సబ్ ఫీచర్

మార్క్స్ ఇంకా.. వారి ‘సొంత ఆస్తి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారల్ మార్క్స్‌పై ఇటీవల వెలువడిన ఘనమైన కీర్తనల ప్రతిధ్వని ఇంకా వినిపిస్తూ ఉంది. అసహజ రీతిలో వాటిని వినిపించిన వైనం కొత్తతరాన్ని, సహస్రాబ్ది తరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఇంటర్నెట్‌ను అభివృద్ధిపరిచి అమెరికా తన గోతిని తానే తవ్వుకుంటోందని కమ్యూనిస్టుపార్టీ నాయకుడొకరు అన్నారు. ఇది ఎంతటి అనాలోచిత వ్యాఖ్యనో ఇట్టే తెలుస్తోంది. ఈతరం ఊపిరి అయిన ఇంటర్నెట్‌ను అభివృద్ధిపరచడం ‘దోపిడీ’లో అంతర్భాగమన్న కమ్యూనిస్టు నాయకుల అవగాహన ఎంత లోపభూయిష్టమైనదో తెలుస్తోంది. ‘వర్క్‌ఫ్రం హోం’ అనే సౌకర్యాన్ని కల్పించి కార్మికులను కొత్తతరహాలో దోచుకుంటున్నారు.. ఇదీ ఆ నాయకుడి విశే్లషణ. ఈ రకమైన వ్యాఖ్యలు, విశే్లషణలు చేయడం కమ్యూనిస్టు నేతలకే చెల్లు. ఈ విధమైన అవగాహన, ఆలోచనగలవారు ఆధునిక సమాజాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళతారని ఆశించడం సాధ్యమా?
వాస్తవానికి ‘మార్క్సిజం, కమ్యూనిజం 19 శతాబ్దానికి సంబంధించిన చైతన్యం’ అన్న విషయాన్ని గుర్తించడానికి మార్క్స్ అభిమానులు సిద్ధంగా లేరు. 21వ శతాబ్దం స్వభావ స్వరూపాలను జీర్ణం చేసుకోకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అంచనా లేకుండా వర్తమానంపై వ్యాఖ్యానించడం ఎంతటి అర్థరహితమో, అమాయకత్వమో వారికి తెలియడం లేదు. నిజానికి నేటి శ్రామికశక్తిలో 25శాతం కొత్తతరం ఉంది. 2020 నాటికి వీరి శాతం 40 శాతానికి చేరనున్నది. మన దేశంలో ఆ సమయానికి ఆ శాతం 50కి చేరనున్నది. ఈ నేపథ్యంలో సోషలిస్టు వ్యవస్థ అనివార్యమని, వర్గపోరాటాలు చేయాలని పిలుపునివ్వడంలో అర్థం కనిపించదు. కాని కమ్యూనిస్టు నాయకులు, మావోయిస్టులు మాత్రం అదే మంత్రాన్ని జపిస్తున్నారు. కమ్యూనిస్టు సాహిత్యాన్ని ఎంతగా తొక్కిపెట్టినా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతటా అందుబాటులో ఉందని అంటూనే, ఇంటర్నెట్ దోపిడీకి ఉపకరించే మాధ్యమంగా ప్రకటించడం ద్వారా వారి ద్వంద్వ వైఖరి బట్టబయలవుతోంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇట్టే జీర్ణించుకుని తదనుగుణంగా స్పందించే తరానికి మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావోల గూర్చి బొత్తిగా తెలియదు. వారు ప్రవచించిన ఆలోచనలను నేటి తరం వినలేదు. విన్నా వాటిపై మనసుపెట్టే తీరిక, ఆసక్తిలేదు. అసంగతమైన అంశాలను అదే పనిగా ఊదరగొట్టడంలో అర్థం లేదు. స్మార్ట్ఫోన్, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్, గూగుల్ అనుసంధానంతో కొత్త స్వరంతో మాట్లాడుతున్న తరానికి, ఈ కామర్స్‌పై ఆధారపడుతున్న వారికి కమ్యూనిస్టు నాయకులు, మార్క్స్ అభిమానులు చేయాల్సిన మార్గదర్శనం ఎలా ఉండాలో తెలియక తికమక పడుతూ, టెక్నాలజీని అంచనావేయడంలో విఫలమయ్యామని, మార్క్సిస్టు నాయకుడొకరు బహిరంగంగా అంగీకరిస్తుంటే, మరికొందరు అనేకానేక రకాలుగా పాత పల్లవిని వినిపిస్తున్నారు. అది ఎవరి చెవికి ఎక్కుతున్నదన్న స్పృహ వారికి లేదు. మార్క్సిజంపై తమకు తెలిసినవి, తెలియనివి చెప్పడం ఆచారంగా పెట్టుకున్నారు.
రోజుకు 15నుంచి 17 గంటలు ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో కనిపించే తరానికిచ్చే సందేశం ఏమిటి? వారి జీవితాల్ని తీర్చిదిద్దుకునేందుకు అందించే సూచనలేమిటి? అసలు ఆ ‘్ఫ్లట్‌ఫాం’ గూర్చిన ఆనుపానులు తెలియక, అందులో సంక్లిష్ట వ్యవహారంపై అవగాహన లేకుండా, సమాచార విప్లవం తీసుకొచ్చిన మార్పుపై ఆలోచనలేకుండా, అనేక ఆధునిక టెక్నాలజీల సమ్మిళితంతో నూతన ‘దృశ్యం’ అన్ని రంగాలలో కనిపిస్తున్న సందర్భంలో వాటిని పట్టించుకోకుండా 19వ శతాబ్దపు పడికట్టు పదాలతో, భావాలతో ఇప్పటికీ విశే్లషణలు చేయడం, అభిప్రాయాలను వ్యక్తంచేయడం కాలం చెల్లిన విధానమని తెలియకపోవడం విడ్డూరంగాక ఏమవుతుంది?
మారిన పని సంస్కృతి
ప్రపంచవ్యాప్తంగా పని సంస్కృతి పూర్తిగా మారినా, మార్క్సిస్టుల ఆలోచనలు మాత్రం పనిగంటల తగ్గింపుకోసం చికాగో నగరంలో కార్మిక వర్గం జరిపిన ఊరేగింపుల కాలం దగ్గరే ఆగిపోవడం విషాదం. తొలి పారిశ్రామిక విప్లవ ఫలితాలకు, నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలకు మధ్యగల అంతరాలను, అభివృద్ధిని తూచేందుకు వారిదగ్గర తూకం రాళ్లులేవు. పాత పద్ధతిలోనే పాత పద ప్రయోగంతోనే, పాత భావజాలంతోనే అంచనావేయడం ఎలా సమంజసమవుతుందన్న విషయాన్ని సైతం వారు విస్మరిస్తున్నారు. సిలికాన్ వ్యాలీలోని పని విధానం, పని వాతావరణం హైదరాబాద్ సైబర్ సిటీలో కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడున్నా అనుసంధానమై ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీపై మనసుపెట్టి దాన్ని సొంతం చేసుకుంటూ అప్‌డేట్ అవుతున్నారు. ఆ విధంగా తమనితాము శక్తిమంతులుగా ప్రకటించుకుంటున్నారు. ఒక రకంగా సమష్టి జీవితం విచ్ఛిన్నమై మైక్రో జీవితం ఆరంభమైంది. సమాజమంతటా దీన్ని తిలకించవచ్చు. జనరేషన్ ఎక్స్‌గా పిలిచే తరం కూడా పోయి మిలీనియల్స్‌గా పిలిచే తరంలో ఏది ప్రాసంగికం? ఏదికాదు అన్న ఇంగిత జ్ఞానం ముఖ్యం. అది కొరవడి చెప్పేవన్నీ కాలం చెల్లిన విత్తనాలను విత్తడమే అవుతుంది, దానివల్ల ఏమిటి ప్రయోజనం? సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేవారే నిజమైన విప్లవకారులు తప్ప యథాతథవాదులు విప్లవకారులు, అభివృద్ధికాముకులుగా గుర్తింపు పొందారు.
ద్వంద్వ ప్రమాణాలు
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగిందని చెబుతూనే ఆ పార్టీ అనుసరించిన, అనుసరిస్తున్న విధానాలను ఇతర దేశాల్లో దుయ్యబట్టడం విచిత్రం. ఈ ద్వంద్వ విధానం వారి మనఃస్థితిని బట్టబయలుచేస్తోంది. పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిస్టు విధానం అంటూ ప్రత్యేకంగా కనిపించని కాలంలో జీవిస్తున్నాం, ప్రజల అభివృద్ధి అత్యంత కీలకమని భావిస్తున్న తరుణంలో మనమున్నాం. ఈ కీలక అంశాన్ని గుర్తెరగడానికి మార్క్స్ అభిమానులు తిరస్కరిస్తూ తమ సిద్ధాంత పాండిత్యాన్ని పది మంది ముందు ప్రదర్శించడానికి ఉత్సుకత కనబరచడంవల్ల ఒరిగేదేమి ఉండదు. పాతికేళ్ల క్రితం చైనాలో డెంగ్ జియావోపింగ్ చేపట్టిన సంస్కరణలు సరైనవని అక్కడి కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఆ సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెడితే కార్యవర్గ వ్యతిరేక చర్యలంటూ విరుచుకుపడటం విడ్డూరం గాక ఏమిటి?
మార్క్సిజం పిడివాదం కాదంటూనే, సృజనాత్మక సిద్ధాంతమని చెబుతూనే శాస్ర్తియ ఆలోచనా విధానమంటూనే పూర్తి పిడివాదులుగా, ‘మార్క్సిస్టు మత’వాదులుగా వ్యవహరించడానికే వారు ఇష్టపడుతున్నారు. మార్క్సిజంలో పేర్కొనే ప్రాథమిక సూత్రాలు, దోపిడీ నిర్వచనం, వైరుధ్యాలతీరు సంపూర్ణంగా మారిపోయిన విషయాన్ని పసిగట్టడంలో ఆ సిద్ధాంత ప్రేమికులు పూర్తిగా విఫలంకావడంతోనే ఇలా అగమ్యగోచర స్థితిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాచేసే నాయకుల ఇంట్లో కొత్తతరాల భావాలను, వారి ఆకాంక్షలను పట్టించుకుంటే- నిజానికి ఇలాంటి తప్పిదాలకు ఒడిగట్టరు. కళ్ళముందు కనిపిస్తున్న అనేక విషయాలను తొక్కిపెట్టి, గుర్తింపు కోల్పోయిన భావజాలాన్ని భుజాలపై మోసేందుకు ఆ బరువును ఇతరులు సైతం పంచుకోవాలని పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గది కాదు.
మానవ స్వభావం.. లాభం
ప్రస్తుత బూర్జువా వ్యవస్థను యథాతథంగా కొనసాగించేందుకు కుహనా మేధావులు కృషిచేస్తున్నారని మార్క్సిస్టు మేధావులు తరచూ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యవస్థ, విధానం వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. క్రీస్తు పూర్వం ‘సిల్క్‌రూట్’ కాలం నాటి వ్యవస్థ చూసినా, సముద్రయానం ద్వారా వ్యాపారాలు జరిగిన కాలం నాటి పరిస్థితులు గమనించినా ఇదే ‘‘స్వభావం’’ స్పష్టమవుతోంది. అంటే మానవుడిలోని ఆకాంక్షల కొనసాగింపే నేడు కనిపిస్తోంది. ఇది లాభాలవేట అని నిందిస్తూ మార్కెట్ రహిత వ్యవస్థను ప్రతిపాదిస్తే అది కుప్పకూలిన వైనాన్ని గుర్తించక ఆడిపోసుకోవడంలో అర్థం లేదు. లాభాల వేటలో ప్రజలు కనిపిస్తారు. గ్రహాంతరవాసులు కాదు. జ్ఞాన బలిమిగలవారు తమ వాటాను పెంచుకుంటూపోతారు. ఇది ప్రకృతి ధర్మం. నియంత్రించేందుకు అవసరమైన చట్టాలు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలహీనులను, జ్ఞాన బలిమి తక్కువగలవారిని ఏ విధంగా ఆదుకోవాలన్న దానిపై శ్రద్ధపెట్టడంలో అర్థం ఉంది కాని జ్ఞాన బలవంతుల ఉనికిలేకుండా చేయాలనుకోవడంలో సహజ న్యాయం కనిపించదు. జ్ఞాన బలవంతులు శ్రామికవర్గం నుంచి ఎదగవచ్చు, మధ్యతరగతినుంచి తొంగిచూడవచ్చు, ధనికవర్గం నుంచి రావచ్చు. దీనిపై ఆంక్షలు లేనప్పుడు మన ఆలోచన తీరు మరో విధంగా ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది.
సొంత ఆస్తిలేని సమాజం సృష్టిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మార్క్స్‌చేసిన ప్రయత్నం, తిరుగుబాటు బెడిసికొట్టింది. మార్క్సిస్టులకు, కమ్యూనిస్టులకు ‘మార్క్స్’ స్వయంగా ఇప్పుడు ‘సొంత ఆస్తి’గా మారాడు. లాభం చేకూర్చే వనరుగా మారాడు. ఈ వౌలికమైన అంశంపై స్పష్టత ఉంటే కాలానుగుణమైన మార్పులను స్వాగతిస్తే, రూపాంత్రీకరణ చెందితే ప్రజలందరికీ మేలుజరుగుతుంది. జగతి అంతా మురుస్తుంది. అందరు కోరుకునేది, కోరుకోవలసింది ఇదేకదా?

-వుప్పల నరసింహం 99857 81799