సబ్ ఫీచర్

కబడ్డీతో లింగవివక్షకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కబడ్డీ ఆడితే ఆడపిల్లలకు ఏం ఉపయోగం? ఆటపాటల పేరిట అమ్మాయిలు బయటకు వెళితే వారికి భద్రత ఎలా? జీవనోపాధికి దారిచూపే పనేదైనా నేర్పించండి..’- అంటూ మురికివాడల్లో ఉంటున్న పలు కుటుంబాలు ప్రశ్నించినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆటల్లో పాల్గొనే బాలికలు లింగవివక్షను ధైర్యంగా ఎదుర్కొంటూ సమాజంలో స్వేచ్ఛగా జీవించగలరన్న విశ్వాసాన్ని వారిలో ఆమె కలిగించారు. ఫలితంగా అక్కడి పేదింటి బాలికలు కబడ్డీ ఆటలోనే కాదు, చదువులోనూ రాణిస్తున్నారు.
ముంబయిలోని గోవాండి మురికివాడ పరిధిలోని శివాజీనగర్‌లో ఇపుడు కొత్త చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడి బాలికలు బడిబాట పట్టాలంటే ముందుగా వారికి ఆటపాటలపై ఆసక్తి కలిగించాలని ‘పరివర్తన్’ సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త సబియా షేక్ భావించారు. పేద కుటుంబాలను కలుసుకుని బాలికలు కబడ్డీ ఆడేలా ఒప్పించగలిగారు. మురికివాడల్లోని బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఆమె కలిగించారు. బి.కామ్ చివరి సంవత్సరం చదువుతున్న సబియా అంతర్జాతీయ మహిళా అధ్యయన సంస్థ (ఐసిఆర్‌డబ్ల్యు), ‘అప్నాలయ’, లండన్‌కు చెందిన ‘స్ట్రయివ్’ సంస్థల సహకారంతో పేదింటి బాలికలకు అండగా నిలిచారు. విద్య, చదువు, ఆర్థిక విషయాల్లో లింగవివక్ష కారణంగా బాలికలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ముం దుగా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని సబియా భావించారు. కబడ్డీ వంటి ఆటల్లో పాల్గొంటే బాలికల్లో సిగ్గు, బిడియం పోతాయన్న నమ్మకంతో ఆ దిశగా ఆమె తన ప్రయత్నాలు ప్రారంభించారు. బాలికలను బయటకు పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులను పలుసార్లు కలుసుకుని వారిని మొత్తానికి ఒప్పించారు. గోవాండి ప్రాంతంలోని అంబేద్కర్ మైదానంలో బాలికల కోసం కబడ్డీ టోర్మమెంటును నిర్వహించారు. ఈ టోర్నమెంటులో 75 మంది బాలికలు పాల్గొనడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని సబియా చెబుతున్నారు. తల్లిదండ్రుల వైఖరిలోనూ క్రమంగా మార్పు వస్తోందని, ఆడపిల్లలు ఆటపాటల్లో పాల్గొనేందుకు ఇపుడు సుముఖత చూపుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంటి నుంచి బయటకు రాకుంటే- ఏ రంగంలోనైనా బాలికలు ఎలా రాణించగలరు?’అని ఆమె ప్రశ్నిస్తుంటారు. సబియాతో పాటు మరో పదిమంది కార్యకర్తలు బాలికలకు కబడ్డీలో మెళకువలను నేర్పుతుంటారు. మహారాష్ట్ర కబడ్డీ సంఘానికి చెందిన కోచ్‌లు కూడా ఇపుడు మురికివాడల్లో సేవలందించేందుకు ముందుకువస్తున్నారు. ఒకప్పుడు పురుషులు ఆడే ఆటగా భావించే కబడ్డీలో అమ్మాయిలు ఇంతగా నైపుణ్యం చూపుతున్నారంటే అందుకు సబియా కృషే కారణమని శివాజీనగర్‌కు చెందిన వృద్ధులు చెబుతున్నారు. లింగ వివక్ష నిర్మూలన, అక్షరాస్యత, ఆర్థిక సాధికారత వంటి విషయాలపై బాలికల్లో అవగాహన కలిగించేందుకు పాత పద్ధతులకు స్వస్తి చెప్పామని, కబడ్డీ వంటి ఆటల ద్వారా అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఐసిఆర్‌డబ్ల్యు నిర్వాహకులు చెబుతున్నారు. విభిన్నమైన పద్ధతుల పట్ల బాలికలు సైతం ఆసక్తి చూపుతున్నారని, ఆటల్లో, చదువులో రాణించాలన్న పట్టుదల వారిలో పెరిగిందని అంటున్నారు. తాము అబ్బాయిలకు ఏ విషయంలోనూ తీసిపోమన్న భావన బాలికల్లో రావడం శుభపరిణామమని ‘పరివర్తన్’ ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సంస్థ ఆవిర్భవించగా, ఇప్పటివరకూ 174 మంది బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇచ్చారు. అయితే, యుక్తవయసు రాకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం వల్ల ఆటలకు, చదువుకు వారు అర్ధంతరంగా స్వస్తి చెబుతున్న పరిస్థితులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని ‘పరివర్తన్’ నిర్వాహకులు అంటున్నారు. వివాహం చేసుకున్నప్పటికీ అమ్మాయిలు తమ ఆటలకు, చదువులకు దూరం కావాల్సిన పనిలేదని వారు సలహా ఇస్తున్నారు. లింగవివక్ష నిర్మూలన అనేది రాత్రికి రాత్రి సాధ్యం కాదని, మహిళా సాధికారత కల సాకారం కావాలంటే దృఢ సంకల్పం, నిరంతర శిక్షణ, సృజనాత్మకత అవసరమని సబియా చెబుతున్నారు.

-విజయ