సబ్ ఫీచర్

అదిగో.. నవలోకం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే పుష్కర కాలంలో ప్రపంచం పెద్దఎత్తున మారనున్నది. అంటే 2030 నాటికి విశ్వం రూపురేఖలు మన అంచనాలకు అందకుండా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఆటోమేషన్! భారత్ సహా సంపన్న దేశాలైన అమెరికా, జపాన్, జర్మనీ, చైనా తదితర దేశాల్లో ‘దృశ్యం’ మారనున్నది. కోట్లాది మంది చేస్తున్న ఉద్యోగాలు, పనులు రూపాంతరం చెందనున్నందున మొత్తం పరిస్థితే మారిపోతుంది. ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం కోట్లాది ఉద్యోగాలు ఆటోమేషన్‌కు ఆవిరవుతాయి. వాటి స్థానంలో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వాటిలో కుదురుకోవడానికి నైపుణ్యాలు, ప్రత్యేక శిక్షణ, అవగాహన అవసరం. దీన్నొక సంక్షోభంగా భావించేవారు కొందరు.. ఈ సవాళ్లను నిచ్చెన మెట్లు చేసుకునే స్వభావం గలవారు ఇంకొందరు.. ఆ ‘దృశ్యాని’కి సంబంధించి ఎన్నో సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
‘ఆటోమేషన్ వల్ల కార్మికశక్తిలో మార్పు’ అంశంపై 46 దేశాల్లో జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆ వెలుగు చూపే దారిలో మనం చూపు నిలిపితే ఉపాధి సులువవుతుంది. తొలి పారిశ్రామిక విప్లవం ప్రపంచమంతటా పరచుకున్నప్పుడూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. దాని ఫలితం క్రమంగా విస్తరించింది. ఆనాటి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దానివేగం మందకొడిగా కనిపించింది. ప్రస్తుతం నాల్గవ పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన ఆటోమేషన్ ఫలితాలు చాలా వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి.
గడుస్తున్న ప్రతి ఏడాదిలో సాంకేతిక పరిజ్ఞానం ఓ కొత్త మలుపుతిరుగుతోంది. అది అందరి ఎరుకలోకి వస్తోంది. కృత్రిమ మేధ తీసుకొచ్చిన, తీసుకొస్తున్న సునామీ ఇంతంత కాదు. దీంతో వేల సంవత్సరాల మానవ మనుగడ ఒక కొత్త కక్ష్యలోకి అడుగిడింది. క్రమంగా పెరుగుతున్న ఆ వేగాన్ని అందుకోవడం అందరి బాధ్యత. ఈ నూతన పరిస్థితికనుగుణంగా తమని తాము మలచుకోని పక్షంలో వెనుకబడిపోవడం తథ్యం. అలా వెనుకబడటం అటు వ్యక్తులకు, సమాజానికి, దేశాలకు నష్టదాయకం. మారిన, మారుతున్న పరిస్థితుల కనుగుణంగా ఒదిగిపోయే స్వభావం మానవ సముదాయానిది. అందుకే గత రెండువందల ఏళ్ల చరిత్రలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నా ఆయా తరాలు వాటిని ఆహ్వానించి, వాటిలో ఒదిగిపోయి జీవించడం అలవర్చుకున్నాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అయితే గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాల కారణంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఊడిపోయిన దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం మీడియాలో స్పష్టంగానే కనిపిస్తోంది. నిపుణులు మాత్రం అంతగా దిగులు పడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు. కొత్త టెక్నాలజీకి, పని విధానానికి సంబంధించిన విషయాలను అవగాహన చేసుకుని, నైపుణ్యాలను పెంచుకుని, శిక్షణ పొంది అవసరమైన ఉపాధి పొందే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయంటున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఊడిపోతాయో, అన్ని, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అయితే ఆ ‘ప్లాట్‌ఫాం’ వేరుగా ఉంటుందంటున్నారు. దీన్ని జీర్ణం చేసుకుంటే దిగులు పడాల్సిన అవసరం కనిపించదు. కొత్త తరాలకైతే ఇదొక వరం. వారు ఈ పరిణామ క్రమంలో సులువుగా ఒదిగిపోయే అవకాశముంటుంది. భారత్‌లో యువశక్తి ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కొత్త సాంకేతిక విప్లవాన్ని ఈ కొత్తతరం సంతోషంగా ఆహ్వానించే అవకాశాలున్నాయి. పుష్కర కాలంలో వచ్చే కొత్త తరాలకయితే ఇది కరతలామలకంగా మారనుంది. భవిష్యత్ అంతా వీరిదే.
1980 ప్రాంతంలో స్టీవ్ జాబ్స్, బిల్‌గేట్స్ లాంటి సాంకేతిక నిపుణులు, కంప్యూటర్ రంగాన్ని కొత్త ‘లెవల్’కు తీసుకెళ్ళడంతో ప్రపంచ గతి సంపూర్ణంగా మారింది. ఆ పునాదులపై లేచిన ‘ఆటోమేషన్’ ప్రపంచ చలనగతిని కుదిపేస్తోంది. ‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ వ్యవస్థాపకులు లారీపేజ్, సెర్గిబ్రిన్‌ల ఆవిష్కరణలు అద్భుతాలను సృష్టించాయి. వీరికి కొనసాగింపుగా ఇప్పుడు ఇలాన్ మస్క్ ప్రపంచాన్ని మరో ఎత్తుకు చేర్చబోతున్నారు. ఇలాన్ మస్క్ తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ కార్లు, లూప్ ద్వారా ప్రయాణం మరింత విప్లవాత్మకం కానున్నది. సోలార్ సిటీ ఏర్పాటు ఓ అద్భుతం. ఆయన దృష్టి కోణం ఎంతో అధునాతనమైనది. చివరకాయన అంగారక గ్రహంపైకి మానవులను తీసుకెళ్లి, అక్కడ కాలనీలను ఏర్పాటుచేసే ‘స్పేస్ - ఎక్స్’ కార్యక్రమంలో తలమునకలై ఉన్నాడు. ఇటీవలనే బాహుబలి లాంటి రాకెట్‌లో ఎలక్ట్రానిక్ కారును నింగిలోకి పంపారు. అంతిమంగా భూగ్రహాన్ని కాపాడుకోవడమే గాక మానవుడిని కాపాడేందుకు ఆ అంగారకగ్రహ కాలనీల ఉద్దేశమని ఆయన చెబుతన్నారు. నక్షత్ర మండలంలో జరగరానిది జరిగి పెద్ద శకలమేదైన భూమిని ఢీకొంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని, పెరుగుతున్న జనాభాకు ఇప్పుడున్న వనరులు ఎంతోకాలం సరిపోవని అందుకే నూతన గ్రహంపై ఆవాసాల అవసరముందని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అటువైపుగా అడుగులు బలంగా వేస్తున్నారు.
ఇటీవల స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో తాజా పరిస్థితులను పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, వివిధ దేశాల నాయకులు ఒకరినొకరు పంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు హాజరై ప్రపంచం ఎటువైపు చూస్తున్నదో తెలుసుకున్నారు. తదనుగుణంగా టెక్నాలజీని, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పెద్దగా నైపుణ్యం అవసరంలేని చోట, పునరావృత పనులు చేసే చోట, మానవ పొరపాట్లు ఎక్కువ జరిగే చోట ఆటోమేషన్ ప్రభావం ఉంటుందని ‘ఇంటెల్’ సంస్థ ఇండియా విభాగం అధిపతి నివృత్తి రాయ్ ఇటీవల హైదరాబాద్‌లో చెప్పారు. అతి త్వరలో స్మార్ట్ఫోన్ ఆధారంగా టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషన్లు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసే ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలోనూ అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం ఓ కుగ్రామమైన వేళ అమెరికాలో గాని, హాంగ్‌కాంగ్‌లో గాని ఆవిష్కృతమైన కొత్త టెక్నాలజీ భారతదేశంలోకి వేగంగా వచ్చి చేరుతోంది. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాల్లో అంతర్భాగంగా ఏర్పడిన అనేక అంకుర సంస్థలు (స్టార్టప్స్) కొత్త ఆవిష్కరణ కోసం చెమటోడుస్తున్నాయి.
తలకిందులైన మార్క్సిజం
ఇంత ప్రస్ఫుటంగా సాంకేతిక పరిజ్ఞాన విప్లవం వెయ్యి రెక్కలుగా విప్పారి కనిపిస్తున్న సమయాన భారతదేశ మవోయిస్టులు ప్రవచించే మార్క్సిజం సింద్ధాంతానికి మాన్యత కనిపిస్తున్నదా..? 2030 సంవత్సరం నాటికే ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ‘కార్మిక శక్తి’లో మార్పులు ఊహించని రీతిలో జరగబోతున్నాయని తెలుస్తున్నప్పటికీ, ఈ విషయాలను అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నప్పటికీ మార్క్సిజం ఆధారంగా దండకారణ్యంలో బలమైన దండు నిర్మించి, దాన్ని కదం తొక్కించి 2050 నాటికి ఎర్రకోటపై ఎర్రజండా ఎగురవేస్తామని మావోయిస్టులు ఆదివాసుల ప్రాణాలు తీయడం, జరిగిన కొద్దిపాటి అభివృద్ధిని ధ్వంసం చేయడం, మభ్యపుచ్చి కాలహరణ చేయడం ఆహ్వానించదగ్గదేనా?
మార్క్స్ తన కాలానికన్నా పూర్వపు పరిస్థితిని విశే్లషించి దాన్ని తలకిందులు చేసి, కమ్యూనిస్టు మూలసూత్రాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ‘కార్మిక శక్తి’లో, ఉత్పత్తి సంబంధాల్లో వైరుధ్యాల్లో వచ్చిన మార్పు- మార్క్స్ ఆలోచనలను తాజా సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ ఆథారిత ఆటోమేషన్ పూర్తిగా తలకిందులు చేసింది. ఏ కార్మిక శక్తిపై మనసు, మేధ నిలిపి మార్క్స్ పనిచేశాడో ఆ శ్రమశక్తి కార్మిక శక్తి తలకిందులైంది. రోబోల శక్తి పెరిగింది. అయినా 170 సంవత్సరాల క్రితపు మార్క్స్ ఆలోచనలే ఇప్పటికీ శిరోధార్యమని మావోయిస్టులు మారణహోమాలు సృష్టిస్తూ, మందుపాతరలు పేలుస్తూ బంద్‌లకు పిలుపునిస్తూ విధ్వంసకాండకు పూనుకుంటే ఆ కార్మిక శక్తి మెరుగైన జీవితం అందుకునే అవకాశమున్నదా?. లేదు గాక లేదు! మరి ఆ చర్యలను అందరూ నిరసించాలి కదా..? *

-వుప్పల నరసింహం 99857 81799