సబ్ ఫీచర్

బలహీనపడుతున్న పాలనా వ్యవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా బలహీన పడిపోతున్నాయనడంలో సందే హంలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పునాదిరాళ్ళుగా ఉంటుంటాయి. అయితే అవినీతి జాడ్యంవల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్ధే బీటలువారుతోంది. వాస్తవ సిద్ధాంతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అయితే రాజ్యాధికారం ప్రజలపైనే చెలాయించటం ఇక్కడి వైపరీత్యం. భారతదేశంలో ప్రజాస్వామ్యంపైకి బాగానే కనిపిస్తుంది . కానీ లోలోపల అంతా రాజరికపు అవలక్షణాలే ప్రతిబింబిస్తుంటాయి. అర్ధ ప్రజాస్వామ్యం అర్ధరాచరికపు లక్షణాలు సైతం పరిపాలనలో కనుపిస్తుంటాయి. కానీ ఎప్పటికైనా ప్రజాస్వామ్య సిద్ధాంతం పై చేయిగా ఉంటుందని సాధారణ ఎన్నికలు నిరూపిస్తుంటాయి. ఎన్నికల్లో ప్రజలు తమ అసాధారణ అధికారాన్ని ఓటు ద్వారా చూపిస్తారు. మన దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిస్థాయి విజయవంతం కావాలంటే ప్రజల కనీస అవసరాలు నెరవేర్చాల్సి ఉంటుంది. అయితే కనీస అవసరాలు నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నట్లుగా నటిస్తూ దశాబ్దుల కాలంనుండి అవినీతి కార్యకలాపాలు చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తూ విదేశీ బ్యాంకుల్లో దాచుకునే ప్రజాప్రతినిధులు, అధికారులు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఉంటున్నారు.
దేశం మొత్తంగా చూస్తే పాలనా వ్యవస్థలు నానాటికినీ దిగజారిపోతున్నాయి. చాలా శాతం అధికారులు అధికారమే పరమావధిగా పెట్టుకొని చెయ్యరాని పన్లుచేస్తూ దేశ సమగ్రతను ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తున్నారు. రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి మొత్తం వెరసి వ్యవస్థని విధ్వంసం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల నిమిత్తం ఖర్చుచేసిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి రాబట్టాలని నిత్యం కృషిచేస్తారు. గతంలో దేశ స్వాతం త్య్ర సముపార్జనే లక్ష్యంగా వందలు వేల మంది నిరాయుధులై నిస్సహాయులుగా ఉంటూనే స్వాతంత్య్రంకోసం ఉద్యమించారు. వారి యవ్వనప్రాయాన్ని, ఆస్తులు, సమస్త సంపదలను స్వాతంత్య్రోద్యమంలో సమర్పించి సమిధలయ్యారు. శ్రీమంతులు నిరుపేదలయ్యారు. ఆగర్భశ్రీమంతులు దేశంకోసరం అన్న పానీయాలు దొరకని పేదలయ్యారు. ఒక్కపూట తిని, తినక నిరాహారంతో ఉద్యమాలు నడిపించిన వారెందరో ఉన్నారు.
ప్రస్తుతం మన అధికార వ్యవస్థ అవినీతి, నీతిబాహ్య వ్యవహారాల్లో నిండామునిగి తేలుతున్నారు. చాలామంది అధికారులు అధికారం అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల ధనం ఏర్పాటుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది కొంతమంది నిరంతరం ఆదాయ అనే్వషణలోనే కాలం గడుపుతున్నారు. పేదవర్గాలు మరింతగా అభివృద్ధిచెందాలని అంత ఆశ పడుతున్నారని జనం అనుకొనే విధంగా రాజకీయ నాయకులు నటిస్తుంటారు. పేదల ప్రభుత్వం అంటూ నినాదాలవరకే చేస్తుంటారు. నిజానికి రాజకీయ నాయకులు పేదరికం పూర్తిగా నిర్మూలించటానికి ఇష్టపడరు. పెద్ద ఆనకట్టలుకట్టి రైతులకి నిరంతర జలస్రవంతిని అందుబాటులోకి తెస్తే వ్యవసాయమే రైతుకి ఊతం ఇస్తుంది. అంతేకాకుండా అనుబంధ పరిశ్రమలు పాడిపరిశ్రమలు వ్యవసాయ వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధిచెందుతాయి. కానీ స్వార్థ నాయకులు అంత త్వరగా ఏ ప్రాజెక్టునూ ఆనకట్టల్ని వెంటనే పూర్తిచేయరు. చేయటం వారికి ఇష్టం ఉండదు. దేశ చరిత్ర మొత్తంలో ఫలానా ప్రాజెక్టు లేదా ఫలానా ఆనకట్టని నిర్ణీతమైన కాలనిర్ణయ ప్రాతిపదికన పూర్తిచేసిన దాఖలాలు లేనేలేవు.
‘‘అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకలించి ఏరిపారెయ్యకపోతే ప్రజాస్వామ్యం విజయవంతం కానే కాదు’’. పి.సి.అలెగ్జాండర్ ప్రభుత్వ పాలనా శాస్త్రం గురించి విశే్లషిస్తూ ఇలా అన్నారు. ‘‘ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే నాయకుల్లో నిస్వార్ధబుద్ధి, సేవాతత్పరత, వ్యక్తిత్వ వికాసం, ఔదార్యం వంటి ఉత్తమ గుణ సంపద కావాల’’ని డా.పట్ట్భాసీతారామయ్య అన్నారు. ప్రస్తుతం మన ప్రభుత్వ పాలకుల్లో అటువంటి ఉత్తమ గుణసంపద మచ్చుకైనా కానరావటం లేదు. అధికారం అందిందే తడవుగా అక్రమ సంపాదనే ధ్యేయంగా ఉంటున్నారు. ఏ పన్లు చేస్తే డబ్బులు అక్రమంగా సంపాదించవచ్చో అవే పన్లు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో అవినీతి అనేది ఉన్నప్పటికీ బహిర్గతం అయితే వెంటనే పదవులుకి రాజీనామా చేయాల్సిందే. అవినీతికి పాల్పడిన ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్ తనయావదాస్తిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ముఖ్యమంత్రి జ్యోతిబసుకి చెందిన అనేక కోర్టు కేసుల్లో అనుకూలంగా తీర్పులిచ్చి వ్యక్తిగతంగా అనేక లాభాలు పొందాడు. దీంతో ఎవరో అగంతకులు సుప్రీంకోర్టుకి విషయాన్ని నివేదించగా సుప్రీంకోర్టు దర్యాప్తు చేయించి అతగాడి అక్రమ ఆస్తులున్నట్లు అవినీతికి పాల్పడినట్లు గుర్తించి అతని మొత్తం ఆస్తులు వేలం వేయించి ఆ సొమ్ము ప్రభుత్వ ట్రెజరీలో జమచేయించి రసీదులు సమర్పించే విధంగా చర్యలు తీసుకుంది.
అవినీతి సామ్రాజ్యం ఊడలు దిగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలని అపహాస్యం చేస్తున్న విషయం పట్ల అందరూ కలవరం చెందాలి. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పెద్ద మనుషుల్లా నటించేటువంటి గోముఖవ్యాఘ్రాలని పట్టుకోవటంలో పోలీసు,న్యాయ వ్యవస్థలు రెండూ నిరంతరం నిఘా నేత్రంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసు వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది పోలీసు అధికారులు అవినీతి మార్గాన పయనిస్తున్నారని ప్రజలు గ్రహిస్తున్నారు. వీరికి జీతం కంటే పై సంపాదన మీద యావ బాగా ఉంటున్నదని జనం అంటుంటారు. కర్మకాలి పోలీసు వారి బారిన పడితే లక్షల్లో ధనం పోగొట్టుకోవాల్సి వస్తోంది. పోలీసు వారికి ఆర్థిక నేరాలకి పాల్పడ్డ నిందితులను పట్టుకోవాలంటే మహా సరదాగా ఉంటుంది. ఆర్థిక నేరస్థులు డబ్బులిస్తుంటారు. బాధితులూ డబ్బులిస్తుంటారు. రెండుప్రక్కలా ఆదాయం పొంది చివరికి అంటీముట్టనట్టు కాలక్షేపం చేసి బదిలీ అయి వెళ్ళిపోతున్నారు. క్రింది స్థాయి పోలీసులు అధికారులు కూడా కోట్ల రూపాయల ధనం ఆస్తులతో తులతూగుతున్నారు.

- ఎన్.నాగేశ్వరరావు