సబ్ ఫీచర్

ఆరెస్సెస్‌కు పోటీగా ‘సేవాదళ్’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ చాలా అసహనం ప్రదర్శించింది. మీడియాలో దీనికి విశేష ప్రాధాన్యం లభించడంతో ఏనా డూ ప్రచారానికి ఉబలాట పడని ఆరెస్సెస్‌కు కలిసొచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ సేవాదళ్‌ను పటిష్టం చేస్తానని చెబుతోంది. తమ పార్టీ అనుబంధ సంస్థ అయిన సేవాదళ్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. సేవాదళ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయవాదం, దేశభక్తి గురించి ప్రబోధించి, పనిలో పనిగా ఆరెస్సెస్‌ను తిట్టిపోశారు. ఆరెస్సెస్‌కు దీటుగా సేవాదళ్ బలపడాలన్నారు.
నిజానికి ఆరెస్సెస్‌లా రోజూ గ్రామాల్లో ‘శాఖలు’ పెట్టాలని కాంగ్రెస్ ఒకప్పుడు ఆలోచించింది. అలనాటి కాంగ్రెస్ దిగ్గజం, మాజీ రాష్టప్రతి డా.శంకర్‌దయాళ్ శర్మ ఈ మాట ఎపుడూ అంటుండేవారు. ఈ విషయాన్ని అలనాటి ఆరెస్సెస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్ కూడా స్వాగతించారు. సామాజిక కార్యరంగాలన్నింటిలో విశుద్ధ దేశభక్తి, క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల అవసరం వుందని, అందుకోసం ఈ పని ఎవరుచేసినా స్వాగతించాలని దేవరస్ అనేవారు. కాని కాంగ్రెస్ ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ ఒక సేవాసంస్థగా మారాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారు. ‘స్వాతంత్య్రానంతరం మీరు ఏ మంత్రి పదవిని కోరుకుంటారు?’ అని బాలగంగాధర తిలక్‌ను కొందరు అడిగితే, ‘నేను నా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళిపోతాను’అని ఆయన అన్నారు. ఇందుకు కారణం- స్వాతంత్య్ర సిద్ధికి మాత్రమే ఒక వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆరోజుల్లో పనిచేసింది. అందుకే అందరూ ఆ పార్టీలో చేరి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డా. కేశవ బలరాం హెడ్గేవార్ కూడా కాంగ్రెస్‌లో పనిచేసి, రెండుసార్లు జైలుకెళ్ళారు. ఆ రోజుల్లో జైలుకెళ్ళినవారు అక్కడి బాధలు భరించలేక క్షమాపణ చెప్పుకొని బయటకు వచ్చేసేవారు. హెడ్గేవార్ మాత్రం రాజీలేని దేశభక్తినే కోరుకునేవారు. 1923లో నాగపూర్‌లో జరిగిన జెండా సత్యాగ్రహంలో పాల్గొన్న అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తల్ని బ్రిటీషు ప్రభుత్వం జైళ్ళలో కుక్కింది. చాలామంది క్షమాపణ చెప్పుకుని బయటపడ్డారు. కాని హుబ్లీకి చెందిన ఎన్.ఎస్.వార్దికర్ లొంగిపోయేందుకు ససేమిరా అన్నారు. ఆయన దృఢవైఖరిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇదే కాంగ్రెస్ సేవాదళ్ విభాగానికి ప్రేరణ అయ్యింది. జనవరి 1, 1924నాడు ఇదే హిందూస్తానీ సేవాదళ్‌గా ఆవిర్భవించింది. జవహర్‌లాల్ నెహ్రూ దీనికి మొదటి అధ్యక్షుడు.
కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో ఈమేరకు తీర్మానం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కనుసన్నలలో సేవాదళ్ పనిచేయాలని తీర్మానించారు. మొదట్లో దీనికి కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ఎదురైంది. తమ అహింస లక్ష్యానికి ఇది భిన్నమన్నారు కొందరు. ఉమాబాయి కుందపూర్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా వచ్చాక 1931లో దీన్ని కాంగ్రెస్ సేవాదళ్‌గా పేరు మార్చారు. అప్పటినుంచి అదొక కేంద్ర వలంటీర్ సంస్థ అయింది. ఆరోజుల్లో ‘వలంటీర్’ అంటే మీటింగులలో కుర్చీలు వేయడం, తీయడం, స్వచ్ఛత కోసం పనిచేయడం, వేదికలను అలంకరించడం వంటి సేవలందించే వారన్నమాట. స్వచ్ఛందంగా పనిచేస్తారన్న అర్థం తప్ప, ఏం పనిచేస్తారంటే మళ్ళీ సేవల గురించే అంతా ప్రస్తావించేవారు. అందుకే కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో సేవాదళ్ పాత్ర పరిమితమైపోయింది. సేవాదళ్ సభ్యులు ప్రతిజ్ఞ తీసుకునేవారు. 1938లో వారికి ప్రశిక్షణ కూడా జరిగింది. వార్దికర్ నేతృత్వంలో శారీరక శిక్షణ శిబిరాలు నిర్వహింపబడేవి. సహాయ నిరాకరణోద్యమంలో సేవాదళ్ చురుకుగా పాల్గొన్నది. 1932లో సేవాదళ్ నిషేధానికి గురైంది. సహాయ నిరాకరణోద్యమ ఉధృతి కారణంగా 1934లో నిషేధం తొలగిపోయింది. 1959లో నాసిక్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో నెహ్రూను ప్రధాన ద్వారం వద్ద కమలాకర్ శర్మ అనే సేవాదళ్ వలంటీర్ ఆపివేశాడు. ‘నేనెవరో నీకు తెలీదా?’ అని నెహ్రూ అడిగాడు. ‘తెలుసు, కాని మీరు సరైన బ్యాడ్జి ధరించలేదు’ అని జవాబిచ్చాడు ఆ వలంటీర్. నెహ్రూ చిరునవ్వుతో జేబులోంచి బ్యాడ్జి తీసుకొని పెట్టుకున్నాకే ఆయన్ను ఆ వలంటీర్ లోపలికి పంపాడు. ‘దళ సమాచార్’ పేర పత్రిక నడిచేది. సేవాదళ్ సైనిక క్రమశిక్షణను అమలు చేసేది. ఒకప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం కావాలంటే సేవాదళ్ శిక్షణ తప్పనిసరిగా వుండేది. కాని నేడు సేవాదళ్ కనుమరుగై పోయింది. అధికారంలోకి వచ్చినపుడల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ విషయం మరచిపోతుంది. 1969లో సేవాదళ్‌లో చేరిన బలరాం సింగ్ చెప్పిన వాస్తవాలను నేడు కాంగ్రెస్ పార్టీ నేడు అవలోకనం చేసుకోవాలి. కాంగ్రెస్ సేవాదళ్ ప్రారంభమైన రెండేళ్ళకు ఆరెస్సెస్ ప్రారంభమైంది. సంఘ్ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ నారాయణ సుబ్బారావు వార్దికర్ ఇద్దరూ సహచరులు. కాంగ్రెస్‌లో పనిచేసినా, ఆ తర్వాత వారి దారులు వేరయ్యాయి. సంస్థ నిర్మాణంలో కాంగ్రెస్‌ది కుందేలు-తాబేలు న్యాయంగా మారిందనేవారు బలరాం.
రాజకీయంగా ఎంతో ఎదిగిన కాంగ్రెస్‌కు నేడు నాయకులు కరవయ్యారు. కార్యకర్తల లేమి పార్టీని వెంటాడుతోంది. కారణం సేవాదళ్‌ను నిర్లక్ష్యం చేయడమే. రాజకీయం నేతలకు సర్వస్వం అయింది. పదవుల పటాటోపం పార్టీ నడ్డివిరిచింది. సంపాదనే సర్వస్వమైంది. అవినీతి మకిలి పార్టీని అధోగతిపాలు చేసింది. ప్రజలను అయోమయానికి గురిచేసింది. గతం అవగతం కాని చోటామోటా నాయకులు నేడు కాంగ్రెస్‌లో మిగిలారు. ఇందిర హయాంలో వ్యక్తివాదం శ్రుతిమించింది. దీనికి భిన్నంగా ఆరెస్సెస్ ‘వ్యక్తితోడ ముడివడనిది ధ్యేయవాద జీవనం’ అంటూ నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేసింది. దేశానికి ప్రధానమంత్రుల్ని సైతం అందించగలిగింది. సేవాదళ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అలంకారప్రాయమై, ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. సేవాదళ్ సంఘటనా కార్యదర్శి మహేంద్రజోషి-‘కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తామేదీ చేయలేమని, తాము అనుచరులం మాత్రమే’ అన్నారు. ప్రజలకు,పార్టీకి మధ్య వారధిగా సేవాదళ్ నిర్మాణం జరగలేదు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం వంటివి వదిలిపెడితే, సేవాదళ్ మళ్ళీ కాంగ్రెస్‌ను గట్టెక్కించగలదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జ్భీయ్ దేశాయ్ మాట్లాడుతూ తాము కూడా ప్రతినెలలో చివరి శనివారం నాడు 1000 నగరాల్లో జెండా వందనం చేబడతామని, 3 నెలలపాటు అందరికీ శిక్షణ ఇస్తామని అన్నారు. దేశ క్షేమం కోరేవారందరూ ఈ కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. కాని ఇది రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా నిరంతరం జరగాల్సిన పని. స్వాతంత్య్రానికిముందు స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత, స్వాతంత్య్రానంతరం నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా సాధనకై నియమించిన సంపూర్ణానంద కమిటీ- ‘ప్రతి గ్రామంలో, బస్తీలో ప్రజలు రోజూ ఒకచోటచేరి దేశమాతకు ప్రార్థన చేయాల’ని సూచించారు. సరిగ్గా ఆరెస్సెస్ ఇదే పనిచేస్తోంది. ఈ పని ఎవరుచేసినా అభినందించాలి, అవకాశాన్ని అందిపుచ్చుకొని యువత దేశప్రగతికై నడుం బిగించాలి. నిత్యసాధన, నిత్య ప్రార్థన, నియమ పాలన, క్రమశిక్షణ, అనుశాసనము వేల సంవత్సరాల జాతీయ జీవనం అక్షుణ్ణంగా, అప్రతిహతంగా సాగిపోయేందుకు సానుకూలాంశాలవుతాయి. జాతీయ వాదం ఎవరి సొత్తూకాదు. పాలనాధికారం, పదవులు, ఎవరికీ వారసత్వం కాదు. ప్రతి సామాన్యుడినీ ప్రముఖ జాతీయవాదినిచేసే తంత్రం నేడు దేశానికి కావాలి. ప్రతి వ్యక్తినీ నిజ దేశభక్తుడిగా మలిచే పరమోత్కృష్ట యంత్రాంగం కావాలి. కాంగ్రెస్ పార్టీ విషయంలో కాలం చేజారిపోయింది. నినాదాలు, వివాదాలు ఆ పార్టీని బలహీనపరచాయి. 1984-85 నుంచి యువజన కాంగ్రెస్, విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యుఐ దూకుడు పెరిగింది.
నిజమైన పార్టీ నేతల్ని పక్కన పెట్టేశారు. గత 15 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ మార్కు రాజకీయం రచ్చకెక్కింది. సేవ, నిష్ఠ, సమర్పణ అఖిల భారతీయ కాంగ్రెస్ సేవాదళ్ లక్ష్యాలు. కాని పార్టీలో వాటిని పునాదులుగా గుర్తించి పెంపొందించే పని నెత్తుకెత్తుకునే వారు కరవయ్యారు. చక్కటి దేశభక్తి గేయాలతో సేవాదళ్ కార్యకర్తలు ఓతప్రోతమయ్యేవారు. ప్రస్తుతం సోనియా, రాహుల్‌ను కీర్తించే భట్రాజులు నిండిపోయారు. 1929లో సంపూర్ణ స్వాతంత్య్రం నినాదమిచ్చిన కాంగ్రెస్ నేడు విభజన రాజకీయాలతో ప్రజలను అవమానిస్తున్నది. ఒకే జాతీయ జెండా నీడన పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేడు రాజకీయ స్వార్థం కోసం వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ జెండాలను, ప్రత్యేక జెండాలను కోరే రాజకీయాలను తమ ఎజెండా చేసుకుంది. మహేంద్రజోషి లాంటి సేవాదళ్ నేతలు ‘కాంగ్రెస్ పతనానికి ఎవర్నీ దూషించనక్కరలేదని మన పతనానికి మనమే కారణమని, సమాజానికి దూరమైనపుడల్లా రాజకీయ పార్టీల అస్తిత్వం కనుమరుగైంద’ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను అధ్యయనం చేయాలని ఆయన సేవాదళ్ కార్యకర్తలకు సూచిస్తారు. ఆరెస్సెస్‌పై అభాండాలు వేస్తూ సమయం వృథా చేయకుండా సేవాదళ్ నిర్మాణంపై రాహుల్ దృష్టిపెట్టాలి. అందుకు అవసరమైతే రాజకీయాలతో సంబంధంలేని మేధావుల సలహాలను తీసుకోవాలి. సేవాదళ్ కార్యకర్తలకు ప్రశిక్షణపై దృష్టిపెట్టాలి. ఇక్కడి సమాజాన్ని, జీవన రచనను అర్థం చేసుకునేందుకు, సంయమనంతో అడుగులు వేసేందుకు పూనుకోవాలి. పోట్లాడేందుకు కాకుండా జాతి భవిత కోసం పోటీ మనస్తత్వంతో పనిచేయవచ్చు. దేశ నిర్మాణ కార్యంలో కోట్ల జనం అడుగులొక్కటయ్యేందుకు అందరూ శ్రమించాల్సిందే. ఆ ఆనందం అందరూ అనుభూతి చెందాల్సిందే!

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888