సబ్ ఫీచర్

‘నల్లారి’ వారి మరో ప్రస్థానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం వింతేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ నేతృత్వంలో రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ ‘స్వగృహప్రవేశం’ లాంఛనంగా పూర్తయ్యింది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తిరిగి జవసత్వాలను కూడగట్టుకునేందుకు ప్రయత్నించడం సర్వసాధారణమే. బలమైన నాయకులకు, అనుభవజ్ఞులైన నేతలకు, అంగబలం, అర్థబలం ఉన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పలకటం, పార్టీలోకి తీసుకోవటం షరామామూలే. పాత మిత్రులను, శత్రువులను సైతం మచ్చిక చేసుకోవటమూ సహజం. ఊమెన్ చాందీ కూడా అలాంటి ‘వ్యవహారాలను’ చక్కబెట్టే పనిని చేపట్టారు. ఐతే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో ఆ పార్టీకి ఎంత లాభం చేకూరుతుందో ఇప్పుడే చెప్పలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఘట్టంలో ధీరోదాత్తంగా పోరాడి ఓడిన నల్లారికి మాత్రం ఎటువంటి లబ్ధి చేకూరుతుందో అనుమానమే. ‘నల్లారి’ నడక గతంలో కాంగ్రెస్ పార్టీలో మాదిరి నల్లేరుపై కొనసాగుతుందో లేదో ఇప్పటికిప్పుడు వెల్లడించలేం.
కిరణ్‌కుమార్ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ జీవితం. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా ఆయన ‘కాంగ్రెస్ కుటుంబం’తో కలిసి పనిచేశారు. ఆయన కుటుంబమే కాంగ్రెస్ విధేయత కల్గిన కుటుంబం. ఆయన తండ్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకుడు. 1972లో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. 1987లో అమర్‌నాథ్‌రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా 1988లో జరిగిన వాయల్పాడు ఉపఎన్నికలో ఆయన భార్య నల్లారి సరోజిని పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా వాయల్పాడు నుంచి కిరణ్ ఎమ్మెల్యే అయ్యారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చీఫ్ విప్‌గా, 2009లో స్పీకర్‌గా పనిచేశారు. 2009 సెప్టెంబరు 2వ తేదీన వై.ఎస్ మరణానంతరం రాష్ట్రంలో సమర్థంగా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పగ్గాలు చేపట్టే నాయకులు కరవయ్యారు. అప్పటి ఆర్థికమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమ నేపథ్యంలో శాంతిభద్రతలను, పార్టీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం నల్లారిని 2010 నవంబర్ 25వ తేదీన ముఖ్యమంత్రిగా నియమించింది. ఏనాడూ మంత్రి పదవిని నిర్వహించిన అనుభవం లేకపోయినా, ఏకంగా ముఖ్యమంత్రి అయిన అదృష్టం నల్లారిది. ఈ బాధ్యతలను ఆయన చాలా గడ్డు పరిస్థితులలోనే చేపట్టారు. దాదాపు మూడున్నరేళ్ళు ఆయన ఏపీ సీఎంగా కొనసాగారు. శాంతిభద్రతలను ఒక కొలిక్కి తేగలిగారు. ప్రభుత్వ పాలనను, సంక్షేమ పథకాలను గాడిలో పెట్టగలిగారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఒక రూపాయికే అందించిన ఘనత కిరణ్‌దే. ఇప్పటికీ ఆయన చేపట్టిన ‘కిలోబియ్యం రూపాయికే’ పథకం అమలు జరుగుతోంది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లబడిందని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం, వార్‌రూం చర్చలు, పార్లమెంట్‌లో టేబుల్ ఐటెమ్‌గా తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్రం నుంచి తీర్మానం చేయడం వంటివి జరిగాయి. మరోప్రక్క సీమాంధ్రలో సమైక్యాంధ్ర గర్జనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకటికి రెండుసార్లు కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట- రాష్ట్ర విభజన యోచన సరికాదని ముఖ్యమంత్రి హోదాలో నల్లారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే కొన్ని అనర్థాలు జరుగుతాయని ఆయన తన గళం వినిపించారు. విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి కలిగే మేలుకూడా ఏమీ వుండదని తెగేసి చెప్పారు. ఐనాకూడా కాంగ్రెస్ ఏపీ విభజన వైపే మొగ్గు చూపటంతో చేసేది లేక రాజ్యాంగపరమైన పోరాటాన్ని కిరణ్ చేపట్టారు. అసెంబ్లీ తీర్మానాలు లేకుండా ఏ రాష్ట్ర విభజనా చెల్లదని, అందుకు రాష్టప్రతి అంగీకరించరనే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రంతో అసెంబ్లీలోనే విభజన వ్యతిరేక బిల్లును ఆమోదింపచేశారు. కేంద్రానికి దూతగా ఉండి కూడా అధిష్ఠానాన్ని ధిక్కరించారు. విభజన నేపథ్యంలో రాజ్యాంగ ఉల్లంఘనలను, సాంప్రదాయ ఉల్లంఘనలను బలంగా ఎత్తిచూపారు. నల్లారి చేసిన ఈ పనిని ఇప్పటికీ సీమాంధ్రులు మరువలేరు. ఒక దశలో అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబు, మరో విపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కంటే ఎక్కువగా సమైక్యాంధ్ర ప్రజల మన్ననలను నల్లారి పొందగలిగారంటే అతిశయోక్తి కాదు.
లోక్‌సభలో విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయగానే కిరణ్ ణ్‌కుమార్ రెడ్డి తనకుతానుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు. ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కిరణ్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో రాజకీయంగా వౌనవ్రతం పట్టారు. ఈ నాలుగేళ్ళలో ఆయన ప్రజల ముందుకు రాలేదు, ఎలాంటి రాజకీయ ప్రకటనా చేయలేదు. ఇంతటి రాజకీయ ప్రస్థానం కలిగిన నల్లారిని మళ్లీ అక్కున చేర్చుకోవడం ద్వారా ఏపీలో తమ పార్టీకి నూతన జవసత్వాలు కలగవచ్చని కాంగ్రెస్ ఆశపడటంలో తప్పు లేకపోవచ్చు.
ఏపీ రాజకీయాలలో మూడు బలమైన సామాజికవర్గాలు చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అధికార తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి, ప్రతిపక్ష వైసిపి రెడ్డి సామాజిక వర్గానికి, కొత్తగా తెరపైకి వచ్చిన జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దృశ్యాన్ని కాదనలేం. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభంగా నిలచిన రెడ్డి సామాజిక వర్గం దాదాపు జగన్‌కు మద్దతుగా నిలిచింది. దీంతో కాంగ్రెస్‌లో రెడ్డి సామాజిక వర్గం ఛాయలు మసకబారాయి. వైకాపా అధినేత జగన్ కాంగ్రెస్ శ్రేణులను, ఆ పార్టీ వోటుబ్యాంకును ప్రభావితం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైకాపాను ఢీకొట్టగలిగే నాయకుడు కూడా కాంగ్రెస్‌లో కానరావడం లేదు. జగన్ కొల్లగొట్టిన నాయకత్వాన్నీ, ఓటు బ్యాంక్‌ను తిరిగి రాబట్టకుండా తమకు పూర్వవైభవం రాదనే నిర్ధారణకు కాంగ్రెస్ వచ్చింది.
తెదేపా, వైకాపాలను ఎదుర్కొనగలిగే నేత కోసం కాంగ్రెస్ అనే్వషిస్తోంది. ఈ ఆలోచనతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి సమర్థ నాయకుని వైపు ఆ పార్టీ దృష్టిసారించి వుండవచ్చు. నల్లారికి ప్రజాకర్షణ బలం తక్కువగా ఉండొచ్చునేమో కానీ, నాయకత్వ బలం బలంగానే ఉందనే చెప్పాలి. ఆయనపై అవినీతి మరకలు కూడా లేవు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే, ప్రస్తుతానికి అధికార తెదేపాకు అంతగా నష్టం కలిగించకున్నా, విపక్ష వైకాపాకు కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పక తప్పదు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరు అనే లోకోక్తిని మరోమారు నిజం చేస్తూ సొంత గూటికి కిరణ్ చేరటంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కిరణ్ మాటకు విలువ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా- ‘పూలమ్మినచోట కట్టెలమ్మాల్సి వచ్చినట్టు’ కిరణ్‌కు రాబోయే ఎన్నికలు సవాల్‌గానే పరిణమించవచ్చు.

--పోతుల బాలకోటయ్య 98497 92124