సబ్ ఫీచర్

పశ్చిమ కనుమలలో పర్యావరణ విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ఆముష్మిక పవిత్రత, ఐహిక సౌభాగ్యానికి ‘సహ్యాద్రి పర్వత శ్రేణులు’గా సుపరిచితమైన పశ్చిమ కనుమలు అత్యంత ప్రాచీనత, ఆధునిక జీవన సమ్మిళిత ప్రకృతి సంపదగా విలసిల్లుతున్నాయి. ఉత్తర,దక్షిణ భారతావనిలోని గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలలోని అపార భూ, జల, అటవీ, పర్వత, పశుపక్ష్యాదులు వంటి అపురూప ప్రకృతి సంపన్నతకు ఈ అద్భుత కనుమలు నిలయాలుగా ఉన్నాయి. జాతి నాగరికతా జీవన సౌభాగ్యాన్ని సాధించే అభివృద్ధి, సామాజిక ప్రగతికి అంతర్భాగమై ఇవి అలరారుతున్నాయి. స్వాతంత్య్రానంతరం అధిక జనాభా ప్రాథమిక జీవనావసరాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వనరులను అవసరమైనంతమేరకు సద్వినియోగం చేసుకొనే స్థాయి నుంచి, క్రమేపీ అడ్డూ అదుపూ లేకుండా కొల్లగొడుతున్నాయి. కృతి విధ్వంసం కారణంగా పర్యావరణ దుష్పరిణామాలు సంభవించే విపత్కర స్థితిగతులను సృష్టిస్తున్నాయి. మైనింగ్, క్వారీయింగ్, పవర్ ప్లాంట్లు, వివిధ పరిశ్రమలు పశ్చిమ కనుమల ప్రశాంత పర్యావరణ అపురూప అస్తిత్వానికి తీవ్ర విఘాతం కలిగించటమేకాక, మానవాళి మృత్యు సంక్షోభానికి హేతువుగా పరిణమిస్తున్నాయి.
ప్రపంచ స్థాయిలో వారసత్వ స్థలంగా గుర్తింపు, గౌరవం పొందుతున్న పశ్చిమ కనుమల్లో 10 ఉన్నత జీవ వైవిధ్య హాట్ స్పాట్స్ వున్నాయి. 5,000 పుష్ప, ఫల మొక్కలు, వృక్షాలు, 139 వివిధ జంతు, మృగ సంతతి, 508 పక్షి, కీటక జాతులు, 179 ఇతర వైవిధ్య జాతులున్నాయి. సహ్యాద్రి శ్రేణులు 142 తాలుకాల పరిధిలో సుమారు 1,500 కిలోమీటర్ల మేరకు విస్తరించాయి. సుసంపన్న ప్రకృతి, జీవ జల సంపదపై అభివృద్ధి మాయాజాలం పేరిట- గ్లోబల్ వార్మింగ్ దుష్ఫరిణామాలు, హాని సృష్టించే ప్రభుత్వ, ప్రైవేటువర్గాల కన్నుపడింది. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన, బడా ప్రైవేటు యాజమాన్యాల దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, అధునాతన జీవన వ్యామోహం, జనాభా దుష్ఫలితాలు ప్రశాంత ప్రకృతి వనరులకు, జీవ సంపదకు నిలయమైన పశ్చిమ కనుమలలోకి చొచ్చుకొనిపోయాక సంక్షోభం ఆరంభమైంది. అడవులు, చెట్ల నరికివేత, విచ్చలవిడిగా తీర ప్రాంతాలలో గనుల త్రవ్వివేత, ప్రశాంతంగా ప్రవహించే నదీ జలాల వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు, అధికాహారోత్పత్తి పేరిట రసాయనిక కాలుష్యం, పారిశ్రామిక ప్రగతి అంటూ పీల్చేగాలి, త్రాగే నీరు సర్వత్రా మ నిషి బతకలేని కాలుష్యంతో కృతి వ నరులపై వికృత దోపిడీ ఆరంభమైంది. హరిత, శే్వత, నీలి విప్లవాలు ప్రాణాధారమైనా సహజంగా ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, భూమి, ఖనిజ సంపద, అడవులు విచక్షణారహితం గా కొల్లగొట్టడంతో మనిషి మనుగడకే ముప్పువాటిల్లేటట్టు- కూర్చున్న కొమ్మ నరుక్కునే దుస్థితి ప్రాప్తించింది. ‘మనం నివసిస్తున్న భూమి ప్రతి మనిషి అవసరాలను తీర్చగలదు. కాని ప్రతి మనిషి అత్యాశలను మాత్రం కాదు’- అన్న మహాత్మా గాంధీ మాటలు గుర్తుచేసుకోవలసిన పరిణామాలవైపు పరుగులు తీస్తున్నాం.
సత్యాగ్రహోద్యమాలు
భారతదేశంలో బ్రిటిష్ పాలనలో తలెత్తిన అటవీ హక్కుల ఉద్యమాలు క్రమేపీ గాంధేయ సత్యాగ్రహ ఉద్యమాలుగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలుగా ప్రకృతి వనరులను కాపాడుకోవాలనే లక్ష్యంతో కొనసాగాయి. కొండలు, కోనలు, అడవులు, లోయలు, నదీ పరీవాహక ప్రాంతాలలో ప్రకృతి వనరులు దెబ్బతినకుండా రక్షించుకోవటానికి, భారీ డ్యామ్‌ల నిర్మాణం, నిర్వాసిత జనాందోళనలు ఉద్యమరూపంలో ప్రభుత్వాలను నిలదీసాయి. గిరిజన మహిళలు అడవులను రక్షించుకోవటానికి, వృక్షాలను హత్తుకొని వాటిని నరకకుండా కాపాడుకొన్న గాంధేయవాద ‘చిప్కో ఉద్యమం’ 1972, 1973 సంవత్సరాలలో పర్యావరణ జాగృతిని కలిగిం చి దేశాన్ని కదిలించింది. 1983 సెప్టెంబరులో కర్ణాటకలో ‘అప్పికో ఉద్య మం’ విజయం సాధించింది. చం డీప్రసాద్ భట్, మీ రా బెహన్, సర ళా బెహన్, సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే, మేధా పాట్కర్, అరుంధతి రాయ్, జి.డి.అగర్వాల్, స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించిన స్వామీ నిగమానంద (ఉత్తరాఖండ్) వంటి ఎందరో పర్యావరణ సంరక్షణ ఉద్యమ నేతలు, ప్రకృతి ప్రేమికులు, శాస్తవ్రేత్తలు నిరాహార దీక్షలు, భారీ నిరసనోద్యమాలతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారు.
ఎకో సెన్సిటివ్ ప్రాంతాలు
1976 నాటి రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం, పర్యావరణం అడవులు అనే పదాలు తొలిగా 48(ఎ) ఆదేశిక సూత్రాలలో అధికరణంలో చేరాయి. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నీరు, గాలి, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, అడవుల సంరక్షణ, అటవీ జంతు మృగరక్షణ, జాతీయ పర్యావరణ, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ వంటి చట్టాలపై దృష్టిసారించింది. తూర్పు, పశ్చిమ కనుమలలో ప్రకృతి వనరులను కొల్లగొట్టి పర్యావరణ విధ్వంసనాన్ని అరికట్టడానికి, గంగానది ఇతర కాలుష్య నివారణ లక్ష్యంతో ఎకో సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి, అక్కడ అభివృద్ధి పేరిట జరిగే వినాశనాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేసింది. పశ్చిమ కనుమలలో ప్రకృతి రమణీయతకు నిలయమైన కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టు 1978లో కేంద్ర ప్లానింగ్ కమిషన్ ఆమోదం పొందినప్పటికీ 1984లో రద్దుకావటం మరచిపోలేని చారిత్రాత్మక సంఘటన.
వెస్ట్రన్ ఘాట్స్ పరిధిలోని ఆరు రాష్ట్రాలలో అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వాల విధ్వంస నియంత్రణకు- 2011 మాధవ గాడ్గిల్ నివేదిక పశ్చిమ కనుమలలో మొత్తం ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ ప్రాంతంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన ఫలితంగా కేంద్రం కస్తూరీ రంగన్ కమిటీ వేసింది. 2013లో కస్తూరీ రంగన్ కమిటీ నివేదిక ప్రకారం, అభివృద్ధికి ఆటంకం లేకుండా 60 శాతం వెస్ట్రన్ ఘాట్స్‌లో ప్రాజెక్టులు చేపట్టడానికి సిఫార్సు లభించింది. 37 శాతం పశ్చిమ కనుమల విస్తీర్ణం మైనింగ్, విద్యుత్ ప్లాంట్‌లు లేకుండా ‘నో-గో-జోన్’ ఏరియాగా హైలెవెల్ వర్కింగ్ గ్రూప్ నిర్ధారించింది. కాని ప్రస్తుతం కేంద్రం రాష్ట్రాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. 2017లో కేంద్రం జారీచేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు కూడా చట్టబద్ధత లేదు. పశ్చిమ కనుమలలో పర్యావరణ విధ్వంసం, వినాశనాన్ని కేంద్రం అరికట్టగలదా?

--జయసూర్య 94406 64610