సబ్ ఫీచర్

అవిశ్రాంత సాహితీ సృజనశీలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

15న డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుకు
జీవన సాఫల్య పురస్కార ప్రదానం సందర్భంగా...
*
లుగు సాహిత్య రంగంలో నవల, కథ, సృజనాత్మక రచనా వ్యాసంగానికి 1953లో శ్రీకారం చుట్టి 65 సంవత్సరాలుగా అవిశ్రాంత సాహితీ పథికునిగా డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు పురోగమిస్తున్నారు. ‘మంజుశ్రీ’ కలం పేరుతో తెలుగు సాహిత్యాన్ని కథ, నవలలతో సుసంపన్నం చేసిన ఆయన క్రమేపీ సాహిత్యమే జీవన సర్వస్వంగా వివిధ ప్రక్రియలతో ముందుకు సాగుతున్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఈ నెల 15న ఆయనను సాహితీ జీవన సాఫల్య పురస్కారంతో అభినందిస్తోంది.
జారుడుమెట్లు, నూరుశరత్తులు, దూరతీరాలు వంటి పది నవలలు, మైథిలి, జీవిత దృశ్యాలు, మంజుశ్రీ కథలు, పంచాక్షరి వంటి కథల సంపుటాలు సుమారుగా రెండు దశాబ్దాల కథ, నవలా రచయితగా చదువరులను అలరించిన అక్కిరాజు సాహితీ ప్రస్థానం 1972 కందుకూరి వీరేశలింగం సమగ్ర అధ్యయన పరిశోధనలతో మలుపు తిరిగింది. తెలుగు భాష, సాహిత్యాన్ని ఒక ప్రయోజన లక్ష్య నిర్దేశనంతో ప్రభావితం చేయగల ప్రతిభావంతులైన రచయితలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆరు దశాబ్దాలకు పైగా డాక్టర్ రమాపతిరావు వివిధ దిన, వార, పక్ష, మాస ప్రత్యేక పత్రికలలో నాలుగు వేలకు పైగా ప్రచురణలు వెలువరించారు. ఇంతవరకు ప్రాచీన, ఆధునిక కాలానికి సంబంధించిన సాహితీరంగ ఔన్నత్యపు లోతులను అపురూపంగా దర్శించి, అవలోకించి, పరిశీలించి, పరిశోధించి మొత్తం నూటనలభై గ్రంథాలు ప్రచురించారు. వెయ్యేళ్లకు పైగా తెలుగు సాహిత్య చరిత్రలో నిక్షిప్తమై, కనుమరుగైన ఎంతో స్తబ్దత కదిలి కరిగి, వివిధ ప్రక్రియలలో రచనలుగా వెలుగు చూసింది. 1969 నుంచి సాహిత్య చరిత్ర, జీవిత చరిత్ర, పరిశోధన ప్రధాన ఇతివృత్తాలుగా వీరేశలంగం, గిడుగు, కొమర్రాజు, వెనె్నలకంటి, కోలవెన్ను, తిరుమల రామచంద్ర, నాయని, వావిలాల, ఎందరో లబ్దప్రతిష్ఠులైన ప్రతిభామూర్తులు, సాంఘికమాన్యులు, కవిపండిత సమాజ సంస్కర్తలు, ఆధ్యాత్మిక, జ్ఞానవిజ్ఞానవేత్తల జీవితాశయాల వెనె్నల వెలుగులను, జీవనయాత్రా ఔన్నత్య విలువలను విశిష్ట రచనలుగా దర్శింపచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, యువభారతి, కేంద్ర సాహిత్య అకాడమీ, సమాచార పౌరసంబంధ శాఖ, తెలుగు మహాసభలు, విద్యాశాఖ, సుపథ, విశాలాంధ్ర వంటి ఎన్నో ప్రచురణ సంస్థలు, నేషనల్ బుక్ ట్రస్ట్, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వంటి సంస్థలు, ట్రస్టులకు, సాహితీ, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాతః స్మరణీయుల జీవిత విశేష శతజయంతి, సంస్కృతి సందర్భాలను ప్రచురణలుగా వెలుగులోకి తెచ్చారు.
అవిశ్రాంత సాహితీ పథికునిగా తెలుగు నాట, ఇతర రాష్ట్రాలలోను మారుమూల మరుగున పడిన గ్రంథాలయాలను, మహాత్ముల స్మృతి మందిరాలను, సమాధి స్థలాలను భక్తిశ్రద్ధలతో సందర్శించి వారి దివ్యానుభవాలను గ్రంథస్థం చేశారు. ఇక గ్రంథ పీఠికలు, సంకలనాలు, సంపాదకత్వాలు, ఇంతవరకు వెలుగుచూడని అముద్రిత, ముద్రిత గ్రంథ పునర్ముద్రణలు అసంఖ్యాకంగా ఉన్నాయి. తంజావూరు మహారాజు శరభోజి సరస్వతి మహల్‌లో మహాభారతం పర్వాలు తొమ్మిది తాళపత్ర సంపుటాల నుంచి పాఠాంతర పరిశోధనా అంశాల సేకరణ నిర్వర్తించారు. పాల్కురికి సోమనాథుని మహాకావ్యం పండితారాధ్య చరిత్ర, బసవపురాణం వచనీకరించి, 800 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి ఎవరూ సాధించని మహోన్నతత ప్రసాదించారు. నవలలు, కథా సంపుటాలు, సాహిత్య, జీవిత చరిత్ర పరిశోధనలు, అనువాదాలు, కూర్పు - వ్యాఖ్య - వివృతి - నియత శీర్షికా రచనలు, విశిష్ట సంచికల సంపాదకత్వం, వచనీకరణలు, పీఠికలు, స్వీయచరిత్రలు, పరిచయ రచనలు, త్రిపిటకాలు తెలుగు సాహితీ సర్వస్వం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు నేటికీ జీవితాశయంగా సుసంపన్నం చేస్తున్నారు.
80 సంవత్సరాలు పైబడి పరిణతి సాధించిన ప్రతిభావంతుడైన మేధావిగా అంతర్లీన ఆత్మీయ వ్యక్తిత్వం, మహోన్నత సామాజిక జీవన విలువలను అనే్వషిస్తూ సాహితీ సృజనను నిత్యం ఆరాధిస్తున్న తపస్వి డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు, మరెన్నో వసంతాలు అవిశ్రాంత సాహితీ పథికునిగా నిండునూరేళ్లకు పైగా తెలుగు సాహిత్యాన్ని ఆరాధ్యనీయంగా ప్రకాశవంతం చేస్తుండాలని, ఈ సాహితీ సుసంపన్నునికి మరెన్నో జీవన సాఫల్య అభినందనలు వరించాలని ఆశిద్దాం.

- జయసూర్య, 9440664610