సబ్ ఫీచర్

స్నేహితుల్లాగే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు కాదు పిడుగులు అనేమాట మనం వింటూ ఉంటాం. ప్రతి తరంలోను మేము నీ అంత అప్పుడు ఇలా ఉండలేదమ్మా అనేవాళ్లను చూస్తూ ఉంటాం. తరతరానికి మార్పు సహజం. అసలు మొన్నటి కన్నా నిన్న, నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు మెరుగులు దిద్దుకుంటేనే రోజు ఎంతో ఆనందాన్ని స్తుంది. మార్పు అనేది చాలా సహజం. ఈ మార్పు పిల్లల్లో మరీ కనబడుతుంది.
పిల్లలకు మాట వచ్చింది మొదలుకొని ఒకటే ప్రశ్నలు అడుగుతుంటారు. కొందరు అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు విసుక్కుంటుంటారు. ‘అబ్బా ఒకటే కొశ్చిన్ బ్యాంక్ తెరిచాడు వీడు’అనేస్తుంటారు. ఇట్లా అనడం తప్పు. పిల్లల్లో సహజంగా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ వారికి కొత్తగా కనిపిస్తుంది. అదేమిటో తెలుసుకోవాలన్న ఆశ మెండుగా ఉంటుంది. అందుకే వారు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. ఆ విషయం గురించి వారికి తెలుసు అనుకొనేదాకా ప్రశ్నలు వేస్తుంటారు.
ప్రశ్నలు వేయడం మంచిదే. వారిలో నూతనోత్సాహం కలిగించడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి బీజం పడేదిక్కడే. అందుకే వారికి అర్థమయ్యేవిధంగా సులువుగా వారి భాషలోనే వారికి చెప్పాలి కాని పెద్ద పెద్ద పదాలు వాడి వారిని అయోమయానికి గురి చేయకూడదు. అంతేకాదు కొత్త కొత్త వస్తువుల గురించోలేక కొత్త విషయాల గురించి, మహానుభావుల గురించో వారికి ఆసక్తి పెరిగే విధంగా విషయాన్ని అమ్మలు విడమర్చి చెప్పాలి. వారిలో ఈ విషయాలన్నీ విని సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
ఇంకొందరు పిల్లలు ఏ వస్తువునైనా విడగొట్టడానికి చూస్తుంటారు. అంటే ఇది పిల్లల్లో ఆ వస్తువు ఎట్లా ఏర్పడిందో తెలుసుకోవాలనే ఉబలాటం ఎక్కువ అవడం వల్ల ఇట్లా చేస్తుంటారు. కనుక వారికి ఏ వస్తువులతో ఏపద్ధతిలో వారి చేతిలో ఉన్న వస్తువు తయారు అవుతుందో వారికి అప్పుడప్పుడూ చెబుతుండాలి. అపుడు ఆ వస్తువును విడగొట్టకుండానే దాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు.
మరికొందరు చుట్టుపక్కల ఉన్న పిల్లల దగ్గరకు ఆసక్తిగా వెళ్తారు. వారిని ఇంటికి పిల్చుకొని వస్తుంటారు. వారికి వీరి దగ్గర ఉన్నవి చూపిస్తుంటారు. వారిని కూడా ఉత్సాహపరిచేలా వీరి దగ్గర ఉన్నవస్తువులు ఎట్లాంటివో చెబుతూనే వీరి దగ్గర ఉన్నవి పక్కవాళ్లకు కూడా ఉపయోగపడేవిధంగా ఇవ్వడం నేర్పించాలి. అపుడు వారికి ఇతరులకు ఇవ్వడం ఉన్నదాన్ని నలుగురితో కలసి పంచుకునే తత్వం ఏర్పడుతుంది. ఇది వారిలో దయాగుణం పెరగడానికి తోడ్పడుతుంది.
పిల్లలు పెద్దయ్యేకొద్ది వారు స్నేహితులకు ఎక్కువ విలువనిస్తుంటారు. ‘మా ఫ్రెండ్ చెప్పాడులే’ అనేస్తుంటారు. తల్లిదండ్రుల కన్నా వారికి స్నేహితులే మిన్నగా కనిపించడం సహజం. ఆయా సందర్భాల్లో ‘ఏమి మా కన్నా వాడే నీకు ఎక్కువనా’ అని తల్లిదండ్రులు కోప్పడుతుంటారు. ఇది మంచి లక్షణం కాదు. వారు చెప్పినదానికి సరే అనకపోయినా ఫర్వాలేదు కాని వారి స్నేహితులను విమర్శించకుండా విషయం గురించిన అవగాహన వారికి వచ్చేలాగా చేయాలి. అపుడు వారు మీరు కోరుకున్నట్టు చేస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ స్నేహితుల్లాగే మసిలితే వారు ఎంతో కలివిడిగా విషయాలను చెబుతుంటారు. వారిలో వచ్చే మార్పులను బట్టి తల్లిదండ్రులు వారికి మంచి సలహాలను కూడా ఇవ్వచ్చు.
పిల్లలతో ఎప్పుడు మాట్లాడినా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేవిధంగా మాట్లాడాలి కాని, వారిని వేరొకరితో పోల్చి నీవు తక్కువ అనేయ కూడదు. దానివల్ల వారిలో మానసిక సంఘర్షణ ఎక్కువై ఆత్మనూన్యతకు దారితీస్తుంది.
ఒకవేళ చదువులో వెనుకబడి ఉన్నా వారిని చదువుబాగా చదువగలవు. ఏదో మార్కులు రావడంలేదు. నీకు విషయం అర్థమయితే ఇది చాలా సులువుగా ఉంటుంది అన్నమాటలు చెప్పాలి కాని నీకు బుద్ధి తక్కువనో నీకు బుర్రలేదనో వారిని ఈసడించే మాటలు అనకూడదు. ఇది వారిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.
కాలానుగుణంగా వారికి సెల్‌ఫోన్లు, టీవీలు అన్నీ అందుబాటులోకి తెచ్చినా వాటిని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. కాని వారిని అనుమానంతో చూస్తున్నామన్న భావం వారిలో కలుగకుండా కూడా చూసుకోవాలి. ఎప్పుడూ పిల్లలతో వాదించకుండా వారికి అసలు విషయాన్ని ఒక్కసారిగా కాకపోయినా పదిసార్లు అయినా విడమర్చి చెప్పాలి కాని వారిని తక్కువ చేసి చూపకూడదు.

- లక్ష్మీప్రియాంక