సబ్ ఫీచర్

పిల్లల్ని పీడించే పక్క తడిపే అలవాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్క తడిపే అలవాటు పిల్లలకు సర్వసాధారణం. ఇది వయస్సుతోపాటు తగ్గిపోతుంది. నవమాసాలు మోసి పురిటినొప్పులతో కన్నబిడ్డ రాత్రివేళల్లో పడక తడుపుతున్నాడంటే తల్లికి బాధగా ఉండకపోయినా ఆ అలవాటు అంతమంచిది కాదు. దీన్ని నివారించేందుకు ఆదిలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది పిల్లల్లో పనె్నండు సంవత్సరాల వయసు వరకూ నిద్రలో పడక తడిపే అలవాటు వుంటుంది. ఇలా జరగడానికి కారణం తల్లి ఆ అలవాటును చిన్నప్పుడే మానిపించకపోవడం లేదా ఇదే శరీర తత్వంగా మారడం.
వైద్యపరంగా ‘నాక్‌టర్నల్ ఎన్యురిసిస్’ అని వ్యవహరించే ఈ జబ్బు అధికంగా సమయపాలనతో కాలకృత్యాలు తీర్చుకోకపోవడంవల్ల సంక్రమిస్తుంది. మెదడులో మెచ్యూరిటీ స్థాయికి, మూత్రాశయ మెచ్యూరిటీ స్థాయికి తేడా ఉండడంవల్ల సిగ్నల్ ట్రాన్సిమిషన్ సరిగా ఉండకపోవడం ఎన్యురిసిస్ ప్రధాన లక్షణం. కేవలం ఐదు శాతం మంది పిల్లల్లోనే అంగ సంబంధితమైనదిగా ఈ లక్షణాలు కనిపిస్తాయిట! మూత్రాశయంలో పట్టు కోల్పోడంవల్ల అసహజ మూత్ర విసర్జన జరుగుతుంది. ఎన్యురిసిస్ సాధారణగా మానసిక జాఢ్యమే. పిల్లల్లో ఈ దురలవాటుకు ఆర్గానిక్ డిజార్డర్ కారణమైతే వైద్య చికిత్స అవసరం. కానీ సైకోజనిక్ డిజార్డర్ అయితే వెంటనే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, వైద్య సలహాలు తీసుకోవాల్సి వుంటుంది. కొన్ని చిట్కాలను ప్రయోగించి పిల్లల్లో ఉన్న ఈ దురలవాటును దూరం చేసేందుకు తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకటిన్నర సంవత్సరాల వయసు నిండిన పిల్లలకు స్వయం నియంత్రణ శక్తి వస్తుంది. కానీ వారికి సరియైన అలవాట్లను నేర్పించాల్సి వుంటుంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని తల్లులు చేపట్టాలి. నిద్రకు ఉపక్రమించే ముందు పిల్లలను టాయ్‌లెట్‌కు తీసుకెళ్ళాలి. అవసరమనుకుంటే మధ్యలో కూడా పిల్లల్ని నిద్రనుంచి మేల్కొలిపి, మూత్రవిసర్జన చేయించడం తప్పనిసరి. నిద్రవేళల్లో ద్రవ పదార్థాలను అంతగా ఇవ్వకపోవడం మంచిది. నిద్రావస్థలో పడక తడుపుతున్న పిల్లలను విసుక్కోవడం, గేలి చేయడం సముచితం కాదు. దీనివల్ల పిల్లల మానసిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదముంది. బ్లాడర్ విత్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగేందుకు డాక్టర్ సలహాలు పాటించాలి. కొన్ని రకాల వ్యాయామాలవల్ల కూడా ఈ దురలవాటు నుంచి పిల్లలను దూరం చేయవచ్చు. పగటి వేళల్లో పిల్లలకు పండ్ల రసాలు, మజ్జిగ, మంచినీళ్ళు- ఇలాంటి ద్రవ పదార్థాలు ఇచ్చి మూత్ర విసర్జన సమయాలను గమనించాలి. పిల్లలకు తెలియకుండానే ఏదైనా ఇతర వ్యాపకాల్లో నిమగ్నమయ్యేట్టు చేసి వారి దృష్టిని మళ్లించాలి. ఇలా చేయడంవల్ల మూత్రవిసర్జన వ్యవధిలో మార్పు కనిపిస్తుంది.
మూత్రాశయ పని సామర్థ్యం పెరుగుతుంది. బుద్ధిమాంద్యంగల పిల్లల్లో పడక తడిపే అలవాటు నిజంగానే జఠిలంగా ఉంటుంది. వీలైతే జాగృతావస్థలోనో, ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పుడో తమకు తెలియకుండానే కట్టుకున్న బట్టల్లోనే మూత్ర విసర్జన చేసేస్తారు. వీరిని మానసికంగా అధ్యయనం చేసి, వారి కాలకృత్యావసరాలను తీర్చుకోవాల్సిన సందర్భంలో ఇంట్లోని పెద్దవారికి ఏదైనా సంకేతం ద్వారా తెలియజేసే అలవాటు చేయాలి. వీరిని నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే వారిని పట్టి పీడించే దురలవాట్లను మానిపించడం ఏమంత కష్టతరంకాదు.

- హర్షిత