సబ్ ఫీచర్

ఎవరి కోసం మూడో కూటమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని కుట్రలను, అడ్డంకులను అధిగమించి కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రిగా కొలువుదీరాడు. ఆయన సీఎం కావటానికి- ధర్మాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడినందుకు సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని అందరం అభినందించ వలసిందే. సుదీర్ఘకాలంగా క్రియాశీల రాజకీయాలలో ఉంటూ వస్తున్న మాబోటి వాళ్లకు కర్నాటక గవర్నర్ నిర్ణయం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందల్లా- రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో శాసనసభ్యులెవరూ ప్రలోభాలకు లొంగకుండా ధర్మబద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. సుప్రీం ధర్మాసనం కన్నా ఎక్కువగా అభినందనీయులు శాసనసభ్యులే. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోయి ఉంటే ధర్మాసనం నిర్ణయం నీరుగారిపోయేది.
ఇప్పుడిక చర్చించవలసిన విషయం కర్నాటక ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై ఏ విధంగా ఉంటుంది? ‘మూడో కూటమి’ అసలు రూపుదిద్దుకుంటుందా? లేదా? అనే విషయాలను పరిశీలించే ముందు ఓసారి ఎన్నికల ఫలితాలను విశే్లషించాలి.
లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరిగినందున కర్నాటక ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దాదాపు 4 కోట్ల 97 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఈసారి ఏకంగా 72.13 శాతంగా నమోదై గత రికార్డులను బద్దలుకొట్టింది. గత మూడు దశాబ్దాల కాలంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కన్నడ ప్రజలు ఏనాడు కూడా అధికార పార్టీని వరసగా మళ్లీ అధికారంలో కూర్చోబెట్టిన ఉదంతాలు లేవు. అదే ఇప్పుడు జరిగింది. పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేసినట్లుగానే ఏ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ రాలేదు. బిజెపి 36.2 శాతం ఓట్లతో 104 స్థానాలు, కాంగ్రెస్ 38 శాతం ఓట్లతో 78 స్థానాలు, జెడియస్ 18.4 శాతం ఓట్లతో 37 స్థానాలు దక్కించుకున్నది. ఇతరులకు దక్కినవి 6.5 శాతం ఓట్లు మూడు సీట్లు. బిజెపి కన్నా కాంగ్రెస్‌కు దాదాపు 2 శాతం ఓట్లు అధికంగా లభంచినా సీట్లు మాత్రం 26 తక్కువగానే వచ్చాయి. జెడియస్, కాంగ్రెస్‌లకు కలిపి వచ్చిన ఓట్ల శాతం 56, వచ్చిన సీట్లు మాత్రం 115. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం కన్నా బిజెపికి 20 శాతం ఓట్లు తక్కువగా వచ్చినా అది కైవసం చేసుకున్న సీట్లు మాత్రం 104. జెడియస్, కాంగ్రెస్ పార్టీకు బిజెపి కన్నా 20 శాతం ఓట్లు అధికంగా వచ్చినా బిజెపి కన్నా అధికంగా వచ్చిన సీట్లు మాత్రం 11 మాత్రమే. 1999, 2004, 2008, 2013, 2018లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు కూడా బిజెపికి కాంగ్రెస్ కన్నా తక్కువ శాతమే ఓట్లు లభించినా సీట్లు మాత్రం అధికంగా సాధించి అధికారానికి దగ్గరగా రాగల్గుతోంది. కాంగ్రెస్‌కు పోలైన ఓట్లలో ఎప్పుడూ అధిక శాతమే లభిస్తున్నా దానికి అనుగుణంగా మాత్రం సీట్లు వటం లేదు. అదే బిజెపిని కాం గ్రెస్ పార్టీతో పోల్చితే పోలైన ఓట్లలో బిజెపికి కాంగ్రెస్ కన్నా తక్కువ శాతమే లభిస్తున్నా సీట్లుమాత్రం అధికంగానే కైవ సం చేసుకుంటున్నట్లు గత ఎ న్నికల గణాంకాలు తెలుపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్, బిజెపిలతోపాటు జెడియస్ కూడా స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 శాతం ఓట్లు సాధించుకుంటూ ముక్కోణపు పోటీలు ఏర్పడటంతో బిజెపి లాభపడి కాంగ్రెస్ నష్టపోతోంది. ముక్కోణపు పోటీలు ఎప్పుడూ బిజెపికే లాభాన్ని చేకూరుస్తాయి. కాంగ్రెస్, జెడియస్‌లు ఎన్నికలకు ముందే అవగాహన ఏర్పరచుకుని ఉమ్మడిగా బిజెపిని ఢీకొని ఉంటే ఫలితాలు వేరేలా విధంగా ఉండేవి.
గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యస్‌పి, బియస్‌పిలతోపాటు రాష్ట్రీయ లోక్‌దళ్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల ముందు ఒక అవగాహనకు వచ్చి బిజెపిపై ఉమ్మడిగా అభ్యర్థులను నిలబెట్టి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవి. ఈ విషయాన్ని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. బిజెపి సగటున ఏ రాష్ట్రంలో గాని లేదా దేశవ్యాప్తంగా గాని 30నుండి 35 శాతం కన్నా ఓట్లను మించి సాధించలేదు. బహుముఖ పోటీలతో అనివార్యంగా ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోవడం బిజెపికి లాభిస్తోంది.
బిజెపికి దీటుగా పోటీనివ్వగల సత్తావున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆ పార్టీని దేశవ్యాప్తంగా నిర్వీర్యం చేయగలిగితే- ఇక తమ పార్టీకి జాతీయస్థాయిలో ఎదురే ఉండదని, మరో ప్రత్యామ్నాయం లేక అనివార్యంగా తమపై ఆధారపడక తప్పదని బిజెపి నాయకత్వం భావిస్తోంది. అప్పుడు బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఏర్పడుతాయని అప్పుడు తమ పార్టీ నుండి అధికారం చేజారిపోకుండా పదిలంగా ఉంటుందని, తద్వారా హిందుత్వ ఎజెండాను అమలుపరచడం సులువు అవుతుందనే వ్యూహంలో భాగంగానే ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ నినాదాన్ని మోదీ-షా ద్వయం తెరపైకి తెచ్చింది. ఈ నినాదం ప్రజల ఆకాంక్ష కాదు, కేవలం మోదీ-షాల ఆకాంక్ష మాత్రమే. ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ ప్రజలు కోరుకుంటే సాకారం అవుతుందేమో కానీ, తాము కోరుకుంటే కాదని మోదీ-షాలు గ్రహించాలి.
ఇక, తెలంగాణలో అధికారం కోసం పోటీపడే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు. కర్నాటకలో కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి కొలువుతీరటం తెలంగాణ సీఎం కెసీసిఆర్‌కు అయిష్టంగానే ఉంది. కర్నాటక స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే అది తన అస్తిత్వానికే ముప్పుగా పరిణమిస్తుందని ముందే గ్రహించిన కెసీఆర్ మూడోఫ్రంట్ అనే నినాదాన్ని ఎన్నికల కంటే ముందే వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. మూడో ఫ్రంటు లేదా ఫెడరల్ ఫ్రంటు అని పేర్కొంటున్న కెసీఆర్ లక్ష్యం వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయడం. కాంగ్రెస్, బిజెపిల నేతృత్వంలోని ఫ్రంట్లకు సమాంతరంగా మూడోఫ్రంటును ఏర్పాటు చేసి 2019 లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలనేది అతని ఎత్తుగడ. ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల అండ లేకుండా మూడో ఫ్రంటు ఏర్పాటు అసాధ్యం. ఒకవేళ ఏర్పడినా అది బలపడదు, మరి అది ఎవరి కోసం అన్నది పశ్న. బిజెపి పట్ల ప్రజల్లో ఏర్పడే వ్యతిరేకత కాంగ్రెస్‌కు సానుకూలంగా మల్లకుండా, రాబోయే ఎన్నికల్లో మూడోఫ్రంటు రూపంలో బహుముఖ పోటీలు జరిగేలా చూస్తే బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి అంతిమంగా అది కాంగ్రెస్ ఓటమికి, బిజెపి విజయానికి దారితీస్తుందనే రహస్య ఎజెండా మూడోఫ్రంటు నినాదం వెనుక దాగి ఉంది. ఈ సత్యాన్ని క్రమంగా అన్ని రాజకీయ పార్టీలు గ్రహించి కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్న సంకేతాలు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబుతోపాటు హాజరైన వివిధ రాజకీయ పార్టీల నాయకులంతా ఒకే వేదికపై కనిపించడం సూచిస్తున్నాయి.
ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో బిజెపితో బాబు సంబంధాలు బెడిసికొట్టాయి. ‘హోదా’ పోరులో కాంగ్రెస్ తప్ప ఏపీలో చంద్రబాబుతో కలిసివచ్చే పార్టీ ఏదీ లేదు. ఒకవేళ కాంగ్రెస్, టిడిపిల మధ్య ఆంధ్రలో అవగాహన కుదిరితే అది తెలంగాణలో కూడా కుదిరే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో కెసీఆర్ రహస్య ఎజెండాను అర్థం చేసుకుంటున్న టిడిపి, వామపక్షాలు కాంగ్రెస్‌కు చేరువయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో కెసీఆర్‌కు తెలంగాణలో ఒంటరి పోరు తప్పదు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలే. ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ అన్నా, ‘్థర్డ్‌ఫ్రంట్’ అన్నా లక్ష్యం ఒక్కటే. అది కాంగ్రెస్‌ను నిర్మూలించడం. రాజకీయాల్లో ఇలాంటి లక్ష్యాలు ప్రజలు అనుకుంటే సాకారమవుతాయే తప్ప మోదీ, కెసీఆర్‌లు పగటి కలలు కంటే నెరవేరేవి కావు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ దేశ రాజకీయాల్లోనైనా ఉండేవి రెండే కూటములు. ఒకటి అధికారంలో వున్న పార్టీ కూటమి అయితే రెండవది ప్రతిపక్షాలతో కూడిన కూటమి. కేంద్రంలో అధికార బిజెపి ఒక కూటమికి ప్రాధాన్యం వహిస్తే, ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు తమ భావజాలంతోపాటు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కూటమిలో కొనసాగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్థానిక అంశాలతోపాటు మరికొన్ని విషయాలను బేరీజు వేసుకుని ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉంటారు. కాని మూడో కూటమిలో చేరరు. సమీప భవిష్యత్తులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిలు మధ్యనే. ఆ ఎన్నికల పిదప దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అప్పటివరకు వేచి చూద్దాం.

-ప్రొ. జి.లక్ష్మణ్ 98491 36104