సబ్ ఫీచర్

సిలికాన్ వ్యాలీ.. కొత్త తీర్థస్థలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ఇప్పుడు కొత్త ‘మతం’ వైపు పయనిస్తోంది. మతమంటే కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు, విధానాలు, విశ్వాసాలు. మనిషి చుట్టూ పరిస్థితులు మారినప్పుడల్లా మతాలు రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు ‘భగవంతుడు-భక్తి’ చుట్టూ మతం ప్రవహించింది. ఆ విశ్వాసంతో శతాబ్దాలపాటు కొనసాగారు.. కొనసాగుతూ ఉన్నారు. అయితే అదే అంతిమం కాదు, అక్కడే మనిషి ఆగిపోలేదు. ఆలోచనలు పెరిగి, జ్ఞానం విస్తరించి, సాంకేతిక పరిజ్ఞానం పుట్టుకొచ్చి, వివిధ పరికరాలు జీవితాన్ని సుఖమయం చేయడంతో విశ్వాసాల్లో మార్పులు తొంగి చూశాయి. కొన్ని సందర్భాల్లో మనసుకు సాంత్వన కలుగజేసే పద్ధతులు- పరికరాలు మతం రంగును పులుముకున్నాయి.
కృత్రిమ మేధ జీవితంలోని అన్ని పార్శ్వాలలో ఒదిగిపోయి అది మరింత మెరుగైన పద్ధతిలో అలరించేందుకు పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భంలో అమెరికాలోని ‘సిలికాన్ వ్యాలీ’ ఇప్పుడు సరికొత్త మతం ప్రబోధిస్తున్న కేంద్రంగా, తీర్థస్థలంగా చాలామంది సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. సాధారణ వ్యక్తుల మానసిక స్థితికిది అంతగా అతుక్కుపోకపోయినా నైపుణ్యంతో అనేక మెట్లు ఎక్కేవారికి ఈ ప్రతిపాదన, ప్రకటన పారవశ్యానికి గురిచేస్తోంది.
మనిషి స్వేచ్ఛాజీవి. ఆ స్వేచ్ఛలో తనకు అనుకూలమైన, ఆకర్షణీయమైన, ఉత్తేజకరమైన ఉత్ప్రేరకం కలిగించే ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. దానికి ఉపకరించేదే వివిధ పద్ధతులతో కూడిన ప్రక్రియనే ‘మతం’గా తీర్మానించడం జరుగుతోంది. ఈ పరిధికి లోబడే ప్రొఫెసర్ యువాల్‌నోహ హరారీ అనే ఇజ్రాయిల్ రచయిత, చరిత్రకారుడు అనేక నూతన ప్రతిపాదనలు ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఒకటి ‘సిలికాన్ వ్యాలీ ఓ తీర్థస్థలి’ అని, ‘కొత్త మతాన్ని ప్రతిపాదిస్తున్న ప్రదేశమని భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే సాంకేతిక తరంగాల సంగమమ’ని ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన ఆలోచనలకు, భావాలకు చాలామంది ఉత్తేజితులవుతున్నారు. ముఖ్యంగా సాంకేతిక రంగంలో తమ తమ ప్రజ్ఞాపాటవాల్ని ప్రదర్శిస్తున్న యువ నిపుణులు ఈ నూతన అభివ్యక్తితో ఏకీభవిస్తున్నారు. ఏ మతమైనా, ఏ మార్పైనా ఆయా కాలమాన పరిస్థితుల్లో ఉబికి వచ్చిన కొత్త ఆలోచనలతోనే ప్రారంభమవుతుందని ఆ రచయిత చెబుతున్నారు.
19వ శతాబ్దంలో భారతదేశంలో దయానంద సరస్వతి ఆనాటి కాలమాన పరిస్థితుల కనుగుణమైన ప్రవచనాలు చెప్పడంతో, సనాతన ధర్మంలోని ‘మేలిమి’ని గుర్తుచేయడంతో కొత్త మార్పు చోటుచేసుకుంది. ఆర్య సమాజం ఓ ‘మతం’గా ఆవిర్భవించింది. అలాగే, కారల్ మార్క్స్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి నూతన మంత్రాన్ని ప్రబోధించడంతో ‘కమ్యూనిజం’ అంటే మరేమిటోకాదు.. ‘కార్మిక సంఘాలకు రాజ్యాధికారమ’ని నిర్వచించి చెప్పడంతో అప్పటి సమాజాన్ని కదిలించగలిగాడు. దాంతో కొత్త ‘మతా’న్ని పాదుకొల్పగలిగాడు. (అది వారు మతంగా గుర్తించకపోవచ్చు) ఇదే ప్రక్రియ ఇస్లాం, క్రైస్తవ మతవ్యాప్తి సందర్భాల్లోనూ జరిగిందని ఆయన వివరించాడు.
ఇప్పుడు 21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వేచ్ఛా విధానం (ఎకనామిక్ లిబరలిజం), స్వేచ్ఛా విపణి, వ్యక్తిస్వేచ్ఛ- విశిష్టత, మానవ హక్కులకు ప్రాధాన్యత ఏర్పడిన సందర్భంలో గత కాలపు మతాలకు ప్రాధాన్యత తగ్గుతున్నది. అవి వాటి ప్రాసంగికతను కోల్పోతున్నాయి. ఇది అనివార్యంగా జరుగుతుంది. ఆ క్రమంలోనే సిలికాన్ వ్యాలీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సాంకేతిక రంగంలో తొంగి చూస్తున్న మార్పులు, బయోటెక్నాలజీలో వచ్చిన పరిణామాలు కొత్త ‘వాతావరణా’న్ని ఏర్పరస్తున్నాయి. మరోసారి ఇది ప్రపంచాన్ని కుదిపేయబోతోంది. ఆ కుదుపుతో పుట్టుకొచ్చేదే ‘ఆధునిక మతం’గా స్థిరపడగలదని చాలామంది విశ్వసిస్తున్నారు.
రాజకీయం, ఆర్థికం, నైతికత, కళలు తదితర విభాగాలు మనిషి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆకాంక్షలపై ఆధారపడతాయి. వాటిలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నప్పుడు విశ్వాసాలపై దాని ప్రభావం తప్పక పడుతుంది. అలా మారిన నూతన విశ్వాసాలే ‘మతం’గా స్థిరపడుతుందని, కొనసాగుతుందనేది నూతన ప్రతిపాదన. గొప్ప మేధావులు రూపొందించిన ‘కారు’ గొప్పది కాదు, ఎక్కువమంది వినియోగదారులు ఇష్టపడేదే ‘గొప్ప కారు’. ఇదే సూత్రం అన్ని రంగాలకూ వర్తిస్తుందనేది ప్రొఫెసర్ హరారీ అభిప్రాయం. లిబరల్ ఎకానమీలో వినియోగదారుడే సర్వశక్తిమంతుడు. ఈ తెలివిడి, ఎరుక ఇప్పుడు అంతటా విస్తరిస్తోంది. దాంతో మానవ ప్రవర్తనలో, పద్ధతుల్లో, ఆలోచనల్లో, అభిప్రాయాల్లో, అభివ్యక్తిలో ఆధునిక పద్ధతి తొంగి చూస్తూ మతం ఉబికి వస్తోందన్నది ఆయన మాటల సారాంశం. ఓ వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులకు ఇష్టమైనది, నచ్చినది ఇతరుల కోసం వదులుకోకుండా, ఇతరులు ఏమనుకుంటారోనని వెరవకుండా చేస్తూపోయే మనస్తత్వం విస్తృతమవుతున్న నేపథ్యంలో పాత మతాలు, అభిప్రాయాలు, విశ్వాసాలు వీగిపోతున్నాయి.. వీగిపోతాయి. అక్కడే కొత్త మతం, కొత్త విశ్వాసం, కొత్త పద్ధతి కొంగు బంగారమవుతుంది. కమ్యూనిజం అనేది మేధావులకు, ఆదర్శవంతులకు నచ్చింది కాని సామాన్య మానవులకు నచ్చలేదు. వారికి సరిపోలేదు కాబట్టి ఆ మతం వెనుకబడింది. దాని స్థానంలో కొత్త విశ్వాసాలు చిగురుతొడుగుతున్నాయి. ఇది అత్యంత సహజం, అంతకుమించి ఏదో ప్రళయం రాబోతోందని కాదు.
ఐడియాలు, ఆవిష్కరణలు, వాటిని సార్వజనీనం చేయడం అందరికీ (మె జార్టీ) ఇష్టమయ్యేలా రూపొందించడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవం సందర్భంలో ఇది మరింత జోరుగా కొనసాగుతోంది. దాంతో మార్పులు రావడం వేగంగా జరుగుతోంది. అందుకే చాలామంది సిలికాన్ వ్యాలీని ఆధునిక తీర్థస్థలిగా విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాలనే ప్రోదిచేస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. వ్యాప్తిచేస్తున్నారు. ఆ విశ్వాసాలు, నమ్మకాలు, ఆలోచనలు, ఆచరణ ‘ఆధునిక మతం’గా రూపాంతరం చెందుతాయని ప్రొఫెసర్ హరారీ లాంటి వాళ్లు నమ్ముతున్నారు.
మార్క్స్ 19వ శతాబ్దానికి చెందినవాడు. ఆనాటి సాంకేతిక రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆలోచనల సారాంశానికి వర్తమాన 21వ శతాబ్దపు సాంకేతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆలోచనల సారాంశానికి వ్యత్యాసం హస్తిమశకాంతరముంది. ఈ సూక్ష్మమైన విషయాన్ని అవగాహన చేసుకుంటే ఆ ‘ఇజం’ ఏ మేరకు ప్రాసంగికమో అర్థమవుతుంది. దీన్ని విస్మరించి మాస్కోనో, బెర్లినో, బీజింగ్‌నో తీర్థస్థలాలుగా భావించి ఆలోచనలు విత్తితే మొలకలు ఎలా వస్తాయి? వర్తమానంలో సిలికాన్ వ్యాలీ, బెంగళూరు, హైదరాబాద్, నాగపూర్ ఇలా పలు ప్రాంతాలు తీర్థస్థలాలుగా ఉబికివచ్చాయి. అక్కడి ఆలోచనలు-అభిప్రాయాలు సారవంతమైనవి. వాటిని విత్తితే బలమైన మొక్కలు మొలకెత్తుతున్న ‘దృశ్యం’ కళ్ళముందు కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రజాస్వామిక విశ్వాసాలకు ప్రాసంగికత ఉంది కాని నిరంకుశత్వానికి ఏ మాత్రం గుర్తింపులేదు. అలాంటి ‘ఐడియా’ను ఏ ఒక్క యువ కిశోరం ‘సహించడం’ లేదు. స్వేచ్ఛావాతావరణంలో తమ ప్రతిభను బయటపెట్టేందుకు అవసరమైన ‘ఇంక్యుబేషన్’ కోసం తాపత్రయపడుతున్నారు. అంతేగాని వాటిని తొక్కిపెట్టే శ్రామిక జన నియంతృత్వం కావాలని కోరుకోవడం లేదు. ఈ వౌలిక వ్యత్యాసాన్ని - తేడాను, మార్పును మావోయిస్టులు- మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు గమనించక పోవడం వారి అజ్ఞానానికి చిహ్నం తప్ప మరొకటి కాదు. ఈ అజ్ఞానంతో, ఇంకెంత కాలం ప్రజలను కదం తొక్కించడానికి ప్రయత్నిస్తారు? అలా చేసి చరిత్రహీనులు కావడం తప్ప మరో మెరుగైన అంశం అంజనం వేసి వెతికినా కనిపించదు!

-వుప్పల నరసింహం 99857 81799