సబ్ ఫీచర్

ఆదివాసీల చైతన్యమే రాజ్యాధికారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్తర్ ప్రాంతంలో విమానయానం..! అవును.. జగదల్‌పూర్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు జూన్ 14న విమానం ఎగిరింది. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ విమాన ప్రయాణాలను ప్రారంభించారు. మావోయిస్టుల ప్రాబల్యం లోని బస్తర్ ప్రాంతంలో విమానాశ్రయం రావడం, సర్వీసులు ప్రారంభం కావడంతో కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే బస్తర్ ‘మావోల కంచుకోట’ అని, వారి ఆధీనంలో వేలాది మైళ్ల విస్తీర్ణంలో ‘విముక్త ప్రాంతాలు’ ఉన్నాయని, ఆ ప్రాంతం మొత్తం ఏదో ఒకరోజు మావోల ఆధీనంలోకి వస్తుందని వారి సానుభూతిపరులు, అర్బన్ నక్సల్స్ చాలా కాలంగా చెబుతున్నారు. కాని వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఏ బస్తర్‌లోని అబూజ్‌మాడ్ ప్రాంతం మావోల రాజధానిగా ఉందని భావిస్తున్నారో ఆ ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు తొలిసారి ఈ విమాన ప్రయాణం చేయడం గమనార్హం.
బస్తర్ పేరు చెప్పగానే మావోల ప్రభావం తప్ప మరేదీ లేదన్నట్టుగా జరిగిన ప్రచారం సరైంది కాదని జగదల్‌పూర్ నుంచి ఎగిరిన విమానమే చెబుతోంది. హవాయి చెప్పులు వేసుకునేవారు సైతం ‘హవాయ్ జహాజ్’ (విమానం)లో ప్రయాణించాలన్నదే తమ అభిమతమని ప్రధాని పేర్కొన్నారు. మావోల ఘాతుకాలను మోదీ ప్రస్తావిస్తూ- హింసకు సమాధానం వికాసమని అన్నారు. అదొక నినాదంగా ఆయన భావిస్తూ ఆచరణలో పెడుతున్నారు.
రెండు నెలల వ్యవధిలో రెండవసారి ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన ప్రధాని అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాజా పర్యటనలో రూ.22 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. వికాస యాత్ర పేర జరిగిన సభలో ఉత్తేజపూర్వకంగా ప్రసంగించారు. రూ.18,800 కోట్లతో భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ ఆధునీకరణ, విస్తరణ పనులను జాతికి అంకితం చేశారు. ఈ ఉక్కు కర్మాగారం ఇప్పుడు మరింత మందికి ఆసరాగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడ రైలుమార్గం వేస్తున్నా భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీలో తయారైన పట్టాలను ట్రాక్‌పై పరవాల్సిందే! అంతటి విశిష్టతగల ఫ్యాక్టరీ ఛత్తీస్‌గఢ్ ప్రజలను దశాబ్దాలుగా ఆదుకుంటోంది. ప్రపంచంలో ఇప్పుడు ఉక్కు ఉత్పత్తిలో, సరఫరాలో భారత్ రెండవ స్థానం సంపాదించింది. అందుకు భిలాయ్ ఉక్కు కర్మాగారం కారణమని అక్కడి కార్మికులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంత భారీఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నచోట సహజంగానే ఆధునిక అవసరాలు పెరుగుతాయి. అందుకే ఐఐటీ శాశ్వత క్యాంపస్ భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఐఐటి విద్యాసంస్థ ఏర్పాటుకావడం, దానికి శాశ్వత భవనాలు నిర్మించడానికి నిధులు కేటాయించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ ఛత్తీస్‌గఢ్ ఈ ఘనతను సాధించింది. నయా రాయ్‌పూర్‌కు తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం రావడం, స్మార్ట్‌సిటీ హోదా పొందడం, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పడటం.. ఇవన్నీ అపురూపం గాక ఏమవుతుంది.
గనులు, సహజ వనరుల ద్వారా లభించే ఆదాయంలో కొంత భాగాన్ని స్థానికుల సంక్షేమానికి ఖర్చుచేసేందుకు కేంద్రం చట్టం చేసింది. దాని ప్రకారం ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా రూ.3వేల కోట్లను కేటాయించారు. వీటిని ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని వేల గ్రామాలను ఇప్పటికే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ళతో అనుసంధానం చేశారు. వచ్చే మార్చి నాటికి దాదాపు మరో 6 వేల గ్రామాలకు ఈ సౌకర్యం అందించనున్నారు. ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్ వేయడమంటే మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే. విద్య,వైద్య,కమ్యూనికేషన్ సౌకర్యాలను పెంచే కార్యక్రమాలు బస్తర్‌లో కొనసాగుతున్నాయి. వంటగ్యాస్ కనెక్షన్లను అర్హులైనవారికి ఉచితంగా అందిస్తున్నారు. ‘ముద్ర’ పథకంలో పూచీకత్తు లేకుండా రుణాలను అందిస్తున్నారు. అంత్యోదయ పథకం ద్వారా మారుమూల ప్రాంత ప్రజలకు ఆహార భద్రత, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాఠశాలల సంఖ్యను పెంచారు. పెద్దసంఖ్యలో మహిళలకు సెల్‌ఫోన్లను ఉచితంగా అందించారు. విద్యార్థులకు ప్రధాని ల్యాప్‌టాప్‌లను అందించారు. చాలామంది విద్యార్థులు ఉపకార వేతనాలు అందుకుంటున్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో జరిగే పనులన్నీ బస్తర్ సహా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గత 14 ఏళ్లుగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇదంతా ఇవన్నీ చూస్తే- ఛత్తీస్‌గఢ్ ఏ రకంగా వెనుకబడిందన్న ప్రశ్న ముందుకొస్తుంది.
మావోలు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు పొంతన కుదరడమే లేదు. దండకారణ్యం లోతట్టు ప్రాంతాల పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. భౌగోళిక కారణాల వల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి దూరం కావొచ్చు. అంతమాత్రాన ఆయుధాలు ధరించి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గెరిల్లా దళాలను కదం తొక్కించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సబబు కాదు. అభివృద్ధి అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. భిలాయ్ నగరం ఒక మినీ భారత్‌గా విలసిల్లుతోంది. అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ జీవిస్తున్నారు. ఆయా ప్రాంతాల సంస్కృతి అక్కడ విరాజిల్లుతోంది. ఆ ‘చైతన్యం’ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ప్రతిఫలిస్తోంది. ఈ అభివృద్ధిని అసలు గమనించకుండా- ‘జనతన సర్కార్‌ను బస్తర్‌లో నెలకొల్పుతున్నాం.. మా సర్కార్ ఇప్పటికే పనిచేస్తోంది..’ అంటూ మందుపాతరలు పేల్చి మావోలు రంకెలు వేస్తే దానికి మాన్యత ఏమేరకుంటుంది? ఈ విషయాన్ని ప్రధాని మోదీ చెప్పడం కాదు, కోట్లాది మంది ఛత్తీస్‌గఢ్ ప్రజలే చెబుతున్నారు. రెండు నెలల్లో రెండవసారి ప్రధాని ఛత్తీస్‌గఢ్‌కు వచ్చినప్పుడు ఈ విషయం రూఢీ అయింది. అనేక అభివృద్ధి-సంక్షేమ పథకాలకు ప్రజల స్పందన అనూహ్యంగా కనిపిస్తోంది. అంటే మావోయిస్టుల జనతన సర్కార్ భావన నీరుగారుతుందనేగా అర్థం. అర్బన్ నక్సల్స్, దండకారణ్య నక్సల్స్ ఎంత విషప్రచారం చేసినా, అబూజ్‌మాడ్ విముక్తి ప్రాంతం గూర్చి గొప్పలు పోయినా ఆ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పటంలో కనిపిస్తోందని, అక్కడి పౌరులు అప్పుడే విమాన ప్రయాణం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ ప్రచారంలోని డొల్లదనం బయటపడడం ఖాయం.
బస్తర్‌లో అనేక రాచకుటుంబాలు ఉన్నాయి. దంతేశ్వరి దేవాలయం ఉంది. దసరా ఉత్సవాలను ఏటా 75 రోజులపాటు జరుపుకుంటారు. పర్యాటకుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో మసిబూసి మారేడుకాయ జేసే వైఖరిలో మావోలు మరెంతో కాలం విజయం సాధించలేరని స్పష్టమవుతోంది. సహజ వనరుల ఆదాయం నుంచి కొంత భాగం స్థానిక ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయించి ఖర్చు చేయాలన్న చట్టం రూపొందాక, అది ఆచరణలోకి వచ్చాక మావోలు ఇంత కాలంగా చేస్తున్న వాదన పూర్వాపరమవుతోంది. ప్రకృతి కల్పించిన వనరులను ఉపయోగించుకోవడం దేశ ప్రజల ప్రాథమిక హక్కు. లోకమంతటా ఇదే రీతి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ అదే అమలవుతోంది. దీనికి అనేక రంగులద్ది, తాము లబ్ధిపొందేందుకు విష ప్రచారం చేస్తూ పట్టణ, నగర ప్రాంతాల్లో సానుభూతి పొందేందుకు మావోలు, అర్బన్ నక్సల్స్ అవిశ్రాంతంగా పాటుపడటంలో ‘పస’లేదు. అన్నిరకాల హింసకు అభివృద్ధే తారకమంత్రం, వికాసమే విరుగుడు అని ప్రధాని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించడంతో అందుతున్న ఫలితాలను గరిష్టంగా అందుకోవడంలోనే ఆదివాసుల మేలు దాగుంది. అంతేగాని మావోల మాటలు నమ్మి ఆయుధాలు చేతబట్టి అరణ్యాలలో సంచరిస్తే ప్రపంచంతో కలిసి అడుగేసినట్టు కాదు. ఆర్థిక-సామాజిక అభివృద్ధి సాధించలేరు. ఈ భావన ఇప్పుడు దావానలంలా దండకారణ్యంలో విస్తరిస్తోంది. దాని ప్రతిరూపం ప్రధాని సభలో కనిపించింది. కేంద్రంలో యుపిఏ సర్కారున్నా, ఎన్డీయే సర్కారున్నా బస్తర్ ప్రజలకు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందడమే ముఖ్యం. తమ హక్కులు సాధించే చైతన్యం పొందడమే కీలకం, అదే వారికి రాజ్యాధికారంతో సమానం!

చిత్రం..ఛత్తీస్‌గఢ్ పర్యటనలో పిల్లలకు ప్రధాని నరేంద్ర మోదీ పలకరింపు

-వుప్పల నరసింహం 99857 81799