు సిగ్గులేదు’ అన్నట్టు నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ స్థితిలో మున్ముందు ఫిరాయింపుల రాజకీయాలు మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. వీరికి పదవులు కట్టబెట్టడం అనైతికమన్న విమర్శలు చెలరేగాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని గవర్నర్ నుంచి దిల్లీలోని వివిధ పార్టీల నేతలకు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారన్న విమర్శలు చెలరేగాయి. తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించి మంత్రి పదవి పొందినపుడు తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు- ‘అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు.. బయట పార్టీ నుంచి వచ్చిన వారిలో సమర్ధులూ ఉంటారు. రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులిస్తే తప్పులేదు’ అంటూ తాను చేసిన తప్పును సమర్ధించుకున్నారు. అంటే- మిగతావారు చేస్తే తప్పు.. తాను చేస్తే ఒప్పు అన్నమాట.
గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపులతోనే ఏర్పడ్డాయి. 1967 తరువాత దేశ రాజకీయాలను పరిశీలిస్తే ఫిరాయింపుల మరక అంటని పార్టీ లేదు. ఈ విషయంలో గవర్నర్లు కూడా వివాదాస్పదం అవుతూ విమర్శలకు గురవుతున్నారు. పలు సందర్భాల్లో గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదు. కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తూ వివాదాస్పద మవుతున్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే ఆలోచన చాలామంది నేతలలో ఉండడం లేదు.
అనాదిగా భారతీయ సమాజం నిర్మించుకున్న విలువలు నేడు పతనమై మొత్తం రాజకీయ వ్యవస్థ సంక్షోభ దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపుల ఫలితంగా రాజకీయాలు వ్యాపారాన్ని తలపిస్తున్నాయి. వ్యాపారం ఉన్న చోట నీతి, నియమాలు ఉండవు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని బహుశా ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు.
1967లో కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధిపత్యానికి గండిపడి సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైంది. అప్పటి నుండి పలు రాష్ట్రాలలో జాతీయ పార్టీల గుత్త్ధాపత్యానికి కాలం చెల్లి, ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడంతో పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకుని ఎన్నికల్లో గెలుపొంది, ఆ తరువాత మరొక రాజకీయ పార్టీలోకి దూకడం షరామామూలుగా మారింది. రాజకీయాలు క్రమంగా వ్యాపార స్వభావం సంతరించుకోవడంతో విలువలు పతనమై ‘జంప్ జిలానీ’ల సంఖ్య పెరుగుతోంది.
పార్టీ ఫిరాయింపులను అడ్డుకునే విధంగా చట్టాన్ని తీసుకురావాలని గతంలోనే కొందరు ఉద్యమబాట పట్టారు. పార్టీ ఫిరాయింపుల వల్ల వామపక్ష పార్టీలు తప్ప దాదాపు అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో లాభపడ్డాయి. అందువలన పైకి నిరసించినా, ఫిరాయింపుల రద్దుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. రాజ్యాంగంలోని 101, 102, 190, 191వ అధికరణాలకు కొన్ని సవరణలు చేశారు. కొత్తగా 10వ షెడ్యూల్ చేర్చబడింది. ఈ చట్టం 1-3-1985 నుండి అమలులోకి వచ్చింది. కానీ, ఈ ప్రయత్నం పట్ల ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధిలేదు. కనుక అంతా లొసుగుల మయం. ఈ షెడ్యూలు పరమ లోపభూయిష్టంగా రూపొందించబడింది. మొక్కుబడిగా ఆ తరువాత ఈ షెడ్యూలును సవరించినా ఇప్పటికీ పార్టీ ఫిరాయింపులు నిరాఘాటంగా కొనసాగుతున్నాయంటే ఈ షెడ్యూల్ ఎంత లోపభూయిష్టంగా ఉందో సులభంగానే అర్థం అవుతుంది.
ఒక రాజకీయ పార్టీపై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆ తరువాత మరొక పార్టీలో చేరితే అతని సభ్యత్వం రద్దు అవుతుందని చట్టం చెబుతోంది. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం సభాపతికి ఇచ్చారు. ఇక్కడ సభాపతి నిర్ణయమే అంతిమ నిర్ణయం. పార్టీలో చీలిక, పార్టీ విప్ ధిక్కరించి ఓటువేయడం, గైరు హాజరుకావడం మొదలగు అంశాలు మొదటినుంచి వివాదాస్పదం అవుతున్నాయి. ఆ వివాదంపై అంతిమ నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా సభాపతికి ఇవ్వడం జరిగింది. సభాపతి నిర్ణయాలపై విచారణ జరిపే అధికారం న్యాయస్థానాలకు లేదు. చాలా సందర్భాల్లో సభాపతులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నా, ఆ నిర్ణయం తప్పు అని స్పష్టంగా కనిపిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. చివరకు సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేకపోయింది. ఇది యాధృచ్ఛికంగా కాదు, బుద్ధి పూర్వకంగానే జరిగింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సర్వాధికారాలను సభాపతికి ఇవ్వడంలోనే మొత్తం కిటుకు దాగి ఉంది. ఫిరాయింపులపై సభాపతి నిర్ణయం తీసుకోవడంపై పదవ షెడ్యూల్‌లో ఎటువంటి కాలపరిమితి లేకపోవడంతో మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. సదరు చట్టసభ ఐదు సంవత్సరాల కాలపరిమితి తీరిపోతుంది. ఇది కూడా బుద్ధిపూర్వక కుట్రలో భాగమే. సహజంగా సభాపతి అధికార పార్టీకి చెందిన వారై ఉంటారు. అందువల్ల పార్టీ ఫిరాయింపుల విషయంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. నెలలు గడుస్తున్నా వారు తమ నిర్ణయాన్ని చెప్పకుండా కాలయాపన చేస్తుంటారు. ఇప్పటిదాకా జరిగింది, జరుగుతున్నది ఇదే. కాబట్టి ఈ షెడ్యూల్ ఉన్నా లేనట్టే. పార్టీ ఫిరాయింపులు కొనసాగుతునే ఉన్నాయి. ఇకముందు కొనసాగుతాయి కూడా. తప్పంతా ఇక్కడ పెట్టుకుని ఫిరాయింపుదార్లపైన, గవర్నర్ల మీద విమర్శలు గుప్పిస్తే ఉపయోగం ఏముంది? ఇకనైనా చట్టాన్ని పటిష్టపరిచి ఫిరాయింపుదార్లకు కళ్లెం వేసి, రాజకీయాల్లో విలువలను కాపాడాలి.

-షేక్ కరిముల్లా