సబ్ ఫీచర్

వ్యసనాల చెరలో యువత విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత నగర జీవన విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకువెళ్తున్న యువతలో కొందరు చెడు మార్గంలోకి వెళుతున్నారు. కొందరైతే అమానవీయ చర్యలకు పాల్పడుతూ మానవత్వానికే మచ్చ తెస్తున్నారు. ఇందుకు అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాను చేసిన అప్పులు తీర్చడానికి స్నేహితుడి ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగిలించడమే కా కుండా అతడిని ఓ యువకుడు పెట్రోలు పోసి తగులబెట్టాడు. నాగరిక జీవనానికి నిలయమైన హైదరాబాద్‌లో ఈ ఘోరం జరిగింది. పాతకక్షలతో చిన్ననాటి స్నేహితుడిని మరో యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తాను పిలిస్తే వెంటనే పలకలేదని ఆగ్రహించి ఓ యువకుడు మరొకడిని చంపడం మరో దుర్ఘటన. జనం రద్దీగా ఉండే కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఓ యువకుడు ఒక యువతిని కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఇదేనా మన సంస్కృతి?
యుక్తవయసులోకి అడుగుపెడుతున్న వారు ఇలాంటి వికృత చేష్టలకు దిగజారడానికి ఎన్నో కారణాలున్నాయి. మానసిక పరిపక్వత సరిగా లేకపోవడం, చెడువ్యసనాలకు బానిసలు కావడం, విలాసవంతమైన జీవన విధా నం, పాశ్చాత్య సంస్కృతికి దాసోహం కావడంతో కొందరు యువకులు హత్యలకు సైతం తెగిస్తున్నారు. ఈ పెడధోరణులను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది. విలాసాల కోసం, డబ్బు కోసం, స్వల్పకాలంలోనే ఆర్థికంగా అందలాన్ని అందుకోవాలన్న తపనతో- కాలం కంటే వేగంగా పరుగులుతీస్తూ కొంతమంది యువతీ యువకులు తమ జీవితాలను చేతులారా పాడుచేసుకొంటున్నారు. ఇంకొందరైతే తల్లిదండ్రులను, భార్యా పిల్లలకంటే వస్తువులపై మోజు పెంచుకుంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకం పట్ల అంతగా శ్రద్ధవహించడం లేదు. పిల్లలకు ఏది మంచి? ఏది చెడు? అని చెప్పేవారు కరవయ్యారు. పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబ పెద్దల మధ్య గడిపే సమయం చాలా తక్కువ కావడంతో అనుబంధాల గురించి అవగాహన లోపిస్తోంది. ఎక్కువ సమయాన్ని సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వినియోగానికే కేటాయిస్తూ ఉన్నారు. పాఠశాల దశనుండే పిల్లలు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. తోటి స్నేహితులతో కలసి సినిమాలు, బేకరీలలో ఎగ్‌పఫ్‌లు, కర్రీ పఫ్‌లతో మొదలైన అలవాట్లు వారిని క్రమంగా పబ్‌లు, పార్టీల దాకా నడిపిస్తున్నాయి. మద్యం, సిగరెట్లు, డ్రగ్స్, అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారుతున్నారు. ‘నా జీవితం నేను ఎంజాయ్ చేస్తా..’ అంటూ చివరకు స్నేహితుల ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎలా ఉందో యువతను ఎటువైపు తీసుకువెళ్తుందో ఎవరూ చెప్పలేం.
పిల్లల జీవితాలను ఆనందమయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సోషల్ మీడియా ప్రభావంతో చెడుదారులలో పయనిస్తున్నవారికి, లైంగిక చర్యలకు ఉసిగొల్పబడేవారికి సరైన కౌనె్సలింగ్ ఇవ్వాలి. కొందరు యువకులు ఏదో మానసిక స్థితిలో గతి తప్ప డం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు, స్నేహితులతో గొడవులు హత్యలకు, ఆత్మహత్యలకు, యాసిడ్ దాడులకు దారితీస్తున్నాయి. రానున్న కాలంలో ఈ విష సంస్కృతి మహావృక్షంగా మారే ప్రమా దం పొంచి ఉంది.
విలువలు పతనం కావడంతో సమాజంలో మానవ త్వం మంటకలుస్తోంది. మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమకు, లైంగిక చేష్టలకు తేడా తెలియడం లేదు. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వాల్సిందిపోయి ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రేమ అనే మాయలో ఉన్మాదులుగా మారుతున్న యువకులను సన్మార్గంలో నడిపించాలి.
ఉన్మాదం తగ్గాలంటే...
* పిల్లలు సన్మార్గంలో నడిచేలా పాఠశాల దశనుండే విద్యావిధానంలో సమూల మార్పు రావాలి.
* పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
* ప్రతిరోజూ పిల్లలతో గడిపేందుకు పేరెంట్స్ కొంత సమయం కేటాయించుకోవాలి. సెలవురోజులలో కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలు సందర్శించాలి.
* యుక్తవయసు పిల్లలకు సంబంధించిన స్నేహితులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి.
* పిల్లలు దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే సైకాలజిస్ట్‌ల సహాయాన్ని తీసుకోవాలి.
* భయాందోళనలు కలిగించే దృశ్యాలు యువత కంటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలుకూడా ఉన్నాయని పిల్లలకు చెబుతుండాలి.
* యువతకు స్నేహం, ప్రేమకు మధ్య వ్యత్యాసం తప్పనిసరిగా వివరించాలి.
చెడుమార్గం పట్టే యువత ఒక్క నిమిషం ఆలోచించాలి.. నేరాలు చేసేవారిని పోలీసులు అరెస్టు చేసి తప్పకుండా కటకటాల్లోకి పంపుతారు. వ్యసనాలకు బానిసలై చెడు మార్గం పట్టే యువకులను చూసి వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన చెందుతారు. కుటుంబాన్ని ఆదుకొనే యువకులు శాశ్వతంగా దూరమైతే ఆ తల్లిదండ్రుల శోకానికి అంతే ఉండదు. తమపై ఆధారపడిన వారికోసమైనా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. విలాసాలకు, వ్యసనాలకు, నేరాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల మెప్పు పొందాలి. జీవితంలో ఏదైనా మంచిపని సాధించాలన్న దిశగా యువత దృష్టిసారించాలి. యుక్తవయసులో విపరీత ఆలోచనలకు లోనవడం సహజం. అయితే నిరంతరం తమ కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకుసాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆలోచించి, అందులోని మంచిచెడులను సరిచేసుకుంటూవెళ్ళాలే కాని హత్యలు, ఉన్మాదచర్యలు చేసే స్థాయికి దిగజారిపోకూడదు.
వ్యసనాలకు బానిసలైనా, నేరాలకు అలవాటు పడినా సమాజం అవహేళన చేస్తుందన్న నిజాన్ని యువత గుర్తెరగాలి. శ్రమను, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటే విజయం తథ్యమని గ్రహించాలి. తమను బలవంతులుగాచేసే ప్రతి అంశాన్నీ స్వీకరించాలి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించాలి. ఏ పరిస్థితులలోఉన్నా కర్తవ్యం గుర్తుంటే అన్ని పనులూ సాఫీగానే జరుగుతాయి. సమస్యలను సవాల్ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321