సబ్ ఫీచర్

వినమ్ర స్వభావి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది 1957వ సంవత్సరం. ఆ రోజు కీర్తిశేషులు పోతుకూచి సాంబశివరావుగారు నిర్వహించే నవ్యసాహితీ సమితి కార్యక్రమం- గురజాడవారి గురించి రాసిన వ్యాసాల పోటీ బహుమతుల ప్రదానం, నారాయణగూడలో ఒక హాలు. త్యాగరాయగానసభ లేదు, రవీంద్రభారతీ లేదు. యద్దనపూడి సులోచనారాణికి మొదటి బహుమతి రూ.లు 116/-, నాకు రెండవ బహుమతి రూ.58/-లు వచ్చాయి. ఆ వేదికే మా మొదటి కలయికకి స్థానం. ఆమె అప్పుడే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. నేను సమాచార పౌర సంబంధాల శాఖలో చేరాను. అలా కబుర్లతో ప్రారంభం అయింది. ఆమె మితభాషి. నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. ఆమె మాట్లాడుతూంటే పక్క మనిషికి తప్ప మాట మరెవ్వరికీ వినబడదు. పెదవులమీద చిరునవ్వు విరిసీ విరియని మల్లియలా. నా మాటా గొంతూ పెద్దది. ఎన్నిసార్లు కలుసుకున్నారు అన్నది ప్రధానం కాదు, కలిసినప్పుడల్లా ఎలా మాట్లాడుకున్నారు అన్నది ముఖ్యం, ఎవ్వరితోనైనా సరే... మాటే మానవత్వానికి పునాది. ఆమె రెండుమూడేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. రచనా వ్యాసంగానే్న వృత్తిగా స్వీకరించారు. మంచి సంస్థ ద్వారా ఏదైనా మేలు జరిగితే, తరవాతవన్నీ అదే స్థాయిలో జరుగుతాయి. దుక్కిపాటి మధుసూదనరావుగారి ద్వారా అన్నపూర్ణ సంస్థ ద్వారా ఆమె చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఆమె రచనలను యువ, ఆంధ్రజ్యోతి పురాణంగారు సీరియల్స్‌గా వేసి కొన్ని నవలలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాక, ‘నవలా రాణి’ అనే బిరుదును ప్రసాదించారు. మధ్య తరగతి మహిళలకి ఆమె నవలలు, మనసును ఊరడింపజేసే కథలు కుటుంబంలోని వ్యక్తులు, బంధుత్వాలు ఎలా వుండాలో, ఎలా వుంటే జీవితం ఆనందంగా గడుస్తుందో తెలుపుతూ వచ్చాయి. ఇంట్లో పనులు పూర్తిచేసుకుని, ఆమె కొత్తగా వచ్చిన నవలను, ప్రతి పేజీ శ్రద్ధగా చదివి ఆనందించేవారు. అలా మహిళా పాఠకుల సంఖ్య ఎంతో పెరిగిపోయింది. ప్రతీ నవలా ఒక ఆణిముత్యమే. తరువాత అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నా 1990లో మొదటిసారిగా ప్రభుత్వం అందించే నంది అవార్డులకు ‘ఆగమనం’ నవల సీరియల్‌కి బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు నంది వస్తే, నా ‘స్ర్తి’ సీరియల్‌కి నాకు ఉత్తమ రచయిత్రి నంది వచ్చింది. ఆమెతోపాటు ఒకే వేదికమీద నంది అవార్డు అందుకోవడం నాకెంత ఆనందాన్నిచ్చిందో. కంట్లోంచి రాలాయి ఆనందబాష్పాలు. జన్మలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది ఆ సంఘటన.
ఇన్ని నవలలు రాసిన ఆమె మాత్రం వేదికల పై తనను తాను పొగడుకోలేదు. ఎవరైనా తన గురించి పొగడ్తల వర్షం కురిపి స్తుంటే అవి విని హర్షించడానికి కూడా మొహమాట పడేవారు. ఆమె నమ్రస్వభావానికి మారు పేరుగా ఉండేది. ఆమె వినయ విధేయతలను చూసిన ఎవరైనా వినమ్ర తే ఆమె ఆభరణమా అనుకునేవారంటే అతిశయం లేదేమో. తరవాత అప్పుడప్పుడు ఏదో వేదికలమీద కలిసినా, పెద్దగా చెప్పుకునేదేమీ లేదు, నేను సయితం తప్ప. రేపు జూన్ 5వ తేదీ రాగసప్తస్వరం సంస్థ నాకందిస్తున్న సాహితీ పురస్కార సభకి ఆమె ముఖ్య అతిథిగా రావలసి వుంది. వస్తున్నానని ఆర్గనైజర్లకి ఫోన్ చేసి చెప్పారట. మళ్లీ ఒకసారి ప్రత్యేకంగా నా ఫంక్షన్‌లో ఆమె ఉంటారని ఎంతో సంతోషించాను. కానీ, విధి మరోలా చేసింది. నేను ఆమె మరణానికి సంతాపం చెప్పవలసి వచ్చింది! ‘ఈ జీవన తరంగాలలో...’ ఇవి ఇంతే కదూ! నా అభిమాన రచయిత్రికి నేనందించే అక్షర నివాళి ఇదే!

-శారదా అశోకవర్థన్