సబ్ ఫీచర్

సవాళ్ల సుడిలో ఎదురీత తప్పదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నేతలు నడిచే దారి పూర్తిగా ‘పూలబాట’ కాదు. తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న విధంగానే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రజాజీవితంలో కష్టనష్టాలు లేకుండా ఎంతటివారైనా నిజమైన రాజకీయ నాయకుడు కాలేరు. జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకుని నరేంద్ర మోదీ వరకు మన ప్రధానులు, ప్రకాశం పంతులు మొదలుకుని కిరణ్‌కుమార్ రెడ్డి వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారే. ఉత్థాన పతనాలు రాజకీయాల్లో సహజం. రాజకీయ పార్టీలకు, నాయకులకు ఇది వర్తిస్తుంది.
2014 జూన్ 2న తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాను.. ఇక నుండి బంగారు తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగిస్తా’ అని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఆయన అనేక సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏటా సగటున 25వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అన్ని పట్టణాలు, అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు ‘మిషన్ భగీరథ’ను చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న 46వేల చెరువులను, కుంటలను బాగుచేసి పొలాలకు సాగునీటిని అందజేసేందుకు ‘మిషన్ కాకతీయ’ను చేపట్టారు. ఈ పథకాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ అమరులకు చేయూత, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నిరంతర విద్యుత్తు, హరితహారం, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి పలు సంక్షేమ పథకాలు చేపట్టారు. పారిశ్రామికాభివృద్ధి, ఐటి రంగం విస్తరణ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన ఏ పథకమైనా పూర్తిగా విజయవంతం అవుతుందని, పూర్తిగా విఫలం అవుతుందని చెప్పలేము. నిధుల కేటాయింపు, వాటి వినియోగం, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలన్నీ పథకాల జయాపజయాలను నిర్దేశిస్తాయి.
గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుండి దాదాపు ఐదులక్షల కోట్ల రూపాయల వ్యయం జరిగింది. ఇందులో సుమారు 20 నుండి 25 శాతం నిధులు ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారికి పింఛన్ల కోసం ఖర్చు చేశారు. 20 శాతం నిధులు రుణాల చెల్లింపుల కిస్తీలకు వ్యయం అయింది. సంక్షేమం కోసం మరో 25 శాతం నిధులు వ్యయం చేయాల్సి వచ్చింది. అంటే అభివృద్ధి పనులు, కార్యక్రమాలకు 20 నుండి 25 శాతం నిధులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. నీటిపారుదల, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, భవనాల నిర్మాణం తదితర అవసరాలన్నింటికీ 25 శాతం నిధులనే వాడుతున్నారు. ఎన్ని పనులు చేసినా, ఎన్ని నిధులు ఖర్చు చేసినా పెరుగుతున్న జనాభాకు సరిపోయేలా ఉండవు. ప్రజల ఆశలు, ఆశయాలు రోజురోజుకు పెరుగుతూనే ఉంటాయి. అన్నివర్గాల వారూ తమ డిమాండ్ల కోసం గర్జనలు తదితర పేర్లతో ఆందోళనలు నిర్వహించడం, ప్రభుత్వంపై ధ్వజమెత్తడం సహజమే. వీలైతే అన్నీ ఉచితంగా కావాలి, లేదంటే రాయితీలు దక్కాలి అన్న ఆలోచనల్లోంచి వివిధ వర్గాలవారు బయటపడలేకపోతున్నారు. ‘ప్రభుత్వం మాకు ఏం చేసింది? అని కాకుండా సంక్షేమ పథకాలను విజయవంతం చేసేందుకు మనం ఎంత వరకు తోడ్పడుతున్నాం..’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. మనం పన్నులు సరిగ్గా చెల్లిస్తున్నామా? లేదా? ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమ మార్గంలో వినియోగిస్తున్నామా? లేదా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు తప్పు చేస్తే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
ఊసులేని హామీలు
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సచివాలయ భవనాల స్థానంలో కొత్తగా బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో భవనాల నిర్మాణం చేపడతామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కేంద్రం కూడా కొత్త సచివాలయం కోసం స్థలం ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయం చర్చకు రావడం లేదు. మరో ఫిల్మ్‌సిటీ, కేజీ టూ పీజీ ఉచిత చదువు, దళితులకు మూడెకరాల భూమి వంటి కార్యక్రమాలు వివిధ కారణాల రీత్యా సరిగ్గా అమలు కాలేదు. కళాభారతి, లింగాయత్ భవన్, క్రిస్టియన్ భవన్, రెడ్డి భవన్, యాదవ భవన్, బంజారా భవన్, బ్రాహ్మణ భవన్, కేరళ భవన్‌లకు శంకుస్థాపనలు జరిగినా ఒక్క భవన్ కూడా పూర్తి కాలేదు. వివిధ సామాజిక వర్గాల వారు ఏర్పాటు చేసే సమావేశాల్లో కేసీఆర్ ఉద్వేగంతో హామీలు ఇచ్చినప్పటికీ, నిధుల కొరత ఆయనను వెంటాడుతోంది. ‘మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్’కు గత ఏడాదే వెయ్యికోట్ల నిధులు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఫలితం శూన్యం. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గత రెండేళ్లలో 200 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఇందులో రెండుశాతం నిధులు (నాలుగుకోట్ల రూపాయలు) మాత్రమే విడుదల చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ తదితర కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
నాయకుల గుణాలను నాలుగు రకాలుగా తెలుగు సాహిత్యంలో పేర్కొన్నారు. ‘్ధరోధాత్తుడు’ (ఉత్తమమైన గుణాలు కలిగిన రాముడు, కృష్ణుడిలా), ‘్ధర ఉద్ధతుడు’ (అరాచకాలకు పాల్పడే దుర్యోదనుడిలా), ‘్ధర లలితుడు’ (కళలు, సాహిత్యంపై అభిమానం చూపే శ్రీకృష్ణదేవరాయలులా), ధీర శాంతుడు (గౌతమ బుద్ధుడిలా) అంటూ అభివర్ణించారు. వీరిలో ఉదాత్తమైన పరిపాలనను అందించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనడంలో సందేహం లేదు. పరిపాలనలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ప్రణాళికలు రూపొందించుకున్నా పాలకులపై విమర్శలు రావడం సహజం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా, ఏ సంక్షేమ పథకం చేపట్టినా కేసీఆర్‌ను వ్యతిరేకించేవారు ఏదోరకంగా ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సమర్థించేవారు సమర్థిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేసేందుకు, భూసేకరణను అడ్డుకునేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు అంశాలు
నిధులు, నీళ్లు, నియామకాలు.. ఇవీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన అంశాలు. తెలంగాణ ఏర్పడితే మన నీళ్లు మనం వాడుకోవచ్చు, మన నిధులు మనం వాడుకోవచ్చు, మన ఉద్యోగాలు మనం సంపాదించుకోవచ్చు అన్న భావన ప్రజల్లో కలిగింది. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2015 ఏప్రిల్‌లో రాజ్‌భవన్‌లో జరిగిన వెబ్‌సైట్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. 27 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్టు తాజాగా ప్రభుత్వం ప్రటించింది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏటా టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు గురుకులాలు మినహా టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు.
నాలుగేళ్లు గడిచాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడిచాయి. ఇప్పటివరకు బంగారు తెలంగాణ, సంక్షేమ తెలంగాణ అంటూ పాటపాడిన కేసీఆర్ ఇప్పుడు రాబోయే ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించక తప్పడం లేదు. ‘ఎన్నికలు నాకు ముఖ్యం కాదు’ అంటూ పదే పదే అంటున్నప్పటికీ, ఆయన రాజకీయ జీవితానికి ఎన్నికలే ప్రధానమైనవని అనడంలో సందేహం లేదు. ఏ నాయకుడికైనా తన రాజకీయ జీవితం సాఫీగా సాగాలన్నా, అధికారంలో ఉన్నవారు తిరిగి అందలం ఎక్కాలన్నా ఎన్నికలే గీటురాయిగా నిలుస్తాయి. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలని తెరాస యత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఓటుబ్యాంక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. రుణమాఫీ, రైతుబంధు, ఆసరా పింఛన్లు, ఉద్యోగులకు వేతనాల హెచ్చింపు వంటి పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నారు. విపక్షాలు కూడా అధికారంలోకి వచ్చేందుకు తమ పరిధిలో ప్రయత్నిస్తున్నాయి.

-పి.వి. రమణారావు 98499 98093