సబ్ ఫీచర్

అసత్యాలతో ‘హైందవం’పై దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత దేశంలో కులవ్యవస్థ కారణంగా జనంలో అసమానతలు పెరుగుతున్నాయి.. కాబట్టి కుల రహిత సమాజం ఆవిర్భవించాలి.. క్రైస్తవంలో, ఇస్లాంలో కులాలు అసలే ఉండవు.. కేవలం హిందూ మతంలోనే అనేక కులాలు ఉంటాయి..’ అని ఇటీవల కొందరు సరికొత్త వాదనలు చేస్తున్నారు. అయితే- ఇస్లాంలో, క్రైస్తవంలో వేర్వేరు తెగలుంటాయన్న విషయం ప్రస్తావించకుండా వారు హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాలను రాజేస్తున్నారు. ఒక మతాన్ని గొప్పగా, మరొక మతాన్ని అవమానించే విధంగా మాట్లాడేటప్పుడు ఆయా మతాలలోని గొప్పతనం, తప్పొప్పుల గురించి తెలిసికొనక పోవటం సమంజసం కాదు. వివిధ కులాల మధ్య సామాజికంగా అసమానతలు ఉంటాయి కాబట్టి కులరహిత సమాజం కావాలనేవారు- మతాల మధ్య సమానత్వం ఉన్నదని చెప్పగలరా? మత రహిత సమాజం కావాలని ఎందుకు వీరు కోరడం లేదు?
మన దేశంలో ఏనాడూ కులాల మధ్య ఘర్షణలు జరగలేదు. కానీ మతాల మధ్య మాత్రం నిరంతరాయంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారకులు క్రైస్తవ మతంలోకి మారినవారు, కుహనా లౌకికవాదులు. ఆర్థిక అసమానతలను, సామాజిక అసమానతలను రూపుమాపడమే తమ సిద్ధాంతం అని, వాటి కోసమే తాము నిరంతరం పోరాడుతామంటున్న కమ్యూనిస్టులు చెప్పినట్లు మన దేశంలో కులాల వారిగా సామాజిక అసమానతలు ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా?
విద్యాలయాలు, వైద్యాలయాలు, బస్సులు, రైళ్లు, హోటళ్లు, సినిమా థియేటర్లు, వ్యాపార కేంద్రాలు, క్షౌరశాలలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, గ్రంథాలయాలు, దేవాలయాలు, ధర్మసత్రాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, బ్యాంకులు మ్యారేజి హాల్స్ వీటిల్లో సామూహిక వ్యవస్థలు తప్ప కులాల వారీగా ప్రత్యేక వ్యవస్థలు లేవు అనే విషయం అందరు అంగీకరించేదే కదా! ఇది సామాజిక సమానత్వం కాదా? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా అనుసరిస్తున్నదే కదా! కమ్యూనిస్టులు సామాజిక సమానత్వం గురించి నిర్వచించగలరా?
కులాలలో అగ్ర కులాలు, వెనుకబడిన కులాలు, ఎస్.టి, ఎస్.సి. కులాలని వేరువేరుగా విభజన చేసి ఎన్ని సంవత్సరాలైంది? ఈ విభజనకు ప్రధాన పాత్ర పోషించిందెవరు? ఎందుకు విభజన చేయబడింది? వీటివల్ల కుల వ్యవస్థ పటిష్టవౌతుందా? నిర్వీర్యవౌతుందా? కుల రహిత సమాజం కావాలనేవారు, సామాజిక- ఆర్థిక అసమానతలను రూపుమాపుతామనేవారు అనేక కులాల సమూహాన్ని ‘నాలుగు విభాగాలు’గా విభజన చేయబడిన దాని గురంచి మాట్లాడరెందుకు? విభజన వల్ల కులాల మధ్య అసమానతలు పెరుగుతున్నవా? తగ్గుతున్నవా? దీనికి కమ్యూనిస్టులు, వారికి మద్దతిస్తున్న కుహనా సెక్యులరిస్టులు వాస్తవాలు చెప్పరెందుకు?
కుల ప్రాతిపదికన అమలు జరుగుతున్న రిజర్వేషన్ల ద్వారా ఉన్న కులాల సంఖ్య తగ్గకపోవడమే కాకుండా కొత్త కులాలు పుట్టుకొస్తున్న విషయం ఎవరైనా కాదనగలరా? రిజర్వేషన్ల కోసం అనేక కులాల వారు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? కుల రహిత సమాజం కావాలనేవారు, సామాజిక సమానత్వం సాధిస్తామనేవారు కులప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లను తొలగించమని ఎందుకు చెప్పడం లేదు? కులప్రాతిపదికన అమలు చేస్తున్న రిజర్వేషన్ల వల్ల కులాల మధ్య అసమానతలు, ఘర్షణలు పెరుగుతున్నవన్న విషయం ఎవరు కాదనగలరు. ఎస్‌సిలలోని మాల, మాదిగల మధ్య వర్గీకరణ ఉద్యమం, ఎస్‌టిలలోని గోండులు, లంబాడాల మధ్య తగవులు జరుగుతున్న విషయం ఎవరికీ తెలియనిదా? రిజర్వేషన్లకు కులమే కొలమానం అయితే- కుల రహిత సమాజం ఎలా సాధ్యవౌతుందో చెప్పగలరా? ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ సిద్ధాంతం, అందుకు తాము నిరంతరం పోరాటాలు చేస్తూన్నామంటారు కమ్యూనిస్టులు. అంటే- వీరు ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి కమ్యూనిజాన్ని ఆవిష్కరిస్తారా?
రిజర్వేషన్ల ఫలాలను పొంది అభివృద్ధి చెందినవారు, వారి పిల్లలకు రిజర్వేషన్ రద్దుచేయమని ఎందుకు చెప్పడం లేదు. రిజర్వేషన్ పొంది ఆర్థికాభివృద్ధి పొందినవారికి ‘క్రీమీ లేయర్’ పరిధిని ఎప్పటికప్పుడు ఎందుకు పెంచుతున్నారో ప్రశ్నించరెందుకు? వౌనం ఎందుకు వహిస్తున్నారు? రిజర్వేషన్లు పొందినవారికి తరతరాలుగా ఆ సౌకర్యాలు కొనసాగుతూనే ఉండాలి. ‘క్రీమీ లేయర్’ పరిధి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి అనుకున్నప్పుడు- రిజర్వేషన్లకు అర్హత ఉండి వాటి ఫలాలు 70 సంవత్సరాల కాలంలో ఒక్క పర్యాయం కూడా పొందనివారు ఇంకెంత కాలం ఎదురుచూడాలి? వారికి ఆర్థిక సమానత్వం ఎలా వస్తుంది? కమ్యూనిస్టులారా సమాధానం చెప్పండి? అర్హత ఉన్నా రిజర్వేషన్ ఫలాలు పొందలేని వారి సంఖ్యనే అత్యధికంగా ఉన్నదన్న విషయం గణాంకాల రూపంలో ఎందుకు చెప్పరు?
రిజర్వేషన్ల ద్వారా శాసనసభ్యులు గాని, పార్లమెంటు సభ్యులు గాని ఒక పర్యాయం ఎన్నుకోబడిన వారిని రెండవ పర్యాయం జనరల్ సీటుకు పంపితే ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కలుగుతుంది. అధిక శాతం మందికి వేగవంతంగా ప్రజాప్రతినిధులుగా సమాజసేవ చేసే అవకాశం కలుగుతుంది. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కూడా వేగవంతంగా జరుగుతుంది కదా? ఈ విషయంలో వామపక్ష మేధావులు నోరు విప్పరెందుకు? ఇందులో వాస్తవం లేదంటారా? ఒక వ్యక్తికి ఒక పర్యాయము, ఒక జనరేషన్ వరకు రిజర్వేషన్ పరిమితి చేస్తే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో రిజర్వేషన్ల లక్ష్యం పూర్తయ్యేది. ప్రతి ఒక్కరు సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా, రాజకీయపరంగా అందరూ ఈపాటికి అభివృద్ధి చెందేవారే కదా!
పదవ తరగతి వరకు పాఠశాలలు ప్రభుత్వాలే నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలలోనే బంట్రోతు పిల్లవాడి నుండి ఐఏఎస్, ఐపిఎస్ తదితర ఉన్నత ఉద్యోగులు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా 1 నుండి 10వ తరగతి వరకు తప్పనిసరి చదవాలని ప్రభుత్వాలపై ఒత్తిడి ఎందుకు తేలేకపోతున్నారు? ప్రజలను ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? విద్యార్థులకు ప్రభుత్వాలు నిర్వహించే వసతి గృహాలలో కులాల వారీగా కా కుండా, ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ అవకాశం కల్పించాలని ప్రభుత్వాలకు సలహాలెందుకు ఇవ్వరు?
ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థలలో మార్పులు తీసుకురావడానికి కృషిచేయకుండా, వాటి గురించిన మాట కూడా మాట్లాడకుండా, రాజ్యాంగబద్ధంగా పేరు మార్పుతో అమలవుతున్న ‘చాతుర్వర్ణం’ ఫలాలను అనుభవిస్తున్నవారు వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడా అమలులో లేని ‘మనుస్మృతుల’ను అవమానపరుస్తూ, వాటిని తగులబెడతామని చెప్పేవారు కొందరైతే, ఈపాటికే అనేక పర్యాయాలు తగులబెట్టినవారూ లేకపోలేదు.
విదేశీ సిద్ధాంతాలను వంట పట్టించుకొని, విదేశీ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని సమాజంలో వాస్తవాల జోలికి పోకుండా కొందరు కుహనా లౌకికవాదులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలున్నాయని, వాటిని రూపుమాపేందుకే నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నామని ‘ఉనికి కోల్పోయిన’ కమ్యూనిస్టులు ప్రకటిస్తుంటారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి తమ ఓటుబ్యాంకును కాపాడుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఫలితాలను పొందుతూ క్రైస్తవ మతంలోకి మారి హిందువుల పేర్లతో చెలామణి అవుతున్నవారు కమ్యూనిస్టులకు వత్తాసు పలుకుతుంటారు. పైగా వీరంతా తమ ప్రచారం కోసం డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును వాడుకుంటారు. హిందూ మతంలో కులాల మధ్య అసమానతలున్నాయని- ‘కులం లేని క్రైస్తవ మతం’ పుచ్చుకొన్న వారు తాము దళిత క్రైస్తవులమని చెప్పుకుంటారు. హిందువులపై నిందలు వేయడం, హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయాలనేది వీరి దురుద్దేశము కాదా? ఈ దిగజారుడు భాష్యాలు ఇంకెంతకాలం కొనసాగిస్తారో చూడాల్సిందే. కులాల మధ్య వైవిధ్యాలు ఉన్నా.. వైరుధ్యాలు లేవనే విషయం సమాజం గుర్తించిన వాస్తవం. ఇది భారత సమాజ స్వరూపం. వసుదైవ కుటుంబకం, కృణ్వంతో విశ్వమార్యం, జననీ జన్మభూమిశ్చ సర్గాదపి గరీయసీ.. అనేవి హిందూ ధర్మం విశాలతత్వానికి తిరుగులేని సాక్ష్యాలు.

-బలుసా జగతయ్య 90004 43379