సబ్ ఫీచర్

‘నీట్’ తీర్చేది ఎవరి అవసరాలను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యన సుప్రీంకోర్టు ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నది. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థది మూడోస్థానం. పార్లమెంట్ చేసే చట్టాలకు రాజ్యాంగానికి, భంగం వాటిల్లకుండా చూడడం, పాలనా వ్యవస్థ అదుపుతప్పితే వ్యాఖ్యానించడం, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలివ్వడం న్యాయవ్యవస్థ విధి. పదే,పదే కోర్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయంటే, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గాడితప్పుతున్నదన్నమాటే!
వైద్యవిద్యలో ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలని, వివిధ రాష్ట్రాల, ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్వంత ప్రవేశ పరీక్షలు చెల్లవంటూ గత ఏప్రిల్ 25న అత్యున్నత న్యాయస్థానం ఓ రూలింగు ఇచ్చింది. ఒకవిధంగా ఇదోమంచి నిర్ణయమే. కాని, రోగమొకటైతే, మందొకటిలా సుప్రీంకోర్టు తీర్పు కనబడుతున్నది. దేశవ్యాపితంగా గల 579 వైద్య కళాశాలలకు, 309 డెంటల్ కళాశాలలకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వంతంగా ప్రవేశ పరీక్షల్ని నిర్ణయించడం ఎమర్జెన్సీ తర్వాతి కాలంనుంచి కొనసాగుతున్నదే. పాండిచ్చేరి జిప్‌మార్, వెల్లూర్, ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ స్వయం ప్రతిపత్తితో ప్రవేశ పరీక్షను నిర్వహించుకొని అడ్మిషన్స్ కల్పిస్తున్నాయి. ఇక ఈ మధ్యన డీమ్డ్ విశ్వవిద్యాలయాలంటూ పుట్టుకొచ్చిన సంస్థ లు, వాటికవే పరీక్షల్ని నిర్వహించి విద్యార్థుల్ని ఎంపిక చేసుకుంటున్నాయి. ఇలా దేశవ్యాపితంగా జరిగే వైద్య విద్య ప్రవేశ పరీక్షలు 740కి పైగా వున్నాయి. పోతే, వీటన్నింటిని నియంత్రిస్తున్నవి మాత్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ), డెండల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డిసిఐ)లే. నిజానికి ఈ రెండు సంస్థలు అవినీతికి ఆలవాలంగా, లోపభూయిష్టంగా నడుస్తున్నాయంటూ, స్వయాన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఈ సంస్థల వ్యవహారశైలిపై బ్రిటీషు మెడికల్ జర్నల్ కూడా అసంతృప్తిని వెల్లడించింది.
ఇలాంటి లోపభూయిష్ట సంస్థ, సిబిఎస్‌ఇతో కలిసి మెడికల్, డెంటల్, పిజి అడ్మిషన్లకై దేశస్థాయిలో ఒకేవిధమైన (నీట్) ప్రవేశ పరీక్ష నిర్వహించాలని సూచించడం ఆలోచించాల్సిన అంశమే. దీనికి చెబుతున్న ప్రధాన కారణం, ప్రైవేటు యాజమాన్యాలు మేనేజ్‌మెంటు కోటాను కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నాయని, నాణ్యతతో కూడిన విద్యను అందించడం లేదని, అన్నింటికి మించి మెరిట్‌కు స్థానం లేకుండా చేస్తున్నాయని. నిజానికి ఇవన్నీ వాస్తవాలే. వీటన్నింటిని నియంత్రించడానికి నీట్ పరీక్ష ఎలా పనిచేస్తుందో స్పష్టమైన వివరణ లేదు. అవినీతికరమైన వ్యవస్థలో వీటిని రూపుమాపే వ్యవస్థకై ఆలోచించాలికాని, ప్రత్యామ్నాయంగా మరో లోపభూయిష్ట విధానాన్ని ముందుకు తేవడం సరైంది కాదు.
వివిధ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల అడ్మిషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల, ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల ప్రకారం జరుగుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో 15 శాతం నాన్ లోకల్ కోటా ద్వారా, మిగతావి, లోకల్ ద్వారా ఇవ్వబడగా పీజీ సీట్లు 50 శాతం కోటాగా ఉంటున్నాయి. మొత్తంగా కన్వీనర్ కోటా 80 శాతం కాగా మిగతా 20 శాతాన్ని మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగానే ఇవ్వాలనేది నిబంధన. ఈ నిబంధన ఎక్కడా అమలుకాకపోవడం నాన్ మెరిట్ విద్యార్థులకు వేలంపాట నిర్వహించి, ప్రవేశ పరీక్షలకు ముందే సీట్లను అమ్ముకోవడం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మెడికల్ కౌన్సిల్, పౌర సంస్థలు ప్రశ్నించడంతో ప్రైవేట్ కళాశాలు తామే స్వయంగా ప్రవేశ పరీక్షల్ని నిర్వహించుకుంటామనే వాదనను ముందుకు తేగా సుప్రీంకోర్టు ససేమిరా ఒప్పుకోలేదు. ఇదో మంచి తీర్పే.
దేశవ్యాప్తంగా లభ్యమయ్యే 56వేల వైద్య విద్యాసీట్లలో దాదాపు 30వేల సీట్లు నల్లధనానికి అమ్ముడు పోతున్నట్లు కథనాలు. ఇలా 12వేల కోట్ల రూపాయల మెడికల్ అడ్మిషన్ వ్యాపారం జరుగుతున్నదని, కొన్ని కళాశాలల్లో మెడికల్ సీటుకై 50 లక్షలు, పీజీ సీట్లు కోటి నుంచి మూడు కోట్లు పలుకుతున్నది బహిరంగ రహస్యమే. జ్ఞాపకశక్తిని మెరిట్‌గా భావించే వ్యవస్థలో 160 బహుళైచ్ఛిక ప్రశ్నల పరీక్షలో ఏమీరాని విద్యార్థి కూడా 30-40 మార్కులు సంపాదించవచ్చు. ఇలా ఆబ్జెక్టివ్ విధానంలో ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున, మైనస్ మార్కు లు లేకుండా రాష్ట్రాలు ఎంపిక చేసే వైద్య ప్రవేశ పరీక్షమెరిట్‌ను గుర్తించడం లేదని, దీనికి భిన్నంగా ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున 180 ఎనలిటికల్ ప్రశ్నలకు, తప్పుకో మార్కు తగ్గిస్తూ వుండే నీట్ విధానం సరియైందని సుప్రీంకోర్టు భావిస్తే, ఈవిధామైన పరీక్షనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించవచ్చని సూచించవచ్చు. అలాగే ఒకే అభ్యర్థి ఒకే విద్యాసంస్థలో పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాస్తున్నాడని భావిస్తే, దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలు ఒకేసారి పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవచ్చు. లేదా ఒక విద్యార్థి ఒకే రాష్టల్రో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోనన్నా రాయాలని కట్టడి చేయవచ్చు.
సువిశాల దేశంలో, విభిన్న ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, లభించే ప్రకృతి కారకాలైన నీరు, గాలి వేరువేరుగా వుంటున్నాయి. రోగమైనా నొప్పి అయినా బడుగు వర్గాలనే అధికంగా పలకరిస్తాయి. వీటికి గల కారణాలు సంబంధిత వైద్యవిధాన పరిషత్‌కు తెలుసు. వీటికి అనుగుణంగా వైద్యవిద్య ఉండాలి. ఓ విద్యార్థి జమ్ము కాశ్మీర్‌లో, మేఘాలయలో చదువుకుంటే అక్కడి ప్రజల నాడిని చూసి అభ్యసించిన వైద్యవిద్య, దక్షిణ భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో నూటికి నూరుశాతం పనికిరాదు. అలాగే పట్టణ, గ్రామీణ, గిరిజన ఆవాసాలు వేటికవే వేరువేరు అవస్థలలో వుంటాయి. వాటికి స్థానికత అనే ఆలోచనా వైద్యవిధానం పనిచేస్తుంది. ఇందుకై ఈ ప్రాంతాలకు చెందినవారై, ఈ ప్రాంత కళాశాలల్లో వైద్యవిద్యను అభ్యసించి, కొంతకాలం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం వైద్యవృత్తి ధర్మం. అందుకే రూరల్ ప్రాక్టీసు తప్పనిసరని భావించారు. ఇంత వున్నా, వేలల్లో డాక్టర్లు తయారైనా, పట్టణాలకే పరిమితమైంది వైద్యం. అదీ వ్యాపారమైంది. రోగి దగ్గరకే వైద్యుడు అనే నైతికత నుంచి వైద్యుడి దగ్గరికే రోగి అనే విధానం దేశవ్యాపితమైంది. దీనె్నవరూ గుర్తించడంలేదు.
ఎంసిఐ లెక్కల ప్రకారం 2005-14 మధ్యన వైద్యంపై మన మెడికల్ కాలేజీలు ప్రచురించిన పత్రాలు 1,01,034 కాగా 332 కాలేజీలు ఒక్క పత్రాన్ని కూడా ప్రచురించని తీరు. ఈ పత్రాలు కూడా ఎఐఐఎంఎస్, 11,337, చండీగఢ్ మెడికల్ సంస్థ 8,145, వెల్లూర్ మెడికల్ కాలేజీ 3,742 ప్రచురించినవే. ఇదే కాలంలో అమెరికాలోని మాసాచ్యూట్స్ మెడికల్ సంస్థ 46,311, మేయో మెడికల్ సంస్థ 37,633 పత్రాలను సమర్పించాయంటే వైద్యవిద్యలో మనస్థానమెంతో తెలుస్తున్నది. శ్రీకాకుళంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల గూర్చి మన వైద్య విద్యార్థులు ఎప్పుడైనా ఆలోచించారా? ఆదిలాబాద్ గిరిజనులు సీజనల్ వ్యాధుల గూర్చి ఏ సంస్థనైనా పట్టించుకున్నదా? ఆకలి చావుల గూర్చి, స్వచ్ఛమైన నీటి గూర్చి, గాలి గూర్చి, పట్టించుకోని వైద్యవిద్య ఆక్సీజన్ సిలిండర్లపై వెంటిలేటర్లపై ఆధారపడి వైద్యం చేసినంతకాలం ఓ రామయ్య లాంటి డాక్టరులా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాక్టర్ నార్మన్ బెతూనులా, డాక్టర్ కోట్నీసులా తయారు కాలేరు. ఇలాంటి డాక్టర్లు తయారు కానంతకాలం ఈ దేశంలో వైద్యం అమ్మబడడం కాదు, శవాలపైన కూడా సంపాదిస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు మాట్లాడాల్సింది ఈ అంశాల గూర్చి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162