సబ్ ఫీచర్

కేరళపై జంతు ప్రేమికుల కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీధికుక్కలను పెద్దఎత్తున వధిస్తుండటంపై కేరళలో నిరసన పెల్లుబుకుతోంది. రెండేళ్లుగా ఈ వ్యవహారం రోజురోజుకూ ముదిరి ఇప్పుడు విస్తృతమవుతోంది. వీధికుక్కలను నిర్మూలించాలని ఓ వర్గం ఉద్యమిస్తుండగా, వీటి సంఖ్యను నియంత్రించడానికి ఎన్నో ఇతర మార్గాలున్నాయని, అక్షరాస్యతలో అగ్రపథాన ఉన్న కేరళలో మూగజీవాలను ఇలా వధించడం సిగ్గుచేటని మరోవర్గం వాదిస్తోంది. వీధికుక్కల హననం ఇలాగే కొనసాగితే కేరళలో పర్యాటక రంగాన్ని బహిష్కరిస్తామని, ఆ రాష్ట్రంలో అడుగుపెట్టమని, రాజస్తాన్, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల జంతుప్రేమికులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కేరళ సిఎం విజయన్ అధికారిక మెయిల్‌కు పుంఖానుపుంఖాలుగా లేఖలు రాస్తున్నారు. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ సహా పలు అంతర్జాతీయ పత్రికల్లో ఈ ఉదంతం ప్రముఖ వార్తాంశంగా మారిపోయింది. దీంతో కేరళ పర్యాటక మంత్రి స్పందించి, ఈ వివాదాన్ని పరిశీలిస్తామని ప్రకటన చేయాల్సి వచ్చింది.
భారత్‌లో దాదాపు 3 కోట్ల వీధికుక్కలు ఉన్నాయని ఓ అంచనా. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో వీధికుక్కల బెడద ఎక్కువగానే ఉంది. గుంపులు గుంపులుగా తిరిగే వీధికుక్కలు ప్రజలపై మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వీటివల్ల ర్యాబిస్ వ్యాధి వ్యాపిస్తుందన్న ఆందోళన పెరిగింది. తిరువనంతపురంలో 90 ఏళ్ల వృద్ధుడు, కొచ్చిలో 65 ఏళ్ల వృద్ధురాలు కుక్కల దాడిలో గాయపడి మరణించారు. ఒక్క కొచ్చిలోనే రోజూ పదిమంది కుక్కలదాడిలో గాయపడి ఆస్ప్రత్రులలో చేరుతున్నారు. మరోవైపు చంపిన వీధిశునకాలను కర్రలకు వేళ్లాడదీసి ఊరేగించడం వంటి కార్యక్రమాలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. వీధికుక్కల నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమిస్తున్న జోస్‌మవేలి (కొచ్చి)కి స్థానికంగా ఎక్కువ మద్దతే లభిస్తోంది. దాదాపు 2.75 లక్షల వీధికుక్కలను హతమార్చాలని నిర్ణయించారు. దీనికోసం పెద్దఎత్తున నిధులు, శునకాలను పట్టుకుని, వధించేవారికి శిక్షణ, పెద్దఎత్తున చెల్లింపులు జరుపుతున్నారు. వీధికుక్కల నియంత్రణకు వాటిని వధించడమే మార్గం కాదని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. వాటిని పట్టుకుని స్టెరిలైజేషన్ చేస్తేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఈ భూమిపై మానవుడితోపాటు కలసి పదివేల సంవత్సరాల నుంచి అవి మనుగడ సాగిస్తున్నాయని వారు వాదిస్తున్నారు. మనం వదిలేసిన వృథా పదార్థాలను తిని పర్యావరణానికి అవి కాపాడుతున్నాయని, మన రక్షణకు అవి పనిచేస్తాయని చెబుతున్నారు. స్టెరిలైజేషన్ వల్ల వాటి సంఖ్యను నియంత్రించాలని, వాటిని వధించడం క్రూరమైన చర్య అని ఆరోపిస్తున్నారు. వీధికుక్కల నియంత్రణకు శాస్ర్తియ పద్ధతులను వదిలి, వాటిని క్రూరంగా వధించడం సరికాదని ‘యానిమల్ ఎయిడ్ అన్‌లిమిటెడ్’ సంస్థకు చెందిన నేహాసింగ్ బన్యాల్ (రాజస్థాన్) అంటున్నారు. అన్ని ప్రాణుల్లాగే వీటికీ జీవించే హక్కు ఉందని ఆమె వాదిస్తున్నారు. కేరళలో వీధికుక్కల వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్న మవేలీ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అ నాథ పిల్లల కోసం ఓ శరణాలయాన్ని నిర్వహిస్తున్న మవేలీ పిల్లలు స్వేచ్ఛగా, నిర్భయంగా వీధుల్లో తిరిగే పరిస్థితి రావాలంటున్నారు. ఆయనకు రాజకీయ నాయకులు, స్థానికులు మద్దతిస్తున్నారు. అయితే అంతకుతగ్గ స్థాయిలో వ్యతిరేకతా ఎదురౌతోంది. ఆయనపై కేరళలో వివిధ ప్రాంతాలలో ఎనిమిది కేసులు నమోదైనాయి.
వీధిశునకాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, స్టెరిలైజేషన్, వాక్సినేషన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ ఏడాది మార్చిలో కేంద్రప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ర్యాబిస్ నిరోధించే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. కేరళలో మాత్రం అందుకు భిన్నంగా వీధిశునకాలను వధిస్తూండటం వివాదానికి కారణమైంది. గతేడాదిగా సోషల్ మీడియా వేదికగా వీధికుక్కల సంహారంపై పెనుదుమారం రేగి ఇప్పుడు ముదిరింది. వీధికుక్కల ఉన్నపళంగా వచ్చి కరవవని, వాటిని రెచ్చగిడితేనే అవి మీదపడతాయని, వాటి మానానవాటిని బతకిస్తే సరిపోతుందని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. బహిరంగంగా, అందరికీ తెలిసేలా క్రూరమైన పద్ధతుల్లో శునకాలను వధించడం, వాటి కళేబరాలను ఊరేగించడం దారుణమే.

-కృష్ణతేజ