సబ్ ఫీచర్

పంచాయతీలను పటిష్ఠపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొనాలి. అందుకు పరిపాలనా వికేంద్రీకరణ అవసరం. సుపరిపాలనకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు. వనరులు సమకూర్చుకోవడం ఎంత ముఖ్యమో వాటిని సక్రమంగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అనేక అభివృద్ధి కార్యక్రమాలను దేశ రాజధానినుండి ఆమాటకొస్తే రాష్ట్ర రాజధాని నుండి అమలుచేయడం కష్టం, వాంఛనీయం కూడా కాదు. కొన్ని సమస్యలు స్థానిక స్థాయిలో వున్నవారికే అర్థమవుతాయి. ఉదాహరణకు, వ్యవసాయం. ఈ రంగం ఎదుర్కొనే సమస్యలు అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా వుండవు. ఈ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. అందుకే పరిపాలనా వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
భారతదేశం లాంటి పెద్ద దేశాలలో వికేంద్రీకరణ సూత్రాన్ని తప్పనిసరిగా గౌరవించాలి. అయితే, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలం స్థానిక ప్రభుత్వాలను ఏర్పరచ లేదు. వనరులు, అధికారం వాటికి బదలాయించలేదు. పంచాయతీలు వున్న రాష్ట్రాలలో కూడా గ్రామసభకు ప్రాధాన్యత లేదు. గ్రామసభ ద్వారానే సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపాలి. 73వ రాజ్యాంగ సవరణ (1992) పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఈ సవరణ వల్ల పంచాయతీలకు 29 రకాల అధికారాలు లభించాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు 18 రకాల అధికారాలను మాత్రమే బదలాయించాయి. అంటే పంచాయతీలను పటిష్ఠం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్థానిక సంస్థలు పన్ను బకాయిలను కూడా సక్రమంగా వసూలు చేయలేక పోతున్నాయి. ‘గ్రామ స్వరాజ్యం’ ప్రక్కనబెట్టి స్థానిక సంస్థలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నాయి.
పంచాయతీలకు వనరులను సేకరించే అధికారాలను పెంచాలి. లబ్ధిదారులను ఎన్నుకోవడంలో గ్రామసభకు అధికారాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో అమలుపరచే అన్ని పథకాలు పంచాయతీలు చేపట్టాలి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలను (డి.ఆర్.డి.ఏ.) తొలగించి వాటి బాధ్యతలను జిల్లా పరిషత్‌లకు అప్పగించాలి.
పంచాయతీలకు ఆదాయ వనరులు ఎన్నో వున్నాయి. అయితే, నిధుల సమీకరణపై చిత్తశుద్ధిలేదు. ఒక్కోసారి నిధులు విడుదల అవుతున్నా కొన్ని షరతుల కారణంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు.
పంచాయతీలు అనేక మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకొనే అవకాశం పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. నిధులకొరకు పంచాయతీలు ఎక్కువగా ఫలసాయం, చెరువుల వేలం, ఇంటి పన్నులు, లీజులు ఖాళీ స్థలాలు, ప్రకటనలు, వినోదం, లేఅవుట్లపై ఆధారపడవచ్చు.
రాష్ట్ర బడ్జెట్ నుండి నేరుగా పంచాయతీలకు మూడవ వంతు నిధులు సమకూర్చాలి. అప్పుడే గ్రామాలలో వౌలిక సౌకర్యాలు తగినంతగా పెరుగుతాయి. ఆర్థిక సంఘాలు కూడా పంచాయతీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, తగురీతిలో ఆదుకోవాలి. 14వ ఆర్థిక సంఘం ఈ విషయంలో సరిగా స్పందించ లేదు. పన్నుల వాటా పెంచాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యతలు పెట్టడం సరికాదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా దేశ వ్యాప్తంగా వున్న పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరుస్తుంది. వీటిని సమగ్రంగా వినియోగించుకోవడానికి పకడ్బందీ ప్రణాళికలు అవసరమని కేంద్రం భావిస్తున్నది. ఈ ప్రణాళికలు ప్రయోజనకరంగా వుండాలంటే లైన్ విభాగాల (విద్య, వైద్య, వ్యవసాయం, మహిళా సంక్షేమం తదితర శాఖలు) మధ్య సమన్వయం వుండాలి. పంచాయతీ అభ్యర్థుల విద్యార్హత పెంచడం అవసరం. హర్యానా, రాజస్థాన్ ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి. సోషల్ ఆడిట్‌ను కూడా పటిష్ఠం చేయాలి.

- డా.ఇమ్మానేని సత్యసుందరం