సబ్ ఫీచర్

రక్తపాతం.. జ్ఞానం.. ఏ విప్లవం విలువైనది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తపాత విప్లవాలకు కాలం చెల్లింది. జ్ఞాన విప్లవాలకు ఆదరణ కనిపిస్తోంది. ప్రజలు పెద్దఎత్తున అందులో భాగస్వాములవుతున్నారు. ఇది ఈ కాలపు విశిష్టత. తాజాగా ఐటి, టెలికమ్యూనికేషన్ రంగాల్లో, విద్య-వైద్యంలో ఈ విప్లవాల ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగాలన్నీ పరస్పర పూరకాలుగా, ఒకదానిపై ఒకటి ఆధారపడి ముందుకు వెళుతున్నాయి. ఈ విషయమై, ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీపడుతున్నాయి. ఈ స్పర్థ ఆరోగ్యకరమైన పోటీగా పరిణమించి ఫలితాలనిస్తోంది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి అగ్రశ్రేణి సంస్థల ఉత్పత్తులు ప్రపంచాన్ని ముంచెత్తాక ఇది మునుపటి ప్రపంచం కాదన్న సంగతి గుర్తించడంలోనే విజ్ఞత దాగుంది.
అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) ప్రారంభమైన సమయంలోనే వెలుగుచూసిన కంప్యూటర్ సాంకేతిక రంగం అత్యంత వేగంగా మానవాళి మనుగడనే మార్చేసింది. నవ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ప్రజాపరం చేసింది. దాంతో మొత్తం సమీకరణలు మారాయి, మానవ చైతన్యంలో సరికొత్త కెరటం ఎగిసింది.
వామపక్ష తీవ్రవాదులు ఏ రక్తపాత విప్లవంతో సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని ఆశించారో మరో రూపంలో సాంకేతిక విప్లవం ఆ ‘‘మార్పు’’ను తీసుకొచ్చింది. దీన్ని దర్శించే ‘చూపు’ ఉండాలి. అంతర్నేత్రంతో అవగాహన చేసుకునే వివేకం ఉండాలి. వాటన్నింటికి తలుపులు మూసి రక్తపాత విప్లవాలకు సమాయత్తమవుతామంటే అది పూర్తిగా అనాగరికం, సమకాలీన సమాజాన్ని ఎగతాళి చేయడమే అవుతుంది. తాజాగా కృత్రిమ మేధ ఆధారంగా ఎగిసి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త దారులను తెరుస్తోంది. మానవాళికి నవ్యమార్గం చూపుతోంది. జీవన విధానం సరళతరమవుతోంది.. జీవనం సజావుగా సాగేందుకు తోడ్పడుతోంది. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్, బ్లాక్‌చెయిన్ ఇలా అనేక సాంకేతిక పరిజ్ఞానమార్గాలు పరస్పర పూరకాలుగా మానవ జీవితాన్ని ఓ కొత్త లెవల్‌కు తీసుకెళుతున్నాయి.
టెక్నాలజీకి వర్గం లేదు
ఇది సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల కొమ్ముకాసేదని ఒక్క మాటలో కొట్టిపారేసి నత్తగుల్లల్లోకి, రక్తపాత విప్లవాల బాటలోకి నడిస్తే మిగిలేది బూడిద, శవాల దిబ్బలు, కష్టాల కడలి, శతాబ్దాల వెనుకబాటుదనం. ఈ దశలో కోరికోరి ఆ పరిస్థితులను ఆహ్వానించేవారి మస్తిష్కాలపై అనుమానాలు తలెత్తక తప్పదు!
తాజాగా రిలయన్స్ సంస్థవారి ‘జియో’ సేవలు దేశంలోని ప్రతి పల్లెకు, మారుమూల ప్రాంతాలకు అందుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అనేక సేవలు అందించేందుకు సిద్ధంకావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
అందులో వ్యాపార దృక్పథంతోపాటు దేశ ప్రజలకు ప్రపంచస్థాయి టెక్నాలజీని పరిచయం చేయాలన్న తపన కూడా కనిపిస్తోంది. ప్రభుత్వరంగంలోని సంస్థలు సైతం చేయలేని పనిని ఈ సంస్థ చేస్తోంది. చౌకగా సేవలు అందిస్తోంది. కొత్త తరాలకు అనేక అవకాశాలను, సౌకర్యాలను అందిస్తోంది. ఓ రకంగా గొప్ప విప్లవాన్ని ‘జియో’ తీసుకొచ్చింది. ప్రజలకు సాధికార ఆయుధాన్ని అందిస్తోంది. ప్రపంచంతో కలిసి నడిచేందుకు అవకాశం కల్పిస్తోంది. ధనిక-పేద అన్న తేడాలేకుండా అందరూ ప్రజలే.. అందరూ సమానమే! అన్న కీలక విధానం వారి సేవల్లో కనిపిస్తోంది. ఇదే ఈనాటి తారకమంత్రం.. టెక్నాలజీ గొప్పదనం. అందుకే మహానగరాల్లోని సౌకర్యం మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. కోట్లాది పేద ప్రజలు కలలు కనేందుకు ఊతం ఇస్తోంది. విద్య - వైద్యం - ఆరోగ్యం రంగాల్లో మార్గదర్శకంగా నిలిచేందుకు సమాచారాన్ని బట్వాడా చేస్తోంది. వ్యవసాయం, ఈ మార్కెట్ రంగంలోకి సైతం ప్రవేశించబోతోంది. ఆ విధంగా సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజలకు ఓ కొత్త దివిటీని అందిస్తోంది. ఈ విస్తృతిని, విప్లవాన్ని, వెలుగును, జ్ఞానదారిని విస్మరించి రక్తపాత విప్లవాల కలలుకనడం ఏ మాత్రం సమంజసంకాదు. అటువైపుగా యువతను, అమాయక ఆదివాసీలను నడిపించడం దారుణం. ఎవరి హక్కులకు భంగం కలుగుతోందని భూనభోనాంతరాలు దద్దరిల్లేలా నినదించే వారికిప్పుడు సాంకేతికత గొప్ప కానుకగా లభిస్తోంది. దాని ద్వారా సాధికారికంగా శ్వాసించే అవకాశం వందశాతం కనిపిస్తోంది. ఈ వెలుగుల ప్రవాహం వైపుగాకుండా శ్మశాన దిబ్బలవైపు వారిని తరలించే కార్యక్రమం నిందనీయం..
జియో గిగా ఫైబర్
తాజాగా ‘జియోగిగా ఫైబర్’ పేర మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఫైబర్ టుది హోమ్ (ఎఫ్.టి.టి.హెచ్) సాంకేతికతతో భారత ప్రజల జీవితాలను విప్లవీకరించనున్నది. అత్యధిక వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతోపాటు ఇంటిని ‘స్మార్ట్‌హోం’గా మార్చుకునే సౌలభ్యం-సౌకర్యం కల్పించడానికి సిద్ధమైంది. ఇంట్లోని టీవి బహుళ ప్రయోజనాల సాధనంగా మారబోతోంది. వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్/ రియాల్టీ గేమింగ్‌తోపాటు మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్స్‌కు ఉపకరించబోతోంది.
మన దేశం తృతీయ ప్రపంచ దేశాల్లో ఒకటిగా చెప్పుకుంటున్నప్పటికీ అభివృద్ధిచెందిన ప్రథమశ్రేణి దేశాల్లోని సాంకేతిక పరిజ్ఞానం ప్రజల చెంతకు వస్తోంది. శరవేగంగా విస్తరిస్తోంది. ఈ టెక్నాలజీనే ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ ఆయుధం ఇప్పుడు భారత ప్రజల చేతికందుతోంది. దేశంలోని 1100 నగరాల్లో ఫిక్స్‌డ్ లైన్‌లో ‘ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్’ సౌకర్యం అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. దీంతో ‘ఇంటింటికి ఇంటర్నెట్’ అన్న నినాదం నిజం కానున్నది. ఇది అంతర్జాతీయస్థాయి నాణ్యతతో ఉండటం విశేషం. ప్రస్తుతం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా జియో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చింది. రెండున్నర కోట్లమందికి చౌకగా ఫీచర్ ఫోన్‌ను అందించింది. త్వరలో జియోఫోన్ 2ను 10కోట్ల మందికి అందించి అందులో యూ-ట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సౌకర్యం కల్పించనున్నది. ప్రస్తుతం ప్రపంచం ఈ మూడు సౌకర్యాలపై ఎక్కువ ఆధారపడి కదులుతోంది. దాన్ని దేశంలోని పది కోట్ల మందికి చౌకగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది.
ఇక ఇంట్లో టీవీకి సెట్‌టాప్ బాక్స్‌ను నూతన సాంకేతికతతో అందించనున్నది. దీనితో వందలాది ఛానళ్ళను వీక్షించడమేగాక, వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవడం ఓ అద్భుతం. స్మార్ట్‌హోంలో భాగంగా చిన్నచిన్న కెమెరాలు, భద్రత కోసం మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందించనున్నది. డోర్ సెన్సర్లద్వారా సరికొత్త జీవన విధానం అందుబాటులోకి రాబోతుంది. ఒకప్పుడు సైన్స్‌ఫిక్షన్‌లో చదివినవన్నీ సాధారణ వ్యక్తుల ముంగిళ్ళలో దర్శనమివ్వనున్నాయి. గోడగోడకు (వాల్ టు వాల్) వైఫై సదుపాయం సైతం రానున్నది. ఇది పూర్తిగా డిజిటల్ విప్లవంలో అంతర్భాగం.
డిజిటల్ విప్లవం
అపురూపమైన ఈ డిజిటల్ విప్లవాన్ని తిలకించేందుకు నిరాకరిస్తూ రక్తపాత విప్లవాల కోసం ఉవ్విళ్ళూరే వారి మానసిక స్థితిపై అనుమానాలు కలుగక మానవు. అభివృద్ధిచెందిన దేశాల ప్రజల సరసన భారతదేశ ప్రజలను నిలపడం వారికిష్టమున్నట్టు అనిపించడంలేదు. కాని అలాంటివారి ఆకాంక్షలను ప్రజలే తిప్పికొడుతున్నారు. కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు ఇంటర్నెట్‌తో తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తూ, వంటింటి సరుకులు సైతం ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేస్తూఉండగా... ఇది సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల సాంకేతిక పరిజ్ఞానం దీనివలలో పడొద్దని తిరస్కార భావంతో మాట్లాడటంలో ఏ మాత్రం విజ్ఞత కనిపించదు.
రక్తపాత విప్లవాలను కాంక్షించేవారు మార్కెట్ ఎకానమీని నమ్మరు, మార్కెట్ రహిత ఎకానమీ కోసం పనిచేస్తారు. ఈ-కామర్స్, ఇంటర్నెట్, టీవీ, స్మార్ట్‌హోం, స్మార్ట్ఫోన్, స్మార్ట్ గాడ్జెట్స్ అన్నీ మార్కెట్ ఎకానమీకి ప్రతిరూపాలు. వీటినెలా తుంగలోతొక్కి మార్కెట్ రహిత ఎకానమీని పాదుకొల్పుతారో వారికే స్పష్టతలేదు. అయినా గుడ్డిగా ఆ దారిలో పయనించడానికి, ఇతరులను ఆ దారిలోకి బలవంతంగా లాక్కెళ్ళడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వారి ‘కల’నెరవేరేనా?...
చైనా నుంచి ఏం నేర్చుకున్నాం?
చైనా కమ్యూనిస్టుపార్టీ ముప్ఫై ఏళ్ళక్రితమే ఈ తత్వాన్ని జీర్ణించుకుని మార్కెట్ ఎకానమీని ఆలింగనం చేసుకుని, గాఢంగా ఆ విధానాన్ని అక్కున చేర్చుకుని అద్భుతాలు సృష్టిస్తూ తమ ప్రజలను ప్రపంచంతో కలిసి నడిచేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యాలలో ఒకటిగా నిలిచింది. ఈ ‘సోయి’ భారతదేశంలోని రక్తపాత విప్లవకారులకు ఉండాలి కదా?... ఉత్తపుణ్యానికే వేలాది మంది ప్రజలను, జవాన్లను కడతేరిస్తే, ఆస్తులను బుగ్గిపాలుచేస్తే, మానవ వనరులను అరణ్యాల పాల్జేస్తే ఒరిగింది ఏమిటి?.. హళ్ళికిహళ్ళి- సున్నకు సున్నానే కదా?.. మరింత వెనుకబాటుతనమే కదా?.. ప్రజల్ని ముందుకు నడపాల్సిన వారు తమ సిద్ధాంతాలపై మూఢ విశ్వాసంతో వెనక్కి నడిపే అధికారం వారికెవరిచ్చారు? ఇది ఓ రకంగా ప్రజాద్రోహమే కదా?
ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం సిద్ధాంతం ఉండాలి తప్ప సిద్ధాంతం కోసం ప్రజల్ని బలిఇవ్వడం రాక్షసత్వం అరాచకం అవుతుంది. 21వ శతాబ్దంలో నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలు ప్రతి పల్లెకు చేర్చాల్సిన సందర్భంలో ఏవైనా అవరోధాలుంటే వాటిని తొలగించి ప్రజలు సాధికారితతో జీవించేందుకు పనిచేయాల్సినవారు, ఉపకరణంగా నిలవాల్సిన వారు ఇలా కాలం చెల్లిన మార్కెట్ రహిత ఎకానమీని స్థాపించే నెపంతో ప్రజల్ని తప్పుతోవ పట్టించడం ఏ రకంగా క్షమార్హమవుతుంది?..
ప్రజలు సుప్రీం
అన్ని పార్టీలకు, సిద్ధాంతాలకు ప్రజలు సుప్రీం. వారి సంక్షేమం- అభివృద్ధి అత్యంత కీలకం. సమకాలీన సాంకేతికతో వారి జీవన విధానం సరళతరం చేయడం ప్రాథమిక అంశం. దీనిపై దృష్టిపెట్టనివారు, దండకారణ్యంపై దృష్టి నిలిపి పనిచేసేవారు ఎలా ప్రజలకు మేలుచేస్తారని భావించాలి? వారు తమ సిద్ధాంతాలకు మాత్రమే మేలుచేసే ప్రక్రియలో ఉన్నంత కాలం ప్రజల ఆకాంక్షలు వారి తలకెక్కవు. అలాంటి ఆలోచనలను తిరస్కరించడం తప్ప ప్రజలకు మరో మార్గమేది?..

-వుప్పల నరసింహం సెల్: 99857 81799