సబ్ ఫీచర్

‘బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీగిరీశుడు వేంకటేశుడు. ‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. సర్వేశ్వరుని క్షేత్ర దర్శన సంపద కన్ను, వినే సంపద చెవి, భగవదర్పిత సుగంధం ఆఘ్రాణించే సంపద నాసిక, గుణాలను గానం చేసే సంపద నోరు, ఈశ్వర తత్త్వాన్ని సర్వదా చింతించే సంపద మనస్సు. ఈ అయిదు సంపదలు మానవ దేహంలో శిరోభాగంలో కేంద్రీకృతమై వుంటాయి. కావున మానవుని దేహ పైభాగమైన శిరస్సు శ్రీపర్వతం, శ్రీగిరి. అదే మూలపదార్థం. ‘ఊర్థ్వమూల మవాక్చాఖాం..’ అన్నది శ్రుతి. అక్కడున్న సహస్రార చక్ర నివాసి- శ్రీగిరీశుడు.
‘వ’కారం జ్ఞాన శక్తివాచకం. ‘ఇ’కారం ఇచ్ఛా శక్తివాచకం. ‘కట’ అంటే ‘కురిపించేది’ అని. కనుక, పంచేంద్రియాలతో శ్రీమంతమైన శ్రీగిరి శిఖర నివాసియై, సాత్వికేంద్రియాలన్నీ లక్ష్మీ సంపదారమణుడై, జ్ఞాన, ఇచ్ఛశక్తులను నిండుగా ప్రవహింపజేసి, నిద్రాణమైన శక్తిని ప్రకటింపజేసి, ఉద్ధరించి భక్తులకు ఇష్టార్థాలను ప్రసాదించు ఈశుడైన వేంకటేశుని, శ్రీగిరి రమణుని, తత్త్వమెఱింగి, తాదాత్మ్యం చెందిన పూర్ణపురుషుడు పరమ భాగవతోత్తముడు అన్నమయ్య.
సంగీత సాహిత్య సమ్మిళితమైన దివ్య పద పారిజాతములతో శ్రీవేంకటేశ్వరుని పాద పద్మములను అర్చించి, పరమేశ్వరుని భజనానందమే తరుణోపాయమని, భక్తిప్రచార పర్వతారోహణకు, సంకీర్తనలనే సోపానములను ఆధారంగా చేసుకొని, అధిరోహించి, పరబ్రహ్మ తత్త్వాన్ని అనుభవించి సాధకులకు అందించిన భక్తశిఖామణి- తాళ్ళపాక అన్నమయ్య.
భగవంతుని రూప నామ గుణ లీలా విశేష విభూతులను సంకీర్తనా వాఙ్మయంలో పొందుపరచి, తానాడిన మాటల్లా అమృత కావ్యంగా పాడిన పాటల్లా పరమ సుధారసగానంగా భాసింపగా, భాష భావం ఆలంబనాలుగా, భగవత్తత్వాన్ని సామాన్య మానవులకు సైతము సులభముగా బోధపడు రీతిగా, మధుర భక్తిపరమైన శృంగార, ఆధ్యాత్మిక కీర్తనలను, భావనా చమత్కృతితో మనోజ్ఞ రచనా విధానంలో, లోకకళ్యాణాన్ని కాంక్షించి, కీర్తించిన భగవత్తేజోవిభూతుడు, పదకవిత పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య.
అన్నమయ్య ఆధ్యాత్మిక సౌధానికంతటికీ పునాది. ఆయన అద్వైత విజ్ఞానం. చిన్నప్పటినంచీ ఒంటపట్టిన అద్వైత తత్త్వాన్ని మరువలేకపోయాడన్నమయ్య. ఈ భావన ఆయన కీర్తనలలో ప్రస్ఫుటంగా విశదమవుతుంది. ‘‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే- అనే తందనానపాటే చాలు ఆయన అద్వైత హృదయాన్ని చాటటానికి. ఉన్నదంతా ఒకే ఒక చైతన్యం. దానికి భిన్నంగా సృష్టిలో మరేదీ లేదు అని చాటిన అద్వైతానుభూతి సిద్ధుడు అన్నమయ్య. చక్రవర్తి అయినా, నిరుపేద అయినా నిద్రలో పొందే సుఖం ఒక్కటే. బ్రాహ్మణుడైనా దళితుడైనా కలిసేది మట్టిలోనే. రాత్రింబవళ్ళకు ధనికుడు నిరుపేద యిద్దరూ ఒక్కటే; దుర్గంధంపైనా పరిమళముపైనా వీచే గాలి ఒక్కటే, ఏనుగుమీద కుక్కమీదా పడే ఎండ ఒక్కటే అని పదములల్లుతూ ‘‘హృదయము శ్రీవేంకటేశుని నెలవిది’’- శుద్ధమైన మానవ హృదయాలన్నీ భగవన్నిలయాలే, అందరికీ శ్రీహరే అంతరాత్మయని, హరినెరిగిన చండాలుడైనా ఉత్తమ కులజుడేనని, జాతి కుల వర్ణ వర్గ భేదము లేక బ్రహ్మతత్త్వం అణువుమొదలు అంతరిక్షం వరకు వ్యాపించిందని ఆత్మ ప్రబోధాన్ని కీర్తించి సమసమాజ స్థాపనకు పునాదులు వేసిన అద్వైత శిఖామణి, మహాప్రవక్త- అన్నమయ్య.
సర్వాంతర్యామియైన పరమాత్మను గూర్చి ‘‘నీవనగనొకచోట నిలిచి వుండుట లేదు. నీవనుచు కనుగొన్న నిజమెల్ల నీవే’’ అని కీర్తించాడు. ‘‘వేదాంత నిలయా వివిధాచారణా ఆదిదేవ శ్రీవేంకటేశ సోధించి తలంచిన చోట నే వుందువట ఏ దెస నీ మహిమే ఇదేటిదయ్యా’’ అంటూ ‘‘అంతరంగుడును అర్చావతారము నింతయు శ్రీవేంకటేశ్వరుడే’’ ఎదుట కనపడే సాలిగ్రామ శిలా విగ్రహ దివ్యమంగళ రూపంలోనే కాక, అంతరంగంలో కూడా శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించమని, కీర్తిస్తూ అందరి యందును నిన్ను కనుగొనెడి వారికి, వారి ఆత్మలయందే నీవున్నావని తెలిసికొనగలిగిన జ్ఞానాన్ని ప్రసాదించమని కీర్తనలను వెలయించి, భక్తి వైశిష్ట్యమును తెలియజేస్తూ, అంతటా భగవంతునే దర్శించిన అద్వైతసిద్ధుడు- అన్నమయ్య.
కాలస్వరూపాన్ని, దాని ప్రాముఖ్యాన్ని గుర్తించి ఉత్కృష్టమైన మానవ జన్మను విషయ వాసనలతో నిరర్థకం చేసికోక, దైవభక్తితో సార్థకం చేసికోమన్న పరమార్థాన్ని, సాహిత్య సంగీత ప్రాధాన్యమైన, నృత్యానుకూలమై, పండిత పామర జనరంజకముగా, భావితరమువారికి ఉపయుక్తమయ్యే నీతిబోధలను భక్తి ముక్తిదాయకంగా బోధించిన మహాజ్ఞాని- అన్నమయ్య.
అన్నమయ్య చూపిన సాధన మార్గం కూడా చాలా సులభమైనది. ‘‘ఆచార విచారాలవి నేనెరగ- వాచామగోచరపు వరదుడవు నీవు, తపమొక్కటే నాకు దగు నీ శరణమట- జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట- కర్మమొక్కటే నీదు కైంకర్య గతి నాకు, ధర్మమొక్కటె నీ దాసానుదాస్యము బలిమి యొక్కటె నాకు భక్తి నీపై గలుగుట, కలిమియొక్కటె నీవు గలవని నమ్ముట- యెలిమితో శ్రీవేంకటేశ నీవు గతి దక్క పలు బుద్ధులనే బొరలు భావనలే నెరుగ- ఇవి అన్నమయ్య చెప్పిన సాధనామార్గాలు. ‘‘వ్యవసాయాత్మికాబుద్ధి రేకొహకురునన్దన, బహు శాఖాహ్య నన్తాక్చ బుద్ధయో వ్యవసాయినామ్’’ (2-41) భగవద్గీతలో చెప్పిన అద్వైత సాధన కూడా ఇదే.
ఆహ్లాదకరమైన నైసర్గిక రూపంతో, కళాస్రస్టలు, కళాద్రష్టలు పండితులతో విరాజిల్లిన తాళ్ళపాక గ్రామంలో, నారాయణసూరి లక్కమాంబ పుణ్య దంపతులకు వైశాఖమాస విశాఖా నక్షత్రంలో (పౌర్ణమి) ఇరువంశముల హరిహరాద్వైత సిద్ధితో, లోక కల్యాణంగా, వేంకటేశుని ప్రసాదంగా అవతరించిన కారణజన్ముడు (క్రీ.శ.1408, మే నెల తొమ్మిదవ తారీఖున) అన్నమయ్య.
ఐదవ ఏట గాయత్రీ మంత్రోపదేశియై, తండ్రివద్ద శాస్త్ధ్య్రాయనంతోపాటు ప్రకృతి ఒడిలో ఒదిగి నేర్చుకున్న విజ్ఞానం తోడురాగా, చిన్ననాటనే వేంకటరమణునిపై వింత వింత కీర్తనలు ఆలపించేవాడు, అన్నమయ్య. ఒక రోజున చిత్తము శ్రీనివాసునుండగా, పరాకుగా గడ్డికోస్తున్న అన్నమయ్య వ్రేలు తెగి రక్తం స్రవించింది. వేదనలో విరక్తి, భక్తి జనియించాయి, లౌకిక విషయములపై వాంఛ నశించి, భక్తిరసావేశంతో, భక్తబృందంతో తిరుపతి చేరినాడు.
శ్రీనివాసునికి నివాసమిచ్చి వాయువ్య దిశ యందున్న ఆదివరాహస్వామికి మ్రొక్కి, లోకపావని పుష్కరిణి యందు క్రుంకు విడి, ఈశాన్యమందున్న యోగ నారసిహుని దీవెనలంది, బంగారు వాకిలి చేరి, మూసి వున్న తలుపులు, ఆశువుగా చెప్పిన ‘‘‘వేంకట శతక’’ గానంతో తెరువబడ్డాయి. ఏడుకొండలవాడు, కలియుగదైవం, శ్రీవేంకటేశుని దివ్య హిరణ్మయ మంగళ స్వరూపాన్ని తిలకించి, పులకించిన హృదితో, ఆర్తితో ఆర్ద్రతతో ‘‘దేవదేవుడితడే దివ్యమూర్తి’’ అంటూ కీర్తనారాగ మాలికతో స్వామిని అర్చించాడు బాల భక్తయోగి, అన్నమయ్య.
మాతృదేవోభవ, నమాతఃపరదైవతమ్- తల్లికి మించిన దైవం లేదని, ఆనాటి రాత్రి స్వప్నమందు తనకు దర్శనమిచ్చి హితవచనములిచ్చిన వేంకటేశళుని ఆదేశానుసారము, తనను వెతకుచూ స్వామి సన్నిధికి వచ్చిన తల్లిదండ్రులతో తాళ్ళపాక చేరి, గృహస్థుడై, భగవత్తత్వాన్ని ప్రచారం చేయటానికి సంకల్పించి, సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలమునకు వెళ్లి శఠకోపయతి శ్రేష్టుని వద్ద నృసింహ మంత్రోపదేశాన్ని పొందాడు. 32 అక్షరముల నృసింహ మంత్రానికి, బీజాక్షరమున కొక వెయ్యి వంతున, 32 వేల సంకీర్తనలను రచించి, మంత్రానుష్ఠాన సిద్ధిని సమాజ శ్రేయస్సుకుపకరించి ‘‘నరసేవయే నరహరి సేవ’’యని చాటిచెప్పిన నిస్వార్థయోగి అన్నమాచార్యులు.
తన సంకీర్తనా ప్రచార విఖ్యాతితో, రాజాహ్వానమొంది, సంకీర్తనాసేవతో వేంకటేశ్వర తత్త్వ వ్యాప్తికి రాజాదరణ ఉపకరిస్తుందని భావించి అదే సమాజ శ్రేయస్సుగా తలించి, సాళువ నరసింహరాజలను దీవించి, పూర్తి శరణాగతితో, మధుర భక్తి సంప్రదాయంతో శృంగార ఆధ్యాత్మిక పరంగా ‘‘ఏమొకో చిగురు టధరమున యెడనెడ కస్తురి నిండెను’’ అని వేంకటేశ్వరుని లీలను వర్ణిస్తూ భక్తి శృంగార కీర్తనను గానం చేశాడు.
అటువంటి శృంగార పదాన్ని ఒకటి తనమీద కూడా వినిపించమన్నాడు సాళ్వ నరసింహరాయలు. ‘‘హరి ముకుందుని గొనియాడు నా జిహ్వనిను గొనియాడం నేరదెంతైన..’’, ‘‘నరులను బొగుడు జీవముకన్నా చెట్టుగనో పుట్టగనో పుట్టటమే మేలు..’’ అన్నాడు తన కీర్తనలలో. ‘‘శ్రీనాధు వర్ణించు జిహ్వ, తారతమ్యము లేక స్వార్థమునకై వినియోగించు ఖలులను పొగడలేదు’’ అని నిష్కర్షంగా చెప్పాడు- చెఱసాలలో బంధింపబడ్డాడు అన్నమయ్య. వేంకటేశ్వరుని నామ సంకీర్తనయే, శరణాగతే అన్ని సంకటములను పోగొడుతుందని ప్రగాఢ విశ్వాసంతో ‘‘ఆకటి వేళల, అలపైన వేళను, తేకువ హరినామమే దిక్కు మరి లేదు, సంకెళ్ళబెట్టిన వేళ చంపబిలిచినవేళ వేంకటేశు నామమే విడిపించగతికాక’’ అన్న కీర్తనను ఆర్తితో ఆలపించాడు. శృంఖల విముక్తుడై, శరణాగతి నొందిన సాళ్వ రాజుకు క్షమాభిక్ష నిచ్చి, కలియుగమందున హరి సంకర్తీనమే ముక్తి సాధనమని, జనావళిని ఉద్ధరించటానికై దేశ సంచారం చేసిన యుగపురుషుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు, హరి సంకీర్తనాచార్యుడు.
అసలు ‘అలమేలు మంగ’ పద్మావతి అంటే ఎవరు? అనేది తెలుసుకొంటే, అన్నమ్య భక్తి శృంగార కీర్తనలలో దాగి వున్న అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మికత ద్యోతకమవుతుంది. ‘తిరుపతి’- ‘తిరు’ అంటే ‘శ్రీ’పతి. కనుక తిరుపతి అంటే శ్రీపతే. ‘శ్రీ’ పత్ని అయితే ఆయన పతి. పతి పత్నులకెడబాటు లేదు. ఆవిడ ఆయనకు నిత్యానపాయిని. ఆవిడ, ఆ పరమాత్మ ‘శక్తి’, ఆశ్రయించి ఉంటుంది. ‘‘ఆశ్రయతీతి శ్రీః’’- ఆశ్రయించేది గనుకనే ‘శ్రీ’ అయింది శక్తి. మరి ఆ తల్లి అలిగి, తిరుచానూర్‌లో కూర్చున్నదంటారు గదా. ‘చాన్’ అంటే ‘దేవి’ అని అర్థం. తిరుచానంటే ‘శ్రీదేవి’. ఆవిడే అలర్మేల్మంగ. ‘అలర్’ అంటే పద్మం. మేర్=మీద, పద్మం మీద నివసించే మంగై అంటే మాత. పద్మాలయ అయిన దేవి. ఈ పద్మాలనేవి ఏవో గావు, మన శరీరంలో అదృశ్యంగా వున్న మూలాధారాది షట్చక్రములు. అవే షట్కమలాలు.. వాటిలో విహరిస్తూ ఉంటుంది- కుండలినీ శక్తి. చివరికి సప్త చక్రమైన సహస్రారంతో, తనకాశ్రయమైన పరమాత్మతో సాయుజ్యాన్ని భజిస్తుంది. దీనికి బాహ్యమైన సంకేతమే మనకు కనిపించే ఈ ఏడుకొండలు. వృషభాద్రి నుంచి వేంకటాద్రిదాకా విస్తరించి ఉన్న సప్తగిరులూ సప్తకమలాలు. సహస్రారం చేరేసరికి స్వామి సన్నిధినే చేరుతున్నాం. అదే ‘ఆనంద నిలయం’. అక్కడకెళ్ళేసరికి ‘శ్రీ’రూపిణి అయిన ఈ శక్తి శ్రీచక్ర రూపంగా స్వామి పాదాలనాశ్రయిస్తుంది. ఇదే శివశకె్తైక్యం. సాకారంగా స్వామి వక్షస్థలంలో దర్శనమిస్తుంది. ఇన్ని భావాల్ని ప్రస్ఫుటీకరిస్తూ భక్తి శృంగార ఆధ్యాత్మిక కీర్తనలను వెలయించిన పదకవితా పితామహుడు అన్నమయ్య.
మంత్రానుష్ఠాన సిద్ధిచే వాక్సుద్ధిగల్గి, పుల్లని పళ్ళనిచ్చే చెట్టును తియ్యని మామిడిపళ్ళనిచ్చేటట్లుగా చేసి, పేదవాని కుమార్తె పెండ్లి వైభవముగా జరుగుటకు అతనికి కాసులను అనుగ్రహించి, ఆశీర్వదించి, మంత్రానుష్ఠానాన్ని, ప్రజోపయోగమునకు ఉపయోగించిన పుణ్యకీర్తనాతపస్వి, దీనజనబాంధవుడు- అన్నమయ్య. కురంజిరాగం, ఆదితాళంలో ‘‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..’’- ఈ కీర్తనలో కొన్ని గంటల పాటు చెప్పుకొనే వేదశాస్త్రాన్వయం, జ్యోతిషశాస్త్రం, యోగశాస్త్రం మున్నగు అద్భుతమైన విషయాలందించాడు- అన్నమయ్య.
‘‘ఏకం సత్ విప్రా బహుదా వదన్తి’’- ఉన్నదొకే వస్తువు. భారతీయ ఆధ్యాత్మిక విచారణమంతా రుూ మహోదాత్త సూత్రంమీదనే ఆధారం. శ్రీవేంకటేశ్వరుని తత్త్వం సర్వదేవతా స్వరూపమని, వైష్ణవులు విష్ణువని, శైవులు శివుడని, వేదాంతులు పరబ్రహ్మయని, శాక్తేయులు శక్తిస్వరూపుడని తలచి కొలుస్తారని రమ్యంగా రచించి వివరించి గానం చేసిన సర్వలసిద్ధాంత సమన్వయచార్యుడు- అన్నమాచార్యుడు.
సంగీత సాహిత్య పరిపుష్టితో భావగాంభీర్యంగా రచించిన కీర్తనాయజ్ఞాన్ని పూర్తిచేసి ‘‘వేనామాల వెన్నురా, వినుతించ నెంతవాడ, కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేనయ్యా’’ అని కీర్తించిన వినయశీలి- అన్నమయ్య.
వృక్షాలలో ఋషితత్త్వం కని, పాషాణాలలో వేదఘోష విని, చేతనా చేతన భూత జాల మందంతటను భగవంతుని దర్శించి, ‘‘నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, తెగదు పాపము, తీరదు పుణ్యము, నగినగి కాలము నాటకము, గగనము మీదిది కైవల్యమని, సర్వోపనిషత్సారమును తెలిపి, సర్వమును వేంకటేశుని యందే ఉంచి తరించి, యితరులను తరింపజేసి, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’’ అని అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శింపజేసి, యశఃకాయుడైన అన్నమాచార్యుడైన తాళ్ళపాక అన్నమయ్య.

-పసుమర్తి కామేశ్వరశర్మ