సబ్ ఫీచర్

తెలిసి తప్పులు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థి అనేపదానికి విద్యను అర్థించేవాడు అని అర్ధం. కాని ఈ పదం నేటి పాఠశాలలలో చదువుకునే వారికి ఎంతమాత్రం వర్తించదు. ఇంగ్లీషులో స్టూడెంట్ అనే పదానికి సరైన తెలుగు పదం కనిపించడం లేదు. కనుక ఈ పదాన్ని తప్పని పరిస్థతుల్లో వాడుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ఉచితంగా విద్యను అందిస్తోంది. దీనితోపాటు భోజనం పుస్తకాలు కూడా ఉచితమే. అనేక వసతి గృహాలున్నాయి. ఇక్కడగల పిల్లల సర్వ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాథమిక స్థాయినుండి విశ్వవిద్యాలయాల స్థాయివరకు విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అసమర్ధులైన ఉపాధ్యాయులు, చదువు అవసరం లేని పిల్లలు ఎక్కువైపోతున్నారు.
ఇక పరీక్షా విధానం ఒక ప్రహసనంగా తయారైంది. మాస్ కాపీయింగ్‌లు, పేపర్ లీకేజీలు పెరిగిపోతున్నాయి. 1947వ సంవత్సరం మార్చి నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్ష లెక్కల పేపరు లీకైంది. ఆనాడు నేటివలె పరీక్షలు సుమారు పనె్నండు రోజులు జరిగేవికావు. మొత్తం పరీక్షలు ఐదురోజుల్లో పూర్తి అయ్యేవి. రెండవరోజు లెక్కల పేపరు లీకైనట్టు గ్రహించిన ప్రభుత్వం ఆనాడు సాయంత్రం రేడియోద్వారా మొత్తం పరీక్షలన్నీ రద్దు అయినట్టు తిరిగి ఏప్రిల్ నెలలో పరీక్షలు జరపబడతాయని ప్రకటించింది. ఆ విధంగా ఏప్రిల్ నెలలో పరీక్షలు తిరిగి నిర్వహించబడ్డాయి. అది బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగింది కనుక అట్టి నిర్ణయం తీసుకోబడింది. నేను ఆనాడు ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్ష రాసి ఉత్తీర్ణుడైనాను కనుక ఈ విషయాలు చెప్పగలిగాను. తరువాత అనేక పర్యాయాలు లీకేజీలు జరిగాయి. లీకైనప్పుడల్లా ప్రభుత్వం తాము విచారణ జరిపినట్టు, లీకవడం వాస్తవం కాదని ప్రకటనలు ఇవ్వడం అలవాటైపోయింది. రీ ఎగ్జామినేషన్ అనేది ఎన్నడు జరగలేదు. ఇక పరీక్షలు నిర్వహించడం అనవసరం. ఇది ఒక ఆత్మవంచన. కనుక దీనికి ప్రత్యామ్నాయం తీవ్రంగా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. భమిడిపాటి కామేశ్వరరావుగారు గొప్ప హాస్య రచయిత. ఆయనకు హాస్యబ్రహ్మ అని బిరుదు లభించింది. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. పాఠశాలకు ఎన్నడూ ఆయన ఆలస్యంగా రాలేదు. విద్యార్థులను ఎప్పుడూ తిట్టలేదు. కొట్టలేదు. తరగతిలో పిల్లలపేర్లన్నీ ఇంటి పేరుతో సహా ఆయనకు గుర్తుండేవి. రాజమండ్రి వీరేశలింగం ఉన్నత పాఠశాలలో ఆయన లెక్కల మాస్టా రు.లెక్కలలోకూడా హాస్యం సృష్టించి పిల్లలను నవ్వించి తరువాత ఆ లెక్కలు సులువుగా ఎలా చేయాలో బోధించేవారు. ఆనాటికే అనగా 1947నుండి విద్యార్థుల్లో క్రమశిక్షణ దిగజారడం ప్రారంభమైంది.
ఆయన ఇది గ్రహించి ముందు ముందు పిల్లలు జండాలు పుచ్చుకుని మాకు ఈ పాఠాలు తీసివేయాలని ఫలానా ఉపాధ్యాయులను తొలగించాలని ఊరేగింపులు జరుపుతారు అని చెప్పేవారు. చదువుకునేవారు తమ గురువులకు ఎదురు తిరిగి వారిని కొడతారని ఆనాడు ఆయన ఊహించలేదు. ఆయనవద్ద చదువుకునే అదృష్టం లభించింది గనుక ఈ విషయం చెప్పగలిగాను. విద్యార్థులు విద్యాలయాల్లో శ్రద్ధగా చదువుకోవాలి. ఆ విషయంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే అధికారులకు చెప్పాలి. మతాలు కులాల ప్రస్తావన లేకుండా అందరు సోదర భావంతో మెలగాలి. చదువుకునే వారికి చదువు చెప్పేవారికి సంఘాలు ఏమిటి? ముందు ప్రభుత్వం ఈ విధానం రద్దు చేయాలి. విద్యాలయాలలో హాస్టల్స్ తొలగించాలి. ఇవి నేడు అనేక అసాంఘిక కార్యకలాపాలకు నెలవులైనాయి. ఇందులో ర్యాగింగ్ ఒకటి. ఏదో ఒక చదువు తరువాత మరొక చదువు పేరుతో కొందరు ఏళ్లకొద్దీ తిష్టవేస్తున్నారు వీటిలో.
ఇటీవల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అలజడులు కనీవినీ ఎరుగని స్థాయికి చేరాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులతో విద్యార్థులు దురుసుగా ఎందుకు ప్రవర్తించాలి? వీరికి అవకాశవాద రాజకీయ పార్టీలు వత్తాసు పలకడం ఏమిటి? వీటిని ఉపేక్షిస్తే ఈ వ్యాధి అన్ని విద్యాలయాలకు వ్యాపిస్తుంది. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని వైస్ ఛాన్సలర్ పై దాడిచేసిన వారిని శిక్షించాలి. విద్యాలయాల్లో ఉపాధ్యాయ నియామకాలు ప్రభుత్వం చేస్తుంది. ఇందులో విద్యార్థులకు సంబంధం ఏమిటి? గురుశిష్యుల సంబంధాలు తండ్రీకొడుకుల సంబంధాల వంటివి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు విద్యతోపాటు వినయం నేర్చుకోవాలని కాంక్షించాలి. వారి పిల్లలు ఇలాంటి అలజడుల్లో పాల్గొంటున్నట్టు వారు ఎరుగరా? తెలిసి ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు సామాజిక న్యాయం కోసం విద్యార్థులు పోరాడుతున్నారుట. సామాజిక న్యాయం చేయాల్సింది ప్రభుత్వం. ఆ పని ప్రభుత్వం ఏనాడో చేసింది. ఇంకా అవసరమైతే చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అవకాశంగా తీసుకుని చదువుకునేవారు జాతి వ్యతిరేక కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రభుత్వం ఉపేక్షించదు. చివరగా ఒక మాట. డాక్టర్ భీష్మసహానీ హిందీ భాషలో తమస్ అను ఒక గొప్పనవల రాసారు. దానిని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారు తెలుగులోకి అనువాదం చేసారు. దాని ముందు ఇలా రాసారు.
‘‘మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు నడిపేవారిని, స్వార్ధ ఫ్రయోజనాల కోసం కుల మత విద్వేషాల్ని రెచ్చగొట్టే వారిని కనీసం మనసులోనైనా వ్యతిరేకించే చిత్తాశుద్ధి ధైర్యం ఉంటేనే తమస్ చదవండి. లేకుంటే మీ కాలాన్ని వ్యర్ధం చేసుకోకండి’’
ఈ మాటలు అక్షర సత్యాలు. ఒకసారి ఆలోచించండి.

-వేదుల సత్యనారాయణ