సబ్ ఫీచర్

సర్వ ధర్మాలకు ఆధారం సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజునకు ధర్మ స్వరూపాలను, దమము మహిమలనూ, తపస్సు తీరుతెన్నులనూ వివరించాడు. పిదప ధర్మరాజు తాతా! దేవతలు పితృదేవతలు- బ్రహ్మ జ్ఞాన సంపన్నులు సత్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారుగదా! సత్యంయొక్క స్వరూప స్వభావాలను కూడా వినాలని ఉందని తన సందేహాన్ని వినయంగా అడిగాడు.
తిక్కనగారు భీష్ముని ద్వారా ధర్మనందనునికి ఒక చక్కని కంద పద్యం ద్వారా సత్యాన్ని వివరించే విషయాలను తెల్పుతూ, భరతశ్రేష్ఠా సత్యనిరూపణ ఈ విధంగా ఉంటుందని చెప్పారు.
సత్యం అంటే ఒక రూపంతో ఒక విధంగా అన్ని కాలాల్లో ఉండేది అనీ, ‘సత్’అనే దానియందు పుట్టునది అని అర్థం. ‘సత్’ అంటే పరమాత్మ. పై పద్యంలో సత్యస్వరూపాలుగా పదమూడు లక్షణాలున్నాయి. వీటిని గురించి బాగా తెలిసికొంటే సత్యం బాగా అర్థమవుతుంది. సమత అనగా అన్ని ప్రాణులయందు ఒకే విధంగా మెలగడం. మనస్సును అదుపులో ఉంచుకోవడం దమం అంటారు. అన్ని దుఃఖములనూ పారద్రోలే ప్రయత్నం లేకనే సహించి ఉండడం తితిక్ష అని అర్థం.
ఇతరుల అభివృద్ధిని చూచి క్రుంగిపోకుండటం అమత్సరము అంటారు. హ్రీ అనగా పాడుపనులు చేయడానికి సిగ్గుపడడం, బుద్ధియొక్క శక్తిని ఏ పరిస్థితులలోనూ జారనీకుండటం ధృతి. గుణాలను అనగా మంచి లక్షణాలను దోషాలుగా చెప్పకుండుటయే అనసూయ. తన ప్రవర్తననూ, తన నడవడినీ యితరులకు మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉండే విధంగా మెలగడం ఆర్యత్వం. ఎట్టి పరిస్థితులలోనూ, ఏ ప్రాణికీ బాధ కల్గించకుండా ఉండడం అహింస. ఇది జీవులలో ముఖ్యంగా ఉండాలి. తనకున్న దానిని పరులకూ, దీనులకూ, అభాగ్యులకూ ప్రేమతో అందివ్వడం దానం అంటారు. ఓర్పును వదలకుండడం క్షమా, అత్యజనం అనీ, ఆడిన మాటను తప్పకుండడం ననృతం అనీ అంటారు. ఇవన్నీకూడా సత్యంయొక్క స్వరూపాలే అని అంటూ రాజా! పైన తెల్పినవన్నీ సత్యం అనే పరిధిలోకి వస్తాయో, వాటి తారతమ్యాలు పరిశీలించి తెలుసుకోవాలి. వీటిని వివరిస్తాను జాగ్రత్తగా విను.
ఆత్మచైతన్యం అన్నింటిలో, అందరిలో ఉన్నదనడమే సత్యం. దానిని తెలుసుకోలేక పోవడం అసత్యం. ఇంద్రియాలూ- మనస్సు, సత్యం కాని విషయాల యందు పరిభ్రమిస్తూ ఉంటాయి. కావున అవి పరమాత్మయందే రమిస్తూ ఉండాలి. దానికి సహాయకారిగా వుండేది దమముగాన అది సత్యం. లోకంలో జీవులకు బాధలు మూడు రకాలుగా వస్తాయి- దేహసంబంధంగా- ఇతర జీవుల సంబంధంగా- దేవతా సంబంధంగా ఉంటాయి. ఇవన్నీ నశించే స్వభావంగల దేహాదులకు చెందినవి. ఇవన్నీ ఆత్మకాని దేహాదులకు కలిగే కష్టాలకు ప్రతిక్రియ చేయకుండా ఓర్పుతో సహిస్తాడు కాన ఈతి తిక్ష అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించి కనుక ఇది కూడా సత్యస్వరూపమే. ఒకరి ఉన్నతిని చూచి ఓర్వలేకపోవడం మత్సరం. ఆ వ్యక్తిలోని ఆత్మలక్షణాన్ని గుర్తింపకుండా చేస్తుంది. అది లేకపోతే ఆత్మతత్త్వం తెలుస్తుంది. కావున అమత్సరం సత్యం అవుతుంది. మాత్సర్యం అసత్యం. హ్రీ అంటే సిగ్గు. చెడ్డపనులు- చోరత్వం అంటే దొంగతనం- పరస్ర్తి వ్యామోహం మొదలైనవి. ఇవన్నీ ఆత్మకు విరుద్ధమైనవి, వీటి విషయంలో మెలకువతో, జాగరూకతతో ఉండడమే హ్రీ లక్షణంగాన ఇదీ సత్యమే.
ఇక ధృతి విషయానికి వస్తే బుద్ధి జారిపోయి భౌతిక విషయాల మీదికి మళ్ళడం, భౌతికమైన విషయాలన్నీ సత్యానికి వ్యతిరేకమైనవే గాన అలా జారిపోకుండా ఉండడమే ధృతి అంటారు. సత్యం విషయంలో బుద్ధిని నిలుపటం గాన ఇది సత్య మార్గమే. గుణాలను దోషాలుగా భావించడం- ప్రకటించడం- నిందించడం అసూయతోనే గదా. అది కాని దానిని అదే అనుకోవడం అసత్య లక్షణం. కనుక అది లేకుండమే సత్యం.
పవిత్రమైన, ఉన్నత ఉత్తమ గుణాలతో కూడిన ప్రవర్తనమే ఆర్యత్వంగాన అది పరమాత్మను ప్రకటించే లక్షణం కనుక సత్యం ఇది. పరులను నిరంతరం నిందించడం, హింసించడం పరమాత్మతత్త్వాన్ని గుర్తించకపోవడం వలననే జరుగుతుంది. దీనిని గుర్తించి ప్రవర్తించడమే సత్య స్వరూపం. దానం అనే విషయానికొస్తే సద్భావనతో చూస్తే సృష్టిలో తనదంటూ ఏమీలేదు. అదంతా పరమాత్మ తత్త్వం చేత కప్పిచూడాలి. దానిని గుర్తించడమే దానంలోని అంతరార్ధం. ఇది మమకారాన్ని తృంచివేస్తుంది. వ్యాసులవారు ‘మమ’అనే రెండక్షరాలు బంధనమనీ, ‘నమమ’ అనే మూడుక్షరాల కూర్పు మోక్షమనీ చెప్పారు గాన దానం సత్యం అవుతుంది.
ఇంకో పదం క్షమాత్యజనం అనగా ఓర్పును వదలకుండడం. మామూలుగా మానవులు దేహానికీ, మనస్సు మొదలైనవాటితో నిండిన సూక్ష్మదేహానికీ ఏదైనా బాధకల్గినపుడు ఓర్పును కోల్పోతుంటారు. అవి అనిత్యములు. మనం ఎంత కాపాడినా అవి జారిపోతూనే ఉంటాయి. నిలుకడలేని వానికోసం నిత్యసత్యమైన ఆత్మతత్త్వాన్ని వదలిపెట్టడం అజ్ఞానం. కనుక క్షమా అత్యజనం సత్యసంబంధం కల్గినది అవుతుంది.
ఇవే వాక్కునకు సంబంధించినది సూనృతం. ఆడిన మాట తప్పకపోవడం, ఋతమును సృష్టిలో ఏకరూపంగా నిత్యం ఉండే స్థితిని వాక్కుద్వారా కాపాడుకోవడమే సూనృతం. ఇది సత్యంతో ముడిపడియున్నది. ఈ విధంగా సత్యస్వరూపాలు చక్కగా తెలిపే భావములు పనె్నండుంటాయి ధర్మరాజా అన్నాడు భీష్మపితామహుడు. సత్యాన్ని స్వీకరించి చరితార్థులు కావాలన్నది భారతం. వేయి అశ్వమేధయాగాలు చేసినా ఆ యాగ ఫలం సత్యానికి సాటిరాదు అంటూ జ్ఞాన శిరోమణి భీష్మపితామహుడు ధర్మరాజుకు సత్యస్వరూపాలను తెలియజేశాడు.

- పి.వి.సీతారామమూర్తి