సబ్ ఫీచర్

భాషను బతికించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాష ప్రవాహం వంటిది. నది వెల్లువెత్తి వంకర టింకరగా పారుతూ వాగులూ-వంకలూ తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతున్నట్లే భాష కూడ వ్యావహారికాలను, మాండలికాలను, అన్యదేశ పదాలను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రవాహపు నీళ్ళను కాలువల ద్వారా సక్రమ మార్గంలోకి మళ్ళించినట్లు భాషను కూడ వ్యాకరణం ద్వారా సక్రమంగా ఉండేటట్లు నన్నయ్యాదులు చేశారు. నన్నయ్య స్వయంగా ఆంధ్ర శబ్ద చింతామణిని రాశారు. దానికి అహోబల పండితుడు అహోబల పండితీయమనే పేర భాష్యం రాశారు. అధర్వణాచార్యులు కారికలు రాశారు. పైవన్ని తెలుగు భాషకోసం సంస్కృతంలో రాసిన వ్యాకరణ గ్రంథాలు. వాటిని అనుసరించి తెలుగులో చిన్నయసూరి బాల వ్యాకరణం రాశారు. బాల వ్యాకరణానికి సవరణ పూరణ గ్రంథాలుగా బహుజనపల్లివారి ప్రౌఢ వ్యాకరణం, పంతం రామకృష్ణరావుగారి ‘ముక్త లక్షణ కౌముది’ మొదలగు వ్యాకరణ గ్రంథాలు వచ్చాయి.
తెలుగులో వ్యాకరణ దీపం చిన్నదని విజ్ఞుల అభిప్రాయం. ఈ రంగంలో కొత్తగా పరిశోధనలు జరగటం లేదన్నది వాస్తవం. దీనికి పరిశోధక విద్యార్థుల అనాసక్తి కారణం కావచ్చు. వ్యాకరణం ఉప్పుబుట్ట అనే అభిప్రాయం లోకంలో ఉన్నది కదా! భాషాశాస్త్రం మీద కూడా గతంలో కొంత పరిశోధన జరిగింది. భద్రిరాజు కృష్ణమూర్తి, గంటి సోమయాజులు, వెలమల సిమ్మన్న వంటి భాషావేత్తలు భాషా శాస్త్రానికి వనె్నతెచ్చారు. భాషాపరిణామ వికాసాలను ‘రికార్డు’చేశారు. భాష పుట్టిన దగ్గరనుండి ఎలా మార్పుచెందిందీ పరిణామక్రమాన్ని సిద్ధాంతీకరించారు. చేరాగారు వాక్య నిర్మాణాల మీద చేసిన కృషి అమూల్యమైనది.
భాష మీద ఛందోలంకార గ్రంథాల పాత్ర కూడ తక్కువగాదు. కావ్య రచనకు అవి ఎంతగానో తోడ్పడ్డాయి. ఛందో దర్పణం, సులక్షణ సారం, అప్పకవీయం వంటి లక్షణ గ్రంథాలను చదవని భాషాపండితులు కవులు ఉండరనటం అతిశయోక్తికాదు. నేడు మాత్రం వాటి వాడుక నామమాత్రం. వచన రచనలో వచ్చిన వివిధ ప్రక్రియల కారణంగా వచన రచనాసరళి కొత్త పుంతలు తొక్కింది. ఆంగ్లం మొదలైన అన్యభాషల శైలిని పుణికిపుచ్చుకొన్నది. ఈ నేపథ్యంలో వ్యాకరణం పాత్ర కూడ పరిమితమైనది. అంతకుముందు బాగానే ఉన్నది కాని పూర్తిగా వ్యాకరణం చదవకపోతే, వాడుకలో లేకపోతే, వెర్రితలలు వేసిన పిచ్చిమొక్కలాగా భాష పాడైపోయే ప్రమాదం ఉంది. అందువలన సంప్రదాయాలను గౌరవిస్తూ వ్యాకరణాదులను తప్పక చదువుకోవాలి.
భాష మీద సాధికారత రావాలంటే పూర్వ రచనలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి. ముఖ్యంగా నిఘంటువులు అందుబాటులో ఉంచగలగాలి. ఎప్పుడో రాసి ప్రచురించిన ఆంధ్ర శబ్దరత్నాకరం ఇప్పటికీ మనకు పెద్ద దిక్కు. ఇటీవలి కాలంలో సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటివి ఒకటి రెండు వచ్చినా పెద్దగా అందుబాటులో లేవు. వివిధ సంస్థలు పోటీపడి నిఘంటువులు ప్రకటిస్తున్నా సమగ్రంగా ఉండటం లేదు. ఏకాక్షర నిఘంటువులు, నానార్థ నిఘంటువులు, పర్యాయ పద నిఘంటువులు, వ్యుత్పత్తి పదకోశం. వృత్తి పదకోశాలు అనేకం సమగ్రంగా తయారుకావలసి యున్నది. అచ్చతెలుగు నిఘంటువులు అసలు అందుబాటులో లేవు. ఆంధ్ర నామ సంగ్రహం సాంచ నిఘంటువులు కూడ అందుబాటులో లేవు. నిఘంటు రచన, వ్యాకరణ పరిశోధనలు, భాషా శాస్త్ర పరిశోధనలు ఏకముఖంగా సాగాల్సి వుంది. అందుకుగాను ‘తెలుగు భాషా కేంద్రం’ వేదిక కావాలి. విశ్వవిద్యాలయాలు మార్గదర్శనం చేయాలి. భాషను పది కాలాలపాటు బతికించుకోవాలి.

- నూతలపాటి వెంకటరత్నశర్మ