సబ్ ఫీచర్

మూర్త్భీవించిన ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జస్టిస్ కోదండరామయ్య
*
జస్టిస్ కోదండరామయ్యగారి నివాసంలో ఎందరో న్యాయవాదులు తయారయ్యారు. అలాగే మన పురాణాలపై అవగాహన పెంచడం గురించి, సనాతన ధర్మం కొరకు కృషిచేసే వీరాభిమానులూ తయారయ్యారు. నేడు ఆధ్యాత్మిక సైన్యంలా మన ధర్మాన్ని ఆచరింపచేయగల యువతరం ఏర్పడాలని కాంక్షిస్తూ ఉంటారు ఇటీవల అస్తమించిన న్యాయమూర్తి.
కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆయన నివాసానికి వెళ్లాను. కోదండరామయ్యగారి వద్దకు మన ఇతిహాసాలను, పురాణాల గురించి తెలుసుకోవాలనే తపనతో అడుగుపెట్టిన ఒక యువ న్యాయవాదిగా నేను అడిగిన ఎన్నో ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానమిస్తూ ఆధ్యాత్మికత విలువలను కాపాడే ప్రయత్నం చేశారు జస్టిస్‌గారు. నా వ్యక్తిత్వాన్ని నాలాంటి వేలాదిమందిని తీర్చిదిద్దిన మహానుభావుల్లో జస్టిస్ కోదండరామయ్యగారు చాలా ముఖ్యులు. రామాయణ మహాభారతాలలో ఉన్న గాథలను వక్రీకరిస్తున్న నేటి మేధావుల గురించి నేను అడిగిన ప్రశ్నలకు ఆయన నాకు ఇచ్చిన సమాధానమే ఈ వ్యాసం. ఇప్పటి రాజకీయ వాతావరణంలో మునిగితేలుతున్న ఆధునిక మానవునకు ఈ పితృభక్తి, వివాహ పవిత్రత అనే అంశాలు సామాజిక సుస్థితిని పట్టించుకోని మంగళగీతాలలాగా కానవస్తాయి. మహర్షుల ఆశీస్సులవలన మనం వాని ప్రాధాన్యాన్ని గుర్తించకుండా ఈ రెండింటి ప్రయోజనాలను అనుభవిస్తున్నాం. 1942లో మార్క్సిజం మన దేశంలో కొంగ్రొత్తగా ఆవిర్భవించిన సమయంలో ఒక విద్యార్థి ఇలా ప్రకటించాడు. ‘‘‘నేను మా తల్లిదండ్రులను గౌరవించనక్కరలేదు. ఎందుకంటే నేను వారి ఆరవ సంతానాన్ని’’. అతని ఉద్దేశం ఏమిటంటే తన తల్లిదండ్రులు మోహబుద్ధులు. కుటుంబ నియంత్రణ సూత్రాలను పాటించనివారు. తనను కని, పెంచి, పెద్దజేసి, చదివించిన తల్లిదండ్రులను గూర్చి కొడుకు ఇలా అనవచ్చునా? ఏమైనా మనం అటువంటి ప్రమాణాలకు చేరుకున్నాం. దీనికితోడు తల్లిదండ్రులు తమ పోషణ కోసం సంతానం మీద సివిల్ కోర్టులలో వేసి పెరిగిపోతున్న కేసులు ఒక భాగం. సుసంపన్నమైన అమెరికా దేశంలో ముసలివారు, యువకులు అని రెండుగా చీలిపోవటం మనం చూస్తున్నాం. క్రొత్తతరం వారు అన్ని ప్రయోజనాలనూ ముదుసలులకే ఇస్తున్నారని ఆరోపించటం ప్రారంభించారు. ఎవరు ఆ ముదుసలులు? వారు ఈ క్రొత్తతరం వారి తల్లిదండ్రులు. కొన్ని దేశాలు ముసలివాండ్లను చంపటం కూడా మనం చూస్తున్నాం. ఈ దేశంలో పితృభక్తిని విదేశీయులు ప్రశంసించే సందర్భాలు ఉన్నాయి. ఈ దేశపు ప్రజలపై శ్రీరాముడు గాఢంగా ముద్రవేసిన ఫలితమే అది.
అదేవిధంగా వైవాహిక పవిత్రతను గురించి అనిబిసెంట్ ఇలా అన్నది. భారతదేశంలో ఆధునిక స్ర్తిలలో కూడా కానవచ్చే అతి స్వచ్ఛమూ, అత్యున్నతమూ అయిన ఆధ్యాత్మికతా, అతి దృఢమూ, మృదువూ అయిన అనురాగమూ, జారుబాటులేనీ చెక్కుచెదరనీ, మచ్చలేనీ పవిత్రతా, తెలివిగల, సుందరమైన క్షమాగుణమూ నేను మరెక్కడా చూడలేదు. మన స్ర్తి సమాజంలో మన దేశం సాధించిన మహోన్నత సంప్రదాయం ఇది. అనుక్షణమూ మనం పెక్కు కార్టూన్లలో, స్ర్తి విషయకమైన అన్యాయాలకు సంబంధించిన వ్రాతలలో మనం గమనిస్తున్నాం. దీనిని లింగపరమైన న్యాయంగా అభివర్ణిస్తున్నాం. ఒకప్పుడు సహోద్యోగులు ఒక స్ర్తిని అవమానపరచిన విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు శిక్ష విధించింది. దానిమీద వ్యాఖ్యానమేమిటంటే ఆ శిక్ష చాలా తక్కువ అని. అంతేకానీ, ‘దేశంలో ఇది ఎలా సంభవించింది? ఎందు కు సంభవించింది?’ అని ఎవరూ అడగరు. జీససుక్రైస్తు ‘నీవు పర భార్యను స్పృశించరాదు’ అన్నాడు. ఇంకా మన చట్టం రీత్యా వ్యభిచారం నేరం. ఒక స్ర్తిని కామబుద్ధితో చూడటం కూడా వ్యభిచారమే’ అని కూడా చెప్పాడు. మనం ధర్మాన్ని త్రోసివేశాము. దానిని గురించి చర్చించటానికి ఎవడూ సిద్ధంగా లేడు. కానీ ఉద్వేగకరమైన వార్తలను కేవలం మళ్లీ మళ్లీ వ్రాస్తున్నాం. కాగితాలను నింపివేస్తున్నాం. వాల్మీకి శ్రీరాముని గూర్చి ‘న రామః పరదారాంశ్చ చక్షుర్వామపి పశ్యతి’ అని నుడివెను. శ్రీరాముడు పర భార్యను చూడనే చూడడు. అతని తమ్ముడు లక్ష్మణుడు ఈ విషయంలో మరొక అడుగు ముందుకు వేశాడు. అతడు సీతారాములనిద్దరినీ సేవించుకుంటున్నా సీతాదేవి పాదాలను తప్ప ఆమె నెన్నడూ చూడలేదు. ఈ అంశాన్ని వాల్మీకి ఋషి రెండు సందర్భాలలో విస్పష్టంగా వర్ణించాడు. అలాగే శ్రీరాముడు జనని, జన్మభూమి స్వర్గంకంటె గొప్పవి . ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని ప్రకటించాడు. ఆ విధంగా తల్లిదండ్రుల యెడల భక్తి, రాజ్యానికి అంకితం చేసుకోవటం, వైవాహిక జీవితానికి సంబంధించిన పవిత్రత అనే మూడు విషయాలలోను శ్రీరాముడు మూడు లోకాలను అతిక్రమించాడు. రామాయణేతిహాస కథలో వాల్మీకి మహర్షి ఆదర్శమానవత్వాన్ని, గుణాలకు సంబంధించిన దివ్య సౌందర్యాన్నీ నైతిక వ్యవస్థనూ, ధర్మంపై నెలకొన్న నాగరికతను చిత్రీకరించాడు.
అందువలన రామాయణాన్ని లక్ష్యగ్రంథం అంటారు. కాగా మహాభారతం లక్షణ గ్రంథం. రామాయణం ధర్మాన్ని ఎలా ఆచరించాలో అభివర్ణిస్తుంది. ధర్మాచరణ ద్వారా అనేక గొప్ప గుణాలు ఉత్పన్నం అవుతాయి. శ్రీరాముడు లెక్కింపరాని మంచి లక్షణాలను ఆచరించి చూపాడు. ఆ ఇతిహాసం నుండి మహర్షి మన కోసం ధర్మశాస్త్రాన్ని రూపొందించి అందించాడు. అందువలన ఇది లక్షణగ్రంథం.ఆయన, ధర్మమంటే ఏమిటి? ధర్మాన్ని మనం ఎందుకు ఆచరించాలి? తీసుకోవలసిన ముందు జాగ్రత్తలేమిటి? దాని ఆచరణవలన కలిగే ప్రయోజనం ఏమిటి? దానిని ఆచరించటంలో కలిగే ఆటంకాలేమిటి? వానిని ఆచరించటానికి కావలసిన సాధనాలేమిటి? అనే విషయాలను వివరించి చెప్పారు. అందుకోసం ధర్మసిద్ధాంతపు వివిధ రూపాలను సమగ్రంగా వివరించారు. మహాభారతంలో ప్రతి వ్యక్తి ఒకటి రెండు మంచి గుణాలలో ఔన్నత్యం సాధించాడు. కానీ అదే సమయంలో వారు ధర్మాతిక్రమణం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. యుధిష్ఠిరుడు తన స్వచ్ఛతకూ ఆచార విధికీ ప్రతిష్ఠ పొందాడు. భీముడు వీరత్వానికి విఖ్యాతుడైనాడు. అర్జునుడు పరాక్రమానికీ, కవలలు సమర్పణబుద్ధికీ, సేవకూ పేరు పొందారు. వారందరూ వీరులే. (ద్రౌపది కూడా సీతవలె అయోనిజయే అని మనం గుర్తించాలి) కర్ణుడు దాన గుణానికి మైత్రిలోని నిజాయితీకి గుర్తింపు పొందాడు. భీష్ముడు పితృభక్తికీ, జ్ఞాన సంపదకూ, వీరత్వానికి ప్రసిద్ధికెక్కాడు. విదురుడు ధర్మప్రవృత్తికి గణనకెక్కాడు. దుర్యోధనుడు గదా యుద్ధ నైపుణ్యానికీ అసమానమైన అభిమానానికీ పేరు పొందినాడు. ఇలా చూస్తే అన్నిగుణాలూ గల వ్యక్తి మనకు దొరకడు. శ్రీకృష్ణుడు మానవాతీత మహిమగల వ్యక్తి. మనం అతనితో స్పర్థ పొందలేము. (అతనిని అనుకరించలేము) కానీ శ్రీరాముడు మాత్రం కేవలం మానవమాత్రుడుగా ప్రవర్తించి మానవుడు దివ్యత్వాన్ని ఎలా పొందగలడో తెలియజేసే మార్గదర్శకుడైనాడు. ఈ విధంగా ఈ రెండు ఇతిహాసాలు పరస్పర పరిపూరకాలు. ఇవి జాతికి రెండు కన్నులవంటివి. అవి ఈ దేశ సంస్కృతిని మూర్తిమంతం చేస్తున్నాయి. ఈ రెంటి సామాన్యాలను పూర్తిగా నిరూపించటం సాధ్యం కాదు.
వేదవ్యాస మహర్షి ఇలా అన్నారు. ‘‘చేతులు ఎత్తుకొని నేను పెద్దగా అరుస్తున్నాను. ఒక్కడూ నా మాట వినటంలేదు. ధర్మం నుండే సంపదా, సుఖమూ ఏర్పడతాయి. మరియెందుకు ధర్మాన్ని సేవింపరు? సుఖం కోసమో, భయంవలననో, లోభంవలననో లేదా బ్రదుకు కోసం కానీ మనుజుడు ధర్మాన్ని వదలరాదు. ధర్మము నిత్యమైనది. సుఖ దుఃఖాలు అనిత్యాలు. జీవుడు నిత్యుడు. దేహంతో జీవులకు కలిగే సంబంధరూపమైన కారణం మాత్రం అనిత్యం..’’
-సి.ఎస్.రంగరాజన్
(చిలుకూరు బాలాజీ దేవాలయం
వంశపారంపర్య ధర్మకర్త మరియు ప్రధాన అర్చకులు)