సబ్ ఫీచర్

పుణ్యప్రాప్తికి పుష్పపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని ఆరాధించడంలో పూజ చేసే సమయంలో పుష్పాలకు ఒక ప్రత్యేక స్థానం వుంది. పుష్ప పూజకు మనం ఎంతో ప్రాధాన్యతనిస్తాము. ఎంతో ఇష్టంగా స్వామి పాదాలవద్ద పువ్వులను వుంచి భక్తిపూర్వకంగా నమస్కరిస్తాము. అంతేకాదు ఆయనను వివిధ రకాల రంగుల పువ్వుతో అలంకరించి ఆనందిస్తాము. ఎన్నో రకాల పువ్వులు ఈ జగత్తులో భగవాన్ మనకు ప్రసాదించాడు. ఆ పుష్పాలను ఆయనకే చెందేవిగా భావించి, వాటిని మరే విధంగానూ ఉపయోగించని వారెందరో వున్నారు.
శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లుగా భక్తిపూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవ్వరైతే ఆయనకు ఆకును గానీ, ఒక పువ్వును గానీ, ఒక పండును గానీ, కొద్దిపాటి జలాన్నిగానీ సమర్పించిన యెడల అట్టివారి యొక్క భక్తి నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తాను అన్నారు. ఈ పువ్వులతో పూజ చేసే విషయంలో ధనికులని గానీ, పేదలను గానీ తారతమ్యం లేదు. పువ్వులు అందరికీ అందుబాటులో వుంటాయి. మన పురాణ గాథల్లో ఎందరో భక్తులు ఆ స్వామికి ఫలపుష్పాదులను సమర్పించి ధన్యులైనారన్న ఉదంతాలు మనకు కనపడతాయి.
విదురుడు ద్రౌపది ఆ సర్వేశ్వరునికి పత్రాలను సమర్పించారు. ఇక గజేంద్రుడు స్వామిని పుష్పాలతోనే అర్చించాడు. శబరి ఫలాలను సమర్పించుకుంది. రంతిదేవుడు తోయమును సమర్పించుకున్నాడు. ఇక మరో విశేషమైన పుష్పం అందరియందూ దాగివుంది. అదే మానసిక పుష్పం.
జగద్గురు ఆదిశంకరాచర్య స్వామివారు ఈ మానసిక పుష్పాలనే పూజకు వినియోగించారు. శివానంద లహరిలో ఈ విధంగా వివరించారు.
అహింసా ప్రధమం పుష్పం,
పుష్పం ఇంద్రియ నిగ్రహం,
సర్వభూత దయాపుష్పం,
క్షమాపుష్పం విశేషతః
శాంతిపుష్పం, తపఃపుష్పం,
ధ్యాన పుష్పం తదైవచ
సత్యమిష్ట విధం పుష్పం,
విష్ణోః ప్రీతికరం భవేత్
అనగా అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమాగుణం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఎనిమిది మనఃపుష్పాలను ఆ సర్వేశ్వరునికి ప్రీతికరంగా సమర్పించుకోవాలన్నారు, ఆయనపై పరిపూర్ణ విశ్వాసాన్ని వుంచి, చిత్తశుద్ధితో ఈ మానసిక పుష్పాలను సమర్పించుకోవాలి. పాప పరిహారానికీ, పుణ్యప్రాప్తికీ, ఐశ్వర్యాభివృద్ధికీ, పుష్పమాల తప్పనిసరి అని కులార్ణవ తంత్రం చెబుతోంది.
ఇక పూజకు పనికిరాని పువ్వుల గురించి కూడా మన పెద్దలు చెప్పారు. పురిటివారు, మైలవున్నవారు బహిష్టులైనవారు పువ్వులను తాకరాదన్నారు. అలాగే క్రింద భూమీద పడిన పువ్వులనూ, వాసన చూసిన పువ్వులనూ, కడిగిన పువ్వులనూ పూజకు వినియోగించరాదు.
ఎడమ చేత్తో కోసిన పువ్వులు పూజకు పనికిరావు. మీరు పూలు కోసేటప్పుడు విడిచిన దుస్తులను మరలా ధరించి కోయరాదు. శుచిగా స్నానమాచరించిన తర్వాతే పూవులను కోసి పూజకు ఉపయోగించాలి. వాడిపోయిన పువ్వులనూ, దుర్గంధ భూయిష్టమైన పువ్వులనూ పూజకు ఉపయోగించరాదు.
ఈ పువ్వులను పూజ చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులను పెద్దలు చెప్పారు. మధ్యవేలు ఉంగరపు వేలుతో పువ్వులను తీసుకుని దైవానికి సమర్పించాలి. అలా పువ్వులను భగవంతునికి సమర్పించేటప్పుడు, పువ్వులు క్రింది ముఖంగా వుండకుండా జాగ్రత్తపడాలి.
పుష్పాంజలి సమర్పించే సమయంలో ఈ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా తదేక ధ్యానంతో స్వామికి పువ్వులు సమర్పిస్తూ అర్చనలూ, స్తోత్ర పఠనాలూ గావించటం కద్దు. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాల్సి వుందిక్కడ. బిల్వ దళాలకూ, తులసీ దళాలకూ ఈ నియమాలు వర్తించవు. వాటిని ఏ విధంగానైనా సమర్పించుకోవచ్చును. మిగతా పుష్పాలనూ, ఫలాలనూ, అవి ఏ విధంగా చెట్టుమీద వుంటాయో ఆ విధంగానే మనం దైవానికి అర్పించుకోవాలి అని చెబుతారు.
ఇక్కడ మనం ప్రత్యేకంగా తులసిదళం గురించి చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగానేగాక ఈ దళాలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మహర్షులు ఈ తులసిని చిన్న పెద్ద వ్యాధులకు దివ్యమైన ఔషధంగా పేర్కొన్నారు. తలసీదళాలను సేవిస్తే సమస్త పాపాలూ నశిస్తాయనీ, స్మరిస్తే శరీరంలోని వ్యాధులనుండి విముక్తి లభిస్తుందనీ ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. ఏం చేసినా, ఎలా చేసినా భక్తిముఖ్యంగా మనం గుర్తుంచుకుని స్వామివారిని సేవించుకోవాలి.

-డా.పులిపర్తి కృష్ణమూర్తి 9949092761