సబ్ ఫీచర్

అద్భుత శక్తి అమ్మాయిల్లోనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాలికల వైపు నేడు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.. అసాధ్యాలను సుసాధ్యం చేసే అద్భుత శక్తి అమ్మాయిల్లోనే ఉంది.. విశ్వవ్యాప్తంగా చట్టసభల్లో, న్యాయస్థానాల్లో, కార్పొరేట్ సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో మీ భాగస్వామ్యం పెరగాలి.. ఇవన్నీ నెరవేరాలంటే అక్షరాస్యతలో బాలికలు అగ్రభాగాన నిలవాలి..’- అంటూ ఆ మధ్య మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య మిషెల్లీ ఒబామా చేపట్టిన ప్రచార ఉద్యమానికి దేశదేశాల్లో అనూహ్య మద్దతు లభించింది. బాలికల్లో అక్షరాస్యతా శాతం పెంచేందుకు వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్న ఆమె తాజాగా లండన్‌లో కొన్ని పాఠశాలలను సందర్శించి ఎంతో భావోద్వేగంతో ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడి భార్యగా కాకుండా ఓ మాతృమూర్తిగా తాను బాలికల విద్య కోసం ప్రచారోద్యమాన్ని చేపట్టానని ఆమె గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 62 మిలియన్ల మంది కౌమార బాలికలు చదువుకు నోచుకోవడం లేదని, అక్షరాలు నేర్చుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటే తప్ప వారు ఏదీ సాధించలేరని మిషెల్లీ అంటున్నారు. పేద బాలికలంతా బడిబాట పట్టినపుడే ఏ దైశమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. బాలికల విద్య అన్నది ప్రచారం కోసం కాదని, దాన్ని ‘తీవ్రమైన ఆర్థిక అంశం’గా పరిగణించాలని సూచిస్తున్నారు. పేదరికం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బాలికలు పనులకు వెళుతున్నారని, సమస్యల నుంచి గట్టెక్కి గెలుపుతీరాన్ని చేరాలంటే వారంతా చదువులో రాణించాలన్నారు. తాను చిన్నపుడు ఏ మాత్రం తీరిక దొరికినా ఏదో ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకున్నానని, జీవితంలో విజయం సాధించాలంటే అది మంచి విద్య వల్లే సాధ్యమని తన తల్లిదండ్రులు చెప్పేవారని మిషెల్లీ తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సమస్యలు ఎదురైనపుడు నిరాశతో కుంగిపోరాదని, చదువు ద్వారానే దేన్నయినా సాధించవచ్చని ఆమె లండన్‌లోని ముల్బెర్రీ పాఠశాలలో బాలికలను కలిసినపుడు సూచించారు. మతానికో, పేదరికానికో భయపడి బాలికలు బడికి దూరం కావాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబ నేపథ్యం ఎలాంటిదైనా చదువుకోవడం బాలికల కనీస హక్కు అని ఆమె గుర్తు చేస్తున్నారు. చాలా దేశాల్లో చదువుకోవాలనుకునే బాలికలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్య వివాహాలు, యుక్తవయసు రాకుండానే గర్భధారణలు, లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటివి బాలికల పాలిట శాపంగా మారాయన్నారు. పేదవర్గాల్లో అమ్మాయిల గురించి కుటుంబ పెద్దలు ఆలోచించక పోవడం దారుణమని, ఎలాంటి సమస్యలనైనా బాలికలు భరించాల్సిన పనిలేదన్నారు. బాలికల వి ద్య కోసం ఇతర దేశాల్లో సైతం భారీగా నిధులను ఖర్చు చేస్తున్న బ్రిటన్ పాలకులను మిషెల్లీ అభినందించారు. పేద దేశాల్లో బాలికల విద్యకు అన్ని దేశాలూ బ్రిటన్ మాదిరి స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ, బాలికల ప్రగతి వంటి విషయాల్లో అమెరికా, బ్రిటన్ భాగస్వాములు కావడం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘బాలికల విద్య అన్నది ప్రపంచపు సమస్య.. ప్రపంచం కదిలితేనే ఆ సమస్యకు పరిష్కారం సాధ్యం’ అని ఆమె అన్నారు. బాలికల విద్యపై ప్రచారానికి మిషెల్లీ ఒబామా తన ఇద్దరు కుమార్తెలు, 77 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లితో పాటు పాల్గొనడం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘అమ్మాయిలు అందమైన వారే కాదు, శక్తిమంతులు కూడా’ అని తాను సందర్శించిన పాఠశాలలో బాలికలనుద్దేశించి ఆమె అన్నారు. ‘బాధ పడడం కాదు.. అందులోంచి బయటపడాలి.. ఆలోచించాలి.. కలల్ని నిజం చేసుకోవాలి’ అంటూ ఆమె ఆప్యాయంగా చెప్పిన మాటలు బాలికలను కదిలించాయి.

-కసిరెడ్డి హారిక