సబ్ ఫీచర్

ఆర్థిక నేరాల్లో మావోయిస్టు నేతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక నేరాలకు పాల్పడినవారి ఆస్తుల జప్తు గూర్చిన వార్తలు తరచూ వినిపిస్తాయి. ఆ జాబితాలో ఇప్పుడు మావోయిస్టు నేతలు కూడా చేరారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఇటీవల బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత బినయ్ యాదవ్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. ఇతను తన బంధువుల ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేశాడని, విలువైన ఆస్తులను పోగుచేశాడని వెల్లడైంది. అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు మూడు బస్సులు, ఆరు స్థలాలు, పొక్లెయిన్, కారు, మినీ వ్యాను, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు జప్తుచేసిన వాటిలో ఉన్నాయి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లోని మావోయిస్టు నేతల ఆస్తులను సైతం ఈడీ అధికారులు జప్తు చేశారు. బిహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు ప్రద్యుమ్న శర్మ, సందీప్ యాదవ్, అరవింద్ యాదవ్‌లు సైతం బలవంతంగా డబ్బు వసూలు చేశారని, తమ పిల్లలను ప్రముఖ విద్యాలయాల్లో చేర్పించేందుకు భారీగా డబ్బు చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఈ ధోరణి ఎక్కడికి దారి తీస్తున్నది..? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను జప్తుచేసిన రీతిలో మావోయిస్టు నేతల ఆస్తులను జప్తు చేస్తూ ఉంటే మావోయిస్టుల ధర్మపన్నాగాలు ఇవేనా? అనిపిస్తోంది.
సొంత ఆస్తిలేని సమాజమా?
సొంత ఆస్తిలేని సమాజం నిర్మిస్తామని, ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థను రూపొందిస్తామని, జనతన సర్కార్‌ను నడుపుతామని తరచూ ప్రకటించే మావోయిస్టు నాయకుల వ్యవహారం ఎలా ఉన్నదో ఈ సంఘటనలు పట్టి చూపుతున్నాయి. అరిషడ్వర్గాలను జయించలేని మావోయిస్టులు అద్భుత ప్రపంచాన్ని నిర్మిస్తామని చెప్పటం ఉత్త బూటకం. ఈ ప్రాథమిక విషయాన్ని ఆ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మాత్రం దానికి వేలాదిమంది ప్రాణాలు గాలిలో కలిసి పోవాలా? అత్యంత విలువైన ఆస్తులు బూడిద కావాలా? ఎన్నో జీవితాలు అగమ్యగోచరంగా మారాలా? అక్రమాస్తులు కూడబెట్టిన నేతలపై మావోయిస్టు పార్టీ చర్యలు చేపట్టిందా? అని ప్రశ్నించుకుంటే.. ఎలాంటి సమాధానం రాదు. అది రహస్య పార్టీ గనుక అన్నీ గోప్యంగా, గుంభనంగా కొనసాగుతాయి. పారదర్శకతకు ఎవరు పాతర వేసినా వారు నిందనీయులే! బలవంతపు వసూళ్లు, ఆయుధాల కొనుగోళ్లు, మిలటరీ శిక్షణ కోసం పెద్ద మొత్తంలో కేటాయింపులు, గోబెల్స్ ప్రచారం కోసం అంతకన్నా ఎక్కువ ఖర్చు చేయడం.. ఇదంతా దేనికి సంకేతం? ఏ ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ఈ అడుగులు?
వర్తమన సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం అంతటా పరచుకుంటోంది. దీన్ని అందిపుచ్చుకుంటేనే అడుగులు ముందుకు పడతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే- మావోయిస్టులకు తప్ప! ‘రాజ్యాధికారం’ మాత్రమే సర్వరోగ నివారిణి అని మావోయిస్టులు చిరకాలంగా చెబుతూ ఉన్నారు. అది వాస్తవం కాదని చైనా, రష్యా, తూర్పు యూరప్, లాటిన్ అమెరికా దేశాలు అనుభవ పూర్వకంగా చెప్పినా పట్టించుకోకుండా భారత్‌లో మాత్రం మావోలు పాత పాట పాడుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. సంపదను ధ్వంసం చేస్తున్నారు. అమాయక ఆదివాసీలను ఆహుతి ఇస్తున్నారు. ఇది అభినందించదగ్గదా?
పాఠశాలలు బంద్..
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో 145 గ్రామాలకు గాను 73 గ్రామాల్లో మావోల ప్రభావం కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడం లేదు. పాఠశాలలు పనిచేయడం లేదు. ప్రభుత్వ పథకాలు ఏవీ చేరడం లేదు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అనేక గ్రామాలు వెనుకబడిపోవడం ఏ రకంగా ఆహ్వానించదగ్గది? మావోలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నిర్మాణంలో వున్న రహదారులకు కాపలాగా భద్రతా బలగాలు నిలిస్తే మెరుపుదాడులతో, మందుపాతరలతో వారిని అంతమొందిస్తున్నారు. దేశంలో ఒకవైపున ఎనిమిది వరుసల, 12 వరుసల రహదారుల నిర్మాణం జరుగుతూ వుంటే- వీరు మాత్రం అసలు రోడ్డు నిర్మాణమే కూడదంటూ ఆయుధాలకు పనికల్పిస్తున్నారు. విచిత్రమేమిటంటే భద్రతా బలగాలనే గాక తమ మాట వినడం లేదని కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను, సూపర్‌వైజర్లను, కూలీలను ఖతం చేస్తున్నారు. ఇది కలవరపరిచే అంశమే కదా? రోడ్ల నిర్మాణానికి ఉపయోగించే అనేక వాహనాలను, కోట్ల విలువ చేసే ఆధునిక యంత్ర సామగ్రిని మావోయిస్టులు అనేకసార్లు బుగ్గిచేశారు. ఈ వైఖరి వారి మానసిక స్థితిని, దృష్టికోణాన్ని పట్టిచూపుతోంది.
ముల్లును ముల్లుతోనే..
ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని పాటిస్తూ ప్రభుత్వం ఇటీవల బస్తర్ ప్రాంత ఆదివాసీ యువతీ యువకులతో ‘బస్తరియా బెటాలియన్’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పనిచేస్తున్న వివిధ భద్రతా బలగాల సిబ్బందికి వీరు అదనం. మావోలను అన్నివైపునుంచి కట్టడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అరణ్య ప్రాంతాల్లో సెల్ టవర్లను పెంచుతూ కమ్యూనికేషన్ మెరుగుపరుస్తోంది. ప్రజలకు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. అలాంటి టవర్లను సైతం అప్పుడప్పుడు మావోయిస్టులు కూల్చడం వల్ల ఒరిగింది ఏమిటి? స్మార్ట్ఫోన్లను సైతం ఆదివాసీ కొత్తతరాలు ఉపయోగించి వర్తమాన సమాజంతో కలిసి నడిచేందుకు ఉన్న అవకాశాల్ని అడ్డుకోవడం ‘పురోగమన దృక్పథం’ అవుతుందా?
కాలం వెక్కిరిస్తోంది...
ప్రపంచ వ్యాప్తంగా పోరాట విధానం, యుద్ధరీతులు మారిపోయాయి. వ్యూహం, ఎత్తుగడలు రూపాంతరం చెందుతున్నాయి. ఈ దశలో గెరిల్లా యుద్ధం- ఎత్తుగడలు అంతగా ఎవరినీ ఆకర్షించలేకపోతున్నాయి. ఆ పోరాటంలో ఆరితేరిన కొలంబియా మావోయిస్టు శ్రీలంక ఫార్క్, ఎల్‌టిటిఇ గెరిల్లాలు మట్టికరిచారు. కాలం వారిని వెక్కిరించింది. ఈ అనుభవం కళ్ళముందు కనిపిస్తున్నా పట్టించుకోకపోతే ఎలా? కృత్రిమ మేధ, కంప్యూటరీకరణ, రోబోలు పెరుగుతున్న తరుణంలో మావోలు తమ ప్రాపంచిక దృక్పథాన్ని తప్పక పునర్ మూల్యాంకనం చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. మారిన, మారుతున్న పరిస్థితుల కనుగుణంగా మారినవాడే నిజమైన మార్క్సిస్టు అని ఇటీవల మార్క్సిస్టుపార్టీ నాయకుడొకరు అన్నారు. చైనా కమ్యూనిస్టు నాయకులు ఈ విధానానే్న అనుసరిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ‘చైనా మార్గమే మా మార్గమ’ని ఒకప్పుడు బహిరంగంగా ప్రకటించిన మావోస్టులు ఇప్పుడూ ఆ నినాదం ఇస్తేనే వారికి ఆదరణ లభించగలదేమో!

--వుప్పల నరసింహం 99857 81799