సబ్ ఫీచర్

అంతా నాలుగు నిముషాలే.(.ప్రపంచ సినిమా : జర్మనీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతానికున్న శక్తి గొప్పది. అది మనసును సాంత్వనపరుస్తుంది. లౌకిక సంబంధాలనుండి విముక్తిగావించి అలౌకికానందాన్ని కలిగిస్తుంది. సంగీతంలో మంచి గురువును వెతికి పట్టుకోవడం సులభం. కాని నిజమైన విద్యార్థిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. సంగీతాన్ని ఫ్యాషన్‌గా, మొక్కుబడిగా నేర్చుకునేవారికంటే సంగీతంపట్ల ఆసక్తి, ప్రతిభగలవారు కనిపిస్తే ఆ గురువుకు కలిగే ఆనందం వేరు. అరాచకంగా వుంటూ రణపెంకిగా మారిన శిష్యురాలిని, దారిన పెట్టి ఆమె ప్రతిభను లోకానకి తెలియజేయాలని తాపత్రయపడే పియానో మేష్టారు పట్టుదలను, జైలు నేపథ్యంలో వివరించిన చిత్రమే ‘్ఫర్ మినిట్స్’ (వీయర్ మనుటెన్).
జర్మనీలో ఆడ ఖైదీలను అత్యంత భద్రంగా నిర్బంధించిన జైలు అది. ఆ జైలులో 80 ఏళ్ళ వయసుగల ట్రాడ్ క్రూగర్ గత 60 సంవత్సరాలుగా అక్కడ పియానో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఈసారి పియానో నేర్చుకోవడంలో ఆసక్తిగల కొత్త విద్యార్థులను జైల్లో వెతుకుతుంటే అక్కడ జెన్నీ కనిపిస్తుంది. మొరటుగా వున్న చేతులతో తను పియానో వాయించలేనని జెన్నీ తిరస్కరిస్తుంది. నిర్లక్ష్యంగా, అసహనంగా ఉండే జెన్నీని తోటి ఆడ ఖైదీలు రెచ్చగొడుతుండటంతో ఆమె అందరిమీద చిరుతలా విరుచుకుపడుతుంటుంది. ఆమె బారి నుండి జైలు గార్డు మ్యూజ్ అతి కష్టంమీద ప్రాణాలతో తప్పించుకుంటాడు. మొండిగా, పొగరుగా వ్యవహరించే జెన్నీని అటు ఆడ ఖైదీలు, ఇటు క్రమశిక్షణ పేరిట జైలు గార్డుల హింసకు ఆమె లోనవుతున్నా ఎవరికీ తలవంచదు. చేతులకు బేడీలు వేసి పోలీసులు హాల్లోకి తీసుకురాగా, జెన్నీ పియానో దగ్గర చేరి వీపు అడ్డం పెట్టి, బేడీలు వేసిన చేతులతో చూడకుండా వెనుకనుండి పియానో వాయించడం చూసి పియానో టీచర్ అబ్బురపడుతుంది. నీగ్రో మ్యూజిక్ లాంటి వరుసలు పియానోమీద వాయించవద్దని హెచ్చరిస్తుంది. ఆమె పియానో నేర్చుకోమని ఇచ్చిన నోట్స్ కాగితాన్ని జెన్నీ నోట్లో వేసుకుని నమిలేస్తుంది.
జెన్నీ పెంపుడు తండ్రి, బాల్యంలోనే ప్రతిభ కనబరిచిన మోజార్ట్ లాంటి సంగీతకారుడిగా తయారవ్వాలని కోరుకుంటే, దాన్ని తిరస్కరించి ఆమె వేరే వాటివైపు మొగ్గినందుకు ఆగ్రహించి ఆమెను రేప్ చేస్తాడు. దాంతో ఆమెకు లోకంమీదనే కసి, ద్వేషం ఏర్పడుతాయి. పియానో టీచర్ ఆమె ప్రతిభను వెలికితీయాలని ప్రయత్నిస్తుంటుంది. గార్డుల దెబ్బలనుండి తప్పించుకుని ఆమె పియానో నేర్చుకోవడం, పియానో నేర్చుకోవడం కోసం ఆమె స్వేచ్ఛగా తిరగటాన్ని తోటి ఆడ ఖైదీలు వ్యతిరేకిస్తారు. కాని జైలు డైరెక్టర్ మాత్రం తన జైలులో ఖైదీల సంక్షేమం కోసం చేస్తున్న పనులను మీడియా దృష్టికి తెచ్చి మెప్పు పొందాలనుకుంటాడు.
21 ఏళ్ళలోపు వాళ్ళకు నిర్వహించే పోటీల్లో, ముఖ్యంగా పియానో పోటీల్లో జెన్నీ ఫైనల్స్‌కు చేరుకుంటుంది. కాపలా గార్డు మ్యూజ్ కావాలని జెన్నీని ఆమె శత్రువులున్న గదిలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఆ రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చిన జెన్నీ పడకమీద కదలలేకపోతుంది. ఆ ఆడ రౌడీలు ఆమె చేతులను మంచానికి కట్టివేసి, చేతులకు గుడ్డ చుట్టి నిప్పు పెడతారు. విడిపించుకోకుండా ఆమెను అంతా కలిసి చితకబాదడంతో, ఆ బాధలో ఆమె పోటీ గురించి మర్చిపోతుంది. ఇదంతా జైలు గార్డు మ్యూజ్ చేసిన కుట్ర అని పియానో టీచర్ క్రూగర్ గ్రహించి, అతడ్ని నిలదీస్తుంది. నిరసనగా క్రూగర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన పియానో తీసుకుని వెళ్లిపోతుంది. మ్యూజ్ తన తప్పును సరిదిద్దుకోవడానికి గాను, జెన్నీ తన పియానో టీచర్‌తో ఆమె ఇంటికి వెళ్లిపోయి, పోటీలకు తయారుకావడానికి అనుమతిస్తాడు.
క్రూగర్‌కు తన పెంపుడు తండ్రి తెలుసనీ, అతనే ఇదంతా ఏర్పాటుచేశాడనీ, అందుకోసం అతని దగ్గర క్రూగర్ డబ్బు తీసుకునే వుంటుందని భావించి జెన్నీ కోపంతో ఆమె మీదికి చెలరేగిపోతుంది. అపుడు క్రూగర్ తన గతాన్ని వివరిస్తుంది. ఆమె ఒక లెస్బియన్ అనీ, తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కమ్యూనిస్టు అనే నేరం మోపి చంపివేశారని చెబుతుంది. ఆమెను ఇప్పటికీ తాను మరిచిపోలేకపోతున్నానని, ఆమెకు తను ఎలా పియానో నేర్పించేదో తెలియజేస్తుంది. జెన్నీలో ఆమె పోలికలను చూసి ఆమెను ప్రోత్సహించానని చెబుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో తాను నర్సుగా పనిచేశాననీ, అప్పటి ఆసుపత్రినే ఇపుడు జైలుగా మార్చివేశారని చెబుతుంది. అలాగే జీనియస్ పియానో ప్లేయర్‌గా పేరుపొందిన జెన్నీ హత్యానేరం మీద జైలులో వుంటుంది. హత్య చేసి పారిపోయిన తన బాయ్‌ఫ్రెండ్‌ను కాపాడటానికి ఆ హత్యానేరం తన మీద వేసుకుని జైలుకు వచ్చిందని క్రూగర్ తెలుసుకుంటుంది.
పోటీలో పాల్గొనటానికి జెన్నీని, క్రూగర్ ఒప్పిస్తుంది. ఈలోగా ఆమెను జైలుకు తిరిగి తీసుకువెళ్లడానికి పోలీసులు వచ్చేస్తారు. ఆ పోటీని చూడటానికి విచ్చేసిన జన సమూహం ముందు ఆ థియేటర్లో తన ప్రతిభను ప్రదర్శించడానికి కేవలం ‘నాలుగు నిముషాల’ సమయం ఇస్తారు. ఆమె క్రూగర్ దగ్గర నేర్చుకున్నది పక్కనబెట్టి తన అసలైన ప్రణాళికను అమలుపరుస్తుంది. స్కూమన్ (ప్రఖ్యాత పియానో స్వరకర్త) బాణీలతో మొదలుపెట్టి, తానెంతో అభిమానించే నీగ్రో మ్యూజిక్‌ను ఆ పియానో మీద వాయించడానికి ఆమె చేసే కసరత్తును కళ్లారా చూడాల్సిందే తప్ప వివరించలేము. పియానో మెట్లమీద వాయిస్తూ, డిఫరెంట్ సంగీత ధ్వనుల కోసం తీగలమీద బాదడం, వాటిని లాగి సంగీతాన్ని సృష్టించడం, ఇక్కడినుండి అక్కడకు పరుగెత్తుకుంటూ వాయించడంలో వేళ్ళు రక్తసిక్తం అయినా చలించక, కాళ్లతో నేలను లయాత్మకంగా బాదడం- ఇలా ఇంతవరకు వినని, లేదా కలలో కూడా ఊహించని దిగ్భ్రాంతికరమైన సంగీతలోకంలోకి తీసుకువెళుతుంది. వాయిస్తూ సడెన్‌గా ఆపేసి నిస్త్రాణగానిలిచిన జెన్నీని చూసి తెప్పరిల్లిన జనాలు హర్షధ్వానాలతో తమ ఆనందాన్ని తెలియజేస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు. అలిసి పక్కకు తిరిగిన ఆమె చేతులకు బేడీలు పడడం, అటు ఇటు నిలిచిన పోలీసులను చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
1930లో జర్మనీలో జాత్యహంకార ధోరణులు పెచ్చరిల్లినపుడు ఆఫ్రో-అమెరికన్లు ప్రవేశపెట్టిన జాజ్ సంగీతాన్ని నీగ్రో సంగీతంగా నాజీలు ఈసడించారు. దానికి యూదు సంగీతకారులు మద్దతు తెలపడాన్ని కూడా వారు భరించలేకపోయారు. నిమ్నజాతులు ఉపయోగించే అథమ స్థాయి సంగీతంగా దాన్ని బహిష్కరించారు. ఆఫ్రికన్ సంగీతాన్ని కూడా అదే రాటకు కట్టేశారు. అందుకే ఈ చిత్రంలో పియానో టీచర్, జెన్నీ జాజ్ తరహాలో వాయిస్తే ఒప్పుకోదు. చివరకు ఫైనల్స్‌లో జెన్నీ పియానో మీద జాజ్ సంగీతానే్న వాయించి, అందర్నీ ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంది. జాతి ఎల్లలను చెరిపివేస్తుంది. సినిమా మొదటి నుండి వినిపించే పియానో వరుసలు, క్లైమాక్స్ మ్యూజిక్‌తో చిత్రం సంగీతకారుడు అనె్నట్టె ఫోక్స్ వేసిన ముద్ర చెరిగిపోనిది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసుకుని దర్శకత్వం వహించిన క్రిస్‌క్రాస్, ఆద్యంతం ఆసక్తిగా ఉత్కంఠభరితంగా చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. ఈ చిత్రంలో మొండిగా, రణపెంకిగా వ్యవహరించే జెన్నీ పాత్రలో నూతన నటి హెడ్జ్ స్ప్రింగ్ అద్భుతంగా నటించింది. 80 ఏళ్ళ పియానో టీచర్ క్రూగర్‌గా బ్లెయిబ్ ట్రూ కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరిలో ఎవరు బాగా నటించారో తేల్చుకోలేక కొన్ని ఫిలిం ఫెస్టివల్స్‌లో జెన్నీ పాత్రధారిణి ఉత్తమనటిగా బహుమతులు గెలుచుకోగా, మరికొన్నింటిలో క్రూగర్ పాత్రధారిణి బహుమతులు అందుకుంది.
ఈ చిత్రం 2006లో ఉత్తమనటి, ఉత్తమ నూతన నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకత్వానికిగాను బవేరియన్ ఫిలిం అవార్డ్సు గెలుచుకుంది. అలాగే షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, రెక్ జావిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. దీంతో పాటు 28వ బైబెరాక్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘ఉత్తమ చిత్రం, ఆడియన్స్ అవార్డు’లను అందుకుంది. 2007లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటికిగాను జర్మన్ ఫిలిం అవార్డులను గెలుచుకుంది.

-కె.పి.అశోక్‌కుమార్