సబ్ ఫీచర్

సాంకేతిక పురోగమనం...సమాంతర సంతోషమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర, సాంకేతిక యుగంలో ‘అల్ట్రామోడరన్’ జీవితాన్ని గడుపుతున్నాం. ప్రతి మనిషి చేతిలో ఒక సెల్‌ఫోన్, ప్రతి ఇంటా రెండో, మూడో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌హోమ్‌లు, స్మార్ట్ సిటీలు.. ఇలా స్మార్ట్ లేనిది, కానిది ఇప్పుడు కనిపించదు. వీటన్నిటినీ ఉపయోగిస్తూ మనిషి కూడా స్మార్ట్‌మ్యాన్ అయిపోతున్నాడు. ఏ పనీ స్వయంగా చేసుకునే అవసరం లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడికి, ఎక్కడ నిల్చుంటే అక్కడికి.. చివరకు పడుకున్నా, పక్కమీది నుంచి లేచే పని కూడా లేకుండా చేతికి అందుబాటులో స్విచ్‌లు, రిమోట్‌లు ఏర్పాటు చేసుకుని తెగ సుఖపడిపోతున్నాడు. తన స్విచ్‌ల సైన్స్ పరిజ్ఞానానికి, కొత్త కొత్త గాడ్జెస్‌ల పరిశోధనా శక్తికి.. ఒక్కమాటలో చెప్పాలంటే తన అతి తెలివితేటలకు తానే ప్రపంచమంతా డప్పుకొట్టుకుంటూ మురిసిపోతున్నాడు.
అంతా బాగానే వుంది..! నాణాన్ని మరోవైపు తిప్పి చూసినపుడే... ఇంతసేపూ అనుకున్న ఆ మోడ్రన్ ముఖ చిత్రం మారిపోయి.. వెలాతెలా పోతున్న మరో చిత్రం కనిపించి ‘ఇదేనా నీ మోడ్రన్ లైఫ్?’ అని వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. పురోగమనం మాట సరే.. మరి తిరోగమనం సంగతేంటి?’ అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటుంది. అంటే ‘అన్నారని’ అంటారు గానీ ఈ అత్యాధునిక, శాస్త్ర యుగంలో కూడా వ్యక్తిగత శుభ్రత గురించీ, పరిసరాల పరిశుభ్రత గురించీ మనం ఒకళ్ళతో చెప్పించుకోవాలా? ప్రైమరీ స్కూలు పిల్లలకు టీచరు పాఠం చెప్పినట్టు- ‘అన్నం తినే ముందు చేతులను శుభ్రంగా’ సబ్బుతో కడుక్కోండి, బహిరంగ ప్రదేశాలలో మూత్రవిసర్జన చేయకండి, మలవిసర్జనకు టాయిలెట్స్‌నే వాడండి’ అని పెద్దవాళ్ళకు సైతం పదే పదే టీవీ ప్రకటనల ద్వారా నేర్పించాలా?! ఎక్కడున్నాం ఇంకా మనం! చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్లు మోడ్రన్ యుగంలో ఉంటూ కూడా ఇంకా కొందరు ఎన్నో దశాబ్దాల క్రితం నాటి పాత పద్ధతులను, అపరిశుభ్ర అలవాట్లనే కొనసాగిస్తున్నారంటే అది ఎంత ఎదగనితనం..! ఎంతగా మనం ప్రగతిని సాధించినా ఇంకా చిత్ర విచిత్రమైన వైరస్‌లు పుట్టడం, నోరు తిరగని పేరుగల కొత్త కొత్త రోగాలు దేశ, విదేశాల నుంచీ వ్యాపించటంతో నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య శాఖ వారు ప్రజలకు ఆరోగ్య సూత్రాలను మీడియా ద్వారా నేర్పించడం ఒక విధంగా ఆమోదించదగినదే అయినా జనం వాళ్ళంతట వాళ్ళు ఎప్పుడో నేర్చుకుని ఉండాల్సిన ప్రాథమిక విషయాలు కదా ఇవి!
వెనకటి కాలంలో దయ్యాలు, భూతాలు, మంత్ర తంత్రాలు వంటి మూఢ నమ్మకాలు జనంలో విస్తారంగా ఉండేవి. ఈ ఆధునిక యుగంలో దయ్యాల గోల ఏంటి? వాటిమీద జనానికి అంత నమ్మకం ఏమిటి? నమ్మకం లేని వాళ్ళలోనూ నమ్మకం కలిగించడానికన్నట్టు ఈనాటి మన తెలుగు సినిమాలను ఇంతగా ఎందుకు దయ్యం పట్టి పీడిస్తోంది? ఇది నిజం కాదు.. దయ్యాలు భూతాలు లేవు అని గట్టిగా చెప్పి చీపురు తిరగేసి తెలుగు సినిమాకు పట్టిన దయ్యాన్ని వదిలించే సైన్స్ పండితులే కరువయ్యారా ఈ వైజ్ఞానిక యుగంలో? ఇది మోడ్రన్ యుగమేనా?!
అప్పుడెప్పుడో ఎన్నో వేల లక్షల ఏళ్ళ క్రితం పురాణ యుగంలో పెద్ద పెద్ద కోరలు, కొమ్ములు ఉన్న రాక్షసులు ఉండేవారట. మరి ఈ కాలంలో?! యూనివర్సిటీ చదువులు, పెద్ద పెద్ద డిగ్రీలు, డాక్టరేట్‌లు ఉన్నవాళ్ళు సైతం అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన కంప్యూటర్ సైన్సును రెండు వైపులా పదును వున్న కత్తిలా చెడుకూ వాడుకుంటూ వాట్సప్, స్కైప్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాల ద్వారా ఆడపిల్లల పరువును బజారుపాలు చేస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే విశే్లషకులు ఎవరికైనా ఏమనిపిస్తుంది? అసలు మనం ఇప్పుడు మోడ్రన్ యుగంలోనే ఉన్నామా? అని ఆశ్చర్యంగా అనిపించదూ? ఎక్కడికెళ్తున్నాం మనం.. అభివృద్ధి పథంవైపా.. అధోగతివైపా? అన్న ప్రశ్న ఉదయించి వేధించదూ? సమాజంలో మంచి పెరిగి, చెడు అంతరించి అంతా సుఖంగా, సంతోషంగా, ఆధునికంగా ఉండాలంటే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు , దీర్ఘకాలిక ప్రగతి ప్రణాళికలు ఏమిటని మెదడుకు పదునుపెడుతూ ఆ దిశగా ఆలోచనలు చేయరూ? అలా చేస్తారని, చెయ్యాలని అందరం ఆశిద్దాం!

- వాణీచలపతిరావు