సబ్ ఫీచర్

దేశాన్ని సమైక్యపరిచిన ఆదిశంకరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీఆదిశంకరులు జన్మించే నాటికి భారతదేశంలో అవైదిక మతాలైన బౌద్ధ, జైనాలు బాగా వ్యాపించి ఉన్నాయి. వైదిక మతాలలో కూడా అనేక మతాలు తమ మతమే గొప్పది అన్న అహంకారంతో ఇతర మతాల పట్ల చిన్నచూపుతో వ్యవహరించ సాగాయి. ఆదిశంకరులు భారతదేశంలోని వివిధ మతాల మధ్య సమన్వయాన్ని సాధించారు. వేద సహితమైన, సనాతన ధర్మాన్ని బలోపేతం చేసారు. దేశం నలుమూలలా నాలుగు ఆశ్రమాలను- ఉత్తరాన బద్రినాథ్, పశ్చిమాన ద్వారక, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరిలో- నాలుగు పీఠాలను ప్రారంభించి ధార్మికంగా, సాంస్కృతికంగా భారతదేశ సమైక్యతకు బలమైన పునాదులను వేసారు.
కేరళలో పూర్ణానది వొడ్డున ‘కాలడి’ గ్రామంలో శివగురువు, ఆర్యాంబలకు ఆదిశంకరులు జన్మించారు. తండ్రి చిన్ననాటనే మరణించారు. 5వ ఏటనే గురుకులానికి వెళ్లి 3 సంవత్సరాల్లోనే వేదవేదాంగాలు, తర్కం, సాంఖ్యం, యోగ, వ్యాకరణాలను నేర్చుకున్నారు. ఆదిశంకరునిది కుశాగ్రబుద్ధి, ఏక సంతాగ్రాహి.
అనేక మహిమలు
తల్లి దూరంగానున్న పూర్ణానదికి స్నానానికి వెళ్ళలేని స్థితిలో పూర్ణానదిని ఆశు పద్యములతో స్తుతించి ఇంటివద్దకే పూర్ణానది ప్రవహించునట్లు చేసారు శంకరులు. బిక్షాటన సందర్భంగా ఒక ఇంటికి వెళ్ళారు. పేదరికంతో ఉన్న ఆ ఇంటి ఇల్లాలిని చూసి ఆవేదనతో ఆశుపద్యములతో లక్ష్మీదేవిని ‘కనకధారా స్తోత్రం’తో మెప్పించి ఆ పేదరాలింట్లో పేదరికాన్ని పోగొట్టారు. శంకరులు దేశవ్యాప్త పర్యటనలో మూకాంబ క్షేత్రానికి వెళ్ళారు. అకాలంగా ఒక బాలుడు మరణించడంతో తల్లిదండ్రుల దుఃఖాన్ని చూచి, దయార్ద్ర హృదయుడై పరమేశ్వరుడిని ప్రార్థించి ఆ బాలుని జీవింప చేసారు. చిన్నవయస్సులోనే శంకరులు సన్యాసాన్ని స్వీకరించారు.
కాశీనగరంలో గంగానది స్నానం చేస్తూ ఆదిశంకరులు వస్తుండగా, ఎదురుగా వస్తున్న చండాలుని ప్రక్కకు తొలగమంటూ శంకరుని శిష్యులు అరిచారు. ‘‘ప్రక్కకు తొలగమంటున్నది అశాశ్వతమైన నా భౌతిక శరీరాన్నా? నాలోని ఆత్మనా? అద్వైతాన్ని బోధిస్తున్న మీలోను, నాలోను ఉన్నది ఒకే ఆత్మకదా’’ అని ఎదురు ప్రశ్నవేసిన ఆ వ్యక్తిని చూసి, ఆదిశంకరులు తమ తప్పును అంగీకరించారు. ఆ వ్యక్తిని గురువుగా స్వీకరించి ఆయన ముందు తలవంచారు. ఆ సంఘటనతో ‘‘మనీషా పంచకం’’ను శంకరులు రచించారు.
‘‘చాండాలోస్తు స తు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ’’
‘‘నేను బ్రహ్మను, మొత్తం సృష్టి బ్రహ్మమయం’’. అవిద్యకు మాయకు అతీతంగా ఎవరు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారో వారు చండాలురైనా వారిని నా గురువుగా స్వీకరిస్తాను.’’ అని శంకరులు అన్నారు.
గోవిందపాదుని వద్ద దీక్షను స్వీకరించారు. అతి తక్కువ కాలంలోనే వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, దర్శనాలకు నూతన వ్యాఖ్యానాన్నిచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 9 ఉపనిషత్తులకు భాష్యాన్ని వ్రాసారు. దీనిని ప్రథమ ప్రస్థానంగా పిలుస్తారు. బ్రహ్మ సూత్రాలకు ఆయన వ్రాసిన భాష్యాన్ని ద్వితీయ ప్రస్థానం అంటారు. భగవద్గీతకు వారు వ్రాసిన భాష్యాన్ని తృతీయ ప్రస్థానంగా పేర్కొంటారు. ప్రస్థాన త్రయంతోపాటు 100కు పైగా గ్రంథాలను, స్తోత్రాలను వారు వ్రాసారు, వారు వ్రాసిన సాహిత్యం అపారమైనది.
శంకరులు దేశ పర్యటనలో ఉండగా తల్లి ఆర్యాంబ జబ్బుపడింది. శంకరులు తల్లివద్దకు వచ్చారు. తల్లి మరణించింది. ఒక సన్యాసిగా తల్లికి అంత్యక్రియలు చేసే ఆచారం లేదు. అయినప్పటికీ తల్లిమీద గల ప్రేమ కారణంగా శంకరులు స్వయంగా తల్లికి అంత్యక్రియలు చేసారు.
‘‘ఆదిశంకరులు వచ్చారు, శాస్తచ్రర్చ చేసారు, విజయం పొందారు, తన అనుయాయులను చేసుకున్నారు’’అన్న నూతన నానుడిని సృష్టించారు. ఆనాడు దేశంలోగల పాశుపత మతము, కర్మమతము (కుమారుల భట్టు), శాక్తమతము, సారస్వతమతము (సరస్వతిదేవిని పూజించడం), వామాచార మతము, శైవమతము, వైష్ణవ మతము, హిరణ్యగర్భ (బ్రహ్మ)మతము, సౌర (సూర్య) మతము, అగ్నిమతము, గాణపత (గణపతి) మతము, చార్వాకమతము, సౌగత మతము, శూన్యమతము, అర్హత మతము, బౌద్ద మతము, జైన మతములు ఉండేవి. ఈ మతాలకు చెందిన పండితులతో చర్చించి, వారిని శాస్త్ర చర్చలో ఓడించి అద్వైత మతాన్ని స్థాపించారు. మండన మిశ్రుని భార్య ఉభయభారతి అధ్యక్షతన శంకరులు, మండన మిశ్రుల మధ్య 5, 6 రోజులు పండిత చర్చ జరిగింది. చివరకు శంకరులు గెలిచారు. మండన మిశ్రులు శంకరుని శిష్యులై సురేశ్వరాచార్య అయ్యారు. అనంతరం ఉభయభారతి శంకరుల మధ్య 17 రోజులు చర్చ జరిగింది. చివరకు శంకరులే గెలిచారు. ఆనాడు కాశ్మీరంలోని శారదాలయము అన్ని మతాలకు చెందిన పండితులకు కేంద్రము. ఆ పండితులందరినీ చర్చలో ఓడించి ‘సర్వజ్ఞ పీఠాన్ని’ శంకరులు అధిరోహించారు.
షణ్మత స్థాపనాచార్యులు:- శైవము, శాక్తము, వైష్ణవము, సౌరము, గాణాపత్యము, కౌమారము- ఈ 6 మతాల మధ్య సమన్వయాన్ని నిర్మించారు. ఎవరికి ఇష్టమైన మతాన్నివారు అవలంభించవచ్చునని, ఇతర మతాల పట్ల చిన్నచూపు పనికిరాదని బోధించారు.
చాలా తక్కువ కాలంలో భారతదేశమంతటా విస్తృతంగా పర్యటించి దేశం నలుమూలలా. వైదిక ధర్మసంరక్షణకొరకు దేశం నలుమూలలా 4 పీఠాలను ప్రారంభించారు. తూర్పున పూరి జగన్నాథంలో ఋగ్వేద ప్రధానంగాను, దక్షిణాన శృంగేరిలో యజుర్వేద ప్రధానంగాను, పశ్చిమాన ద్వారకలో సామవేదం ప్రధానంగాను, ఉత్తరంలో బద్రినాద్‌లో అధర్వణ వేదం ప్రధానంగాను 4 పీఠాలను ఏర్పరిచారు. ఈ పీఠాలకు వరుసగా పద్మపాదుడు సురేశ్వరుడు, హస్తామలకుడు, తోటకాచార్యులను పీఠాధిపతులుగా నియమించారు. ఇప్పటికి ఈ పీఠాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. తన చిన్నవయస్సులో తన జీవన కార్యాన్ని ముగించుకుని 32వ ఏటనే సమాధిని పొందారు.

- కె.శ్యామ్‌ప్రసాద్ కన్వీనర్, సామాజిక సమరసత వేదిక