సబ్ ఫీచర్

నేతాజీ సమరోజ్వల కేతనం.. ‘ఫార్వర్డ్‌బ్లాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి పారద్రోలే ఉద్యమంలో ‘నేతాజీ’ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో ఎందరో యువకులు ముందుకు నడిచారు. దేశభక్తి ప్రపూరితమైన నాటి యువకులు గాంధేయవాదంతో ఏకీభవిస్తూనే విప్లవత్తోజ కార్యాచరణతో బ్రిటిష్ నిరంకుశ రాజనీతిని ప్రతిఘటించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో, స్వేచ్ఛా సాధనలో ఎందరో అజ్ఞాత త్యాగధనుల ఆత్మార్పణలు, సాహసోత్తేజం చరిత్రలో కరిగిపోయాయి. తెలుగునాట యువ రాజకీయ పోరాటశక్తిగా జాతినేతల నేతృత్వంలో ఉద్యమించిన నాటి పార్టీలలో ‘్ఫర్వర్డ్ బ్లాక్’ సృష్టించిన చరిత్ర విస్మరణకు గురై, క్రమంగా కాలగర్భంలో కనుమరుగవుతోంది.
‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్ శిష్యుడిగా సుభాష్ చంద్రబోస్ 1923లో అఖిల భారత స్వరాజ్య పార్టీలో కలకత్తా కేంద్రంగా ఆంగ్ల వారపత్రిక ‘ఫార్వర్డ్’కు సారథ్యం వహించారు. ఆ రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్‌లో- ప్రపంచ రాజకీయ నేపథ్యం ప్రభావంతో సోషలిజం భావోత్తేజం తీవ్రతరమైంది. 1938లో హరిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఇంగ్లండ్‌లో ఉన్న సుభాష్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. 1939లో త్రిపురలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీజీ అభీష్టానికి వ్యతిరేకంగా పట్ట్భా సీతారామయ్యను ఓడించటంతో ఆ పార్టీలో విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. పట్ట్భా గాంధీజీకి సన్నిహితుడు. ఆంధ్రుడే అయినా తెలుగునాట అతివాద కాంగ్రెస్ నేతలు సుభాష్‌నే బలపరిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో మెజారిటీ లేకపోవటం, గాంధీజీతో సైద్ధాంతిక విభేదాల ఫలితంగా సుభాష్ త్రిపురలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ద్వితీయ ప్రపంచ సంగ్రామ కారుమేఘాలు కమ్ముకొంటున్నాయి. బ్రిటన్‌తో ఏవిధమైన రాజీకి అంగీకరించని సుభాష్ చంద్రబోస్ 1939 మే 3న ఫార్వర్డుబ్లాక్ పార్టీ స్థాపనకు పిలుపునిచ్చారు. యువతరం ప్రతినిధులు దేశం నలుమూలలా సుభాష్ అడుగుపెట్టిన ప్రతి చోటా మహోత్సాహంతో స్వాగతం చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ఫార్వర్డుబ్లాక్ శాఖలు ఏర్పడటంతో అది జాతీయ పార్టీ అయింది. కాంగ్రెస్ అధ్యక్షునిగా తెలుగునాట కృష్ణా, గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ బాధితుల మహాసభలో 1940 జనవరి 9న ప్రియతమ నేత సుభాష్‌ను పూలవర్షంతో వైభవోపేత ఊరేగింపు స్వాగతించడంతో యావదాంధ్ర దేశం పులకించింది. రాజమహేంద్రవరం, మండపేట, రామచంద్రపురం బహిరంగ సభలలో నేతాజీ ప్రసంగించారు. ఆంధ్ర ప్రాంతంలో 1939 సెప్టెంబరు 3న కాకినాడ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహాసభలో సుభాష్ చంద్రబోస్ ప్రసంగిస్తుండగా, హిట్లర్ పోలెండ్‌పై దండెత్తిన వార్త వెలువడి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సమరోజ్జ్వలానికి నాంది పలికింది. సుభాష్ వారపత్రిక ఫార్వర్డ్‌’ బ్రిటిష్ ప్రభుత్వానికి కనె్నర్ర అయింది. 1939 జూన్‌లో బొంబాయిలో ప్రప్రథమ అఖిల భారత ఫార్వర్డ్‌బ్లాక్ మహాసభ కాంగ్రెస్‌పై ధ్వజం ఎత్తడంతో- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగస్టు నుంచి సుభాష్ సభ్యత్వాన్ని మూడేళ్ల పాటు రద్దుచేసింది. దాంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీతో బంధం తెగిపోయింది.
ఆంధ్ర దేశంలో ఫార్వర్డ్‌బ్లాక్ శాఖకు మద్దూరు అన్నపూర్ణయ్య అధ్యక్షుడు, పేట బాపయ్య కార్యదర్శి, యర్రమిల్లి నరసింహారావు, పిడికిటి రామకోటయ్య, కాకాని వెంకటరత్నం, అల్లూరి సత్యనారాయణరాజు, అనే్న అంజయ్య, గౌతు లచ్చన్న, ఈమని రాజరత్నశర్మ, వి.ఎల్.సుందరరావు తదితరులు కార్యవర్గ సభ్యులు. అఖిల భారత కార్యవర్గ సభ్యులైన సమరయోధులు మద్దూరు, పిడికిటి రామకోటయ్యలకు సుభాష్‌తో ప్రత్యక్ష సంబంధం వుండేది. 1939లో సుభాష్ చంద్రబోస్ కాకినాడ పర్యటనలో అన్నపూర్ణయ్య, బాపయ్య, యర్రమిల్లి వున్నారు. ఏలూరు సభలో బా పయ్య, నూకల రామస్వామి, ఈమని రాజరత్నశర్మ, కుర్రా వెంకటరత్నం, కలపాల సూర్యప్రకాశరావు సహా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు. తెలుగునాట పరకాల పట్ట్భా రామారావు, జొన్నలగడ్డ రామలింగయ్య, గారపాటి సత్యనారాయణ, డా. జి.రామకోటేశ్వరరావు, కె.సోమయ్య, వి.ఎల్.సుందరరావు, కుప్పా వెంకట రామశాస్ర్తీ, కొవ్విడి లింగరాజుతో పాటు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరుకు చెందిన యువకులు ఎందరో నేతాజీకి సన్నిహితంగా వున్నారు.
ఫార్వర్డ్‌బ్లాక్ ఆధ్వర్యంలో రాంగఢ్‌లో జరిగిన బ్రిటీష్ ప్రభుత్వ వ్యతిరేక సభలో ఆంధ్ర దేశ పార్టీ సభ్యులంతా పాల్గొన్నారు. రాజమండ్రి సభలో బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనను తీవ్రంగా ప్రతిఘటించారు. 1940 జూన్‌లో నాగపూర్‌లో ఫార్వర్డ్‌బ్లాక్ ద్వితీయ మహాసభలో పేట బాపయ్య, యర్రమిల్లి నరసింహారావు, ఈమని రాజరత్నశర్మ హాజరై తమ ప్రియతమ నేతను ఆఖరిసారి దర్శించగలిగారు. ఫార్వర్డ్‌బ్లాక్ పిలుపుమేరకు ఆంధ్ర ప్రాంతంలోని సుభాష్ అనుచరులు రహస్యంగా, బహిరంగంగాను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో జైళ్ళపాలయ్యారు. రాజమండ్రిలో పార్టీ అధ్యక్షుడు మద్దూరు అన్నపూర్ణయ్యను బ్రి టిష్ ప్రభుత్వం 1946 వరకు నిర్బంధించింది. ఫార్వర్డ్‌బ్లాక్ న డిపే బాధ్యతను ఆంధ్ర దేశంలో బాపయ్య, యర్రమిల్లి నరసింహారావు, ఈమని రాజరత్నశర్మ స్వీకరించారు. రహస్య సర్క్యులర్లు, కరపత్రాలు, పార్టీ కార్యకలాపాలను ధైర్యసాహసాలతో నిర్వర్తించేవారు. వీరిని పోలీసు నిఘా నిరంతరం వెంటాడేది. సుభాష్ చంద్రబోస్ 1941 జనవరి 16న బ్రిటిష్ నిర్బంధం నుండి అదృశ్యమయ్యేటప్పటికి దేశమంతటా ఫార్వర్డ్‌బ్లాక్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమనేతలందరూ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు. బెంగాల్‌కు చెందిన నందలాల్ బోస్, షీల భద్రయాజీ సుభాష్ సందేశాన్ని ఆంధ్ర కార్యకర్తలకు, నాయకులకు స్వయంగా రహస్య పర్యటనలతో అందించేవారు.
1939, 1940 సంవత్సరాలలో ద్వితీయ ప్రపంచ యుద్ధ నేపథ్య పరిణామాలలో సోషలిస్టు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, పిఎస్‌పి తదితర పార్టీలు తమ మేధావి వర్గాల మార్గదర్శకత్వం ఏదైనప్పటికీ, స్వాతంత్య్రం సాధించే లక్ష్యంతో బిటిష్ నిరంకుశత్వంతో పోరాడే రోజులవి. వారిని దేశద్రోహ నేరంపై బ్రిటిష్ ప్రభుత్వం దేశరక్షణ చట్టం క్రింద కఠిన జైలుశిక్షలకు గురిచేసేది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆంధ్ర ప్రాంత అధ్యక్షునిగా మద్దూరి అన్నపూర్ణయ్య 18 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించిన త్యాగశీలి.
ఆంధ్ర రాష్ట్రంలోని రాజమండ్రి కేంద్ర స్థానంగా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ కార్యవర్గ సభ్యుడైన స్వాతంత్య్ర సమరయోధుడు యర్రమిల్లి నరసింహారావు (తణుకు) దేశరక్షణ చట్టంక్రింద బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధంలో, రాజమండ్రి సెంట్రలు జైలులో శిక్ష అనుభవించే రోజులలో ’ఫిలిస్ బొటోం’ ఆంగ్ల రచన ‘మోర్టల్ స్టారమ్’ ఆధారంగా ఒక పుస్తకం వెలువరించారు. జర్మనీ నియంతగా హిట్లర్ నాజీ జర్మనీ పైశాచిక ఇతివృత్తం, పాలనా దురాగతాలు ఒక యూదు కుటుంబంలోని యువతి జీవితంలో ఎట్లా చిచ్చుపెట్టిందీ ఈ నవల వర్ణిస్తుంది. నాజీ తత్వం, హిట్లర్ సామ్రాజ్యాధికార దాహం మానవాభ్యుదయానికి, మహిళా జీవన స్వేచ్ఛను ఆ రోజుల్లో నాజీలు ఎలా హరించిందన్నది ఫిలిస్ బొటోం రాసిన ఈ నవల ఇతివృత్తం. ఈ నవల నేతాజీ అనుచరుడైన యర్రమిల్లిని ఆకర్షించటం, తెలుగులో ఆయన చక్కటి పుస్తకంగా రాయటమే కాకుండా 1941 అక్టోబరులో పాలకొల్లులోని ప్రెస్‌లో ప్రచురింపచేయటం స్పష్టమవుతోంది.
సుభాష్‌చంద్ర బోస్ జీవితం ఆద్యంతం త్యాగాల మయం. సాహస భరితం. 1941లో దేశం నుంచి, ‘మాతృదేశ స్వాతంత్య్ర సాధన’లో కనుమరుగైన ఆ దేశభక్తాగ్రగణ్యుడు స్వాతంత్య్ర భానోదయం చూడలేదు. జర్మనీ, జపాన్, ఇటలీ నియంతలతో- మాతృదేశ స్వాతంత్య్ర సాధనా లక్ష్యంతో, భారతావనికి గర్భశత్రువైన బ్రిటిష్ నిరంకుశాధికారాన్ని దేశం నుంచి పారద్రోలే ఏకైక లక్ష్యంతో సుభాష్‌చంద్ర బోస్ చేతులు కలపవలసి వచ్చింది. మన శత్రువుకు శత్రువును, మనం మిత్రునిగా భావించే రాజనీతి తప్ప హిట్లర్, టోజో, ముసోలినీ వంటి రాజ్యాధినేతలతో కేవలం బ్రిటిష్ పరాజయమే నాటి రాజనీతిగా అజాద్ హింద్‌ఫౌజ్ అత్యంత ధైర్యంగా రణరంగంలో పురోగమించింది. ఆంధ్రుడైన కల్నల్ డా.డి. ఎస్.రాజు అజాద్ హింద్ ఫౌజ్ అధినేత నేతాజీకి ఆంతరంగిక వైద్యునిగా రణరంగంలో కీర్తిశిఖరం అధిరోహించారు.

-జయసూర్య 94406 64610