సబ్ ఫీచర్

పెరుగుతున్న ‘పెళ్లికాని ప్రసాదులు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య మన దేశంలో ఒక కొత్త సామాజిక సమస్య మొదలైంది. రోజురోజుకు పెళ్ళికాని ప్రసాదుల జాబితా చాంతాడులా పెరిగిపోతున్నది. ఈ సమస్య ఉత్పన్నం కావటానికి కొంత స్వయంకృతాపరాధం ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు వైద్యపరీక్షల సహాయంతోనో లేక మరో విధంగానో ఆడపిల్లల జననాలను నిరోధించి మగపిల్లలను కనిపెంచేవారు. దీనివలన మగ పిల్లలు 100% ఉంటే ఆడపిల్లలు 85% మించి లేరు. ఈ అసమానతవల్ల పెళ్లికుమార్తెలు దొరకటం చాలా కష్టం అయింది. ఏ మ్యారేజి బ్యూరోకి పోయినా వరుని వివరాలు తెలిపే పుస్తకాలు నాలుగు ఉంటే వధువుకు సంబంధించి ఒక్క పుస్తకం మాత్రమే ఉంటున్నది. దీనివల్ల ఆడ పిల్లలకు ఛాయిస్ ఎక్కువ మగ పిల్లలకు తక్కువ ఏర్పడింది. ఇందు మూలంగా బ్రహ్మచారుల జాబితా రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇది ఒక కారణం. మరొక కారణం ఏంటంటే..వృత్తి విద్యలు చేసే మగ పిల్లలకు వధువులు దొరకడం చాలా కష్టంగా ఉంది. మన దేశంలో ప్రజలు ఎక్కువ శాతం గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మనుగడ సాగిస్తున్నారు. ఇతర ప్రజలు సామూహికంగా ఏర్పడి తమ జీవిత అవసరాలకు సరిపడే వస్తువులను తమ వృత్తుల ద్వారా ఉత్పత్తిచేస్తూ సమా జం అభివృద్ధికి తమవంతు సహాయాన్ని చేస్తున్నారు. వీరిలో వ్యవసాయ రంగం ప్రథమస్థానం వహించింది. ఆ తరువాత కంసాలి, మేదర, కుమ్మరి, చాకలి, నేత, పూజారి, చర్మకారు, మంగలి ఇలాంటి అనేక ఇతర వృత్తులు నిర్వహించేవారు మన సమాజంలో ఉన్నారు.
తమ వృత్తులలో నిష్ణాతులై ఆర్థికంగా బాగా సంపాదిస్తూ, బుద్ధిమంతులైన మగ పిల్లలు చాలామంది వివాహాలుకాక వయసు ముదిరిపోయి బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. ఈనాటి తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలను వైట్‌కాలర్ ఉద్యోగస్థులకు ఇచ్చి పెళ్ళిచేస్తే తమ గౌరవం సంఘంలో పెరుగుతుంది అనే ఒక మూఢ నమ్మకంలో ఉన్నారు. తమ వృత్తిలో ఉన్న గుణవంతులు, మంచి స్ఫురద్రూపులు, ఆర్థికంగా బాగా రాబడి, ఆదాయం ఉన్న పెళ్ళికొడుకులను వదిలేసి ఏదో ఒక యూనిఫారమ్ వేసుకొనే తక్కువ ఉద్యోగస్థునికైనా తమ ఆడ పిల్లలను ఇచ్చి వివాహం చెయ్యటానికి ముం దుకు వస్తున్నారు. కట్నాలు, లాంఛనాలు కూడా ఘనంగా ఇచ్చి వివాహాలు జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళికాని బ్రహ్మచారులలో ఎక్కువ మంది కులవృత్తులు చేసేవారే. వ్యవసాయం చేసే వారికి, పౌరోహిత్యం చేసేవారికి, పూజారులు, ఇలాంటి వారు చాలామంది వివాహాలు కాకుండా ఉన్నారు. ఇది ఒక రకమైన సాంఘిక దురాచారం. చాపక్రింద నీరులాగా చేరి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. ఈ విధంగా కొంత కాలం జరిగితే మగ పిల్లలు ఎవ్వరూ వృత్తి విద్యలు స్వీకరించకుండా పట్నాలకు పోయి ఫాక్టరీలలో కూలీలుగా షాపులలో గుమస్తాలుగా లేక సెక్యూరిటీ గార్డులుగా చాలీచాలని జీతాలతో మురికి కూపాలలో జీవనం సాగిస్తారు. అప్పుడు సమాజం నిర్వీర్యమై గ్రామాలు శిథిలావస్థకు చేరుకుంటాయి.
ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఆర్భాటాలకు పోయి లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి మీ బంగారు తల్లులను పట్నాల సంబంధాలను, విదేశీ సంబంధాలకు ఇచ్చి వివాహం చేసి వారిని కృత్రిమ కష్టాలకు గురిచేయకండి. అపోహలను వీడండి తమ వృత్తులలో యోగ్యులైన మగ పిల్లలు చాలామంది మన సమాజాలలో ఉన్నారు. అలాంటి వారిని చూసి మీకు తగిన, నచ్చిన సంబంధాలు మీ ఆడపిల్లలకు చేయండి. తద్వారా సమాజ శ్రేయస్సుకు, దేశప్రగతికి మీ ఆడపిల్లలు బంగారు భవిష్యత్తుకు పూలబాటలు వేయండి. అప్పుడే గాంధీజీ, కలలుకన్న రామరాజ్య స్థాపనకు మార్గం సుగమం అవుతుంది.

- జన్నాభట్ల లక్ష్మికామేశ్వరి