సబ్ ఫీచర్

వాయు కాలుష్యానికి కళ్లెం ఎపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాల్లో వాయు కాలుష్యం జన జీవన ప్రమాణాలను మింగేస్తున్నదని ఢిల్లీ ఐఐటి జరిపిన పరిశోధన హెచ్చరిస్తోంది. అలహాబాద్, మీరట్, లక్నో, కాన్పూర్, వారణాసి, గోరఖ్‌పూర్, పాట్నా, గయ, ముజఫర్‌నగర్, రాంచీ నగరాల్లో వాయు కాలుష్యంపై ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ డెవలప్‌మెంట్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. సర్వే జరిపిన నగరాలకు సంబంధించి ప్రతి లక్ష మరణాల్లో సగటున 300 మంది కలుషిత వాయువు వల్లనే మరణిస్తున్నారని తేటతెల్లమైంది.
ఢిల్లీ నగరంలో ప్రమాదకర స్థాయిలో సూక్ష్మాతి సూక్ష్మ కణాలతో గాలి కలుషితమైందని గత పదేళ్ళుగా వింటునే వున్నాం. వాయు కాలుష్యం సమస్య ఢిల్లీ నగరానికే పరిమితం కాలేదని తాజా అధ్యయనం తెలియజేస్తున్నది. దేశంలో ప్రధాన నగరాలన్నీ కాలుష్య కర్మాగారాలు కావడం ఆందోళనకరం. ప్రజారోగ్యానికి కాలుష్యం కలిగించే నష్టం భారీ స్థాయిలోనే ఉంది. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ఫల్మనరీ డిసీజెస్, ఎక్యూట్ లోవర్ రెసిపిరేటరీ ఇన్‌ఫెక్షన్, గుండెపోటు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, పరిహృదయ వ్యాధులు వంటివి వ్యాపిస్తున్నాయి. జీవితకాలం క్రమేణా కుదించుకుపోతున్నది. పని దినాలు తగ్గుతున్నాయి. ఆసుపత్రి ఖర్చులు పెరిగి చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
అతి చిన్న ధూళి కణాల, విష వాయువుల మిశ్రమమే గాలి కాలుష్యం. మితిమీరిన మానవ కార్యకలాపాల వలన కలిగే దుష్ఫలితం ఇది. వాహనాలు వదిలే పొగ, పరిశ్రమలు వెలువరించే విష వాయువులు, కరెంటు తయారీ, వ్యవసాయం, చెత్తాచెదారాన్ని ఆరుబయట మండించడం వంటి అనేక చర్యల వలన పోగుబడ్డదే గాలి కాలుష్యం. విషవాయువులకు చాలావరకూ రంగు, వాసనలుండవు. కలుషిత గాలిలో ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడులు, నైట్రోజన్, ఓజోన్, ఓలేటివ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నిండి వుంటాయి. మనం పీల్చే గాలిద్వారా సూక్ష్మకణాలు, విష పదార్థాలు ఊపిరితిత్తులను చేరుతాయి. క్యాన్సర్‌తో సహా పలురకాల శ్వాసకోశ రోగాలు బారినపడేలా చేస్తాయి. ఢిల్లీ నగరంలోని గాలిలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ణయించిన కాలుష్య స్థాయి కంటే 22రెట్లు అధికంగా వుంది.
గాలి కాలుష్యం వాతావరణాధారితం. కాని ప్రాథమికంగా గాలి కాలుష్య తీవ్రత తెలుసుకోవాలి. ఏ కారకం ఎంత కాలుష్యం విడుదల కావిస్తున్నదో లెక్కించాలి. మోటారు సైకిల్, కారు, బస్సు, రైలు, ఇటుక బట్టీ, రసాయన కర్మాగారం, మందుల పరిశ్రమ, విద్యుత్ తయారీ కేంద్రం ఏది ఎంత కాలుష్యం గాలిలోకి చేరేలా చేస్తుందో తెలియాలి. వీటి లెక్కింపునకు, నిరంతర కాలుష్య పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక సాధనాలు అవసరం. అయితే ఇవి కొన్ని నగరాలకే పరిమితం. దేశమంతటా లేవు.
జనాభా పెరుగుదలతోపాటే కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు. ప్రతి కారకం నుండి వెలువడే కాలుష్య తీవ్రతను తగ్గించే సాంకేతిక సంపద అవసరం. దాన్ని సృష్టించుకోవాలి. ఉద్గారాల తీవ్రతలు రెండు రకాలు. సాంకేతికమైనవి, సాంకేతికతతో ముడిపడి లేనివి. డీజిల్ వాహనాలు పెట్రోలు, సియన్‌జి వాహనాల కన్నా ఎక్కువ కాలుష్యాన్ని వాతావరణంలోకి పంపుతాయి. ప్రస్తుతం వినియోగంలో వున్న వాహనాల స్థానంలో బ్యాటరీ, ఇంధనం దాచే ఇతర సాంకేతిక సదుపాయం కలవి అందుబాటులోకి రావడానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుందని అంచనా. రానున్న కాలంలో వాహనాల సంఖ్య ఏ మేరకు తగ్గుతుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. మోటారు వాహనాలు ఇంకా ఇంకా పెరిగితే అవి- ‘జీరో కాలుష్యం విడుదల చేసే వాహన శ్రేణి’గా మారడానికి చాలా కాలం పడుతుంది. కనుక సాంకేతిక సంపద అవసరం లేని మార్గాలవైపు ప్రజలను మళ్ళించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలి. విధాన నిర్ణయాలు ఆ దిశగా సాగాలి. పట్టణ ప్రణాళికల్లో మార్పులు, వాహనాల సంఖ్యను తగ్గించే ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాలి. సైకిళ్ల వినియోగం పెంచాలి. నడకను, ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి.
లక్షలాది నగర వాసులు మితిమీరిన గాలి కాలుష్యానికి బలౌతున్నారు. ప్రమాదకరమైన ఈ సమస్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం క్షమార్హం కాదు. అందుబాటులో ఉన్న ఉన్నత సాంకేతిక పరికరాలను వినియోగించి గాలి స్వచ్ఛత పెంచే చర్యలు తీసుకోవాలి. ఉద్గారాల తీవ్రత తగ్గించే ఇతర అనుసరణీయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటి సహాయంతో గాలిలో ప్రాణవాయువు శాతం పెంచే ప్రయత్నాలు చేయాలి. నగరం నివాసయోగ్యం కావాలంటే అక్కడి స్థలాలను ప్రజాక్షేమం కోసం వినియోగించాలి. కాలిబాటలు, సైకిల్‌దారులు, నీటిమార్గాలు వెంటనే నిర్మించాలి. నగర స్వచ్ఛతను పెంచడానికి, కాపాడడానికి అమెరికా, యూరప్, ఈశాన్య ఆసియా దేశాలు అనుసరిస్తున్న మార్గాల వైపు మనం చూపు మరల్చాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న స్వచ్ఛనగర కార్యక్రమాలు ఉన్నతస్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి పరిచయమే.
ఏ రకమైన కాలుష్యాన్నైనా నిర్లక్ష్యం చేయకూడదు. జీవకోటి మనుగడ నేల, నీరు, గాలి స్వచ్ఛతలతో పెనవేసుకొని వుంది. మంచినీటిని కొనుక్కొని ధనికులు ఆ రకమైన కాలుష్యం నుండి ఉపశమనం పొందగలరు. కాని గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకరమైంది. ఇది ఏ వర్గాన్ని ఉపేక్షింపదు. అందరినీ కబళించేస్తుంది. పారిశ్రామిక వాడలకు దూరంగా గాజుగదుల్లో నివసిస్తున్నాం.. మనకేం కాదులే అనే భావన వీరిలో నెలకొని వుంది. అది భ్రమే. ఓజోన్ ఇనుప తెరలను సైతం తొలచి చొరబడి ఊపిరి తిత్తులను సైతం నాశనం చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యంపై జరిపే సమరంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి వుంది.

-వి.వరదరాజు 94925 42033