సబ్ ఫీచర్

ఓ ‘చందమామ’ వాస్తవ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చం ‘చందమామ కథ’లా బ్రిటన్ యువరాజు హ్యారీ, అమెరికా టెలివిజన్ నటి మేఘన్ మేర్కవ్‌ల పెళ్లి జరిగింది. పెళ్లికొడుకు రాకుమారుడు, పెళ్లికూతురు ఆఫ్రికా- అమెరికన్ సంతతికి చెందిన యువతి. అందులోనూ టీవీ సీరియళ్ళలో కనిపించే నటీమణి. ఇది సాధ్యమా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాధ్యమేనని ఇటీవల లండన్‌కు సమీపాన విండ్సర్ కోటలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి గూర్చి చెప్పాల్సిందే! అందుబాటులో ‘క్లిప్పింగ్స్’ ఉంటే చూపించాల్సిందే!
పవిత్రమైన రక్తం, బ్లూ బ్లడ్.. అని భావించే బ్రిటన్ రాచ కుటుంబంలో ఓ సాధారణ అమ్మాయి చోటు దక్కించుకుంది. ఈ దృశ్యాన్ని తిలకించిన మేఘన్ తల్లి డొరియా రగ్లాండ్ ఉద్విగ్నానికిలోనై కళ్ళలోకి నీరుతెచ్చుకుంది.
అమెరికా అధ్యక్షుడిగా నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా గతంలో ఎన్నిక కావడం, ఓ ఆఫ్రికా-అమెరికా యువతి బ్రిటన్ యువరాణి కావడం ఎవరూ ఊహించి ఉండరు.
లండన్ మహాగ్రంథాలయంలో చరిత్రను అధ్యయనం చేసి, ప్రపంచంలో రెండు వర్గాలున్నాయని ‘డిస్కవర్’ చేసిన కారల్ మార్క్స్ అయితే ఇలాంటి దృశ్యాన్ని కలలో సైతం ఊహించి ఉండరు. అది జరిగితే అదొక ‘ఫెయిరీ టేల్’గా కొట్టిపారేసేవాడు! విచిత్రమేమిటంటే ఆయన ద్విశత జయంతి నిర్వహించిన మాసంలోనే, ఆయన చదివిన గ్రంథాలయానికి కొన్ని మైళ్ళ దూరంలోనే ఈ పెళ్లి జరిగింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన అతి ఖరీదైన, మిలమిల మెరిసే పెళ్లిగౌనులో మేఘన్ మేర్కల్ మెరిసిపోయింది.
ఆమె బ్రిటన్ ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసింది. బ్రిటన్ ప్రజలేమిటి..? యావత్ కామన్‌వెల్త్ దేశాల ప్రజల మనసులను ఆ ముగ్ధమనోహర రూపం దోచుకుంది. టెలివిజన్ సెట్లలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకుంది.
రాయల్ వెడ్డింగ్.. ఈ పేరుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాచరికపు పురాతన కోటలో, అంతే పురాతనమైన సెయింట్ జార్జి చర్చిలో, రాచ కుటుంబాల నుంచి, ఇతర రంగాల నుంచి తరలివచ్చిన అతిథుల మధ్య వారిద్దరూ ఉంగరాలు మార్చుకుని, మొదటి ముద్దు పెట్టుకున్నారు.
పెళ్లివేదికకు పురాతన కారులో పెళ్లికూతురు తరలివచ్చేప్పుడు, హ్యారీతో వివాహమై, దంపతులుగా రెండు జతల తెల్లగుర్రాల బగ్గీలో రాజసం ఉట్టిపడేలా తిరిగి వెళుతున్నప్పుడు దారిపొడవునా వేలాది మంది ప్రజల అభినందనలు, ప్రేమాభిమానాలు అందుకున్నారు. ముందు, వెనక గుర్రాలపై భటులు రాగా ఆ ఊరేగింపు భూలోకం లోనే జరిగిందా? అనిపించేలా కొనసాగింది. పచ్చని పచ్చిక బయళ్ళ మధ్యనుంచి, విండ్సర్ పట్టణంలోని విశాలమైన రోడ్లపై ఆ గుర్రాల బగ్గీలోంచి నూతన వధూవరులు ప్రజల ప్రేమాభిమానాలను, ఆప్యాయతను స్వీకరిస్తున్నట్టు చేతులూపుతూ ఆ ప్రయాణం చాలాసేపు కొనసాగింది. ప్రజలు ఆగకుండా తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
నలుగురు ప్యాడ్ మహిళలు..
ఈ పెళ్లికి భారత్ నుంచి సినీ నటి ప్రియాంక చోప్రానే గాక మరో నలుగురు మహిళలు హాజరయ్యారు. రాచరిక మర్యాదలు, ఆతిథ్యాన్ని అందుకున్నారు. వారు ‘మైనా మహిళా ఫౌండేషన్’కు చెందిన కార్యకర్తలు. వీరు ముంబయిలో పేదలు నివసించే ప్రాంతంలో మహిళలకు శానిటరీ నాప్కిన్స్ (ప్యాడ్స్) చౌక ధరకు అందిస్తారు. మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రత గూర్చి ప్రచారం చేస్తారు. వారు చీరలు ధరించి పెళ్లికి హాజరయ్యారు. ఇది వారి జీవితంలో మరచిపోలేని మధుర స్మృతిగా మిగిలిపోతుంది. ఇలాంటి అతి సాధారణ వ్యక్తులు ఎందరో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘రాయల్ వెడ్డింగ్’ను కనులారా తిలకించారు. కామన్‌వెల్త్ దేశాల రాజకీయ నాయకులకు, బ్రిటన్ రాజకీయ నాయకులకు దక్కని గౌరవం వీరికే దక్కింది, ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులెవరినీ ఈ కళ్యాణానికి ఆహ్వానించలేదు.
మేఘన్ మేర్కల్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలున్నాయి. వారు చేసే సేవాకార్యక్రమాల పట్ల గౌరవం ఉంది. సామాజిక న్యాయం కోసం గొంతు కలిపిన చరిత్ర ఉంది. అందుకే ఏరికోరి కొందరిని ఆహ్వానించింది. ముంబయిలోని డబ్బావాలాలు ఈ పెళ్లికి చీర, గాజులు పంపించారు. పెళ్లికొడుక్కి భారతీయ సంప్రదాయ దుస్తులు పంపారు. ఇలా చాలా ప్రాంతాల నుంచి ప్రజల తరఫున కానుకలు అందడం అపురూపం. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకున్నందువల్లనే మేఘన్‌ను ‘టైమ్’పత్రిక ఇటీవల ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొన్నది.
రెండు,మూడు తరాలకు పూర్వం మేఘన్ మేర్కల్ తల్లి కుటుంబీకులు అమెరికాలో బానిసలుగా ఉన్నారని తెలుస్తోంది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు రాకుమారిగా కోటలో పాగావేయడం అచ్చం ‘చందమామ కథ’నే గుర్తుచేస్తోంది.
ఘర్షణ కాదు.. ప్రేమ
కారల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఆయన శిష్యులు, ప్రశిష్యులయితే ఈ రెండు ‘వర్గాల’ మధ్య ఘర్షణను, పోరాటాన్ని ఊహిస్తారు. కాని వాస్తవంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం కనిపించింది. లక్షలాది సాధారణ ప్రజలు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అభినందనలు తెలిపారు.
పెళ్లినాటి ప్రమాణాల సందర్భంగా వేడుక నిర్వహించిన మత పెద్ద (నల్లజాతీయుడు) ప్రేమ, ప్రకృతి సహజసిద్ధంగా అందించిన అభిమానం, ఒకరికొకరై జీవించే తత్వం బోధించి వారి మనసుల్లో మల్లెలు పూయించారు. యుక్తవయసులోని ప్రేమ, ఒకరిపై ఒకరికిగల అభిమానం, బాధ్యత ఇంత ఉదాత్తమైనవా? అనిపించేలా అభివర్ణించారు. ప్రకృతి శోభను విశదీకరించారు. పెళ్లికాని వారి మనసుల్లో ఓ కొత్త పరవశం విత్తారు.
ఇది జీవితం.. ఇది సత్యం. అందరి జీవితాలు ఇలాంటి చందమామ కథల్లా కొనసాగక పోవచ్చు. అంతమాత్రాన వారి జీవితాల్లో ఆనంద పారవశ్యాలు ఉండవని అనుకోవద్దు. కేవలం సంపదే జీవితానందాలను ఇవ్వదు. విచిమ్రేమిటంటే మార్క్స్ అభిమానులు ఆర్థికానికే ప్రాధాన్యమిచ్చారు. వాస్తవానికి భారతీయ జీవన విధానం శతాబ్దాలుగా మరోలా ఉంది. అది అందరికీ తెలుసు. మన సాహిత్యంలో, చరిత్రలో దాన్ని దర్శించవచ్చు. క్రమంగా దానికి దూరమైనందువల్లనే ఎనె్నన్నో సంక్షోభాలకు దగ్గరవుతున్నామనిపిస్తోంది.
జీవితాన్ని పండించుకోవడమెలా? అని చెప్పినవాడే నేడు నిజమైన విప్లవకారుడు తప్ప- ఘర్షణను, విధ్వంసాన్ని ప్రేరేపించి, రక్తకాసారాలు సృష్టించేందుకు దోహదపడేవారు ఎన్నటికీ విప్లవకారులు కాలేరు.
బరాక్ ఒబామాలా బానిస కుటుంబం ఛాయల నుంచి వచ్చిన మేఘన్ మేర్కల్‌లా స్పందించడం, ప్రేమించడం, ప్రవర్తించడం నేర్చుకుందాం! మరో ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఆ దృశ్యం కోసం శ్రమిద్దాం!
కొసమెరుపు..
మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే ఈ పెళ్లి జరిగిన మరుసటిరోజునే- భారత్‌లో మార్క్స్‌ను నమ్ముకున్న మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మందుపాతర పేల్చి ఏడుగురు జవాన్లను హతమార్చారు. మరికొందరిని గాయపరిచారు. వారి వాహనం తునాతునకలయింది. ఆయుధాలను ఎత్తుకెళ్లారు. బీభత్సమయం ఆ దృశ్యం.. ఇలాంటి దృశ్యాలే వారి సొంతం.
మరి ఏ దృశ్యం మనసు మూర్చనలు పోయేలా చేస్తుందో మీరే ఊహించవచ్చు, ఏ దృశ్యం ఆహ్వానించదగ్గదో కూడా నిర్ణయించవచ్చు.
*

-వుప్పల నరసింహం 99857 81799