సబ్ ఫీచర్

కార్డుంటే చాలు.. బిందెలోకి నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడి మహిళలకు- ఉదయానే్న నిద్రలేచి మంచినీళ్ల కోసం భారీ ‘క్యూ’లో నిరీక్షించాల్సిన పని లేదు.. వీధికుళాయి వద్ద బిందెడు నీళ్ల కోసం సిగపట్లు పట్టాల్సిన అవసరం లేదు.. చేతిలో ప్లాస్టిక్ కార్డు ఉంటే చాలు- ఎలాంటి హైరానా లేకుండా తీరుబడిగా ఎప్పుడైనా మంచినీటిని ఇంటికి తీసుకుపోవచ్చు. తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఒరక్కడు గ్రామంలో మహిళలు ఇపుడు తమచెంతనే ఉన్న ‘వాటర్ ఎటిఎం’కు మంచినీటిని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు వీరు ఎంతో డబ్బు ఖర్చుచేసి వాటర్ కేన్‌లు కొనుక్కునేవారు. ఆర్థిక స్థోమత లేని వారు పొరుగునే ఉన్న నెరుకుంద్రం గ్రామానికి వెళ్లి మంచినీటిని తెచ్చుకునేవారు. మంచినీటి కోసం ఇపుడు దూరాభారం వెళ్లనక్కర్లేదని, వాటర్ కేన్‌లు కొనుక్కునే అవసరం తప్పిందని మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కొంత డబ్బు చెల్లించి ప్లాస్టిక్ కార్డులను తీసుకుంటే చాలు. వాటర్ ఎటిఎంకు వెళ్లి పరిశుభ్రమైన నీటిని పొందే అవకాశం వీరికి ఏర్పడింది.
ఒకసారి కార్డు ఉపయోగిస్తే ఇరవై లీటర్ల నీరు పైపుద్వారా బిందెలోకి చేరుతుంది. ఇరవై లీటర్ల నీటికి కార్డులో ఉన్న మొత్తంలో రెండు రూపాయలు ఖర్చవుతుంది. కార్డులో ఉన్న మొత్తం అయిపోతే మళ్లీ డబ్బులు చెల్లించి వాటిని ‘రీ చార్జి’ చేసుకోవాల్సి ఉంటుంది. చేతిలో డబ్బు లేకపోయినా ఒకసారి కార్డు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్లు పట్టుకోవచ్చు. నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు వంద రూపాయలకు మించి ఖర్చు కావడం లేదని మహిళలు చెబుతున్నారు. తాగడానికి, వంటకు మంచినీళ్లు కొనేందుకు గతంలో చాలా డబ్బు ఖర్చయ్యేదని వారు గుర్తు చేస్తున్నారు. గ్రామంలో ఈ ఎటిఎం ప్రారంభించాక వాటర్ కేన్‌లను కొనడం పూర్తిస్థాయిలో తగ్గిపోయింది. నీళ్ల కోసం మహిళలు కొట్టుకోవడం, కేకలు వేసుకోవడం వంటి దృశ్యాలు ఇపుడు కనిపించడం లేదు. తమిళనాడు రాష్ట్రంలోనే తొలిసారిగా తమ గ్రామంలో వాటర్ ఎటిఎంను ఏర్పాటు చేశారని మహిళలు గొప్పగా చెబుతున్నారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో మంచినీటి కోసం మహిళలు పడుతున్న పాట్లను చూసి గ్రామ సర్పంచ్ వాసంతి భాస్కరన్ ‘వాటర్ ఎటిఎం’ను ఏర్పాటు చేసేలా కృషి చేశారు. రెండు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఒరక్కడు, అలిమెడు గ్రామాల్లోని ఎటిఎంలకు అనుసంధానం చేయడంతో దాదాపు 500 కుటుంబాలకు నీటికష్టాలు తొలగిపోయాయి. వాటర్ ప్లాంట్ల ద్వారా రోజూ తాగునీటి కోసం ఎనిమిది వేల లీటర్లు, ఇతర అవసరాలకు అరవై వేల లీటర్ల నీటిని అందజేస్తున్నట్లు సర్పంచ్ వాసంతి చెబుతున్నారు. చెన్నైకి చెందిన ఓ సంస్థ వాటర్ ఎటిఎంలను ఏర్పాటు చేయగా, పూణెలోని ఓ సంస్థ ‘ప్రీ పెయిడ్ కార్డు’లను సరఫరా చేస్తోంది. ఎటిఎంల ఏర్పాటుకు సుమారు 9.7 లక్షల రూపాయలు ఖర్చయినట్లు ఆమె తెలిపారు. తమ గ్రామంలోని వాటర్ ఎటిఎంలను పరిశీలించేందుకు ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం తనకు సంతోషం కలిగిస్తోందని వాసంతి అంటున్నారు.