సబ్ ఫీచర్

బహుపరాక్.. బస్తరియా బెటాలియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతంలో మకాం వేసిన మావోయిస్టులను అరికట్టడంలో సిఆర్‌పిఎఫ్‌కు ఎదురవుతున్న భాషా పరమైన, భౌగోళిక పరమైన సమస్యలను అధిగమించానికి ‘బస్తరియా బెటాలియన్’ ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఏడాదిపాటు శిక్షణ ము గిశాక, ఇటీవల జరిగిన ఈ బెటాలియన్ ‘పాసింగ్ ఔట్ పరేడ్’కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ హాజరయ్యారు. 534 మంది ఆదివాసీలున్న బస్తరియా బెటాలియన్‌లో 189 మంది ఆదివాసీ మహిళలూ ఉన్నారు. వీరంతా బస్తర్‌కు చెందినవారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులే గాక అక్కడ నివసించే అనేక తెగలవారు మాట్లాడే భాషలు తెలుసు. మావోయిస్టుల ప్రభావం నుంచి అమాయక ఆదివాసీలను బయటకు తీసుకురావడంలో వీరి పాత్ర గణనీయంగా ఉండగలదని భావిస్తున్నారు. మావోయిస్టు గెరిల్లాల సాయుధ దాడులను తిప్పికొట్టేందుకు వీరు ఆయుధ శిక్షణ తీసుకున్నారు. వీరంతా సిఆర్‌పిఎఫ్‌లో అంతర్భాగంగా పనిచేస్తారు. క్రమశిక్షణ, అంకితభావం వీరిలో కనిపిస్తాయి. 18-20 ఏళ్ళ వయసుగల ఆదివాసీ యువతీ యువకులు తమకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మావోల నుంచి బస్తర్‌ను కాపాడాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేసేందుకు వీరు రంగంలోకి దిగారు. బస్తర్‌లో శాంతి నెలకొల్పుతామని వీరంటున్నారు. స్థానిక భాష, వ్యవహారాలు, వ్యక్తుల ప్రవర్తన తెలిసిన వీరివల్ల మంచి ఫలితాలు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.
బస్తర్‌లోని అబూజ్‌మఢ్ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ విముక్తి ప్రాంతంగా ప్రకటించుకున్నారు. ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వీరు చక్రం తిప్పుతున్నారు. ‘జనతన సర్కార్’ పేర తమకు అనుకూలమైన వ్యవస్థను వీరు ప్రారంభించారని పోలీసులకు సమాచారం అందుతోంది. ఇప్పటికే లక్షమందికి పైగా భద్రతా బలగాలు దండకారణ్యంలో విధులు నిర్వహిస్తున్నాయి. మావోల ప్రభావం విస్తరించకుండా, వారి కార్యక్రమాలను నిరోధిస్తూ, సాయుధ కాల్పులు జరిపితే ఎదురుకాల్పుల జరుపుతూ, వివిధ అభివృద్ధి పనులకు పహారా కాస్తూ, గస్తీ తిరుగుతున్నారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ, మరోవైపు మావోలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే బస్తరియా బెటాలిన్‌ను ఏర్పాటు చేశారు.
బ్లాక్ పాంథర్స్
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ‘బ్లాక్ పాంథర్స్’ పేర ఓ దళాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘గ్రేహౌండ్స్’ మాదిరి బ్లాక్ పాంథర్స్ దళం పనిచేయనున్నది. ఇప్పటికే ఈ దళంలోని సభ్యులు శిక్షణ పొందుతున్నారు. అటవీ ప్రాంతంలో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో దాడుల నిర్వహణ విషయమై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నది. ఈ విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్, రమణ్‌సింగ్ ఇటీవలే ప్రకటించారు. కాగా, ప్రత్యేక మహిళా కమాండో దళం కూడా దంతెవాడ సహా మరికొన్ని జిల్లాల్లో పనిచేస్తోంది. ఆదివాసీ మహిళల సమస్యలను అర్థం చేసుకుని వారు మావోయిస్టుల వైపు మొగ్గకుండా జనజీవన స్రవంతిలో కొనసాగేలా, మావోలను ఎదుర్కొనేందుకు వీరు శిక్షణ పొందారు. కొంతకాలంగా వీరు దండకారణ్యంలో విధులు నిర్వహిస్తున్నారు. స్థానికులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని అందుకునేలా ఆదివాసీలను ప్రోత్సహిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల సమాచారాన్ని వారికి చేరవేస్తున్నారు. చిన్న చిన్న రుగ్మతలకు వైద్యం కూడా అందిస్తున్నారు. ఎక్కడో పుట్టి పెరిగి అడవిలో తమ వద్దకొచ్చి ప్రభుత్వ పథకాల సమాచారమివ్వడమేగాక ఎన్నో మంచి మాటలు తెలియజేస్తున్నందుకు ఆదివాసీలు వారిపట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. మహిళా కమాండో దళం గాని, బస్తరియా బెటాలియన్ ఏర్పాటు గాని ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. ఆదివాసీల్లో సానుకూల దృక్పథం కలిగించేందుకు వీరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాధారణ సిఆర్‌పిఎఫ్ జవాన్ల కన్నా వీరి వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మావోయిస్టు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘సమాధాన్’
గతంలో ‘సమాధాన్’ పేర ప్రవేశపెట్టిన విధానంలో అంతర్భాగంగా అనేక పనులు ఇపుడు దండకారణ్యంలో కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున రోడ్లు వేస్తున్నారు. సెల్ టవర్ల సంఖ్యను పెంచుతున్నారు. ప్రభుత్వ విద్య, వైద్యం ఆదివాసీలకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చౌకధరల వస్తువులు ప్రతి గూడేనికి అందేలా ప్రభుత్వం చాలాకాలంగా కృషి చేస్తోంది. అందులో విజయం సాధించిందని వివిధ సర్వేలలో వెల్లడైంది.
బస్తర్ రమణీయ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. చిత్రకూట్ లాంటి జలపాతాలు, ఆదివాసీల నృత్యాలు, హస్తకళలు, అంగళ్లు, దంతేశ్వరి దేవాలయం ఇపుడు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దండకారణ్యం వెలుపలి ప్రపంచపు ఆనవాళ్లు ఆదివాసీలకు తెలుస్తున్నాయి. వారి పిల్లలు చదువుతున్నారు. కొందరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ పట్టణాల్లోని కళాశాలల్లో చదువుతున్నారు. వెనుకటిలా పోతపోసిన రీతిలో ‘అజ్ఞానం’తో వారేమీ లేరు. కొత్త తరాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానం వైపు ఆకర్షితులవుతున్నాయి. వివిధ పట్టణాల్లో, నగరాల్లో జరిగిన మార్పులను చూస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు స్పందిస్తున్నట్టుగానే ఛత్తీస్‌గఢ్ ప్రజలు సైతం స్పందిస్తున్నారు. మారుమూల పల్లెలకూ విద్యుత్, సోలార్ విద్యుత్, సెల్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు వివిధ సమస్యలపై పనిచేస్తున్నాయి. విద్యారంగంలో రామకృష్ణ మిషన్ పెద్ద ఎత్తున పనిచేస్తోంది. మహిళా వికాసం కోసం వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. స్వయం ఉపాధి పొందేందుకు, వివిధ వృత్తి శిక్షణా సంస్థలు నిరంతరం కష్టపడుతున్నాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు కనిపిస్తాయి.
బస్తర్ దసరా
మైసూర్ దసరా, పూరి జగన్నాథ రథయాత్ర కలిపి జరిపినట్లుగా ‘బస్తర్ దసరా’ అంగరంగ వైభవంగా 75 రోజులపాటు ఏటా జరుగుతుంది. మాతా దంతేశ్వరిని ఆదివాసీలు ఆరాధిస్తారు. దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు చేరుకుంటారు. బస్తర్ నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతరులు వచ్చి ప్రత్యేకంగా రూపొందించిన పూల రథాన్ని లాగుతారు. రాజ కుటుంబ సభ్యులు, ఆదివాసీలు, ప్రజలు మమేకమవుతారు. అందరి ఆకాంక్ష బస్తర్ సుభిక్షంగా ఉండాలి. పిల్లా పాపలు చల్లగా ఎదగాలి. గత 700 సంవత్సరాలుగా ఏటా జరిగే ఈ ఉత్సవం పట్ల ఆదివాసీలకు ఎనలేని గురి. భక్తిప్రపత్తులతో, సంప్రదాయబద్ధంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఎంతో హుషారుగా జరుపుకునే ఆ ఉత్సవాన్ని తిలకిస్తే వీరినేనా మావోలు ‘మాయ’ చేయాలనుకుంటుంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
బస్తర్ మహరాజ్
ఈ కృషి అంతా ఒక ఎత్తు అయితే బస్తర్‌లో ఆరాధనీయ కుటుంబంగా ఆదివాసీలు భావించే మహరాజ్ కమల్ చంద్ర భంజ్‌దేవ్ కుటుంబ సభ్యుల కార్యాచరణ పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. తరతరాలుగా ఈ రాజ కుటుంబంపై ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తున్న బస్తర్ వాసులను ఆదుకునేందుకు కమల్ చంద్ర లండన్‌లో చదువుకుని వచ్చారు. బస్తర్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, వారి ఆకాంక్షలు నెరవేరేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన మాటపై నమ్మకం ఉన్న ఆదివాసీలు గ్రామ గ్రామాన కనిపించడం గొప్ప విషయం. ఆధునిక భావాలతో, ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల శక్తి సామర్థ్యాల పెంపుకోసం వారికి దక్కవలసినవి లభించేలా శక్తివంచన లేకుండా పనిచేసే పట్టుదల ఆయనలో కనిపిస్తోంది.
బస్తర్‌లోని ఖనిజ సంపదన, ప్రకృతి సౌందర్యం, కళానైపుణ్యం గొప్ప వ్యక్తి త్వంగల వ్యక్తుల గూర్చిన అవగాహన ఆయనలో మెండుగా కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి అదనంగా జరుగుతోందని, దాన్ని సద్వినియోగం చేసుకునేలా పథకాలు రచిస్తున్నారు. ‘యువజన కమిషన్’ పేర ఓ వ్యవస్థను రూపొందించారు. ప్రభుత్వంలో అంతర్భాగంగా ఇది పనిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో రాబోతున్న ఉక్కు ఫ్యాక్టరీల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నదని అంటున్నారు.
ఇలా అనేక పార్శ్వాల నుంచి సానుకూల వైఖరితో పనులు జరుగుతున్నాయి. దేశంలో అంతర్భాగమైన ఖనిజ సంపద అధికంగా ఉన్న చత్తీస్‌గఢ్ మావోయిస్టుల విముక్తి ప్రాంతం ఎన్నటికీ కాజాలదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కానీ, ముందుగా ప్రజలు పేదరికం, నిరుద్యోగం, అజ్ఞానం నుంచి విముక్తి కావాలి. అందుకోసం పనిచేసేలా ప్రతి బస్తరియా (బస్తర్ వాసి) ఇపుడు ముందుకొస్తున్నాడు. ఆ దృశ్యం స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది- ఒక్క మావోలకు తప్ప..!

--వుప్పల నరసింహం 99857 81799