సబ్ ఫీచర్

విలువలు తోడుంటే.. యువతదే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికతను ఆలంబనగా చేసుకొని మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాల్సిన అవసరం పెరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో అనేకానేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్న మాట నిజమే. ఆధునిక నాగరికత, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. నైతిక విలువలు నానాటికీ దిగజారడం ఆందోళనకర పరిణామం. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు కరవై యాంత్రిక జీవనంలో తమ లక్ష్యాల కోసం అందరూ పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత సమాజంలో యువత వెర్రితలలు వేస్తోందేమోనన్న ఆందోళన కలుగుతోంది. యువత తీరు ఇలాగే కొనసాగితే దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధుల ఆత్మ క్షోభిస్తుంది. ఈ దుస్థితి నుంచి యువత దృష్టిని దేశభక్తి వైపు మళ్లించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలి.
సంస్కృతి పరిరక్షణ..
మనదేశ సంస్కృతి, సాంప్రదాయాలు రానురానూ అడుగంటే ప్రమాదం ఏర్పడుతోంది. ఘనమైన మన సంస్కృతిని నేటి యువతరం అర్థం చేసుకోవాలి. శాస్ర్తియ దృక్పథాన్ని సైతం పెంపొందించుకోవాలి. యువత తమ జీవితాలకు తామే దిశానిర్దేశం చేసుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమాజంలో బాధ్యతగల పౌరులుగా మెలగాలి. సమాజం పట్ల కృతజ్ఞత చూపాలి. అది యువతరం కనీస బాధ్యత. బాల్యదశ నుండే దేశ సంస్కృతి, సాంప్రదాయాలు మనసులో నాటుకొనే విధంగా పిల్లలను తయారుచేయాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు మరువకూడదు.
జాతీయ భావాలు..
తల్లిదండ్రులు ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇలా పెరిగిన పిల్లలు మాత్రమే పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకుంటారు. దేశం కోసం పరితపించే వారిలోనే నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను గుర్తిస్తాడు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కుటుంబ పెద్దలు కృషిచేయాలి.
సైనికుల సేవలు..
దేశాన్ని తీర్చిదిద్దే విషయంలో యువత ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే అలనాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, నేడు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు కారణం. ఎముకలు కొరికే చలిలో కూడా దేశం కోసం పనిచేస్తున్న సైనికుల గురించి నేటి యువత ఆలోచించాలి. తమ ఆలోచనలలో మార్పు రావాలి.
తల్లిదండ్రుల పాత్ర..
అలనాడు ఛత్రపతి శివాజీని అతని తల్లి జిజియాబాయి దేశభక్తుడిగా తీర్చిదిద్దింది. ఇలాంటి కథలు పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. ప్రపంచంలో అమ్మకు మించిన దైవం మరొకటి లేదు. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో మాతృమూర్తి కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి తన ప్రయత్నం ఇంటినుంచే ప్రారంభించేది. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎంతోమంది యువతీ యువకులు ఆదర్శంగా ఎదిగారు. కానీ, నేటి నవ నాగరిక యుగంలో తల్లిదండ్రుల ధోరణిలో మార్పు వచ్చింది. తమ పిల్లలు చదువులో మంచి ర్యాంకులు సాధించాలని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి భారీగా సంపాదించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఆస్తులు సంపాదించాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని నేటి యువత కోరుకుంటోంది. దీంతో యువతలో దేశభక్తి సన్నగిల్లుతోంది. సంస్కారం, నైతిక విలువలు దూరమైనకొద్దీ యువతలో స్వేచ్ఛ పక్కదారులు పడుతుంది. విచ్చలవిడి తనం, నిర్లక్ష్య భావం పెరిగే ప్రమాదం ఉంది. ‘నేను.. నాది.. నేను బాగుండాలి.. తప్పుచేసైనా నేను అనుకున్నది జరిగి తీరాలి..’ అనే భావజాలం వల్ల యువత సమాజం కోసం ఆలోచించేందుకు అవకాశం ఉండడం లేదు. పిల్లలు ప్రయోజకులు కావడం ఎంత ముఖ్యమో వారిని దేశభక్తులుగా తీర్చిదిద్దడం అంతే ముఖ్యం. దేశభక్తి కలిగిన యువత తల్లిదండ్రులను, సమాజాన్ని ప్రేమిస్తుంది.
ఉపాధ్యాయుల పాత్ర..
తల్లిదండ్రుల తర్వాత ప్రముఖమైన స్థానం ఉపాధ్యాయునిదే. పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదగడంలో విద్యాలయాల పాత్ర ప్రముఖమైనది. విద్యార్థులు యుక్తవయస్సు వచ్చేంతవరకు ఎక్కువగా గడిపేది విద్యాలయాలలోనే. ఉపాధ్యాయుని మాట పిల్లవాడికి వేదవాక్కు. వారిలో జాతీయ భావాలు పెంపొందించే బాధ్యత గురువులదే. చదువులో ఎంతగా ప్రతిభ చూపినా, విద్యార్థులు మన దేశ చరిత్రను మరువకూడదు. చరిత్రను తెలుసుకొన్నవారే చరిత్రను సృష్టిస్తారు.

-డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి 97039 35321