సబ్ ఫీచర్

విలక్షణ పోరాట యోధుడు చెన్నమనేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన నిజాం పాలనను చూశారు. ఆ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చూశారు. స్వయంగా ఉద్యమంలో ఆయుధం చేపట్టి పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం రావడం చూశారు. స్వయంగా చట్టసభలకు ఎన్నికై ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేశారు. హైదరాబాద్ రాష్ట్ర అవతరణ చూశారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చూశారు. ఆనాటి శాసన సభకు ఎన్నికయ్యారు. జై తెలంగాణ ఉద్యమాన్ని చూశారు. దానికి వ్యతిరేకంగా విశాలాంధ్ర నినాదాన్ని వినిపించారు. ఎన్టీఆర్ పాలన చూశారు, ఆయన్ని చంద్రబాబు దించేయడం చూశారు. ఆనాటి పరిణామాల్లో క్రియాశీలక భూమికి పోషించారు. జై ఆంధ్ర ఉద్యమం చూశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం చూశా రు. మళ్లీ సమైక్యాంధ్ర వాదం వినిపించారు. కమ్యూనిస్టు పార్టీ చీలికను, టిడిపి ఆవిర్భావాన్ని అన్నీ చూసిన ఆయన చివరకు కమ్యూనిస్టు నుంచి టిడిపి వైపు వెళ్లారు. 2010 నుంచి తెలంగాణ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఏర్పాటే శరణ్యం అని నమ్మారు.
స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, హైదరాబాద్ సంస్థానం విముక్తి, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ప్రత్యేక తెలంగాణ- విశాలాంధ్ర పోరాటం, మలి దశ తెలంగాణ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ విభజన తెలంగాణ ఏర్పాటు రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశ చరిత్రలోనే కీలక ఘట్టాలు. ఈ మహత్తర సంఘటనలకు చెన్నమనేని సాక్షీభూతం. కేవలం సాక్షిగా మాత్రమే కాదు ఈ కీలక సంఘటనల్లో కీలక పాత్ర వహించిన అరుదైన నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు. చెన్నమనేని రాజేశ్వరరావు తెలుగు నాట కమ్యూనిస్టు పార్టీ ఉత్థాన పతనాలను చూశారు.
విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పాల్గొన్న చెన్నమనేని రాజేశ్వరరావుకు ఆ కాలంలోనే పోరాట యోధురాలు అరుణా అసఫలీ రాసిన లేఖ భవిష్యత్తులో పోరాట యోధునిగా మారేందుకు ఊతం ఇచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం సంస్థానం పరాయిపాలనలోనే మగ్గుతోంది. ఆ సమయంలో 1947 సెప్టెంబర్ 2న జెండా పండుగ రోజున హైదరాబాద్ నగరంలో త్రివర్ణ పతాకాన్ని ధైర్యంగా ఎగురవేసిన ధీశాలి చెన్నమనేని. ఆనాటి రయ్యత్ పత్రిక ఈ సాహసాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. పుట్టింది భూస్వాములైన దేశ్‌ముఖ్‌ల కుటుంబంలో కానీ భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఆయుధం చేపట్టి పోరాడిన జీవితం చెన్నమనేని రాజేశ్వరరావుది. 1923 డిసెంబర్ 23న హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతం కరీంనగర్ జిల్లా ఆనాటి సిరిసిల్లా తాలుకా, మానువాడ గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో చెన్నమనేని జన్మించారు. సొంత గ్రామం వేములవాడ మండలంలోని మారుపాక. నాంపెల్లి పరగణాలోని ఎనిమిది పది గ్రామాల్లో వందలాది ఎకరాలకు చెన్నమనేని కుటుంబం యజమానులు. అయితే బాల్యం నుంచే ఆయనపై భూస్వామ్య జీవన ప్రభావం పడలేదు.
చెన్నమనేనిపై కమ్యూనిస్టు మాత్రమే కాదు. భగవద్గీత, ఆర్య సమాజం ప్రభావం చాలా ఉంది. భూస్వామ్య వాతావరణంలో పెరిగిన కమ్యూనిస్టు, కమ్యూనిస్టుగా ఉంటూ భారతీయ సంస్కృతిని ఒంటబట్టించుకున్నారు. సత్యసాయిని దర్శించడం, వైష్ణవీ దేవి ఆలయానికి వెళ్లడంపై కొన్ని విమర్శలు వినిపించాయి. విద్యార్థి గానే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్శితుడైన చెన్నమనేని రాజేశ్వరావు చివరి దశలో టిడిపిలో చేరడం రాజకీయాల్లో విచిత్రంగానే అనిపించింది.
కమ్యూనిస్టు పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు తనకు నచ్చనప్పుడు ధైర్యంగా విమర్శించారు. చెన్నమనేని రాజేశ్వరరావు సత్యశోధన పేరుతో రాసుకున్న ఆత్మకథలో ఈ విషయాలను స్వయంగా ప్రస్తావించారు. పార్టీలో సిండికేట్ సభ్యునిగా చేరిన తాను 1942 నుండి పార్టీ అధికారిక విధానాలలో కొన్నింటిని విభేదిస్తూ వచ్చానని వాటి జాబితాను పేర్కొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని పార్టీ వ్యతిరేకించడం సరైన నిర్ణయం కాదన్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదని, ఇది బానిసత్వానికి మరో రూపమని, పార్టీ తీర్మానించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో చెన్నమనేని ఒకరు. 1948లో అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ రెండవ కాంగ్రెస్‌లో నెహ్రూ ప్రభుత్వాన్ని సాయుధ తిరుగుబాటు ద్వారా కూల్చివేయాలని పార్టీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించారు. 1950 జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన తెలియజేయాలనే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అనేక సందర్భాల్లో నిరంతరం అనేక అధికార విధానాలను వ్యతిరేకిస్తూ తాను పార్టీలో కొనసాగడానికి తనకు మార్క్సిజంపై ఏర్పడిన అచంచలమైన విశ్వాసమే కారణం అని ప్రకటించారు.
1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో హైదరాబాద్‌లో విశాలాంధ్ర నినాదాన్ని వినిపించిన నాయకుడు. ఒప్పందాల ఉల్లంఘన వాస్తవమేనని, న్యాయమైన డిమాండ్లను వినిపించాలి కానీ విభజన డిమాండ్ సరికాదనేది ఆ సమయంలో చెన్నమనేని వాదన. తెలంగాణ ఉద్యమ కాలంలో విశాలాంధ్ర నినాదంతో కొద్ది మందితో ప్రదర్శన నిర్వహిస్తే జైలుకు తరలించారు. జైలు తెలంగాణ వాదులతో నిండిపోయింది. ప్రమాదాన్ని గ్రహించి సంజీవరెడ్డినగర్‌లోని మరో జైలుకు తరలిస్తే అక్కడ ఇంకా ఎక్కువ మంది తెలంగాణ వాదులు ఉండడంతో ప్రత్యేకంగా ఒక గదిలో భద్రత కల్పించారని ఆనాటి సంఘటనలను ఆత్మకథలో చెన్నమనేని గుర్తు చేసుకున్నారు.
సిరిసిల్ల నియోజక వర్గం తొలి ఎమ్మెల్యే మొదలుకుని ఆరుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. పౌరసత్వం లభించక పోవడంతో చివరకు చెన్నమనేని రాజేశ్వరరావే 1999లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తరువాత టిడిపి సమైక్యవాదం వినిపిస్తే చెన్నమనేని అదే వాదం వినిపించారు. ఉద్యమం ఉధృతంగా మారిన తరువాత తెలంగాణ అంశంపై చెన్నమనేని ఆలోచనలు ఊహించని స్థాయిలో మారిపోయాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఫలితంగా తెలంగాణనే కాదు, ఆంధ్ర ప్రాంతం కూడా త్వరగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పార్టీని కుటుంబాన్ని రెండింటిని ప్రేమించి 93 ఏళ్ల సంపూర్ణ జీవితం గడిపిన చెన్నమనేని సోమవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.

- బుద్దా మురళి