సబ్ ఫీచర్

‘సంస్కార రహిత’ భారతమా ఇది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు. ఆ సందర్భంగా బెంగళూరు నగరంలో జరిగిన ఉత్సవంలో మాజీ డీజీపీ సాంగ్లియానా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ‘నిర్భయ కేసు’గా విశేష ప్రాచుర్యం పొందింది. బెంగళూరులో జరిగిన సభకు ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రినాథ్ సింగ్‌లు హాజరయ్యారు. మహిళా దినోత్సవ వేదికపై మాజీ డీజీపీ సాంగ్లియానా చేసిన వ్యాఖ్యలు అందరికీ విస్మయం కలిగించాయి. ‘ఆమె (నిర్భయ తల్లి ఆశాదేవి) శరీరాకృతి చాలా బాగుంది.. దానిని బట్టి ఆమె కుమార్తె ఇంకెంత అందంగా ఉందో ఊహించుకోవచ్చు. అంతటి అందమైనవారు దుర్మార్గుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు’- అని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు విన్నాక సభంతా దిమ్మెరపోయింది. పోలీసు శాఖలో ఉన్నత పదవిని నిర్వహించిన సాంగ్లియానా సంస్కారం ఏ పాటిదో మనకు అర్థమవుతుంది గదా!
ఈ వ్యాఖ్యల మీద సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు సాంగ్లియానా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయినా ఆ మహానుభావుడు, వెనుకకు తగ్గలేదు. పశ్చాత్తాపం చెందలేదు. అందమైన మహిళలకు సర్వసాధారణంగా ముప్పు ఉంటుందని చెప్పటమే తన ఉద్దేశమనీ, నిర్భయ తల్లి శరీరాకృతిపై తాను నిజమే చెప్పాననీ ఆయన అన్నాడు. ఈ వివరణకు మనం ఏమనాలి?
‘నిర్భయ’ కేసులో ఉరిశిక్ష..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో ఈనెల 10వ తేదీన ముగ్గురు ముద్దాయిలకు సుప్రీం కోర్టు ఉరిశిక్షను ఖాయం చేసింది. ఈ కేసులో అసలు ముద్దాయిలు అయిదుగురు. శిక్షపడిన అక్షయకుమార్ సింగ్ తన మరణశిక్షపై అసలు అప్పీలు చేయలేదు. ఇంకో ముద్దాయి రామ్‌సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చి 11న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఈ ముద్దాయిల శిక్షల వ్యవహారం తేలిపోయింది. ఉరిశిక్షలు పడ్డవారు రాష్టప్రతి క్షమాపణ కోసం అభ్యర్థించినా ఆయన ఆమోదిస్తారన్న భావనే లేదని చెప్పవచ్చు.
ప్రిన్సిపాల్ దుశ్చర్య..
బిహార్‌లోని సరన్ జిల్లా ఎక్మా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పర్సాగడ్‌లో మరో దారుణం జరిగింది. 2017 డిసెంబర్‌లో పాఠశాల టాయిలెట్‌లో బాలికపై అత్యాచారం జరిగింది. విద్యార్థులు ఆ వికృత చేష్టలను వీడియోలు తీసి, ఆ బాలికను బెదిరించారు. ఆ విద్యార్థిని ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పుకుంది. ప్రిన్సిపాల్ ఈ విషయం పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పవద్దని తానే పరిష్కరిస్తానని బాలికకు సర్దిచెప్పాడు. కానీ, తర్వాత ఆ బాలికపై తానే అత్యాచారం చేసాడు! దీనితో ఇంకా ఇద్దరు ఉపాధ్యాయులు, 16 మంది విద్యార్థులు అవకాశం దొరికినప్పుడలా, ఆ బాలికపై తెగబడటం మొదలుపెట్టారు. ఆ బాలిక తండ్రి ఏవో కేసులపై జైలులో ఉన్నాడు. ఆ తండ్రి కొద్దిరోజుల క్రితమే బయటికి రాగా ధైర్యం కూడగట్టుకుని ఆమె పోలీసులను ఆశ్రయించింది. జిల్లా ఎస్పీ రాయ్ దీనిమీద ఒక ప్రత్యేక బృందాన్ని నియమించడంతో ప్రిన్సిపాల్‌ను, ఒక టీచర్‌ను, పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ పేరుతో టీచర్ మోసం..
నల్గొండ జిల్లా డిండి మండలంలో జరిగిన ఇలాంటి అకృత్యం సభ్య సమాజాన్ని నివ్వెరపరచింది. వంగూరు ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి పూర్తిచేసిన బాలిక తల్లితో కలిసి డిండికి వచ్చి అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి దాకా చదివింది. ఆ మూడేళ్లలో అక్కడి భాషా పండితుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. 2017-18 సంవత్సరాల్లో ఆమె హైదరాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో చేరింది. తన గ్రామానికి చెందిన యువకుడు ‘నీవు మరో వ్యక్తితో సంబంధం కొనసాగించటాన్ని నేను భరించలేను, ఆత్మహత్య చేసుకుంటాను’- అంటూ సెల్‌ఫోన్‌లో పలుసార్లు మెసేజ్‌లు పంపాడు. దాంతో ఆ బాలిక ఉరివేసుకు ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను తల్లిదండ్రులు తమ కుమార్తె సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకుని, కుటుంబం పరువుపోతుందని భావించి గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత సదరు ఉపాధ్యాయుడిని పెద్దల సమక్షంలో నిలదీస్తే, మృతురాలి కుటుంబానికి ఆరున్నర లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఆచార్యుల వారి నిర్వాకం..
కొన్ని సంవత్సరాల నుంచీ ఎంబీఏ జవాబుపత్రాల మూల్యాంకనంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక కమిటీని వేసిందట! కమిటీ నివేదిక ప్రకారం-కొన్ని ప్రశ్నలకు అసలు జవాబులు వ్రాయకపోయినా మార్కులు వేశారట! ప్రశ్నలకు సినిమా కథలు జవాబులుగా వ్రాసినా మార్కులు పడ్డాయట! ఒక్క ప్రశ్నకు సమాధానం వ్రాసి, మిగతావి వ్రాయకుండా వదిలేసినా మార్కులు పడ్డాయట! 600 జవాబు పత్రాలలో ఇలాటి అక్రమాలు జరిగినట్లు కమిటీ సభ్యులు గుర్తించారు. ఈ నివేదికను సంబంధిత కమిటీ ఈమధ్యనే ఉప కులపతి ఆచార్య రామచంద్రానికి అందచేసిందట. ఈ ఘటనను ఏమనాలి?
మహిళా టీచర్లకు జైలు...
ఎప్పుడూ మగ టీచర్లేనా సంచలనాలు సృష్టించేది? తాము కూడా ఏమీ తక్కువ తినలేదని మహిళా టీచర్లు నిరూపించుకున్న సంఘటన ఇది.. ఇద్దరు మహిళా టీచర్లు తమవద్ద చదువుకునే అయిదేళ్ల బాలికను వివస్తన్రు చేసి, ఆపై ఆ చిన్నారితో అసహజ లైంగిక చర్యలకు పాల్పడినట్లు పాట్నాలోని ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. బాలిక తల్లితండ్రులు మహిళా పోలీసు ఠాణాను ఆశ్రయిస్తే, నిందితులను 2016 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారట. ఆ బాలిక లైంగిక దాడికి గురైనట్లు వైద్య పరీక్షలో తేలడంతో ఇద్దరు మహిళా టీచర్లకు కోర్టు శిక్షలను ఖరారు చేసింది.
ఇంకో దారుణం..
సాక్షాత్తూ ఒక న్యాయవాది.. 50 సంవత్సరాల వయసు వాడు.. తన జూనియర్ మహిళా న్యాయవాది అయిన 32 సంవత్సరాల యువతిపై- ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి ఆమెను వైద్యపరీక్షలకు పంపారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇవన్నీ చూస్తుంటే- ఇంతకీ మన దేశానికి ఏమైంది? అన్న ఆందోళన కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక, గత ఏడు దశాబ్దాల కాలంలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు పెరిగాయి. విద్య మరింతగా పరిఢవిల్లుతోంది. సంస్కారం మాత్రం రోజురోజుకీ దిగజారుతోంది. ఈ విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? దేశంలో అత్యాచారాల సంఖ్య పెరిగినట్టు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు ఇటీవల పేర్కొన్నారు.
ఇప్పటికీ చాలా పాఠశాలల్లో ప్రతి రోజూ ఉదయం ‘గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర..’ శ్లోకంతో పాటు ‘వందేమాతరం’ గీతం వినపడుతుంది. సాయంకాలం తరగతుల ముగింపు సమయంలో ‘జనగణమన’ గీతం వినపడుతుంది. ఇవి వింటూంటే ఎంతో మానసిక ప్రశాంతత.. పరిస్థితులు ఎప్పటికైనా చక్కబడతాయన్న ఆశ.. అందుకే ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది.. ప్రస్తుత విపరిణామాలకు తప్పక తరుణోపాయం ఉందనే నా నమ్మకం..
(ముగింపు రేపు)

-‘చాణుక్య’