సబ్ ఫీచర్

రహదారి భద్రతపై అవగాహన ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డుమీదకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడన్న నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పటివరకూ అందరితో సరదాగా గడిపిన ఓ ఉద్యోగి రోడ్డు మీదకి వెళ్లిన కొద్దిసేపటికే కానరాని లోకాలకు తరలిపోతే- మృతుని కుటుంబ సభ్యులకు దిక్కెవరు? వారి శోకాన్ని తీర్చేవారెవరు? కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు జరుగుతూ నిత్యం ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు కొన్ని వేల కుటుంబాలు అన్యాయమైపోతున్నాయి. పచ్చని కుటుంబాల్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి. క్రమశిక్షణ లేమి, యాంత్రిక జీవనం వంటి అంశాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కాలం కంటే వేగంగా పరుగులు తీస్తున్న వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు.
ఎవ్వరూ కూడా రోడ్డుప్రమాదాలు జరుగుతాయని ముందుగా ఊహించరు. కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మద్యపానం, చట్టాల పట్ల భయం లేకపోవడం, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సహాయక చర్యలు చేపట్టేందుకు చాలామంది వెనుకంజ వేస్తారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భావంతో చాలామంది వ్యక్తులు తమ కళ్లెదుటే రోడ్డు ప్రమాదాలు జరిగినా పట్టించుకోరు. సాటి మనిషిగా మానవత్వంతో క్షతగాత్రులకు సాయం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. వాహనాలు నడిపేవారు, రోడ్డుపైకి వెళ్లేవారు కూడా తమ ఫోన్‌లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లను ఫీడ్ చేసుకోవాలి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతాయి.
అనునిత్యం ఎంతోమందిని బలిగొంటున్న రోడ్డుప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. జాగ్రత్తగా వాహనాలను నడపడం వల్ల ఎదురుగా వచ్చేవారికి సైతం భద్రత ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపి ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వరాదు. మానసిక ఒత్తిడితో వాహనాలను నడపడం, వేగంగా గమ్యాన్ని చేరాలన్న ఆరాటం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నోరకాల భద్రతా చర్యలను చేపడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వం క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినా- జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువగా 18 నుండి 35 ఏళ్ల వయస్సులోపు వారే ఉంటున్నారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీచేసినా, పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చినా, పోలీసులు ఎన్నిసార్లు కౌనె్సలింగ్ చేసినా, జరిమానాలు-జైలుశిక్షలు విధించినా యువకుల వేడి రక్తం ముందు అవేవీ పనిచేయడం లేదు. అతివేగం అనర్థదాయకం అన్న నిజాన్ని టీనేజీ యువత తెలుసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పూర్తిస్థాయిలో పాటించాలి. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అని గుర్తించాలి.
కొడుకు కోరిందే తడవుగా అప్పు చేసైనా సరే డబ్బు ఖర్చుపెట్టి మరీ తల్లిదండ్రులు బైకులను కొని ఇస్తున్నారు. వాహనం ఎలా నడపాలన్న విషయాలను చెప్పే తీరిక నేటి తల్లిదండ్రులకు లేదు. ఒకవేళ వారు ఏదో చెప్పాలని ప్రయత్నించినా- ‘కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్ గురించి మీకేమీ తెలియదు..’ అని పుత్రరత్నాలు అసహనం ప్రదర్శిస్తుంటారు. పిల్లలు అడిగింది తెచ్చి ఇచ్చేస్తే తమ పని అయిపోయిందనే భావించే తల్లిదండ్రులు ఇంకొందరు. గారాబంగా పెంచుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో చేతికందిన పిల్లలు మరణించడం తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్‌కు గురిచేస్తున్నాయి. ఎంత సంపాదించి ఏం లాభం? వృద్ధాప్యంలో తమను చూడాల్సిన వారు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ఇక బతుకంతా విషాదమే. కొందరు యువకులు మద్యం తాగి డ్రైవ్ చేస్తూ మరణిస్తే.. మరికొందరు మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడుతూ మరణిస్తున్నవారు ఇంకొందరు. తల్లిదండ్రులకు, సన్నిహితులకు, బంధువులకు శోకాన్ని మిగిల్చి వెళుతున్నారు.
రోడ్లపై వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా అదే రీతిలో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. వాహన చోదకుల నిర్లక్ష్యం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు సర్వే నివేదికలు ఘోషిస్తున్నాయి. ప్రమాదంలో ఎవరైనా గాయపడి రోడ్డుపై పడి రక్తం మడుగులో కొట్టుకుంటే, వారిని తక్షణమే సమీపం ఆస్పత్రిలో చేర్పించాలని గాని, వారికి తక్షణ సాయం చేయడానికి గాని మిగతా ప్రయాణీకులు స్పందించడం లేదు. మనకెందుకులే అన్న నిర్లక్ష్యం వలన మరణాల సంఖ్య అధికమవుతోంది. ఎవరైనా ప్రమాదానికి గురైతే కాస్తంతైనా మానవత్వం చూపకుండా తమదారిన తాము వెళ్లిపోయేవారు కొందరైతే, ప్రమాదం జరిగిన వాహనం చుట్టూచేరి ఏదో వింతగా చూసినట్లు చూడటం, సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, సాయం చేయండని వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపించేవారు మరికొందరు. ‘అయ్యో పాపం’ అనేవారే తప్ప వారికి సాయం చేద్దామనుకునేవాళ్లు తక్కువైపోతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలైనవారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
రోడ్లపై వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గించడానికి ప్రధానంగా ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయాలి. నిర్దిష్ట సమయాలలో మాత్రమే భారీ వాహనాలను అనుమతించాలి. రోడ్ల సామర్థ్యానికి తగ్గట్టుగానే వాహనాలను నడిపేలా చూడాలి. హైవేలపై వేగ నియంత్రణకు గన్‌షూటర్స్‌ని విరివిగా ఏర్పాటు చేయాలి. యూ టర్న్‌లు, లింక్ రోడ్ల వద్ద సిగ్నల్ బోర్డులు, ఇండికేటర్లు ఏర్పాటు చేయాలి. డ్రైవర్లపై ఒత్తిడి తగ్గించడానికి నిర్ణీత పనిగంటలు మాత్రమే వుండాలి. రోజుల తరబడి ప్రయాణం చేసే లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనే విధంగా అదనపుడ్రైవర్లు విధిగా ఉండేలా చర్యలు ఉండాలి.
పాదచారులకు నియమాలు...
రోడ్డు దాటేటప్పుడు ముందు కుడివైపు, తర్వాత ఎడమవైపు మళ్లీ కుడివైపు చూసి దాటాలి. జీబ్రా గుర్తు వున్నచోట మాత్రమే రోడ్డు దాటాలి. ఎప్పుడూ ఫుట్‌పాత్ మీదనే నడవాలి. పార్క్‌చేసి వున్న వాహనాల వెనక వైపు నుండి ఎప్పుడూ పరిగెత్తి వెళ్ళవద్దు. కనపడని రోడ్డు మలుపులు దగ్గర ఎక్కువ జాగ్రత్తగా వుండాలి.
ఒత్తిడితో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయరాదు. మానసిక ప్రశాంతతతో వాహనాలను నడపాలి. డ్రైవిగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపరాదు. టూ వీలర్లను నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలను నడపడమంటే మృత్యువుకు ఆహ్వానం పలికినట్టే. నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేయరాదు. ఎక్కువ శబ్దంతో పాటలు వింటూ డ్రైవింగ్ చేయకూడదు. టూ వీలర్స్‌పై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు.
ఆటోరిక్షాలలో ఎక్కువమంది పిల్లలను ఎక్కించి స్కూలుకు పంపకూడదు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదు. వాహనం మలుపు తిరిగేటప్పుడు తప్పనిసరిగా సిగ్నల్ ఇవ్వాలి. కార్లు, జీపులు నడిపేవారు సీటు బెల్టు విధిగా ధరించాలి. రాత్రి సమయాల్లో అత్యవసరంగా రోడ్డుపై వాహనం ఆపాల్సివస్తే పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వాడాలి. రోడ్డు భద్రతా నియమాల పట్ల పోలీసులు, రవాణాశాఖ అధికారులు కూడ కఠినంగా ఉండాల్సిందే. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఆ మార్గంలో వెళుతున్న వారు ప్రయత్నించాలి. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. అంబులెన్స్ రావటం ఆలస్యమైతే అందుబాటులో ఉన్న వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. రోడ్డుప్రమాదాలలో గాయపడిన వారిని ఎలాంటి ఎఫ్‌ఐఆర్, పోలీసుల ప్రమేయం లేకుండానే ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఉన్నత న్యాయస్థానాలు గతంలోనే ఆదేశాలు జారీచేశాయి. రోడ్డు ప్రమాదాలను మనం ఊహించలేకపోయినా, అవి జరిగినపుడు మానవత్వంతో స్పందించడం అవసరం.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321