సబ్ ఫీచర్

గద్దర్ రసవాది.. రాజకీయ నేత కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాగాయకుడు గద్దర్ పార్టీ పెడతారట..’
‘ఆ.. ........’
‘ఏమండోయ్.. గద్దర్ రాజకీయ పార్టీ పెడతారట...’
‘అంత సీన్ లేదులే!’
‘అదేమిటి.. అలా అంటారు?’
‘అదంతే!.. అది పూర్తిగా పాతపాట.’
- ఊహాత్మకమైన ఈ సంభాషణను పక్కన పెడితే...
ఆగస్టులో పది లక్షల మంది సమక్షంలో కొత్త రాజకీయ పార్టీని, దాని మేనిఫెస్టోను ప్రకటిస్తానని గద్దర్ ఇటీవల ప్రకటన చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పదివేల మందిని పోగేసి సభ జరపడం గగనమైన వేళ గద్దర్ పది లక్షల మందితో సభ నిర్వహిస్తానని, ఆ వేదికపై కొత్త పార్టీని, ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పడం ఎవరికైనా ‘అతి’గా అనిపిస్తుంది.
వచ్చేది ఎన్నికల సంవత్సరం. దాంతో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల వేగాన్ని ఏదో రూపంలో పెంచాయి. దాంతో రాజ్యాధికారంపై ఆశతో గద్దర్ సైతం నిద్ర లేచాడు. ఓటు రాజకీయాల్లోకి వస్తున్నానని పునరుద్ఘాటించాడు. ఇప్పుడు అంతా ఓటు పోరాట రూపమని, అది తప్ప మరోమాట మాట్లాడనని ఆయన చెప్పాడు. తన కొత్త నినాదం మీకు (సమావేశానికొచ్చినవారు) అంగీకారమైతే ‘రేపే నేను ఓటరుగా పేరు నమోదు చేయించుకుంటా..’అని వాగ్దానం చేశాడు. అన్నీ ప్రజల అనుమతి, అంగీకారంతోనే చేస్తానన్నాడు. ‘రాముడు మంచి బాలుడు’అన్న రీతిలో మీడియా ముందు వినయ విధేయతలతో ఆ వివరాలు వెల్లడించాడు.
గత సంవత్సరం సాయుధ పోరాట పంథా, మావోయిస్టుల మార్గం వీడి పార్లమెంటరీ రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా ప్రకటించి గద్దర్ పెద్ద హడావుడి చేశాడు. దాంతో ఆశగా వామపక్షాలు స్వాగతించాయి. తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి. కొన్ని సంఘాలు సభ్యత్వం తీసుకోమని ఒత్తిడి చేశాయి. కొన్ని మిత్రబృందాలు ఆయనను ‘బందీ’ చేసేందుకు యత్నించాయి. అందరినీ సంతృప్త పరిచేందుకు గద్దర్ ప్రయత్నించాడు. వారి వారి సభలు- సమావేశాలకు హాజరై పాటలు పాడి, ఆటలు ఆడి, కొత్తతరహాలో నృత్యం చేసి, ప్రసంగాలు చేసి, కర్రసాము చేసి- ఇక ‘ప్రభంజనం’ సృష్టిస్తానన్నాడు. ‘టి-మాస్’తో కొంతకాలం సహవాసం చేసి జిల్లాలు తిరిగాడు. దాన్ని రాజకీయ పార్టీగా మారుస్తానన్నాడు.
ఇదిలా ఉంటే తన చిరకాల మిత్రుడు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ గద్దర్‌ను ఆహ్వానించాడు. తనకు కుడి భుజంగా ఉంటాడని ఆశలు పెంచుకున్నాడు, కలిసి విలేఖరులతో మాట్లాడారు, సునామీ సృష్టిస్తామన్నారు. ఇక రాజ్యాధికారం మాదేనని భరోసా ఇచ్చారు. ఇలా అనేక గడపలు తొక్కాక ఎక్కడా కుదరక చివరకు గద్దర్ తానే పార్టీని ప్రారంభించాలన్న తలంపుకొచ్చాడు. ఎలాగూ తన మిత్రులు తలో రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి తనూ ఓ రాజకీయ పార్టీ పెట్టేందుకు కృత నిశ్చయానికొచ్చినట్టనిపిస్తోంది.
వాస్తవానికి గద్దర్ ‘రసవాది’, రాజకీయ నాయకుడు కాదు. ఆ లక్షణాలు అసలే లేవు. కవిగా, గాయకుడిగా, కళాకారుడిగా లక్షలాది మందిని ‘్ఫదా’ చేయగల నైపుణ్యమున్నవాడు. ఆ రసోత్పత్తిలో ప్రజల్ని ఓలలాడించగలడు. ఆయన కంఠంలో పాట పారవశ్యంతో పరిపరి విధాలుగా ఒయలు ఒలికిస్తుంది. లాస్యం ఆయన ముఖంలో తాండవమాడుతుంది. హావభావాలు ఔరా..! అనిపిస్తాయి. జానపద గుబాళింపు కొత్త అందంతో వెనె్నలలా వెలుగొందుతుంది. అనిర్వచనీయమైన రసగంగలో ప్రేక్షకులు తేలియాడుతారు. ఆ రకంగా ఆయన గొప్ప కళాకారుడి కింద లెక్క. కాని రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడికి అవసరమైన లక్షణం ఏ ఒక్కటీ ఆయనలో కనిపించదు. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని ఆయన గుర్తించకుండానే కాలం దొర్లిస్తూ మరోసారి రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించాడు.
దశాబ్దం క్రితం ‘తెలంగాణ ప్రజాఫ్రంట్’ స్థాపన తరువాత ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. టి-మాస్ మాయమైన సంగతి గుర్తించడం లేదు. తెలంగాణ ఇంటి పార్టీ ఎక్కడున్నదో ఎవరికీ తెలియని స్థితి. ఈ నేపథ్యంలో గద్దర్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్రకటనలు గుప్పిస్తే అందులో ఏ రకమైన ఆశావహ అంశం అగుపించడం లేదు. కళాకారుడిగా ‘ఎక్కా నంబర్’గా నిలిచినట్టు రాజకీయాల్లో నిలవాలన్న ఆకాంక్షకు అనువైన ‘సరుకు’ ఉండాలి కదా? అందులో ఓటు రాజకీయం గూర్చి ఏమీ తెలియదని, నిపుణులనడిగి తెలుసుకుంటానని చెబుతూ ఓటు రాజకీయం చేసేందుకు సిద్ధమవడం అది ఎవరికి భారం?... పూర్తిగా ప్రజలపైనే ఆ భారం పడుతుంది.
ప్రజాసేవ పేర ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చేస్తున్నదే గద్దర్ చేసేందుకు ముందుకొస్తే ఏమిటి ప్రయోజనం? వారికి, ఈయనకు ఏమిటి వ్యత్యాసం? ఈ స్పష్టత లేకుండానే గద్దర్ కదలికలుండటం విషాదం గాక ఏమవుతుంది? గద్దర్‌కు, పార్టీలు ప్రారంభించిన ఆయన మిత్రులకు వర్తమానంపై పూర్తి అవగాహన లేదు. సోవియట్ యూనియన్ క్రియాశీలకంగా పనిచేసినప్పటి ఆలోచనా ధోరణి, భావజాలంతో, విషయ పరిజ్ఞానంతో వర్తమానాన్ని తిలకిస్తున్నారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై పాతిక సంవత్సరాలైంది. చైనా తన కమ్యూనిస్టు భావాలను చిదిమేసింది. పూర్తిగా పెట్టుబడిదారీ అవతారమెత్తింది. ఈ ఎరుకను విస్మరించి తమకున్న కొద్దిపాటి గుర్తింపును, పలుకుబడిని, పాటల ప్రపంచంతో నిర్మించుకున్న పందిరిని రాజకీయం కోసం ఉపయోగించుకుందామని, ప్రజలను సరికొత్త ప్రపంచంలోకి నడుపుతామనుకోవడం అమాయకత్వమే తప్ప మరొకటి కాదు.
గద్దర్ ఇప్పుడు 70వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అంటే గత కాలపు స్మృతులతో జీవించే సందర్భం. ఇది ఆయన మనవరాలు, మనవడి తరం. వారి ఆలోచనలకు, గద్దర్ చెప్పే రాజకీయాలకు ఎక్కడా పొంతన కుదరదు. సమాజంలో ఇప్పుడు యువత సంఖ్య ఎక్కువుంది. ఈ దేశం, ఈ ప్రపంచం వారిది. వారిని నడిపించేదే నిలుస్తుంది తప్ప వారిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళని మేనిఫెస్టో దేనికి ఉపకరిస్తుంది? శ్రమ సిద్ధాంతంతో ప్రభావితమైన వారు కృత్రిమ మేధతో విప్లవాన్ని సృష్టిస్తున్న ఉడుకు నెత్తురుగల వారికి ఏ రకంగా నాయకత్వం వహిస్తారు? గద్దర్, ఆయన మిత్రబృందం పుట్టిపెరిగిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితి వేరు. ఈ నూతన సమాజ ఆనుపానులు తెలియకుండా, ఈ సమాజంలోని వారికి రాజకీయ పార్టీ మాధ్యమం ద్వారా ‘సేవ’ చేస్తామని ముందుకు దూకడం ఓ రకంగా ప్రజలను దగాచేయడమే.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విధానాలను ఎండగట్టి, పాలకుల్లో మెలకువ కలిగించేందుకు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టేందుకు రాజకీయ పార్టీల ఏర్పాటే ముఖ్యం కాదు. పౌర సమాజంలో చైతన్యం విస్తృతమైంది. ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకు వివిధ వేదికలు, సామాజిక మాధ్యమాలు, మీడియా కళ్ళముందు కనిపిస్తోంది. పాలకుల మెడలు వంచేందుకు, కళ్లుతెరిపించడానికి అనేకానేక మార్గాల ద్వారాలు తెరిచే ఉన్నాయి. చైతన్యవంతమైనవారు వాటిని ఇప్పటికే సమర్ధవంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేది ఏం కనిపించదు. తమ ప్రాబల్యం పెంచుకోవడం తప్ప!
‘ప్రజాసేవ’ పేర రాజకీయాల్లోకి రావడం వర్తమానంలో అరిగిపోయిన రికార్డు లాంటిది. ఉత్తేజం, ఉత్ప్రేరకం అందించని ఆ రికార్డు వినిపిస్తే ఏమిటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? గద్దర్ మనవరాలు మెడికో. ఆ ఎదుగుదల, జ్ఞానం, చైతన్యం- ఆమెకు ఏ రాజకీయ పార్టీ అందించింది? ఏ సిద్ధాంతం ఆమెను ఆ ఎత్తుకు ఎదిగేలా చేసింది? గద్దర్ కాదు కదా. ఒకప్పటి ఆయన రాజకీయ గురువు కొండపల్లి సీతారామయ్య బతికుంటే సైతం ఇలా చెప్పేవాడు కాదు. ఈ ‘మర్మం’పై మనసుపెడితే మిగతా విషయాలు వాటంతట అవే విచ్చుకుపోతాయి. అశేషమైన కుటుంబాల్లో ఎదగాల్సిన యువతీ యువకులు జ్ఞానంతో ఎదిగేలా అవసరమైన ఆక్సిజన్ అందించడంలోనే ఆధునిక రాజకీయం దాగుంది తప్ప! అధికార దాహంలో కాదు.

--వుప్పల నరసింహం 99857 81799