సబ్ ఫీచర్

ఊహలు ఊయలలూగేలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం, పరువం, ఆత్మాభిమానం,
పొగరుమోత్తనం, చిలిపితనం...
- అమ్మాయల లక్షణాలు..
హుందా, ఠీవి, పలుకుబడి,
అర్థం చేసుకునే తత్త్వం, అనురాగం...
- అబ్బాయిల గుణాలు..
వెరసి యద్దనపూడి సులోచనారాణిగారు తీర్చిదిద్దిన నాయికానాయకులు.
మమతల వెల్లువలో మనసుల్ని చల్లబరిచే ఆత్మీయ సరాగాలు ఆమె అక్షరాలు... ప్రతి వాక్యంలోనూ ఊహలు, వాస్తవ జీవితాలు.. నవలా ప్రపంచంలో కీర్తి శిఖరం ఆమె. అందుకే ఆమెను ‘నవలాలోకపు రారాణి’ అంటారు. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అత్యద్భుతంగా చిత్రించారు. మధ్యతరగతి మహిళ జీవితమే ఆమె నవలలకు వస్త్భుండాగారం. ఎక్కడా నేలవిడిచి సాముచేయకుండానే తనదైన శైలితో రచనలు చేసిన అరుదైన రచయత్రి యద్దనపూడి సులోచనారాణి. స్ర్తీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనారాణి తనదైన మార్గంలో ఎన్నో నవలలు రాశారు. అప్పటి ఆడపిల్లలకు సులోచనగారి నవలా నాయకుడు ఓ కలల రాకుమారుడు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో ఆమెకు ఎవరూ సాటిరారని నిరూపించారు యద్దనపూడి. ఆమె రచనలు అనేకం. ఆమె కథలు చాలా సినిమాలుగా మలచబడ్డాయి.
యద్దనపూడిగారిది కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజ అనే చిన్న గ్రామం. ఆమె 1940లో జన్మించారు. చిన్నవయస్సు నుంచే ఆమె సమాజాన్ని చదవడం మొదలుపెట్టారు. ఆమెకు పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ‘చిత్ర నళినీయం’ అనే రచన ఒకటి ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. పత్రికలో తన పేరును చూసుకున్న ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు. అప్పుడు ఆమెకు తెలియదు పెద్దయ్యాక తానొక నవలాకారిణిని అవుతానని. పదిహేను రోజుల తర్వాత ఆంధ్రపత్రిక నుంచి తన పేరున వచ్చిన పదిహేను రూపాయల పారితోషికాన్ని అందుకుని తనకంటే అదృష్ట్టవంతురాలు లేదని మురిసిపోయారామె. తరువాత పద్దెనిమిదేళ్ళ వయస్సులో హైదరాబాద్‌లో ఓ గృహిణిగా అడుగుపెట్టారు యద్దనపూడి. తనకు హైదరాబాద్ అంటే చాలా ప్రేమని, అందమైన, శుభ్రమైన, ప్రేమనగరమని కీర్తించారు. హైదరాబాద్ వచ్చిన మొదటిరోజుని తాను మరువలేనని, రైలు ఎక్కి చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత మంచుదుప్పటిలో తెలతెలవారుతున్న అందమైన హైదరాబాద్‌ను చూశానని అప్పుడే ప్రేమలో పడిపోయానని చెప్పారామె. హైదరాబాద్‌ను ఆమె పెంచినతల్లిగా చెబుతూ ఉంటారు.
యద్దనపూడిగారికి కొండపల్లి బొమ్మలంటే చాలా ఇష్టం. అవి చాలా సజీవంగా ఉంటాయంటారు. అలాగే నరసాపురం లేస్‌లు కూడా చాలా ఇష్టం. తన నవలలోని పాత్రలు కూడా కొండపల్లి బొమ్మల్లా జీవం తొణికిసలాడుతూ ఉండాలని, కథ నరసాపురం లేసుల్లా చిక్కగా, అందంగా ఉండాలని కోరుకుంటారావిడ. ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్ని చూడటం ఆవిడ అలవాటు. అందుకే ఆమె కథలో మంచితనానికి పెద్దపీట వేశారు. ‘ప్రతి ఒక్కరిలోనూ మంచితనం ఉంటుంది. మనం చూడటంలో, గుర్తించడంలో తేడా అంతే..’ అని అంటారు. అందుకే తన చుట్టూ ఉన్న సమాజంలోని జీవితాలను వస్తువులుగా తీసుకుని రచనలు చేయటం మొదలుపెట్టారు. కాలక్రమేణా కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవ పాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచి జీవం పోస్తారామె. యద్దనపూడిగారి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, మధ్యతరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మాభిమానం, హుందాతనం, మాటకారితనం, చిలిపితనం కనిపిస్తాయి. కానీ సింహభాగం నవలల్లో కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, వీరిద్దరి మధ్య అంకురించే ప్రేమ.. ఇదే యద్దనపూడిగారి నవలాసూత్రం. నవలల్లో విచిత్రమైన మానసిక సంఘర్షణ ఉంటుంది. నవలాపాత్రలు కొద్దిసేపు సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. బహుశా అందుకేనేమో సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం- అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి.. వంటి సహజాతాల మధ్య నవలాపాత్రలు తలమునకలవుతూ ఉంటాయి. ఆ నవల చదివే పాఠకులకు ఆసక్తి, ఉత్కంఠను కలిగిస్తుంటాయి. ఆమె దాదాపు 75 నవలలు రాశారు. అందులో చాలా కథలు సినిమాలుగా వచ్చాయి. మొట్టమొదటిసారి ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రం ద్వారా ఆమె సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తరువాత ‘మనుషులు మమతలు’ సినిమాకు కథను అందించారు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. మీనా, సెక్రటరీ, జీవనతరంగాలు, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మగౌరవం.. ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఆమె కథలు చాలా సీరియల్స్‌గా వచ్చి ఆకట్టుకున్నాయి. ఎంతగా అంటే మారుమూల పల్లెల్లోని మహిళల పొలం పనులు కూడా సీరియల్ కోసం ఓ గంట ముందుగానే ముగించేంతగా.. మురిపించాయి.
యద్దనపూడిగారికి కళలంటే చాలా ఇష్టం. కళ దైవదత్తమని నమ్ముతారామె. ఆమెకు ‘తోడికోడళ్లు’ సినిమాలోని ‘కారులో షికారుకెళ్లే..’ పాటలోని ‘జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా.. చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు.. చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో..’ అనే వాక్యాలంటే చాలా ఇష్టమట.. ప్రతి అందం, సుఖం వెనుక ఓ శ్రమ ఉంటుందని బాగా నమ్ముతుంది ఆమె. అందుకే ఆ వాక్యాలు ఆమెను కట్టిపడేశాయి. యద్దనపూడిగారి నవలల్లోని అక్షరాలు సాధారణ మానవుని మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాల్ని, రాగద్వేషాల్ని మధించి సునిశితంగా, సుందరంగా, అపురూపంగా, అందంగా మనముందు ఆవిష్కృతమవుతాయి. అందుకే ఆమె నవలల్లో ఎక్కువభాగం ప్రేమకథలే ఉంటాయి. వేగం నిండిన ఈ ఆధునిక యుగంలో పుస్తక పఠనం తగ్గిపోయిందంటే ఒప్పుకోరావిడ. ‘‘పుస్తక పఠనం పోలేదు. ప్రతి పదేళ్ళకూ ఓ మార్పు వస్తుందంతే.. ఆ మార్పులో మరో మాధ్యమం ద్వారా అది ప్రజలకు చేరుతుంది. ఇప్పుడు టీవీ ప్రధాన మాధ్యమమైంది. అందుకే కథలు దాని ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయి.. నవలల శకం ముగిసిపోలేదు.. ముగిసిపోదు కూడా.. మనిషి మస్తిష్కంలో చదవాలనుంటుంది. ఆ కోరిక ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. దాన్ని తీర్చుకోవడానికి మనిషి పుస్తకానికి బదులు కంప్యూటర్‌ను వాడతారు.. అంతే తేడా..’’ అంటారు యద్దనపూడిగారు. పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వకుండా మనసుల్ని, మనుషుల్ని కదిలించేలా ఎప్పుడూ తాజాగా ఉండే ఎలాంటి రచన అయనా గొప్ప రచన అవుతుంది. అలాంటి ప్రమాణాలున్నవే యద్దనపూడి రచనలు. జీవితంలోని అరమరికలను అద్భుతంగా ఆవిష్కరించి, ‘నవల’ విలువ పెంచిన నవలారాణి యద్దనపూడి సులోచనారాణిగారికి ఆత్మీయ నివాళిని అందిస్తూ..

- ఎస్.ఎన్. ఉమామహేశ్వరి