సబ్ ఫీచర్

ప్రజల మనిషి ప్రకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు 23వ తేదీ తెలుగుజాతికి పర్వదినం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ‘తెలుగు తేజం’ టంగుటూరి ప్రకాశం పంతులు 1872లో ఇదే రోజున జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, గాంధీజీ ఆదర్శాలను నూటికి నూరుపాళ్లు అమలు పరిచిన ప్రజానేతగా, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. కేవలం 13 నెలల పాలనలోనే ఆయన సాధించిన తిరుపతి విశ్వవిద్యాలయం, కృష్ణా బ్యారేజీకి శంకుస్థాపన, గ్రామ స్వరాజ్య విధానాలు తదితర మహత్తర కార్యక్రమాలను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పేరిట విజయవాడలో ‘ప్రకాశం బ్యారేజీ’ విరాజిల్లుతోంది. 1981లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ప్రకాశం పంతులు జన్మదినమైన ఆగస్టు 23వ తేదీని ‘గ్రామ స్వరాజ్య దినం’గా ప్రకటించారు. ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దినోత్సవంగా జరుపుకోవడం ఆ మహానుభావుడికి నిజమైన నివాళి. ప్రకాశం గొప్ప దేశభక్తుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు, దిశానిర్దేశకుడు, త్యాగశీలి, ధీశాలే కాక ప్రజల నేత, నూటికి నూరుపాళ్లూ జనం మనిషి. ఆయన మహా రాజసమూర్తి, ఆయన వేషం, నడక, భాష, ఠీవి, దర్పం ఈ భావాల్ని స్ఫురింపజేస్తుంది. దక్షిణ భారత రాజకీయ రంగంలో చారిత్రాత్మక ఘట్టాల్లో వీర విహారమొనర్చి ప్రజా హృదయాల్ని చూరగొన్న ప్రజా నాయకుడు.
1926, 1937,1946 ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ఎనలేని బలాన్ని చేకూర్చారు. పగలనకా, రాత్రనకా మారుమూల గ్రామాల్లోనూ తిరిగి ప్రచారం చేశారు. ‘నా కారు ఆ రోడ్డున పోనివ్వండిరా! కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు పడవో చూస్తాను’ అని ధీమా గా అనడం, కాంగ్రెస్‌ను పూర్తి మెజారిటీతో గెలిపించడం ఆయనకే చెల్లింది. తన ప్రజలమీద ఆయనకు అంతటి పట్టు, నమ్మకం ఉందన్నమాట. మద్రాస్ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఆయన చేసిన సేవ నిరుపమానమైనది. జమీందారీల ర ద్దును మహాభారతంలా 18 పర్వాల నివేదికను ప్రచురించి, తాను దీనికోసమే జీవించియున్నానని అసెంబ్లీలో కన్నీరు కార్చిన కరుణార్థ్ర హృదయుడు. ఆయన ప్రవేశపెట్టించిన బడ్జెట్ ప్రజల బడ్జెట్‌గా ప్రసిద్ధిగాంచింది. ఆయన ప్రవేశపెట్టిన ప్రజా ఆహార కమిటీలు, ఉత్పత్తి- కొనుగోలుదార్ల సంస్థలు సామాన్య ప్రజానీకానికి ఆశాదీపాలుగా వెలుగొందాయి.
పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలును ఎన్నుకోవడంలో ప్రకాశం దూరదృష్టి తొలుత ఎవరికీ అర్థం కాలేదు. రాష్ట్ర అవతరణ సందర్భంగా ఖైదీలందరినీ విడుదల చేసిన ఆయన ధైర్యసాహసాలు దేశమంతటా సంచలనం సృష్టించాయి. గాంధీజీ ఇలాంటి సాహసాలకు మెచ్చుకొని- ‘ఇలాంటి సాహసాలు కేవలం కేసరులే చేయగలరు, పండితులకు సాధ్యం కాదు’ అని కితాబు ఇచ్చాడు. నెహ్రూ వంటి వక్తకానీ, రాజాజీ లాంటి మేధావి కాదు ప్రకాశం. సి.ఆర్.దాస్, మోతీలాల్‌లా పుట్టుకతో సంపన్నులు కారు. కానీ తన ప్రతిభతో, వాత్సల్యంతో ప్రజలతో ఆయనలా మమేకమైన నాయకుడు ఎవరూ లేరు. తమిళ ప్రజలు సైతం బ్రహ్మాండంగా స్పందించి ‘సైమన్ గోబ్యాక్’ హర్తాళ్‌ను విజయవంతం చేశారంటే- అందుకు ప్రకాశం పిలుపే కారణం.
హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల దమనకాండను తెలుసుకొని కోదాడ దాటి మునగాల పరగణాలోని శిబిరంలోకి ప్రకాశం ఎకాఎకిన దూసుకుపోయాడు. ప్రాణాలను సైతం లెక్కచేయక- అక్కడి రజాకార్లను కలిసి ‘మీకు చేతనైతే సైన్యంతో పోరాడండి.. అంతేకానీ అమాయక ప్రజలతో కాద’ని హెచ్చరించి వచ్చాడు. అక్కడికి వెళ్లవద్దని, వెళ్లినవాళ్ళు తిరిగిరాలేరని చెప్పిన వాళ్ళకి- ‘మనవాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతుంటే నేను చూడకుండా ఉండలేను. మనవాళ్ళను కలుసుకోవాల్సిందే’ అని నిశ్చయంగా చెప్పాడు. జన క్షేమం కోసం ఇలాంటి సాహసంతో కూడిన పనులు ఆయన జీవితంలో కోకొల్లలు. ప్రజలు కూడా ప్రకాశంను ఆదరించారు, ఆరాధించారు.
తన సర్వస్వాన్ని ‘స్వరాజ్య’ పత్రిక కోసం ఆహుతి చేయడమేకాక, చివరికి ఇంటిని కూడా పోగొట్టుకొని, వృద్ధాప్యంలో తన పుట్టినరోజున రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కూర్చుని ఉండగా అనేకమంది ప్రముఖులు పూలదండలతో ‘ఆంధ్రకేసరి’కి దండలు వేసి అభినందించారు. మధ్యాహ్నం దాటిన తరువాత రైల్వే కళాసీ వచ్చి, ‘పంతులుగారూ.. అన్నం తిన్నారా’ అని అడిగితే, ‘అందరూ పూలదండలు వేశారు కానీ భోజనం గురించి ఎవరూ అడగలేదురా’ అని సమాధానమిచ్చారు. ఆ కళాసీ బాధపడి క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చినపుడు- ‘ఒరే! నాది ఒక రోజు ఆకలి, అదుగో అక్కడ కూర్చున్నాడే సత్యాగ్రహి, ఆయనది రెండు రోజుల ఆకలి, అతనికి పెట్టు’ అనగలిగిన త్యాగమూర్తి. తన ఖర్చులకు జనం ఇచ్చిన పైకాన్ని కూడా అక్కడికక్కడే పేదలకు పంచి పెట్టిన కరుణామయుడు.
అప్పటి రాష్టప్రతి వి.వి.గిరి ఓ సందర్భంలో ప్రకాశం గురించి మాట్లాడుతూ- ‘ప్రకాశం ప్రజా సంరక్షకుడు, ఉజ్వలశక్తిగల వ్యక్తి, బతికినంతకాలం మన మధ్య అత్యంత ప్రమాణాలుగల మహావ్యక్తిగా సంచరించారు.. ప్రజల పక్షపాతి.. నిరుపమాన త్యాగశాలి’ అన్నారు. సర్వోదయ నాయకుడు, భూదానోద్యమ పితామహుడు వినోబా భావే తన ప్రసంగంలో- ‘రాయల తరువాత ప్రకాశం చరిత్రను సృష్టించాడు. ఆయన ఒప్పులు చేస్తే ఏ విధంగా తెలుగు జాతి ఆమోదించి హర్షించిందో.. ఆయన తప్పులు చేసినా అలాగే ఆమోదించి క్షమించింది.. ఆయన జీవితమంతా ప్రజా సంక్షేమానికే అంకితం చేశాడు’ అన్నారు. ‘ప్రకాశం అపసవ్యంగా ప్రయాణించినా ప్రజలందరూ ఆయన తోటే ఉంటారు.. నేను సవ్యమైన మార్గంలో వెళ్తున్న నాతో ఎవ్వరూ రారు’’ అని రాజాజీ వాపోయేవారు.
ప్రకాశం గారికి వల్లూరు అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే వారి తాత ముత్తాతల జీవనయాత్ర ఆ ఊళ్లోనే సాగింది. వల్లూరులో పుట్టిన ఆయనకు అక్షరాభ్యాసం కూడా అక్కడే జరిగింది. మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన వల్లూరును సందర్శించి తను ప్రవేశపెట్టిన ఫిర్కా స్కీమ్‌లో చేర్చారు. ఈమధ్య వల్లూరులో ప్రవేశ ద్వార మండపం నిర్మించి అందులో ఆయన చిత్రపటం చెక్కించి గ్రామస్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కీ.శే. గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు ప్రకాశం గురించి పలికిన ఈ మా టలు అక్షరసత్యాలు...
త్రిమూర్తి స్వరూపం...
తెలుగుంగడ్డ జనించి భారత ధరిత్రిన్ వీరుడునట్టి యు
జ్వల కీర్తిన్ గడియించి మించిన ప్రకాశం బెవ్వడోకాదురా
పిలకన్ పెట్టని గాంధి గుండెను గులాబీ లేని నెహ్రూజీ చే
తులలో యుడ్గము లేని బోసు ఘనకీర్తుల్ తెచ్చెనా జాతికిన్
1957 మే నెలలో ప్రజలను, మిత్రులను కలుసుకొంటూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినందుకు సంతోషిస్తూ సద్భావన యాత్ర సాగిస్తూ హైదరాబాద్ చేరేసరికి వడదెబ్బ తగలడంతో మే 20, 1957న కర్మయోగి ప్రకాశం అనంతజ్యోతిలో కలిసినపుడు- ఆయనకు విరోధిగా పేరుబడ్డ కళా వెంకట్రావ్ సైతం ‘ఈ రోజు నా తండ్రి గతించాడ’ని వ్యాఖ్యానించారు. ఆంధ్రకేసరి ప్రాతఃస్మరణీయుడు.

(నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి)

--టంగుటూరి శ్రీరాం 99514 17344