సబ్ ఫీచర్

సహస్రాబ్దుల అస్తిత్వం.. తెలంగాణకే ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతరాతియుగం నుండి ఉనికిని కలిగి, పూర్వ రాతియుగపు ఆవాసాలకు నిలయమై, షోడశ మహా జనపథాలలో దక్షిణ ప్రాంత ఏకైక ఆశ్మక జనపథాన్ని అంతర్భాగంగా కలిగి, అఖండ భారతావనిలో ప్రత్యేక స్థానం పొందింది తెలంగాణ ప్రాంతం. బుద్ధుడి కాలాన బోధన్ ప్రాంత పాలకునిగా సుజాతుడు ఉన్నట్లు, బుద్ధుని సమకాలికుడైన బావరి బావనకుర్తిలో స్థిర పడినట్లు, మత్స్య పురాణాధారంలో మంజీరా నది ప్రస్తావన, పైఠాన్ రాజధానిగా ఉత్తర- దక్షిణాలకు ప్రధాన మార్గాన్ని కలిగిన ‘ములక రాజ్యం’ గోదావరి నది హద్దు వరకు విస్తరించినట్లు, మగధ రాజ్యం బలపడ్డాక, ఆశ్మక సైతం మగధలో విలీనమైనట్లు చరిత్రకారులు నిరూపించారు. నందుల కాలానంతరం వౌర్యుల హయాంలో పర్యటించిన చైనా యాత్రికుడు మెగస్తనీసు పేర్కొన్న 30 బలిష్ఠ దుర్గాలలో కదంబాపూర్, బోధన్, పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూరు, ఫణిగిరి, కొండాపూర్, శాతవాహన చక్రవర్తుల తొలి రాజధాని కోటిలింగాల చోటు చేసుకోవడాన్ని బట్టి ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యత స్పష్టం అవుతోంది.
శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాం తాన్ని పాలించిన రాజ్యం లేకపోగా, ఇక్ష్వాకుల పాలనలో తూర్పు ప్రాంతాలు విజయపురి రాజధానిగా, వాకాటుల ప్రారంభ కాలంలో ఉత్తర తెలంగాణ ఉండగా, వ్రవర సేనుడి కాలాన తెలంగాణ మొత్తం రాజన్యుల ఏలుబడికి రాగా, తర్వాతి విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణమే అని ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు బి.ఎన్.శాస్ర్తీ నిరూపించారు. బాదామి చాళుక్యుల పాలనలో తెలంగాణ మొత్తం ఉండగా, రాష్టక్రూట, బాదామి చాళుక్య, కందూరి చోళ, కాకతీయ కుతుబ్‌షాహీల ఏలుబడులలో ఎన్నో ఒడిదొడుకులు అనుభవించినా తన ఉనికిని చాటుకున్నది ఈ నేల. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీల్చలేకపోయింది. 1948 సెప్టెంబర్ 17న పోలీసుచర్య ఫలితంగా తెలంగాణ విమోచనోద్యమానికి ముగింపుగా, భారతావనిలో అంతర్భాగమైంది. 1724-1948 మధ్యకాలంలో 224 ఏళ్ల పాటు 8 తెలంగాణ జిల్లాలు, 5 మరట్వాడా జిల్లాలు, 3 కర్నాటక జిల్లాలతో కలిపి 16 జిల్లాల హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషలతో కొనసాగింది. 1948 సెప్టెంబర్ 13న పోలీసుచర్య ఫలితంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగి పోవడంతో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశ ప్రభుత్వ పాలనలో విలీనమైంది. వరంగల్ నుండి కొంత ప్రాంతం, గోదావరి జిల్లాల నుండి భద్రాచలం, దండకారణ్య ప్రాంతం వేరు చేస్తూ ఖమ్మం జిల్లాను రూపొందించారు.
1948 నుండి 1952 వరకు ప్రజాస్వామ్య ప్రభు త్వం లేని కారణాన మిలిటరీ, సివిల్ అధికారుల పాలనలో ఇంగ్లీషు భాష రాదన్న సాకుతో మదరాసు రాష్ట్రంలోని ఆంధ్రపాత్రం నుండి ‘ముల్కీ నిబంధనల’ను ఉల్లంఘించి అధిక సంఖ్యాకులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
1956లో ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాలు విలీనమయ్యాక వలసలు మరింత అధికమైనాయి. నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలలో పెద్దపీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉపాధి దక్కాలని 1910-18 మధ్యకాలంలో ప్రజలు ఉద్యమించడంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ముల్కీ నిబంధనలను ప్రవేశ పెట్టారు. స్వార్థ రాజకీయాల ఫలితంగా ఇది అమలు కాని స్థితిలో 1969లో మర్రి చెన్నరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైంది. 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు- ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్ స్టేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులలో అధికులు ఆంధ్రావారు కావడంతో నిరసనలకు దిగారు. తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. ఉద్యమంలోనికి ఉస్మానియా విద్యార్థులు ప్రవేశించారు. జనవరి 13న ఉస్మానియాలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి రూపుదాల్చింది. మెడికల్ విద్యార్థి మల్లిఖార్జున్‌ను నాయకునిగా ఎన్నుకున్నారు. జనవరి 20న తొలిసారి విద్యార్థులపై కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణల అమలుకు జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్ ముల్కీ ఉద్యోగులను తిరిగి పంపుతామని, జీవోను నిర్లక్ష్యం చేసే అధికారులపై కొరడా ఝళిపాస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివ పేటలో జరిగిన కాల్పులలో 14మంది మరణించారు. గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన 17 ఏళ్ల శంకర్ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనాడు. కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేశారు. జూన్ 4న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్ వచ్చి విద్యార్థి, ప్రజా సమితి నేతలతో చర్చలు జరిపారు. ఉద్యమంలో 369మంది అసువులు బాసినా మృతుల సంఖ్య 57గా అధికారులు పేర్కొన్నారు. ప్రజాబలం అండగా, విద్యార్థుల ఉద్యమాల ఫలితంగా 1971లో 12 లోక్‌సభ సీట్లలో పదకొండింటిని సాధించిన తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్), ఆపై ఇందిరాగాంధీతో చర్చల అనంతరం కాంగ్రెస్‌లో విలీనమైంది. 1979 లో హైదరాబాద్ జిల్లా నుండి రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది.
2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనతో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, వివిధ వర్గాల సహకారంతో ఉద్యమాన్ని ముందుకు నడిపారు. తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత వాసులకు వివరించి, చైతన్యవంతులను చేసే కార్యక్రమంలో సఫలీకృతులైనారు. ఆయన కార్యదీక్షకు తోడుగా 2011లో ఏర్పాటైన రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (పొలిటికల్ జేఏసీ) సహకారంతో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు పోరాటంలో దూకారు. ఆత్మబలిదానాలు, సబ్బండ వర్ణాల ఆకాంక్షలు బహిర్గతమై, అధికార కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో చేసిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై, 6 సిఫార్సులు చేసింది. 2009 డిసెంబర్ 3న ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఆందోళనలు జరిగాయి. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు తీర్మానించగా, 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం జరిగింది.

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 05494